శివ పురాణం ఎన్నో కథల సమాహారం. శివ పురాణాన్ని అమూలాగ్రం చదవలేని వారు ఆ పురాణంలో భాగంగా ఉండే శివలీలలను చదివితే చాలు.. ఎంతో ఆధ్యాత్మిక వికాసం, విజ్ఞానం లభిస్తాయి. విజ్ఞాన శాస్త్ర ప్రాథమిక సూత్రాలు, మానవ వికాస మంత్రాలు మనని శక్తిమంతం చేస్తాయి. మనిషిగా నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అనేకానేక సమస్యలను ఎలా అధిగమించాలో నేర్పు సాధనాలు ఆ శివలీలల్లో ఎన్నో ఉన్నాయి. ‘శివ’ అనే స్వరూపం నిజానికి అనంతమైన శూన్యం. కానీ, మన దృష్టికి, ఆలోచనలకు తగినట్టు ఆరూపానికి మరెన్నో స్వరూపాలను సృష్టించుకున్నాం. నిగూఢమూ, అగోచరమూ అయిన ‘ఈశ్వరుడి’గా, మంగళకరుడైన ‘శంభుడి’గా, అడిగింది లేదనకుండా ఇచ్చేసే ‘భోళాశంకరుడి’గా, సకల వేదాలూ, శాస్త్రాలూ, తంత్రాలూ బోధించిన ‘దక్షిణామూర్తి’గా, ప్రణమిల్లితే చాలు ఎవరినైనా ఇట్టే క్షమించేసే ‘అశుతోషుడి’గా, కాల స్వరూపమై వెలుగొందే ‘కాలభైరవుడి’గా, ప్రశాంతచిత్తాన్ని వెలువరించే ‘అచలేశ్వరుడి’గా, బ్రహ్మాండ నృత్యకారుడైన ‘నటరాజు’గా.. ఇలా జీవితంలో ఎన్ని పార్శ్వాలుంటాయో అవన్నీ కూడా ఆయన స్వస్వరూపాలుగానే వెలుగొందుతున్నాయి.
మనది తర్కంతో పెనవేసుకుపోయిన సంస్క•తి. మానవ ప్రకృతిలోని చేతనను ఉత్క•ష్ట శిఖరాలకు తీసుకువెళ్లగల మహోన్నతమైన జ్ఞానఖని శివపురాణం. దానిని మన పెద్దలు అందమైన కథలుగా చెప్పారు. అలాంటి కొన్ని కథలే శివలీలలుగా ప్రసిద్ధి పొందాయి. అటువంటి కొన్ని శివలీలలను ఈ కార్తిక మాసం సందర్భంగా పఠిద్దాం.
శివలీల-1
మృకండు మహర్షి భృగు సంతతి వాడు. ఆయన భార్య మరుద్వతి. వారికి ఎంతకీ సంతానం కలగలేదు. దీంతో నిష్టా నియమాలతో తపస్సు చేస్తూ, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ కేదార క్షేత్రానికి చేరుకున్నారు.
ఒకనాడు కేదారేశ్వరుడిని అర్చించి, ధ్యానమగ్నులై ఉండగా, ‘ఇక మీరు మీ ఆశ్రమానికి వెళ్లండి. మీకు పుత్రభాగ్యం కలుగుతుంది’ అని వారికి అశరీరవాణి వినిపించింది. సంతోషంతో ఆ దంపతులు ఆశ్రమానికి చేరి, యథావిధిగా గృహస్థాశ్రమ ధర్మాల్ని నిర్వర్తించుకోసాగారు. కొన్నాళ్లకు మరుద్వతి మగపిల్లవాడిని ప్రసవించింది. అదే సమయంలో వారికి ‘ఈ పిల్లవాడు అల్పాయుష్కుడు. ఆయువు పన్నెండేళ్లే’ అని ఆకాశవాణి వినిపించింది. దీంతో మృకండు మహర్షి దంపతులు దు:ఖసాగరంలో మునిగిపోయారు. ‘అంతా ఆ శివలీల. మనమేం చేయగలం?’ అని తెప్పరిల్లి పిల్లవాడిని అల్లారుముద్దుగా పెంచసాగారు.
