ఆహారం.. ఆయుర్వేద నియమాలు

తింటున్నాం.. ఉంటున్నాం.. పెరుగుతున్నాం.. కానీ, ఎలా తింటున్నాం? ఏం తింటున్నామనే స్పృహే మనిషికి లేకుండాపోయింది. మన ప్రాచీన ఆయుర్వేదంలో వివిధ ఆహార నియమాలను ఏర్పరిచారు. అవేంటో చదవండి..
అజీర్ణం అనేది పెద్ద సమస్య. నేటి శరీర స్వభావాలకు సరిపడని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల అజీర్తి కలుగుతుంది. ఇది నాలుగు రకాలు.. ఆమము, విదగ్ధము, విష్టంభము, రసశేషము. ఈ నాలుగు కారణాల వల్ల అజీర్ణ సమస్య ఏర్పడుతుంది. ఎప్పుడైనా తిన్నది అరగలేదనిపిస్తే మజ్జిగను ఔషధంగా తీసుకోవచ్చు. అజీర్తి సమస్యను మజ్జిన బాగా పరిష్కరిస్తుంది.
భోజనం చేశాక, చేతిని కడుకున్న తరువాత అరచేతితో కళ్లను తుడుచుకున్నా, అరచేతితో నీటిబొట్టును కళ్లలో వేసుకున్నా నేత్రరోగాలు మానుతాయి.
భోజనం చేసిన వెంటనే కూర్చోవడం, పడుకోవడం చేయరాదు. అన్నం తిన్న తరువాత పడుకునే వారికి సుఖం కలుగుతుంది. అయితే, భోజనం చేసిన తరువాత కొద్దిసేపు అటుఇటు తిరిగి, మంచి పుస్తకాలు చదివి నిద్రలోకి జారుకునే వారికి ఆయుర్‌వృద్ధి కలుగుతుంది.
ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే తింటూ, తిన్న తరువాత ఎడమ వైపునకు తిరిగి పడుకునే వారికి వైద్యులతో పని ఉండదని ఆయుర్వేదం చెబుతోంది.
ఆకలి వేసినపుడు గనుక సమయానికి తినకుంటే కట్టెలు లేని అగ్నిహోత్రం వలే జఠరాగ్ని నశించి శరీరం కృశించిపోతుంది.
భోజనం చేసిన తరువాత ఎడమ వైపునకు తిరిగి పడుకుంటే పిత్తాశయం నుంచి ఆహారం జీర్ణం కావడానికి అవసరమైన పిత్తరసం సరిగా ప్రసరించి జఠరాగ్నిని వృద్ధి చేస్తుంది. కాబట్టి భోజనానంతరం ఎడమ పక్కకు తిరిగి పడుకోవడం అన్నివిధాలా మేలు చేస్తుంది.

నిద్రపోయే సమయంలో ఎడమ పక్కకు తిరిగి పడుకున్నప్పుడు 32 సార్లు, కుడి పక్కకు తిరిగి పడుకున్నప్పుడు 25 సార్లు ఉచ్ఛాశ నిశ్వాసాలు వెలువడతాయట. ఈ రెండు విధాలుగా కాకుండా వేరే విధాలుగా నిద్రించినపుడు కేవలం పదిసార్లు మాత్రమే ఉచ్ఛాశ నిశ్వాసలు వెలువడతాయి.
అనవసరంగా ఎక్కువగా మందులు వాడటం, కుడివైపునకు ఎక్కువగా తిరిగి పడుకోవడం, భోజనానికి బదులు ఇతర ఆహార పదార్థాలను భుజించడం వలన మనిషికి అప్పటికప్పుడు తృప్తి కలుగుతుండొచ్చు గాక.. గానీ దీర్ఘకాలంలో అనారోగ్యం కలుగుతుంది.
జఠరాగ్ని ఆహారాన్ని వచింప (జీర్ణం) చేస్తుంది. ఆహారం లేని వారికి ఈ జఠరాగ్ని శరీరాన్ని దహింప చేస్తుంది. దానివల్ల శరీరంలోని సర్వ ధాతువులు క్షీణించి, చివరకు ప్రాణాపాయం కూడా కలుగుతుంది.
భోజనం చేసిన తరువాత భుక్తాయాసం తగ్గే వరకు కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవాలి. తరువాత వంద అడుగులు అటుఇటు నడవాలి. తరచూ కూర్చుని, లేస్తూ ఉండాలి.
మనం తీసుకున్న ఆహారం మర్నాటికి రసధాతువు గానూ, మూడో రోజుకు రక్తంగానూ, ఐదో రోజుకు మేధస్సుగానూ, ఆరో రోజుకు అష్థిధాతువు గానూ, ఏదో రోజుకు మజ్జి ధాతువుగానూ, ఎనిమిదో రోజుకు ఉత్కృష్టమైన శుక్ర ధాతువుగానూ మారుతుంది.
పగటి పూట భోజనం వలన కలిగిన అజీర్ణం, రాత్రి భోజనం చేయకుండా ఉంటే జీర్ణం అవుతుంది. రాత్రి తీసుకున్న ఆహారం వలన కలిగిన అజీర్ణం పగలు నిద్రించడం వలన జీర్ణమవుతుంది.

సూర్యోదయం వలన కమలములు వికసించినట్టుగా హృదయం కూడా తెలివి పొంది మేల్కొంటుంది. శరీరంలోని శ్రోతస్సులు అన్నీ వికసిస్తాయి. కాబట్టి రాత్రి భోజనం మానకూడదు.
నెయ్యి, నూనె తాగేందుకు ఉపయోగించే ద్రవ్యములు, కషాయములు, కూరలు మొదలైనవి వేడిచేసినవే ఉపయోగించాలి. మరలా తిరిగి వేడి చేయడం వలన వాటిలోని ధాతువులు నశించి, అవి విషంగా మారతాయి.
రాత్రివేళల్లో కాచిన నీరు తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అజీర్ణం, ఆమం ఎక్కువ అయినపుడు వేడినీటినే తాగాలి. చల్లని నీరు ఏ సమయంలోనూ తాగడానికి ఉపయోగించకూడదు.
జ్వరంతో బాధపడే వారు నీటిని ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల జ్వర వేడి తగ్గుతుంది. చల్లని నీళ్లు తాగితే శ్లేష్మం, పైత్యం పెరుగుతాయి. కాబట్టి కాచిన నీళ్లు మాత్రమే తీసుకోవాలి. ఇవి తీసుకున్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తాయి.
రాత్రి వేళలో తాగే వేడినీళ్లు కఫ వ్యాధులను భేదించి, వాత వికారాలను తగ్గించి అజీర్తి సమస్యలను హరిస్తాయి.

Review ఆహారం.. ఆయుర్వేద నియమాలు.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top