దీపలక్ష్మీ నమోస్తుతే!

దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వమ్‍ దీపలక్ష్మీ నమోస్తుతే

బ్రహ్మ సకల జ్ఞానానికీ అధిపతి. దీపం సాక్షాత్తూ ఆ పరబ్రహ్మ స్వరూపం. అది సకల తమో గుణాలనూ హరించివేస్తుంది. ఎలాంటి కార్యాన్నయినా సాధించగలిగే శక్తిని ప్రసాదిస్తుంది. అలాంటి దీపలక్ష్మీ నీకు నమస్కారం!.
దీపానికి హైందవ సంప్రదాయంలో విశిష్ట స్థానముంది. నిత్య పూజా విధిలో అది ప్రధాన భాగమై విరాజిల్లుతోంది. దీపారాధన చేయనిదే ఎలాంటి శుభకార్యాలూ ప్రారంభించకూడదని శాస్త్రం చెబుతోంది. జ్యోతి సాక్షాత్తూ దేవతా స్వరూపం. దీపంలో కనిపించే ఎరుపు, పసుపు, నీలం రంగులు త్రిగుణాత్మక రూపాలైన లక్ష్మి, సరస్వతి, పార్వతికి ప్రతిరూపాలని చెబుతారు. అంతేకాదు, దీపపు కుందె కింది భాగంలో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణువు, ప్రమిదలో శివుడు, వత్తి కాంతిలో సరస్వతి, నిప్పు కణికలో లక్ష్మి స్థిర నివాసం ఉంటారని శాస్త్ర వచనం. అందుకే దీపారాధన చేయగానే కుందికి బొట్టు పెట్టి అక్షింతలు, పూలూ వేసి నమస్కరిస్తారు. అయితే ప్రాణులన్నింటి భారాన్నీ మోయగల భూదేవి, దీపం వేడికి మాత్రం తాళలేదట. అందుకే దీపారాధన చేసేటపుడు ప్రమిదలో ప్రమిద వేయాలి. కుందె అడుగున ఒక పళ్లెమో అదీ లేని పక్షంలో ఆకు అయినా వేసి దీపారాధన చేయాలి. దీపావళి సమయంలో దీపాలు వెలిగించేందుకు నువ్వుల నూనెనూ లేదా ఆవునెయ్యినీ వాడటం సర్వ శ్రేయోదాయకం. ఈ అక్టోబరులో దీపావళి పర్వంతో పాటు కార్తీక మాసం ప్రారంభమవుతున్నాయి. రెండూ దీప ప్రాధాన్యం కలిగిన పర్వాలే. త్రిసంధ్యా కాలాల్లోనూ దీపాన్ని ఆరాధించడం వల్ల సకల ఐశ్వర్యాలూ సిద్ధిస్తాయని చెబుతారు. దీపం జ్ఞానానికీ, సంపదకూ, శాంతికి ప్రతీకగా భావిస్తారు. మనం చేయాలనుకున్న పనులకు ప్రత్యక్ష సాక్షి కూడా దీపమే. వెలుగు కిరణాలతో చుట్టూ ఆధ్యాత్మిక భావనను నింపే దీపం విశిష్టతనూ, దీపారాధనలోని పరమార్థాన్ని తెలిపే ప్రత్యేక కథనం..

