
3.7.1996,
నిజామాబాదు
ఆత్మీయులు
శాంతాదేవి గారికి ….
చిరమంగళ శుభాకాంక్షలతో …..
మీరు రాసిన ఉత్తరాలన్నీ చేరాయి. భరత్ రాసిన ఉత్తరాలు కూడా చేరాయి. డాక్టరు గారు, మీరు బావున్నారనుకుంటాను.
ఏమిటి విశేషాలు చెప్పండి? ఎలా ఉంది జీవితం?
ఎటుచూసినా అపార్థాలు, అపజయాలు, ఏదో అంతుబట్టని ఆవేదన మనల్ని చుట్టుముట్టినట్లు అనిపిస్తుంది. కదూ!
మీకూ, నాకూ, ఒకటే తేడా! ఇవన్నీ మీకు అపుడపుడు ఉంటాయి. నాకు ఎప్పుడూ ఉంటాయి. ఇది లేనిదే జీవితం ఉండదు. ఇవి ఉన్నాయి కదా అని జీవించటం మానకూడదు.
ప్రతి అనర్ధాన్ని ‘అవకాశం’గా మార్చుకుంటూ సాగాలి. •వతీశీఱ•ఎ అంటే అదే. ప్రతి క్షణం జీవితం నిస్సారంగా అనిపించినా, మన జ్ఞానంతో దాన్ని సారవంతం చేసుకుంటూ వెళ్లాలే గాని, జీవిత క్షేత్రాన్ని వదలకూడదు.
మన జీవితం భగవంతుడి కానుక.
దానిని నిండుగా జీవించటం మన విధి.
నిజానికి భగవంతుడు ‘సమస్య’లోనే ఎక్కువగా లభిస్తాడు. కాని మనం గుర్తుపట్టలేనట్లుగా ఉంటాడు.
‘పరిష్కారం’లో ఆయన తక్కువగా లభిస్తాడు. కాని గుర్తు పట్టే విధంగా ఉంటాడు.
అందుకే అతని పరిష్కారంలో (•శీశ్రీ••ఱశీఅ) తక్కువగా ఉన్నా ఫీల్ కాగలము.
సమస్య (జూతీశీ•శ్రీవఎ) లో ఎక్కువగా ఉన్నా ఫీల్ కాలేము.
కానీ, జ్ఞాని ‘ఆయనను’ రెంటిలోనూ ఫీల్ కాగలడు.
చిన్న పాపకు ఒక మామిడి పళ్ల కుప్పను, వంద రూపాయల నోటును ముందుంచి, ఏది కావాలో తీసుకోమంటే – పళ్ల కుప్పనే ఎన్ను కుంటుంది. అదే కాస్త తెలివి ఉన్న వ్యక్తి – సంతో షంగా వంద రూపాయల నోటు తీసుకుని వెళ్తాడు.
పాప వంద రూపాయల్లో, గుర్తుపట్టలేనట్లే• – ఎన్నో కుప్పల మామిడి పళ్లను చూడలేదు. గుర్తు పట్టేటట్లు ఉండే చిన్న పళ్లకుప్పనే కావా లంటుంది.
అలాగే ప్రాబ్లమ్‌లో •అతీవ•శీస్త్రఅఱ•••శ్రీవగా ఎక్కువగా (ఎశీతీవ) లభించే దైవాన్ని జ్ఞాని దర్శించ గలడు.
అందుకే ప్రాబ్లమ్ రాగానే జ్ఞాని సంతోషిస్తాడు.
మనం దుఃఖిస్తాము.
కొన్ని సమస్యలు ఎంత తలబాదుకున్నా అర్థం కావు. మార్గమేమీ తోచదు. నిర్వేదం, నిరాశ మన సును ఆవరిస్తాయి. ఇలాంటి పరిస్థితిలో – మనకు లభించే ఒకే ఒక ఉపశమనం – ఏమిటంటే – ‘సమస్య – పరిష్కారం’ భగవంతుడి అదృశ్య హస్తంలో నుంచి జన్మించినవే కాబట్టి – బాధ పడవలసిన అవసరం లేదు.