మృకండుడు పిల్లవాడికి జాతకర్మ జరిపించి మార్కండేయుడు అనే పేరు పెట్టాడు. ఉపనయనం అయ్యాక మార్కండేయుడు గురుకులానికి వెళ్లి గురువుల వద్ద విద్యాబుద్ధులన్నీ నేర్చి పదకొండేళ్ల వయసులో ఉండగా తల్లిదండ్రుల వద్దకు తిరిగి వచ్చాడు. బ్రహ్మతేజంతో ముద్దులు మూటగట్టుతున్న కుమారుడిని చూడగానే మృకండ మహర్షి దంపతుల గుండెలు తరుక్కుపోయాయి. ఇంకో ఏడాదే గడువు. తల్లి మరుద్వతి మార్కండేయుడిని గుండెలకు హత్తుకుని కన్నీరుమున్నీరు అవుతుందే కానీ, కొడుకు ఎంత అడిగినా అసలు సంగతి చెప్పదు. చివరకు తండ్రి మృకండుడే చెప్పలేక చెప్పలేక ఇంకో ఏడాదిలో నీ ఆయుష్షు తీరిపోనుందని అసలు విషయాన్ని చెబుతాడు.
తండ్రి మాటలతో మార్కండేయుడు ధీరచిత్తుడయ్యాడు. ‘మీరు నన్ను ఆశీర్వదించండి. ఇప్పుడే నేను తపస్సుకు వెళ్తున్నాను. శివానుగ్రహంతో మృత్యువును జయించి చిరంజీవినై వస్తాను’ అని తల్లిదండ్రులకు ప్రణమిల్లాడు. తల్లిదండ్రులు కుమారుడిని ‘చిరంజీవ’ అని ఆశీర్వదించారు. అదే సమయంలో నారదుడు వచ్చాడు. మృకండుడు ఆయనను పూజించి, తన కుమారుడి ఆయుష్షు గురించి చెప్పాడు. నారదుడు మార్కండేయుడి దృఢ సంకల్పాన్ని మెచ్చుకున్నాడు.
‘నాయనా! మార్కండేయా! నువ్వు తిన్నగా గౌతమీ తీరానికి వెళ్తు. అక్కడ పంచాక్షరీ మంత్రంతో శివుడిని దీక్షతో అర్చించు. నీకు జయం కలుగుతుంది’ అని నారదుడు దీవించాడు.
మార్కండేయుడు గౌతమీ తీరానికి చేరకుని, సైకత లింగాన్ని ప్రతిష్ఠించి, ‘చంద్రశేఖరా! నీవే నన్ను రక్షించు! నీ పాదాలను ఆశ్రయించిన నన్ను యముడేం చేయగలడు?’ అంటూ దీక్షతో తపస్సు సాగించాడు.
మరోపక్క నారదుడు లోకాలన్నీ తిరుగుతూ యముడి వద్దకు వెళ్లాడు. ‘మృత్యువును తప్పించుకోవడానికి మార్కండేయుడనే ముని కుమారుడు తపస్సు చేస్తున్నాడు. ఇక నీ బలమేంటో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది’ అంటూ చల్లగా చిచ్చు పెట్టి వెళ్లిపోయాడు.
మార్కండేయుడి ఆయువు పూర్తి కావస్తోంది. అతడి ప్రాణాలు తోడి తెమ్మని యముడు తన దూతలను పంపాడు. యమకింకరులు మార్కండేయుడి సమీపానికి కూడా వెళ్లలేక తిరిగి వెనక్కి వచ్చేశారు. అప్పుడు యముడే దండాన్నీ, పాశాన్నీ ధరించి నల్లని ఎనుబోతునెక్కి బయల్దేరాడు.
మార్కండేయుడు శివలింగానికి తలను ఆనించి, రెండు చేతులతోనూ శివలింగాన్ని గట్టిగా బిగించి పట్టుకుని ధ్యానమగ్నుడై ఉన్న సమయంలో యముడు కాలపాశాన్ని అతడి కంఠంపైకి విసిరాడు. ఆ పాశం శివలింగంపై పడింది. దీంతో శివుడు ప్రళయ రుద్రుడై తెరుచుకున్న త్రినేత్రంతో ఆవిర్భవించి యముడిపై త్రిశూలాన్ని గురిపెట్టాడు. యముడు భయంతో గడగడలాడుతూ చేతులెత్తి జోడించి, ‘హరహరా! రక్షించు!’ అంటూ కూలిపోయాడు.