దీపం ప్రాణానికి ప్రతీక.
జీవాత్మకే కాదు పరమాత్మకీ ప్రతిరూపం.
అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపాన్ని వెలిగిస్తారు.
చీకటిలోనూ మనకు కళ్లుంటాయి.
కానీ దీపం వెలిగించే దాకా అక్కడ ఉన్నది మనకు కనిపించదు.
అలాగే మన మనసులోని తిమిరాన్ని పారద్రోలాలంటే జ్ఞానదీపాన్ని వెలిగించాల్సిందే.
అందుకు గుర్తే ఆ కోటి సూర్యప్రకాశుడి ముందు మనం వెలిగించే ఈ దీపాలు.
దేవీదేవతల ముందు దీపం వెలిగించడమే దీపారాధన.
దేవుడిని పూజించడం కంటే ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తామన్న మాట.
షోడశోపచారాల్లో దీపారాధన ప్రధానమైనది.
పూజావిధుల్లో అన్ని ఉపచారాలూ చేయలేకపోయినా ధూపం, దీపం, నైవేద్యాలను తప్పక చేయాలంటారు పెద్దలు.
ముక్కోటి దేవతలకూ వాహకంగా నిలిచే అగ్ని సాక్షాత్తూ లక్ష్మీ స్వరూపం.
అందుకే దీపాన్ని ఆరాధించిన వారికి లక్ష్మీ కటాక్షం తప్పక లభిస్తుందని అంటారు.
ఎన్నో విశిష్టతలకు నెలవైన దీపాన్ని ఎలా ఆరాధించాలి?,
దీపారాధన సమయంలో ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి? మొదలైన అంశాలను కూడా మన శాస్త్రాల్లో వివరంగా రాశారు పెద్దలు.
సాధారణంగా మూడు అడ్డవత్తులూ లేదా బొడ్డు వత్తులను చేసి ప్రమిదలో ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె పోసి వీటిని వెలిగిస్తారు.
ప్రత్యేక పూజలూ, నోములూ చేసేటప్పుడు అయిదు పోగులూ, తొమ్మిది పోగులూ, కమల వత్తుల పేరుతో ఎనిమిది పోగులూ.. ఇలా రకరకాలుగా వత్తులను వెలిగిస్తారు.
దీపారాధన శ్లోకం
సాధారణంగా దీపారాధన సమయంలో కింది శ్లోకాన్ని చదువుతారు-
సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్‍
భక్త్యా దీపం ప్రయాచ్ఛామి దేవాయ పరమాత్మనే
త్రాహిమాం నరకాత్‍ ఘోరాత్‍ దివ్యర్జోతి ర్నమోస్తుతే

‘మూడు వత్తులను తీసుకుని తైలంలో తడిపి, అగ్నిని జతచేసి శుభప్రదమైన, మూడు లోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించి, పరమాత్మకు భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకం నుంచి రక్షించే దివ్యజ్యోతికి నమస్కరిస్తున్నాను’ అని పై శ్లోకానికి భావం.
పై శ్లోకంతోనే రోజూ దీపం పెట్టి నమస్కరించాలి.