‘సమస్య’ కూడా మనల్ని అంతగా ప్రేమించే భగవంతుడి సృష్టే కాబట్టి, ఆయన సృష్టిలో ఏదీ అర్థరహితంగా ఉండదు. కాబట్టి – ఆయన ‘కాఠిన్యం’ వెనక దాగుండే ‘కారుణ్యాన్ని’ మనం సందేహించవలసిన పనిలేదు. ఎటొచ్చీ – ఆయన తన కారుణ్యాన్ని మనం ఊహించిన పద్ధతిలో వ్యక్త పరచక పోవచ్చు.
ప్రస్తుతం మీరుండే పరిస్థితికి నేనివ్వగలిగిన సలహా ఒక్కటే!
నాకు భగవంతుడి గురించి, ఆయన హృద యపు లోతుపాతుల గురించి అంతగా తెలియదు గాని – నా ముప్పై తొమ్మిది సంవత్సరాల జీవితంలో నిరంతరం ‘ఆయన’కై వేటాడగా – ఆయన గురించి నాకు కచ్చితంగా తెలిసింది ఒక్కటే. ఆయన చేసే పని చూడటానికి ఎంత అర్థరహితంగా, ఎంత క్రూరంగా, కాఠిన్యంగా కనిపించినా వేచి చూడగల ఓపిక ఉంటే – ఆయన ‘కాఠిన్యం’ వెనక దాగుండే ‘కారుణ్యం’ మన జీవితాన్ని ఆనంద సింధువుగా మారుస్తుంది.
ఈ ఒక్క సత్యం తెలుసుకోవటానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఒక్కోసారి ఆయన చేసే ‘పని’ అర్థమవటానికి ఎన్నో ఏళ్లు వేచి చూడాలి. నా జీవిత పు•ల్లో నుంచి ఒక్క విషయం బ్రీఫ్‌గా చెప్పగలను.
ఒక సంఘటన, దేన్నైతే భగవంతుడి క్రూర త్వానికి, అజ్ఞానానికి పరాకాష్ఠ అని భావించానో – అది ఆయన యొక్క మేరు శిఖరమంతటి కారుణ్యానికి ప్రతీక అని తెలుసుకోవటానికి నాకు 15 సంవత్సరాలు పట్టింది. ఇంతకన్నా వివరాలు తెలపలేను.
కాబట్టి భగవంతుడి ప్రేమను, మనకు ఎంతగా అర్థం కానప్పటికీ, అనుమానించకూడదు. అందుకే షిరిడీ సాయి దేవాలయాలలో శ్రద్ధ (••ఱ•ష్ట్ర) సబూరి (జూ••ఱవఅ•వ) అంటూ హిందీలో రాసి ఉంటుంది.
నమ్మకం – ఓపిక పరస్పరం కరచాలనం చేస్తే గాని పరమాత్మతత్వం అర్థం కాదు.
శిశిరంలో ‘తన్ను’ నగ్నంగా నిలబెట్టిన ప్రకృతే
వసంత పవనస్పర్శతో
హరిత వస్త్రాలను చుట్టి,
పూల పరిమళంతో అలంకరిస్తుందని
ఏ చెట్టుకు మాత్రం తెలుస్తూంది.
నల్లటి రూపమైన కోయిల కంఠ స్వరంలో
సుమధుర సంగీత సముద్రం
కాళ్లు ముడుచుకుని నిద్రిస్తుందని,
అది… గళమెత్తేదాకా
మనం మాత్రం కలగన్నామా!?
దైవలీలలు అర్థం చేసుకోటానికి మనమెంతటి వాళ్లం!
విధి మన ఎదపై ఏది ఎందుకు విసురు తుందో మనకేం తెలుసు! రాగబంధాల్లో దుఃఖో ద్వేగాలతో భుజాలు రాసుకుంటూ తిరిగే వాళ్లం భుజంగ భూషణుడి గురించి మనకేం తెలుసు!? ప్రకృతి లోని అందమైన దృశ్యాలను దర్శించటానికి ఇచ్చిన కళ్లను .. అపుడపుడు కన్నీటి పొరలతో ఎందుకు కప్పుతాడో – ‘మాయ’ ముసుగుని ఒళ్లంతా కప్పు కుని ఈ విశ్వంలోని ఒక మూలన కూర్చొని ఉద్వేగపు ఉలి దెబ్బలతో మూలుగుతున్న మనకు ‘కన్నయ్య’ లీలలు అర్థమవుతాయా!