శివుడు మార్కండేయుడి తలపై తన అభయహస్తాన్ని ఉంచి, ‘వత్సా! నీకు మృత్యువు లేదు. కల్ప కల్పాంతరాలు చూస్తూ చిరంజీవిగా ఉంటావు’ అని వరమిచ్చాడు. తరువాత దేవతలంతా వచ్చి యముడు లేకపోతే లోకంలో జనన మరణాల సమతుల్యం దెబ్బతింటుందని, కాబట్టి ఆయనను మన్నించాలని శివుడిని కోరారు. శివుడి అనుగ్రహంతో యముడు మళ్లీ పునర్జన్మ ఎత్తినట్టుగా లేచి తన లోకానికి వెళ్లిపోయాడు. ఆ సమయానికే కుమారుడిని వెతుక్కుంటూ వచ్చిన మరుద్వతి, మృకండుడు శివానుగ్రహం పొందిన మార్కండేయుడిని చూసి, శివలీలను కొనియాడుతూ చిరంజీవితో తమ ఆశ్రమానికి చేరుకున్నారు.
శివలీల-2
భీమావతి అనే ఊళ్లో సోమయాజి అనే శివభక్తుడు ఉండేవాడు. ఆయనకు సిద్ధరాముడనే కొడుకు కలిగాడు. ఆ కుర్రాడి ఏడవ ఏట సోమయాజి కన్నుమూశాడు. తండ్రి లేని ఆ ఏక పుత్రుడిని తల్లి ఎంతో శ్రద్ధగా పెంచసాగింది.
ఒకనాడు దీపావళి ఇంకా కొన్నిరోజులు ఉందనగా, సిద్ధరాముడు తన ఈడు కుర్రాళ్లతో సమిధలూ, ఆకులూ తీసుకురావడానికి అడవికి వెళ్లాడు. అక్కడ పిల్లలంతా ఓ మర్రిచెట్టు కింద కూర్చుని కబుర్లు చెప్పుకోసాగారు.
‘వచ్చే దీపావళికి మా అక్కనూ, బావనూ తెస్తాం. పండగకు మా ఇంట్లో అప్పాలు చేసుకుంటాం. అరిసెలు చేసుకుంటాం. కజ్జికాయలు చేసుకుంటాం. పూరీలు చేసుకుంటాం. గారెలు వండుకుంటాం. మా అక్కకూ, బావకూ కొత్త బట్టలు పెడతాం..’ అంటూ పిల్లలు తలో రకంగా చెప్పసాగారు. ఆ మాటలు విని సిద్ధరాముడు కూడా, ‘నేను కూడా పండగకు మా అక్కనూ, బావనూ పిలుస్తాను. మా ఇంట్లో పాయసం వండుకుంటాం. మా అక్కకూ, బావకూ సన్నని బట్టలు పెడతాం’ అన్నాడు.
ఆ మాటలు విని పిల్లలంతా వెటకారంగా నవ్వి, ‘నీకు మొదలు అక్కే లేదు కదా! బావ ఎలా వస్తాడురా? మా దగ్గర దంభాలు కొడుతున్నావా? చెప్పు. నీ అక్క ఎవరు? పేరేమిటి? మీ బావ పేరేమిటి? ఆయన ఎక్కడ ఉంటాడు? ఏం చేస్తాడు? ఏం చదువుకున్నాడు? వాళ్లకెంతమంది పిల్లలు?’ అని సిద్ధరాముడిపై ప్రశ్నలు వర్షం కురిపించారు.
వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సిద్ధరాముడు ఏడుస్తూ ఇంటికి వచ్చేశాడు. తల్లి వాడి కన్నీళ్లు తుడుస్తూ విషయం ఏమిటని ఆదుర్దాగా అడిగింది. రాముడు తన తోటి పిల్లలు చేసిన ఎగతాళి గురించి చెప్పాడు.