చిన్న దీపం వెలిగించి, అది ‘నా ఇంటినే కాదు.. ముల్లోకాలనూ వెలుగులతో నింపాల’నేది ఎంత గొప్ప భావన!. మరెంతటి ఉదాత్తమైన ఆలోచన!.
దీపంలో ఉపయోగించే మూడు వత్తులు ముల్లోకాలకీ, సత్వ రజ తమో గుణాలకూ, త్రిసంధ్యలకూ సంకేతంగా భావిస్తారు.
పూజలో చేసే దీపారాధనకే కాదు, సంధ్యా దీపానికీ ఉన్నతమైన స్థానాన్ని కల్పించింది మన హైందవ సంప్రదాయం.
లోకానికి వెలుగునీ, తేజస్సునీ ప్రసాదించే సూర్యుడు జీవుల మీద దయతో వారికి జీవాన్నీ, శక్తినీ ప్రసాదించడానికి తాను అస్తమిస్తూ ఆ తేజాన్ని దీపంలో ప్రజ్వలింప చేస్తాడట. అందుకే సర్వ ప్రాణులకూ ప్రాణప్రదాత అయిన సూర్యుడి అస్తమయం కంటే ముందుగానే ఇంట్లో సంధ్యా దీపం పెట్టే సంప్రదాయాన్ని ఏర్పరిచారు మన పెద్దలు. తిరిగి సూర్యోదయం వరకూ దీపాన్ని వెలుగుతూ ఉంచడం మన సంస్క•తిలో ఒక భాగమే. తమసోమా జ్యోతిర్గమయా!
దీపం మనలోని తమస్సును పోగొడుతుంది.
కాబట్టే ‘తమసోమా జ్యోతిర్గమయా!’ అని రుషులు ప్రార్థించారు.
అజ్ఞానం పోగొట్టి జ్ఞానదీప్తి కలిగించే ఈ దీపాన్ని కార్తీక మాసంలో వెలిగిస్తే విశేష ఫలితాలు ఉంటాయని చెబుతారు. కృత్తికా నక్షత్ర ప్రాధాన్యం ఉన్న కార్తిక మాసం అగ్ని ఆరాధనకు ముఖ్యమైనది. కృత్తిక అంటే అగ్ని. ఆ అగ్నిని యజ్ఞం ద్వారా ఆరాధిస్తాం. ఏ దేవతకైనా హవిస్సులు అగ్ని ద్వారానే సమర్పిస్తాం.
ఆ అగ్నికి సూక్ష్మ రూపమే దీపం. దీపం జీవగతమైనది. ప్రత్యక్ష దైవాల్లో ఒకటైన అగ్నిని దీప రూపంలో ఆరాధించడమంటే పరోక్షంగా ఆ పరబ్రహ్మానికి కృతజ్ఞతలు చెప్పడమే కాదు సమస్త ప్రాణికోటికీ లబ్ధి చేకూర్చటమేనని చెబుతారు.
కీటా:పతాంగా: మశకావ్చవృక్షా: జలేస్థలే యే నివసంతి జీవా:
దృష్ట్యా ప్రదీపం నచజన్మ భాగిన: భవన్తి త్వం శ్వపచాహి విప్రా:
అంటే.. కీటకాలూ పక్షులూ వృక్షాలూ జలచరాలపైన నేను వెలిగించిన దీపపు కాంతి ప్రసరించి వాటికి మోక్షాన్ని ప్రసాదించడమని పై శ్లోకానికి అర్థం.
కేవలం నేనూ నా కోసం అనే స్వార్థచింతనకు తావులేని కార్తిక దీపం వల్ల ప్రకృతిలోని ప్రతి ప్రాణీ తరిస్తుందన్న భావన ఎంత గొప్పదో కదా!.
కార్తీక పురాణం ప్రకారం- కార్తీక మాసంలో పిప్పలుడు అనే మహారాజు దీపదానం చేయడం వల్ల సంతానాన్ని పొందాడనీ, అతని కుమారుడైన శత్రుజిత్తు కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడం వల్ల కైలాసాన్ని చేరుకున్నాడనీ చెబుతారు.

కార్తీక మాసం మొత్తం రెండు సంధ్యల్లోనూ (ఉదయం, సాయంత్రం) దీపారాధన చేస్తుంటారు. అయితే ఇందులో సాయం సంధ్యా దీపం మరింత విశిష్టమైనది.
సాయంత్ర వేళల్లో శివాలయంలో కానీ, వైష్ణవాలయంలో కానీ దీపాన్ని వెలిగిస్తే మంచిదంటారు.
ఆలయ ద్వారం, గోపురం, గర్భగుడిలో, ధ్వజస్తంభం దగ్గర.. ఇలా ఎక్కడ దీపాన్ని వెలిగించినా పుణ్యమే.
గుడిలో దీపాన్ని వెలిగించడం కుదరని వారు ఇంట్లో పూజా మందిరంలో కానీ, తులసి కోట దగ్గర కానీ దీపారాధన చేస్తుంటారు.
వీటితో పాటు రావి, ఉసిరి వంటి దేవతా వృక్షాల కింద, నదీ తీరాల్లో దీపారాధన చేసినా విశేష ఫలితం లభిస్తుందన్నది పెద్దల మాట.

నిత్య దీపారాధన
కార్తీక మాసమనే కాదు నిత్యం ఆ పరమాత్మకు దీపారాధన చేయడం తప్పనిసరి అని చెబుతోంది శాస్త్రం. అలా నిత్య దీపారాధన కుదరకపోతే కార్తీక మాసం మొత్తమైనా, అదీ కుదరకపోతే కార్తిక సోమవారాలూ, కార్తీక శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమిలాంటి తిథుల్లోనైనా దీపాలను వెలిగించాలని అంటారు.
ఇది కూడా సాధ్యం కాని వారు కనీసం కార్తీక పౌర్ణమి నాడైనా 365 వత్తులు ఉన్న గుత్తి దీపాన్ని వెలిగిస్తే ఏడాది పొడవునా దీపాలు వెలిగించినంత పుణ్యం ప్రాప్తిస్తుందని చెబుతారు.

