చంద్రకళాధర సహృదయా!

ఓం నమ:శివాయ ఓం నమ:శివాయ
చంద్రకళాధర సహృదయా
సాంద్రకళాపూర్ణోదయా లయనిలయా
పంచభూతములు ముఖపంచకమై
ఆరు రుతువులూ ఆహార్యములై
ప్రకృతి పార్వతి నీతో నడిచిన ఏడు అడుగులే స్వర సప్తకమై
నీ దృక్కులే అటు అష్టదిక్కులై నీ వాక్కులే నవరసములై
తాపనమందార నీ మౌనమే
దశోపనిషత్తులై ఇల వెలయ
త్రికాలములు నీ నేతత్రయమై చతుర్వేదములు ప్రాకరములై
గజముఖ షణ్ముఖ ప్రమథాదులు నీ సంకల్పానికి రుత్విజవరులై
అద్వైతమే నీ ఆది యోగమై నీ లయలే ఈ కాలగమనమై
కైలాస గిరివాస నీ గానమే జంత్రగాత్రములు శ్రుతికలయ

కె.విశ్వనాథ్‍ దర్శకత్వంలో వచ్చిన ‘సాగర సంగమం’ చిత్రంలోనిదీ గీతం. రచయిత వేటూరి సుందరరామ్మూర్తి. కావడానికి ఇది సినిమా పాటే అయినా ఇందులో అంతులేని శివతత్వం దాగి ఉంటుంది. అదే ఈ పాట మహిమ.

‘ఓం నమ:శివాయ’.. అంటూ పరమ పావనమైన పంచాక్షరితో ఈ పాటను వేటూరి ప్రారంభించారు. ‘చంద్రకళాధర’ అంటూ తలపై అలంకారంగా, చిన్న పువ్వును దాల్చినట్టు, చంద్రకళను ధరించిన వాడా అని వర్ణించారు. సహృదయా’ (మంచి మనసు కలవాడా).. ఈ పాట మొత్తానికి పరమోత్క•ష్టమైన పదమిది.
‘సాంద్రకళా పూర్ణోదయా’ అనే సంబోధన విశేషమైనది. అన్నీ ఉన్న వాడు శివుడు. అన్నీ ఉండటమే కాదు సంపూర్ణంగా, సాంద్రంగా చిక్కగా ఉన్న వాడు సాంద్రకళాపూర్ణోదయుడు. కేవలం నాట్యకళకే కాదు హృదయాన్ని రంజింప చేసే అన్ని కళలూ అత్యున్నత స్థాయిలో ప్రకటించే వాడు, ఆ కళల యొక్క సాధన వల్ల లభించే వాడూ శివుడే. అటువంటి శివుడు లయ నిలయుడు. ఆ మాటలోనే అందమైన శబ్దాలంకారం ఉంది.

లయ అంటే ఏమిటి?

ఇది కాలగమనానికి గుర్తు. ఉదాహరణకు సంగీతంలో కీర్తనకు కచ్చితంగా తాళం ఉంటుంది (ఆది తాళం, ఖండచాపు తాళం మొ।।). ఆ తాళమే లయ అంటే. కీర్తనకి ఒక కొలత తాళం. ఆ కీర్తన వేగానికీ అదే కొలత (ఒకటో కాలం, రెండో కాలం, మూడో కాలం).
అంటే మళ్లీ మళ్లీ ఉత్పన్నమవుతూ నడుస్తున్న దానిలో ఎన్ని మార్పులూ చేర్పులూ వస్తున్నా తాను మారకుండా ఉండి, నడుస్తున్న దానికి అందాన్నిస్తూ ఉండేది లయ. సైన్స్ పరిభాషలో ప్రీక్వెన్సీ అంటే బహుశా ఇదే కాబోలు. ఇక, ఇంగ్లిష్‍లో ఆర్టస్లో ‘రిథమ్‍’ అంటారు దీనినే.
లయ సమయానికి సంబంధించినది కాబట్టి అది వేరే వస్తువుకు సపోర్టింగ్‍ రోల్‍లోనూ ఉంటుంది. ఇంకేమీ లేనప్పుడూ ఉంటుంది. శివుడు లయకారకుడు అంటే అర్థం ఇదే. అటు కళలకూ, ఇటు ప్రపంచ నిర్వహణకీ సరిపోయే మాట ‘లయ’.

ఇంకా ఈ పాటలోని విశేషాల్లోకి వెళ్తే.. పాటను ‘మూడు’తో మొదలు పెట్టి రాశారు. త్రికాలములు, చతుర్వేదములు, పంచభూత ములు, ఆరు రుతువులు, స్వర సప్తకం, అష్టదిక్కులు, నవరసమ్ములు, దశోపనిషత్తులూ.. ఇలా! చిత్రంగా ఇందులో మొదటి రెండు రెండో చరణంలో వస్తాయి.

ఈ పాటలో ‘పంచభూతములు ముఖపంచకమై’ అనే వర్ణన ఉంటుంది. శివుడికి ఐదు ముఖాలని అంటారు. అవి సద్యోజాత, వామదేవ, అఘోర, ఈశాన, తత్పురుష అనే పేర్లతో నాలుగు దిక్కులా నాలుగు, ఆకాశం వైపు ఐదవది ఉంటుంది. అంటే శివుడు అన్నివైపులా చూస్తాడు అని అర్థం. ఈ ప్రపంచం పంచభూతాలతోనే ఏర్పడిందని అంటారు కాబట్టి ఆ ఐదూ కూడా శివుడే అనే భావనతో వేటూరి ఈ వర్ణన చేశారు.

ఇంకా ఈ పాటలోని.. గజముఖ, షణ్ముఖ, నంది మొదలైన మహామహులంతా నీ ప్రతి సంకల్పాన్నీ రుత్వికులు యజ్ఞం చేసినంత శ్రద్ధగా చేయడానికి నిలిచి ఉండగా, అద్వైతమే నీ ఆది యోగమై (అసలు స్థితి, స్వరూపము అయి ఉండగా), నీ లయలే కాలగమనమై- నువ్వే కాలాన్ని నడిపిస్తుండగా, కైలాసంలో కొలువుదీరిన పరమేశ్వరా- నేను చేస్తున్న ఈ నా గానమే మంత్రము- వాయిద్యం, గాత్రం- వాక్కు యొక్క మేలు కలయిక అయి నిన్ను అర్చిస్తున్నాను’ అనే అర్థంలో పాటను ముగిస్తారు.

ఈ పాట వినిపించని తెలుగు లోగిలి ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికి ఎప్పటికి ఇది ఆణిముత్యంలాంటి గీతం.

Review చంద్రకళాధర సహృదయా!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top