అంతా విని తల్లి, ‘వాళ్ల మాటలకేం రా? మీ అక్క పేరు భ్రమరాంబ. మీ బావ మల్లన్న. వాళ్లు శ్రీశైల పర్వతంపై ఉంటారు. వాళ్లు అష్టైశ్వర్యాలు గలవారు. గణపతి, కుమారస్వామి అని వారికి ఇద్దరు కొడుకులు. మీ బావ సర్వేశ్వరుడు. లోకాలన్నీ ఆయన చెప్పినట్టే నడుచుకుంటాయి. నీ బావలాంటి బావ ప్రపంచంలో ఎవడికీ లేడురా!’ అంది.
ఈ మాటలకు రాముడు పొంగిపోయి, ‘అయితే, వచ్చే దీపావళికి వాళ్లను తీసుకొద్దామమ్మా! అందరి అక్కలూ, బావలూ పండగకు వస్తున్నారు. మనం నా అక్కనూ, బావనూ ఎప్పుడూ తీసుకురాలేదు’ అన్నాడు.
‘నాయనా! మీ తండ్రి పోయాక వాళ్లనెవరు పిలుచుకు వస్తారు? నువ్వేమో పసివాడివి. దారంతా అరణ్యం. అందులో క్రూరమృగాలు , విషప్రాణులూ ఉంటాయి. అయినా మీ బావలాంటి ఐశ్వర్యవంతుడు మన పేదింటికి ఎందుకు వస్తాడు? ఆయన ఒంటరిగా రాడాయె! పెద్ద పరివారంతో వస్తాడు. ఒకపూట తింటే మరో పూట తినలేని మనం వారందరికీ తిండి ఎలా పెట్టగలం? నువ్వు పెద్దవాడివై బాగా సంపాదించాక మీ అక్కనూ, బావనూ తీసుకొద్దువుగాని’ అని సముదాయించి తల్లి.
సిద్ధరాముడు మర్నాడు తెల్లవారక ముందే లేచాడు. తల్లికి చెప్పకుండా కనిపించిన వారందరినీ అడుగుతూ శ్రీశైలం దారి పట్టాడు. మృగాలకూ, విషసర్పాలకు భయపడకుండా అక్కడకు చేరుకున్నాడు. శ్రీశైలంలో ఎన్నో తీర్థాలు, ఆలయాలు ఉన్నాయి. రాముడు తన అక్క, బావ కోసం అంతటా తిరిగాడు. ‘మల్లికార్జునుడు ఎక్కడ ఉంటాడు?’ అని ఎవరినో అడిగితే, వాళ్లు రాముడికి దేవాలయం చూపించారు. అందులోకి వెళ్లి చూస్తే లింగం తప్ప మరేమీ కనిపించలేదు.
అప్పటికే రాముడు బాగా అలసిపోయి ఉన్నాడు. దీంతో ఆ లింగానికి ఎదురుగా కూర్చుని, ‘బావా! నిన్నూ, అక్కనూ దీపావళికి తీసుకుపోదామని ఇంట్లో చెప్పండా వచ్చాను. మా ఊళ్లో అందరి అక్కలూ, బావలూ పండగకు వస్తున్నారు. మా అమ్మ మీ ఇద్దరినీ చూడాలని వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నది. ఇన్నాళ్లూ పిలవలేదని అలిగి, కనబడకుండా ఉన్నావా?. నువ్వు ఎంత ధనికుడవైతే మాత్రం బంధుత్వం పోతుందా? మేం పేదవాళ్లమని అనుకోక మా ఇంటికి రా! నిన్ను తీసుకెళ్లకుండా ఇంటికి తిరిగి వెళ్లను’ అన్నాడు.
రాముడి వేడుకోలు అరణ్యరోదనే అయింది. తన అక్క భమరాంబనూ ఇలాగే వేడుకున్నాడు. కానీ, లాభం లేకపోయింది. భరించలేని నిరాశతో రాముడు ఆత్మహత్య చేసుకోవలని నిశ్చయించుకున్నాడు. ‘అక్కనూ, బావనూ తీసుకొస్తానని ప్రగల్బాలు పలికి తీసుకురాలేకపోతే తోటివాళ్ల దగ్గర ఎంత అవమానం? దాని కంటే చావడం మేలు. ఆ చచ్చేది అక్కాబావలున్న చోట చస్తే ఆ మాట వారికే వస్తుంది’.. ఇలా అనుకుని రాముడు శ్రీశైల శిఖరం ఎక్కి కిందకు దూకబోయాడు. అంతలోనే అతని భుజాలు ఎవరో పట్టుకున్నారు. ఒకపక్క మగవాడూ, మరోపక్క మహిళా ఉన్నారు.