ఒక్క దీపం.. బహు రూపం
సాధారణంగా దీపాన్ని లేదా దీపారాధనను మూడు రకాలుగా చెబుతారు.
ఇంట్లో చేసే నిత్య దీపారాధన, ఆలయాల్లో వెలిగించే అఖండ దీపారాధన, ఏదైనా పనిని ప్రారంభించే ముందు నిర్వహించే జ్యోతి ప్రజ్వలనం.
వీటితో పాటు దీపారాధన చేసే ప్రదేశాన్ని బట్టి కూడా దీపానికి పేరు మారుతుంది.
లక్ష్మీదేవి విగ్రహం ముందు దీపాన్ని వెలిగిస్తే దాన్ని లక్ష్మీ దీపం అంటారు.
అలాగే నిత్య పూజలో భాగంగా వెలిగించే దీపాన్ని అర్చనా దీపమని పిలుస్తారు.
గర్భాలయాల్లో వెలిగించే దీపానికి నందాదీపమని పేరు.
తులసి కోట వద్ద వెలిగించే దీపాన్ని బృందావన దీపమని చెబుతారు.
పారాయణ సమయాల్లో లేదా ఏదైనా దైవ సంబంధ కార్యక్రమాలు చేసేటపుడు ముందుగా వెలిగించే దీపాన్ని అఖండ దీపమని అంటారు. ఈ దీపం కార్యక్రమం పూర్తయ్యే వరకూ వెలుగుతూనే ఉంటుంది.
ధ్వజస్తంభం మీద వెలిగించే దీపానికి ఆకాశ దీపమని పేరు.
సాధారణంగా కార్తీక మాసం నెల రోజులూ శివాలయాల్లో తప్పక దీపాన్ని వెలిగిస్తారు. మరీ చిన్న చిన్న ప్రమిదల్లో ఎక్కువ దీపాలు వెలిగిస్తే అది నిరంజన దీపావళి అవుతుంది. కార్తిక పూర్ణిమ నాడు తోరణం మాదిరిగా వెలిగించే దీపాన్ని జ్వాలా తోరణం అని పిలుస్తారు.
హారతి దీపం
పూజ మొత్తం ముగిసిన తరువాత మంగళహారతులు ఇవ్వడం పరిపాటి.
హారతిని భక్తుడిలోని ఆత్మకు ప్రతీకగా భావిస్తారు.

