
దైవం మాదిరిగానేకాలానికీ ఆద్యంతాలు లేవు. దైవాన్ని నమ్మని వారు సైతం కాలాన్ని, దాని విలువను గౌరవిస్తారు. కాల మహిమను గ్రహించిన వ్యక్తే జీవితంలో వి•యాలు సాధిస్తాడు. ‘కాలం, కెరటం ఎవరి కోసం ఆగవు’ అని ఓ ఆంగ్ల సామెత ఉంది. ‘నేను రాజ్యాలు పోగొట్టుకుంటానేమో కానీ కాలాన్ని చేజార్చుకోను’ అనే వాడు ఫ్రెంచి నియంత నెపోలియన్. కాలం ఎంత సద్వినియోగం కాగలదో అంత దుర్వినియోగమూ కాగలదు.
‘కాలాతీతాయ నమ.. కాలాయ నమ’ అంటూ వేదం కాలాన్ని స్తుతించింది. ‘వృద్ధాప్యం రాకముందే, ఆయుక్షీణం కాకముందే వివేకవంతుడు పుణ్యం సంపాదించుకునే ప్రయత్నం చేయాలి’ అనేది భర్త•హరి ఉద్బోధ.
ప్రతి క్షణం భూతకాలంలోకి జారిపోతుంటుంది. దాన్ని తిరిగి చేజిక్కించుకోవడం అసాధ్యం. అందుకే క్షణాన్ని ఒడిసి పట్టేసుకుని, చేయదలుచుకున్న మంచి పనిని చేసెయ్యాలి.
‘రాత్రి పగలు, ఉదయ సంధ్యలు, శిశిర వసంతాలు.. ఒకదాని వెంట మరొకటి వస్తూ పోతూ ఉంటాయి. అది కాల క్రీడ’ అని పలికిన ఆదిశంకరాచార్యుల వారి పలుకుల్లోని అంతరార్థం గుర్తెరగాలి.
‘మంచి రోజు, మంచి ఉషస్సు నాకు లభించుగాక’ అని యజుర్వేద చమక పాఠం చెబుతోంది. ప్రాచీన సంస్క•తిలోని ఆ భావన కాలాంతరంలో ‘పరస్పర శుభాకాంక్ష’గా పరిణమించింది. ఉషస్సు సద్బుద్ధికి, మంచి రోజు సత్కారానికి ప్రతీకలు. కాలాన్ని ఎంత చక్కగా వినియోగించాలో, ఎంత మహత్తర శక్తిగా జీవితానికి అనుసంధానించుకోవాలో సనాతన ధర్మం తెలియచేస్తోంది. మంచికాలం ఎప్పుడో ఒకసారి మన ఇంటి తలుపు తడుతుంది. అది గ్రహించి తలుపు తెరిస్తే అంతా విజయమే.
జనవరి 1. ఆంగ్లమానం ప్రకారం కొత్త ఏడాది ఆగమన వేళ, రోజంతా సంబరాలు జరుపుకొంటారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొంటారు. ఇది ఏటా మన:పూర్వకంగా ఉంటోందా? లేక ఓ తంతుగా సాగుతోందా? అనేదే ప్రశ్న. మనిషన్నాక సహజంగానే సరదాలు, విందులు, వినోదాలు ఉంటాయి. వాటికీ ఓ పరిమితి,
పద్ధతి ఉండాలి. కొత్త సంవత్సరాన్ని మద్యం, అశ్లీల నృత్యాల వంటి వాటితో స్వాగతించాల్సిన పనిలేదు. అర్ధరాత్రిళ్లు కేకలు పెడుతూ, ద్విచక్ర వాహనాలు, ఇతర ఖరీదైన వాహనాలపై మితిమీరిన వేగంతో తిరుగుతూ ‘నూతన సంవత్సర శుభాకాంక్షల’ పేరిట గొంతు చించుకోవాల్సిన పనిలేదు. ఇది వైపరీత్యం.
భారతీయ సంస్క•తి ఇలాంటి విధానాలను ఏనాడూ సమర్థించదు. నేటి యువత దీని గురించి ఆలోచించాలి. కాలాన్ని అందరూ మంచి పనులతోనే ఆహ్వానించాలి. సేవా కుసుమాలతో అర్చించాలి. రక్తదానం, శ్రమదానం, పరిసరాల శుభ్రత, రోగులకు సేవ, అనాథ, వృద్ధాశ్రమాలకు వెళ్లడం, కళాకారులకు సత్కారాలు, ఆధ్యాత్మిక చింతన, సత్సాంగత్యం వంటి మంచి పనులతో నవ వర్ష శుభాగమనాన్ని స్వాగతించాలి. అప్పుడే సంవత్సరమంతా శుభప్రదంగా సాగుతుంది.
అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.
-కుమార్ అన్నవరపు
Review మంచిపని.. మంచిరోజు...