‘ఎవరు మీరు? చచ్చిపోదామనుకున్న నన్నెందుకు ఆపారు? నా అక్కకూ, బావకూ లేని జాలి నా మీద మీకెందుకు?’ అని సిద్ధరాముడు అడిగాడు.
అప్పుడా స్త్రీ, ‘మేం పరాయివాళ్లం కాదు తమ్ముడూ! నేను మీ అక్కను. పేరు భ్రమరాంబ. ఈయన మీ బావగారు. మమ్మల్ని ఎపుడూ చూసి ఎరుగవు. అందుచేత గుర్తుపట్టలేక పోతున్నావు. సోమయాజుల గారి అబ్బాయి ఇక్కడ తిరుగుతున్నాడని తెలిసి నిన్ను వెతుక్కుంటూ వచ్చాం’ అన్నది.
రాముడు పరమానందభరితుడై అక్కకూ, బావకూ మొక్కాడు. వాళ్లు రాముడికి తమ కుమారులు, ఇతర పరివారాన్ని చూపారు. రాముడి వారిని తన వెంట రమ్మన్నాడు.
ఈ లోపల రాముడి తల్లి కొడుకు కనిపించక తల్లిడిల్లిపోయింది. తన మాటలు నిజమని నమ్మి కుర్రవాడు శ్రీశైలం పోయి ఉంటాడనుకుని ఆమె భయపడింది.
కొద్దిరోజులు గడిచాయి. పండగ వచ్చింది. దాంతోపాటే ఉదయం రాముడు ఇంటింటికీ తిరిగి తన అక్కనూ, బావనూ, ఇతర పరివారాన్నీ తీసుకువచ్చాననీ, వారంతా ఆలయం వద్ద ఉన్నారనీ చెప్పాడు. రాముడి తల్లి ఆనందాశ్చర్యాలతో ఆలయానికి వెళ్లి పార్వతీ పరమేశ్వరులను, వినాయకుడినీ, కుమారస్వామినీ, వారి పరివారాన్ని కళ్లారా దర్శించి అందరినీ తనింటికి ఆహ్వానించింది.
వారంతా ఆ ఇంట్లో అడుగు పెట్టే సరికి, ఆ పాత ఇల్లు కాస్తా దివ్య భవనంగా మారిపోయింది. అతిథులు అందులో ప్రవేశించారు. ఆ రోజు ఊళ్లోవాళ్లు కొత్తగా వెలిసిన ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోయారు. బయటి ద్వారాలు మూసి ఉన్నాయి. లోపల అంతులేని జనం ఉన్నట్టు సందడిగా ఉన్నది.
దీపావళికి రాముడి అతిథులుగా వచ్చిన పార్వతీ పరమేశ్వరులు.. రాముడినీ, అతడి తల్లినీ తమ వెంట కైలాసానికి తీసుకువెళ్లారు.
శివలీల-3
హిమాచలాన్ని ఆనుకుని ఉన్నతమైన దేవదారు వృక్షాలతో హిమానీ జలపాతాలతో ఎంతో రమణీయంగా ఉండే దారుకావనంలో ఒకప్పుడు భృగువు, మరీచి, అంగీరసుడు తదితర హేమాహేమీలైన మహా రుషులు ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని గొప్ప తపస్సులు, యాగాలు చేస్తూ తమ భార్యలతో కాపురం ఉంటుండే వారు.
ఆ రుషుల తపోమహిమ చేతనే అతిలోక సౌందర్యవతులైన వారి భార్యలు మహా పతివ్రతలై ఉంటున్నారనీ, పర పురుషులు వారిని సమీపిస్తే భస్మమైపోతారనీ, ముమ్మూర్తులైనా వారి తప్పశ్శక్తి ముందు ఆగలేరనీ తపోగర్వంతో ఆ మహర్షులు గొప్పలు పోతుండే వారు. ఈ విషయాన్ని నారదుడు కైలాసం వెళ్లి శివపార్వతుల చెవిన వేశాడు.