సాధారణంగా కర్పూర హారతినే ఇస్తూ ఉంటారు. అయితే, దీపాన్నే హారతిగా సమర్పించే సంప్రదాయమూ కొన్ని దేవాలయాల్లో మనకు కనిపిస్తుంది. దేవుడికి ఎన్ని దీపాలతో హారతినివ్వాలి?, అలా ఇచ్చే వాటిని ఏమని పిలుస్తారు? అనే విషయాలను వేదాల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
ఒకటి నుంచి రెండు వందల యాభై ఒకటి (251) వరకూ వత్తులతో సమర్పించే ఈ హారతులకూ ఒక్కో పేరు ఉండటం విశేషం.
అసలు దీప హారతిని సమర్పించే పళ్లెమే దైవస్వరూపంగా పేర్కొంటారు.
ఆ పళ్లెం పై భాగం అగ్నికీ, పిడి భాగం ఈశ్వరుడికీ, అడుగు భాగం ప్రజాపతి బ్రహ్మకు ప్రతిరూపాలుగా చెబుతారు.
ఒకే ఒక దీపంతో ఇచ్చే హారతికి ఏకహారతి అని పేరు.
రెండు దీపాలతో ఇచ్చేది- ద్విహారతి.
వత్తుల సంఖ్యను బట్టి హారతి పేర్లు కూడా మారిపోతుంటాయి.
దీప హారతిని ఇచ్చే పళ్లాలను దీపపు సెమ్మెలని అంటారు.
వీటిలో కూడా చాలా రకాలున్నాయి.
పాము ఆకృతిలో ఉండే దీపపు సెమ్మెలను నాగదీపం అంటారు.
రథాకారంలో ఉంటే రథదీపమని పేరు.
కొండ ఆకారంలో ఉండే దీపపు సెమ్మెను మేరు దీపమని పిలుస్తారు.
కుండ ఆకారంలో ఉండే దీపపు సెమ్మెను కుంభ దీపమని అంటారు.
ఇలా అనేక రకాల దీపపు సెమ్మెలకు అనేక రకాల పేర్లు ఉన్నాయి.
అలాగే దీపపు సెమ్మెల సంఖ్యను బట్టీ, ఆకారాన్ని బట్టీ ఈ దీపహారతులకు మహేశ్వరుడు, త్రిమూర్తులూ, పంచభూతాలూ, సప్తరుషులూ, అష్టమూర్తులూ.. మొదలైన వారిని ఆయా దీపాలకు అధిదేవతలుగా పేర్కొన్నారు.
దీపదానం ఎంతో విశిష్టం
ఏక సర్వదానేని దీపదానం తదేకథ:
అంటే, ‘ప్రపంచంలోని అన్ని దానాల్లో దీపదానమే శ్రేష్ఠమైనది’ అని భావం.
అందుకే హైందవ సంప్రదాయంలో దీపారాధనకు ఎంత ప్రాముఖ్యతను ఇచ్చారో దీపదానానికీ అంతే విశిష్టమైన స్థానాన్ని కల్పించారు.

కార్తీక మాసంలో చేసే దీపదానం వల్ల పద్దెనిమిది (18) రకాలైన ఫలితాలు వస్తాయని చెబుతారు. జ్యోతిర్లింగాలను సందర్శిస్తే కలిగే ఫలితమే దీపం దానం చేసినా లభిస్తుందన్నది ఆర్యోక్తి. మనలోని అజ్ఞానపు చీకట్లను పోగొట్టడమే కాకుండా జ్ఞానజ్యోతులను పంచే ఈ దీపదానం చేయడానికి క్షీరాబ్ది ఏకాదశి, ద్వాదశి, కార్తీక పూర్ణిమ వంటివి అనుకూలమైన తిథులని చెబుతారు.
సాధారణంగా ఉసిరికాయ మీద బొడ్డు వత్తి పెట్టి వెలిగించిన దీపాన్ని దానమిస్తారు.
దీంతోపాటు వెండి ప్రమిదలో బంగారు వత్తి వేసి, దక్షిణ తాంబూలాలతో సహా దానమివ్వడం పరిపాటి.
మరికొన్ని నోముల్లో, వ్రతాల్లో బియ్యం పిండి లేదా గోధుమపిండితో దీపాన్ని తయారు చేసి దాన్ని ఆవునేతితో నింపి జ్యోతులు వెలిగించి వాటిని ముత్తయిదువులకు దానంగా అందిస్తారు.
పూజలైనా, దానమైనా ఉన్నది నలుగురితో పంచుకోవడమనే గొప్ప భావన వీటిలో దాగి ఉంది.

