అద్భుత వైద్యం.. శిరావేధ

మనకున్న అతిపెద్ద ప్రాచీన వైద్య సంపద-ఆయుర్వేదం. ఇందులోని చికిత్స పద్ధతులు ఆధునిక వైద్యంలో కూడా కానరావు. కానీ, శాస్త్రీయత అనే ఒకే ఒక్క అంశం కారణంగా నేడు ఆయుర్వేద వైద్యం, వైద్య విధాన పద్ధతులు మరుగున పడిపోతున్నాయి. అలా మరుగున పడిపోతున్న ప్రాచీన ఆయుర్వేద వైద్య విధానంలోని ఒక చికిత్స పద్ధతి- శిరావేధ చికిత్స. దీని పూర్వాపరాలేమిటో తెలుసుకుందాం.

శిరావేధ చికిత్స పద్ధతి అనేది ఆయుర్వేదంలో తప్ప మరే వైద్య శాస్త్రంలోనూ లేదు. ఈ శిరావేధ చికిత్స పద్ధతి ద్వారా అసాధ్య వ్యాధులను పోగొట్టవచ్చు.
మనిషి శరీరంలో మన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం 700 శిరలు ఉన్నాయి. ఈ శిరలు శరీరమంతటా వ్యాపించి, చిన్న చిన్న నీటి కాలువలు తోటలోని అన్ని చెట్లకు నీటిని ఎలా అందచేస్తాయో అదే విధంగా శరీరంలోని అన్ని భాగాలకు మనం తినిన ఆహార పదార్థముల ద్వారా జనించే రసాధి ధాతువులను అందచేసి శరీరాన్ని పోషిస్తాయి. తద్వారా శరీరంలోని అవయవాలు ముడుచుకోవడం, చాచుట వంటి కార్యక్రమాలకు ఈ శిరలు దోహదపడుతున్నాయి. శరీరంలోని వాత, పిత్త, కఫములు రక్తంలోకి చేరి శరీరం అంతటా ప్రసరిస్తుంటాయి. శరీరంలోని వాతాదులు అధికంగా ప్రసరించే శిరలకు వేర్వేరు రంగులు, పనులు ఉంటాయి.
కాళ్లు, పాదాలలో 400 శిరలు ఉన్నాయి. ఉదరంలో 136, శిరసులో 164.. ఇలా మొత్తం 700 శిరలు ఉన్నాయి. వీటిలో చేతులు, పాదాల యందు గల 16 శిరలు, ఉదరంలో గల 32 శిరలు, మెడకు పైభాగాన వేధింపతగినవిగా గుర్తించాలి. ఇక్కడ వేధించడం అనగా, శిరకు రంధ్రం చేసి చెడు రక్తాన్ని తొలగించడం.
శిరావేధ చికిత్స చేసే వైద్యుడు మర్మాలకు సన్నిహితంగా ఉన్న శిరలతో సున్నితంగా వ్యవహరించాలి. అంటే వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. శిరల గురించి, వాటి స్థానం గురించి సంపూర్ణ అవగాహన ఉన్న వైద్యుడు మాత్రమే శిరావేధ చికిత్సను చేయాలి. మర్మలకు సన్నిహితంగా ఉండే శిరలను డిస్ట్రబ్‍ చేయడం వలన అంగవైకల్యం సంభవించే ప్రమాదం ఉంది. ఒక్కోసారి ప్రాణాపాయ పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయితే, శిరావేధ చికిత్సను సరిగా చేయగలిగితే అసాధ్య రోగాలను కూడా పోగొట్టవచ్చు.
శిరావేద చికిత్సను పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాల రోగాలతో క్షీణించి ఉన్న వారు, తాత్కాలిక కారణాల వల్ల నీరసించిపోయిన వారికి చేయడం నిషిద్ధం. అయితే, పై వర్గాల వారు ఒకవేళ పాముకాటుకు గురైన సందర్భాలలో వారికి శిరావేధ చికిత్స అందించవచ్చని ఆయుర్వేదం చెబుతోంది.
శిరలలో చేరిన చెడు రక్తాన్ని తొలగించడమే శిరవేధ చికిత్స పద్ధతి. దీనినే ‘శిరలను వేధించడం’గా ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో పేర్కొన్నారు.
శిరల నుంచి చెడు రక్తాన్ని తీయడానికి ముందుగా తల, పాదాలు, చేతులు, ఉదరం, పార్శ్వములు మొదలైన స్థానాల్లోని శిరలు స్పష్టంగా కనిపించేలా గుడ్డతో కట్టిన అనంతరం వ్రీహిముఖము అనే ఒక శస్త్రముతో ఆయా స్థానములను అనుసరించి ఆవగింజ ప్రమాణం, అర్థ ఆవగింజ అంత లోతుగా వేధించాలి. వేధ చేయాల్సిన సమయాలను సరిగ్గా గుర్తించాలి.
వేధ చేసిన అనంతరం సువిద్ధ, దుర్విద్ధ లక్షణాలు, దుష్టరక్త స్వరూపం, మంచి రక్త స్వరూపం, రక్తము వేధన చేసినా రాకుండా ఉండటం, లేక అధిక రక్తస్రావం కావడం, ఎటువంటి లక్షణాలు గలవారికి ఎంత రక్తం తీయాలి అనే అంశాలను బాగా గుర్తించి రక్తమోక్షణం చేయాలి. రక్తమోక్షణం అనేది శిరావేధ చికిత్సకు గల మరో పేరు. రక్తమోక్షణం అంటే, శిరలలో చేరిన చెడు రక్తాన్ని తొలగించడం.