ఇలా ఉండగా ఒకనాడు మహా యజ్ఞాన్ని తలపెట్టి దాన్ని నిర్వహించేందుకు రుషులంతా తమ భార్యలను ఆశ్రమాల్లో వదలివెళ్లారు. ఈ తరుణం చూసి శివుడు సమ్మోహనాకారుడై ఒకచేత గంజాయి, విప్పపూల సురా పాత్రనూ, మరోచేత భిక్షాపాత్రనూ పట్టుకుని ఉన్మత్తునిలాగ తూలుతూ భిక్షాటనం ప్రారంభించాడు. రుషిపత్నులు అతడిని చూసి పరవశించి వెంటబడి అతడితో పాటు ఆడిపాడుతూ దారుకావనమంతా విహరించసాగారు.
యజ్ఞవాటికలో ఉన్న రుషుల వద్దకు నారదుడు వెళ్లి, ‘అవతల మీ కాపురాల్ని భిక్షువొకడు కూలుస్తున్నాడు. వెంటనే వెళ్లండి’ అని చల్లగా చెప్పి జారుకున్నాడు. రుషులు హూటాహుటిన దారుకావనానికి పరుగెత్తి వెళ్లి, తారల మధ్య చంద్రుడిలా ఉన్న శివుడిని చూసి, ‘ఎవడివిరా నువ్వు?’ అని గద్దించారు. ‘నా పేరు చిదంబర సుందరేశ్వరుడు’ అన్నాడు భిక్షువు.
‘నువ్వు చేసే పనేమిటి?’ అన్నారు రుషులు. జవాబుగా సురాపాత్రనూ, భిక్షాపాత్రనూ ఎత్తిచూపుతూ, ‘పనిలేని వారికి పని కల్పించడమే నా పని’ అన్నాడు శివుడు. ‘ఓరీ! నీ మగతనం బూడిదపాలై శిల అవుగాక’ అని శపించారు రుషులు.
‘నాకిదేమీ కొత్త కాదు’ అంటూ శివుడు పరిహాసం చేశాడు.
రుషులు అభిచార హోమం చేసి హోమగుండం నుంచి ‘మాయ’ అనే కారుచీకట్లు కమ్మే కృత్యాభూతాన్ని పుట్టించి శివుడి మీదకు వదిలారు.
శివుడు ఆ మాయను తన కుడికాలి కింద అణచి, ఎడమ కాలు ఎత్తి తాండవం చేయసాగాడు. రుషులు ఈసారి ‘భయం’ అనే పెద్దపులిని హోమకుండం నుంచి పుట్టించి శివుడి మీదకు పంపారు. శివుడు దాన్ని చీల్చి పులిచర్మాన్ని మొలకు చుట్టుకున్నాడు. ‘మహా పాపములు’ అనే విషసర్పాల్ని శివుడి మీదకు విసిరారు రుషులు. శివుడు వాటిని భూషణాలుగా ధరించాడు.
రుషులు మరోసారి ‘చిత్తచాంచల్యం’ అనే సమ్మోహన విద్యను మంత్రోచ్ఛారణ చేస్తూ ప్రయోగించారు. శివుడు దాన్ని చిన్న లేడిపిల్లలా మార్చి పిడికిట బిగించి పట్టుకున్నాడు. రుషులు ప్రళయాగ్నిని రగిల్చి శివుడి మీదకు విసిరారు. శివుడా అగ్నిని పూలచెండులా పట్టుకున్నాడు.
అప్పటికీ రుషులు శివలీలను తెలుసుకోలేక మహాజ్వాలను విసిరారు.
ఈ జ్వాలలు శివుడి చుట్టూరా వలయాకారంలో తోరణం కట్టాయి.