పంచభూతాత్మక రూపం
పంచ భూతాత్మకమైన సృష్టికి ప్రతీక దీపం.
మట్టి ప్రమిద భూతత్వానికీ, తైలం జలతత్వానికీ, వత్తి ఆకాశతత్వానికీ, వెలగడానికి తోడ్పడే గాలి వాయుతత్వానికీ, జ్యోతి అగ్నితత్వానికీ ప్రతీకలు.
మనిషి శరీరమూ పంచభూతాల సమాహారమే కాబట్టి దీపాన్ని వెలిగించడం అంటే మనల్ని మనం వెలిగించుకోవడమే. మనలోని అజ్ఞానపు అంధకారాల్ని నశింపచేసే ఆ పరమాత్మకు సమీపంగా వెళ్లడమే.
దీపం దానంతట అది ఎలా వెలగలేదో మనిషి కూడా పుట్టుకతో జ్ఞాని కాలేడు.
అందుకే దేవుడి ముందు దీపాన్ని వెలిగించి ఆ వెలుగులో మన ఆత్మదీపాన్ని వెలిగించుకుంటాం.
లోలోపలి చీకట్లను వదిలించుకుంటాం.
దీపానికి ఉండే మరో ప్రత్యేకత.. అది ఎప్పుడూ ఊర్ధ్వదృష్టినే కలిగి ఉండటం.
దీపం నుంచి అజ్ఞానమనే చీకట్లను పారదోలడం నేర్చుకున్నట్టే మనసునూ అన్ని విషయాల వైపు మళ్లించకుండా ఊర్ధ్వదృష్టిని కలిగి ఉండాలనే విషయం నేర్చుకోవాల్సిన పాఠమే.

లక్ష్మికి ప్రతిరూపం.. దీపం
దీపం ముమ్మూర్తులా పరబ్రహ్మ స్వరూపమే.
వెలుగుతున్న వత్తి ప్రకాశాన్నిస్తుంది.
పాప ప్రక్షాళన చేస్తుంది.
దీపానికి ఉన్న అద్భుతమైన శక్తే అంధకారాన్ని పోగొట్టడం. అంధకారమంటే కేవలం చీకటి మాత్రమే కాదు. మనసులోని అజ్ఞానం కూడా అంధకారమే. ఆ చీకట్లను పటాపంచలు చేసి, జ్ఞానాన్ని ప్రసాదించే దేవత లక్ష్మీదేవి.
ఆ అద్భుత శక్తి కలిగి ఉన్న దీపానికి ప్రతీకే లక్ష్మీదేవి. అందుకే లోకంలో లక్ష్మీస్థానంగా చెప్పే వాటిల్లో దీపం కూడా ఒకటి. దీపం లక్ష్మీదేవి స్వరూపం ఎలా అయిందన్న దానికీ ఒక కథ ఉంది.
పూర్వం ఇంద్రుడు దూర్వాస మహర్షి ఆగ్రహానికి లోనై సకల సంపదలూ కోల్పోతాడు. అప్పుడు దిక్కుతోచక శ్రీమహావిష్ణువును ప్రార్థిస్తే ఆయన జ్యోతి రూపంలో లక్ష్మీదేవిని పూజించాలని సలహా ఇచ్చాడట. ఇంద్రుడు అలా భక్తితో దీపరూపాన్ని పూజించి తిరిగి తన సంపదలను పొందాడట. అప్పటి నుంచీ లక్ష్మీదేవి దీపలక్ష్మీదేవి అయిందని చెబుతారు. తమిళులు కూడా లక్ష్మీపూజను దీపస్తంభానికే నిర్వహిస్తారు. అమ్మవారి ప్రతిరూపాలు ఉన్న కుందుల్లో మీనాక్షి దీపాలను వెలిగిస్తారు. జ్ఞానసముపార్జనకూ, ఊర్ధ్వదృష్టికీ ప్రతీక అయిన దీపానికి మనం నమస్కరిస్తాం.
ప్రదక్షిణలు చేస్తాం. పండుగలు చేసుకుంటాం.
మరో కథనం ప్రకారం.. దీపం సకల దేవతలకూ సాక్షీభూతమని చెబుతారు. దీపపు కుందె భాగంలో బ్రహ్మ, మధ్య భాగంలో విష్ణువు, ప్రమిదలో శివుడు, వత్తి వెలుగులో సరస్వతి, వెలిగే జ్యోతిలో లక్ష్మీదేవి కొలువై ఉంటారని ప్రతీతి.
అందుకే పూజలో భాగంగా దీపాన్ని పూజిస్తారు.
పూలూ, అక్షింతలూ జల్లుతారు.
నైవేద్యం పెడతారు.