‘ఆయన’ లీలలు మనకు అర్థమయినా, కాకపోయినా, ఎందుకు అర్థం కావు అన్న మీ మాంసను అటుంచితే – ‘నాకు’ మాత్రం … ఇది కేవలం నా వ్యక్తిగత భావన మాత్రమే – ఒక్క విషయం స్పష్టంగా తెలుసు
మన జీవన కుడ్యాలకు
విధి ఎంత కన్నాలను వేసేది,
కన్నీటి దొంతరలు దూకటానికి కాదు…
‘కన్నయ్య’ దూరటానికి!
మనమే – మన తలపుల తలుపులు తెరవ కుండా ఆయన్ను ‘కన్నం’ వేసి దూరేట్లు చేశామేమో.
నీటి బుడగలాంటి జీవితం నాది; ధూళి రేణువు లాంటి మేధస్సు నాది; నీల మేఘశ్యాముడి లీలలు ఎలా అవగతం చేసుకోగలను! ఏది ఏమైనా… నన్ను ‘ఆయన’ ఎంతగా దండించినా… నాకు మాత్రం ‘ఆయన’కు దండం పెట్టుకోవాలనే అనిపిస్తూంది. కాని, దూషించ బుద్ధవదు. ఎన్ని అఖండ దు:ఖ సాగరాల్లోకి ‘నన్ను’ ఆయన విసరివేసినా –
అడక్కుండానే
‘అమ్మ’ ముద్దుల తియ్యదనాన్ని,
‘అమ్మ’ మనసు త్యాగాన్ని
ఆమె చేతి అమృత స్పర్శను
ఆమె ఒడి చలువదనాన్ని
రుచి చూపించిన
ఆ ‘అనంతుని’ ఆత్మీయతను మరువలేను.
తన ‘పసి’ పెదాల్లోంచి
‘పసిడి’ రంగులద్దకుంటూ,
జాలు వారే, – ‘నాన్నా’ అన్న పిలుపుతో
నా కర్ణరంధ్రాల్లో
‘ఓం! కారం’ సృష్టించే
‘పాప’ నిచ్చిన
పరమ దయాళువైన ‘పరమాత్మ’ కారుణ్యాన్ని
– శంకించటానికి మనసెందుకో ఒప్పు కోవటం లేదు.
ఈ భావనతో ‘శంక’ను దూరంగా తరిమి, ‘శంకరుడి’ దరిచేరి గుండెల నిండా ‘శాంతి’ని నింపుకుని, నిజానికి మన సమస్యలు ‘ఆయన’ సమస్యలని భావిస్తూ, ఈ జీవన చంద్రభాగా తరంగాలపై తన్మయత్వంతో తేలుతూ, కార్తీక చంద్రిక లాంటి ‘చంద్రశేఖరుడి’ కారుణ్య కాంతిలో కరిగిపోతూ, ఆయన చరణారవిందాలపై రాలి పోతూ, ‘కాలం కనుసైగ’ కోసం వేచి ఉండటం తప్ప నేనేం చేయగలను?!
నాకు జన్మనిచ్చిన
వ్యక్తికి
నా జీవితాన్ని శాసించే
హక్కులేదని ఎలా అనగలను?
ఇది జీవితం గురించి, నా జీవితం గురించి నాకు తెలిసింది. ఆ పరాత్పరుని అదృశ్యహస్తం లోంచి జారేవి… జీవితంలో ఝంఝామారు తాన్ని సృష్టించే మహ•ధృత కన్నీటి తుఫానులైనా, ఆహ్లాద సాగరంలోకి జారవిడచే పన్నీటి తుషార తుంపరులైనా అన్నింటిని ప్రేమిస్తూ, అన్నింటికీ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ మన జీవన రహదారిపై దరహాస పారిజాత ప్రసూనాలను పరచుకుంటూ, గుండెల్లో పరవళ్లు తొక్కే శాంతితో … జీవన దిజ్మండలం వైపు సాగాలి.
డాక్టరు గారికి భారత్‌కు, రాజేంద్ర గారికి, మీకు శుభాకాంక్షలు. బాబుకు ముద్దులు. గీతికకు ప్రేమాశీస్సులు.
మీ మమతానురాగాలకు
ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలతో…
– శ్రీరామ్
Review ‘శంక’ను విడిచి.. ‘శంకరుడి’ దరి చేరిపోదాం!