ఈ రక్తమోక్షణం ఏయే భాగాలలో చేస్తే ఏయే వ్యాధులు తగ్గుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పాదదాహము, పాద హర్షము (గుర్రం మూతి), చిప్పము, విసర్పి, వాతరక్తం (గౌట్‍), వాతకంటము, విచర్చికా, పాదదారి మొదలైన వ్యాధులకు సంబంధించి హస్తపాదాల మధ్య ఉండే క్షిప్రమర్మములకు పైభాగాన రెండు అంగుళములలో విహ్రీముఖము (సన్నటి పరికరం)తో శిరకు రంధ్రం చేసి చెడు రక్తాన్ని తీసివేయాలి.
శ్రీ క్రోష్టుక శీర్షము, ఖంజము, పంగు వంటి వాత వ్యాధులకు సంబంధించి చీలమండకు పైన నాలుగు అంగుళములలోని పిక్క యందు శిరకు రంధ్రం చేయాలి.
శ్రీ గృదసీవాతం (సయాటికా)కు సంబంధించి మోకాలు సంధికి నాలుగు అంగుళాల కింద కానీ, పైన కానీ శిరకు రంధ్రం చేయాలి.
శ్రీ గళగండ రోగమునకు సంబంధించి తొడ మొదట ఆశ్రయించి ఉండే శిరను వేధించిన కంఠమును ఆశ్రయించి ఉండే గళగండ రోగము నివృత్తి అవుతుంది.
శ్రీ ప్లీహ (స్ప్లీన్‍) రోగానికి సంబంధించి ఎడమ చేయి మోచేతి సంధి యందు ఉండే శిరను కానీ లేక చేతి యొక్క చిటికెన వేలుకు, ఉంగరం వేలుకు మధ్యలో ఉండే శిరను వేధించాలి.
శ్రీ కాలేయ రోగమునకు సంబంధించి ప్లీహమునకు చెప్పినట్టు కుడి వైపున చేయాలి. శ్వాసకాసలకు కూడా కుడి పార్శ్వముల యందు ఉండే శిరలను వేధించాలి.
శ్రీ పరివర్తిక, ఉపదంశ, శుక్ర దోషాల యందు, శుక్ర వ్యాధుల యందు శిశ్నము మధ్యలో ఉండే శిరను వేధించాలి.
శ్రీ అసాధ్యములైన అంతర్విద్రదుల యందు, పార్వ్శశూల (ఒకవైపు తలనొప్పి), కక్షా స్తనభాగాల మధ్యలో ఉండే శిరను వేధించాలి.
శ్రీ తృతీయక జ్వరానికి సంబంధించి ముడ్డిపూసకు మధ్య వెన్నెముక కింద ఉన్న శిరను వేధించాలి.
శ్రీ చాతుర్థికా జ్వరానికి సంబంధించి భుజ
శిరసులకు కిందుగా రెండు పార్శ్యముల
యందు ఉండే సిరలలో ఏదైనా
ఒకదానిని వేధించాలి.
ఇలా చెప్పుకుంటూపోతే ప్రతి
రోగానికి ఏయే భాగాలలో శిరావేధ
చేయవచ్చో అత్యంత
ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో
వివరణాత్మకంగా ఉంది.

అరచేతిలో ఆరోగ్య చిట్కాలు
వాంతులు తగ్గడానికి:

  • ఒక చెంచా అల్లం రసం, ఒక చెంచా ఉల్లిపాయ రసం కలిపి తాగాలి. ఇలా రెండు మూడు సార్లు తాగితే వాంతులు తగ్గిపోతాయి.
  • రోజుకు మూడు నాలుగుసార్లు కొత్తిమీర రసం లేదా దానిమ్మ రనం కొద్ది కొద్దిగా తాగితే వాంతులు తగ్గుతాయి.
  • జీలకర్రను దోరగా వేయించి పొడి చేసుకోవాలి. ఆ పొడిని తేనెతో కలుపుకోవాలి. దానిని పావు చెంచా చొప్పున తీసుకుంటే వాంతులు తగ్గుతాయి.

అజీర్తి పైత్యం వాంతులు:
అల్లం, పాత బెల్లం కలిపి పది గ్రాముల చొప్పున తింటే అజీర్తి పైత్యం వాంతులు ఉపశమిస్తాయి.

భోజనం తరువాత వాంతులు అయితే:
ఒక గ్లాసు నిమ్మరనం తీసుకుంటే భోజనం చేసిన తరువాత వచ్చే వాంతులు నివారణ అవుతాయి.

చిన్న పిల్లల్లో అజీర్ణ వాంతులు:
తల్లిపాలలో ఒక చిటికెడు వాము పొడి కలిపి పాలు తాగితే పిల్లల్లో వచ్చే అజీర్ణం వాంతులు తగ్గుతాయి.

నత్తి తగ్గడానికి: ఆకుపత్రి (బిర్యానీ ఆకు) చిన్న ముక్క తీసుకుని బుగ్గన పెట్టుకుని ఆ రసం మింగుతుంటే క్రమంగా నత్తి తగ్గుతుంది.

రాత్రి పడుకునే ముందు నాలుకపై పటిక చూర్ణం రెండు మూడు చిటికెలు రుద్దితే మాటల తడబాటు, మొద్దు మాటలు తగ్గుతాయి.

వస చూర్ణం తేనె కలిపి 40 రోజులు ఒక మట్టి పాత్రలో భూమిలో పాతిపెట్టి బాగా మగ్గిన తరువాత బయటకు తీసి ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. రెండు చిటికెల తేనెలో కలిపి రెండు పూటలా తీసుకుంటే గొంతు శుభ్రపడి స్వరం మెరుగుపడుతుంది.

Review అద్భుత వైద్యం.. శిరావేధ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top