ఏ జన్మరాశి వారు ఎన్ని వత్తులు వెలిగించాలంటే..
రోజూ చేసే దీపారాధన కాకుండా నది దగ్గర లేదా గుడిలోనో విశేష దీపారాధన చేయాలనుకున్న వాళ్లకి జన్మరాశిని బట్టి ఎన్నెన్ని వత్తులు వెలిగించాలో శాస్త్రంలో స్పష్టంగా సూచించారు.
దాని ప్రకారం..
• మేష, కర్కాటక, ధనుస్సు రాశుల వారు మూడు (3)
• వృషభ, కన్య, కుంభ రాశుల వారు నాలుగు (4)
• సింహ, వృశ్చిక, మీన రాశుల వారు అయిదు (5)
• తులా రాశి వారు ఆరు (6)
• మిథున, మకర రాశుల వారు ఏడు (7) వత్తులు వెలిగించాలి. దీపారాధన చేసే సమయంలో ఇన్ని వత్తులే వేయాలన్న నియమం ఏదీ స్పష్టంగా లేదు. రెండు వత్తులకు తగ్గకుండా తమ శక్తి మేరకు ఎన్ని వత్తులనైనా వెలిగించుకోవచ్చు. నిత్య దీపారాధన చేసే వారు సాధారణంగా కుందిలో నాలుగు వత్తులను రెండు వత్తులుగా చేసి రెండు జ్యోతులుగా వెలిగిస్తారు.
అయితే, చేసే పూజను బట్టీ, ఆచరించే నోమును బట్టీ వత్తుల సంఖ్య మారుతుంటుంది. కుంది కాకుండా ప్రమిదలో దీపాన్ని పెట్టాలనుకునే వారు ప్రమిద కింద మరో ప్రమిదను పెట్టి దీపారాధనను చేయాలట!. మొత్తం అందరి భారాన్ని మోసే భూదేవి మాత్రం ఈ వేడిని భరించలేదట. అందుకే ఆమెకు వేడి తగలకుండా రెండు ప్రమిదలను ఒక దానిలో ఒకటి ఉంచి వెలిగిస్తారు. మొత్తానికి దీపారాధన చేసేటప్పుడు కనీసం రెండు వత్తులు ఉండేలా చూసుకోవాలి. ఇది కనీస దీప నియమం. మనం వెలిగించే దీపజ్యోతి ఉత్తర దిశగా ఉండేలా పెడితే కార్యాలన్నింటా విజయం లభిస్తుంది. తూర్పు దిశగా పెడితే ఆరోగ్యమూ, మనశ్శాంతీ కలుగుతాయట.

దీపావళికి ఎక్కడెక్కడ దీపాలు వెలిగించాలి?
భోదీపదేవి రూపస్త్యం
కర్మసాక్షిహ్యామిఘ్న కృత
యావత్పూజాం కరిష్యామి
తావత్వం సిద్ధిదోభవ
దీపం సాక్షాత్తూ లక్ష్మీ స్వరూపం.
అందుకే దీపం కొలువైన ఇంట శ్రీమహాలక్ష్మి నివసిస్తుంది.
ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. దారిద్య్రాన్ని పారదోలుతుంది.
ఐశ్వర్యసిద్ధినిస్తుంది. శాంతిని చేకూరుస్తుంది.
దీపావళి పండుగ సమయంలో తీర్చిదిద్దిన రంగవల్లిక మీద పీఠం వేసి అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు. ముగ్గు లేదా సున్నంతో లక్ష్మి పాదాలు వేసి ఆమెను ఇంటి లోనికి ఆహ్వానించే ఆచారమూ ఉంది. దీపావళి నాటి సాయంత్రం పూజగదితో పాటు మరో అయిదు ప్రదేశాల్లోనూ దీపాలు తప్పనిసరిగా వెలిగించాలి.
అవి..
• ఇంటి ప్రధాన ద్వారం
• వంటిల్లు
• ధాన్యం గది
• బావి
• రావిచెట్టు
ఇవి వీలుకాని పక్షంలో తులసి చెట్టు దగ్గరా దీపాన్ని వెలిగించవచ్చు.

దీప కథలు
మనిషి జీవితంలో చీకటి వెలుగులు సహజం. చీకటిని చీల్చుకుంటూ వెలుతురును వెతుక్కుంటూ సాగడమే మానవ జీవితపు పరమార్థం. అలాంటి విజయపు వెలుగుల్ని అందరికీ పంచేదే దీపావళి పండుగ.
చెడు మీద మంచి గెలుపునకు ప్రతీకగా, అధర్మం పైన ధర్మం సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే సిరికాంతుల పండుగ ఇది. ఆ పర్వదిన సందర్భాన ఒక్క నరకాసుర వథే కాదు.. యుగయుగాల్లో మరెన్నో విశేషాలూ ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి.
• ద్వాపర యుగంలో నరకుడనే రాక్షసుడి ఆగడాలు పెరిగిపోయాయి. ఒక్క భూమినే కాకుండా పదునాలుగు భువనాలనూ శాసిస్తూ, జనాన్ని హింసిస్తూ జీవించసాగాడు. దేవతలంతా కృష్ణపరమాత్మను ఆశ్రయించారు. ఆయన తన ప్రియసఖి సత్యభామతో కలిసి యుద్ధానికి వెళ్లాడు. నరకుడు బాణానికి మూర్ఛపోయినట్టు నటించాడు. తన ప్రాణనాథుడికే హాని తలపెడతావా అంటూ సత్యభామ కళ్లెర్రచేసి విల్లెక్కుపెట్టింది. నరకుడు నేలకొరిగాడు. నరక అనే పదానికి అర్థం చీకటి. సత్య అంటే వెలుగు. వెలుగు చేతిలో చీకటి ఓడిపోయింది. ఆ సమయంలో దేవతలంతా ‘దీపం కుర్యాత్‍.. దీపం కుర్యాత్‍’ (దీపాలు వెలిగించండి.. దీపాలు వెలిగించండి) అంటూ ఆనందనాదాలు చేశారు. నరకాసుర వధతో అలా లోకాలన్నీ ప్రకాశవంతమయ్యాయి. అందుకు ప్రతీకగా జరుపుకునేదే దీపావళి పండుగ అని ఐతిహ్యం. దీపావళి నాడు ఒక్క భూలోకమే కాదు.. పద్నాలుగు భువనాలూ దివ్యకాంతులతో వెలిగిపోతాయి.
• లక్ష్మీదేవి పుట్టింది దీపావళి రోజుల్లోనే. ధన్‍తేరస్‍గా పిలిచే ధనత్రయోదశి నాడే మహాలక్ష్మి పుట్టిన రోజుగా చెబుతారు. అందుకు గుర్తుగానే ఆనాడు కొంచెమైనా బంగారం కొని, ఇల్లు శుభ్రం చేసి, ముగ్గులు పోసి, దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు.
• రావణుడిని వధించిన రాముడు సీతాసమేతంగా అయోధ్యకు తరలివచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని అయోధ్యావాసులంతా దీపాలను వెలిగించి ఆనందంగా పండుగ జరుపుకున్నారట. అలాగే, పాండవులు వన, అజ్ఞాతవాసాలను ముగించుకుని దీపావళి సమయంలోనే తిరిగి వచ్చారనేది మరో కథ. • దీపావళి రోజుల్లోనే వచ్చే ధన త్రయోదశి తిథి యముడికి ప్రీతికరమైనదని అంటారు. అందుకు గుర్తుగా ఈనాడు పెట్టే దీపానికి యమదీపమని పేరు. • బలి చక్రవర్తిని వామనావతారంలో విష్ణువు పాతాళానికి అణగదొక్కిందీ దీపావళి నాడేనని అంటారు. ప్రదోష సమయంలో దీపదానం చేస్తే యమబాధల నుంచి మనిషికి విముక్తి లభిస్తుందట. దీపావళి నాడు గాఢాంధకారాన్ని తొలగించి వెలుగులు నింపే జ్యోతిని వెలిగించినా, దానమిచ్చినా పుణ్యమే.

Review దీపలక్ష్మీ నమోస్తుతే!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top