మాయను మర్దిస్తూ, నటరాజ శివుడు చేస్తున్న నృత్యాన్ని చూడ్డానికి విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, నంది, భృంగి మొదలైన ప్రథమ గణాలు వెంటరాగా పార్వతి అక్కడకు చేరుకుంది. జగదాంబ ముంగిట శివుడు మహదానందంతో తాండవం చేస్తుంటే దేవతలంతా వచ్చారు. రాగబద్ధంగా విష్ణువు మృదంగం వాయిస్తుంటే, సరస్వతి వీణ మీటగా ఇంద్రుడు వేణువునూదాడు. బ్రహ్మ తాళాలు పట్టి లయ వేశాడు. రుషులు బుద్ధి తెచ్చుకుని సామవేదాన్ని వల్లించసాగారు. నారదుడు గాంధర్వగానం చేశాడు. భృంగీశ్వరుడు ఢమరుకాన్ని, నందీశ్వరుడు భేరిని వాయించారు. కుమారస్వామి తూర్యనాదాన్ని పూరించాడు. శివతాండవం చూస్తుంటే విఘ్నేశ్వరుడికి ఉత్సాహం పుట్టుకొచ్చి నృత్యం చేయడం మొదలుపెట్టాడు. అతడి వాహనం చిట్టెలుక కూడా చిందులు వేసింది.
నృత్యశివుడు, రాగవిష్ణువు, లయబ్రహ్మగా జగత్తు లీలా నృత్యంగా శివలీల సాగుతుంటే ఆ నృత్యాన్ని చూసి భరతముని నటరాజ శివుడిని నాట్యానికి అధిదేవతగా భరతశాస్త్రమనే నాట్యవేదాన్ని రచించాడు. ఇదే భరతనాట్యంగా ప్రసిద్ధి పొందింది.
శివలీల-4
వ్యాఘ్రపాదుడనే మునికి ఉపమన్యువు అనే కొడుకుండే వాడు. ఐదేళ్ల ప్రాయంలోనే ఆ కుర్రవాడికి తాము దరిద్రులమనే సంగతి తెలిసివచ్చింది. వాడు అరణ్యానికి వెళ్లి పంచాక్షరీ మంత్రం జపిస్తూ శివుడి గురించి తపస్సు చేశాడు. శివపార్వతులు వికార రూపాలలో ఉపమన్యువు ఎదుటికి వచ్చి, ‘బాబూ! ఈ అరణ్యంలో పులులుంటాయి. ఇంటికెళ్లు’ అన్నారు. ‘శివపంచాక్షరీ ఉండగా నాకు ఏ భయమూ లేదు’ అన్నాడు ఉపమన్యువు.
పార్వతీపరమేశ్వరులు సంతోషించి అతడికి అష్టైశ్వర్యాలు ప్రసాదించారు.
శివలీల-5
గయాసురుడనే దానవుడు ఒకసారి ముల్లోకాలనూ ఆక్రమించి కైలాసం మీదకు కూడా విరుచుకుపడ్డాడు. శివుడు తన జటాజూటాన్ని విదిలించగా అందులో నుంచి భయంకరమైన ముఖంతో, పెద్ద శరీరంతో ఒక ఘోరాకారుడు పుట్టి దానవుడిని కబళించడానికి ఉరికాడు. గయుడు భయంతో గజగజ వణికిపోతూ శివుడిని శరణు వేడుకున్నాడు. శివుడు అభయమిచ్చాడు. భయంకరముఖుడు చేసేది లేక ‘ఆహారం.. ఆహారం కావాలి’ అని ఆక్రోశించాడు. ‘నీ శరీరాన్నే నువ్వు తిని నీ ఆకలి చల్లార్చుకోవాల్సిందే’ అని శివుడు ఆదేశించాడు. శివాజ్ఞను శిరసావహించి భయంకరముఖుడు తన శరీరాన్నంతటినీ భక్షించి ముఖంతో మిగిలాడు. అప్పుడు శివుడు ప్రీతుడై ఆ ముఖానికి ‘కీర్తిముఖము’ అని పేరు పెట్టాడు. ‘ఓయీ! కీర్తిముఖుడా! నీవు అందరి దేవతల తలలపై నిలిచి వారికి కీర్తి కలుగచేస్తుంటావు’ అని వరమిచ్చాడు.
ఆ విధంగా శివుడి అంశ కీర్తిముఖంగా మకరతోరణం మధ్య ప్రతి దేవతామూర్తి నడినెత్తిన ప్రకాశించింది.
శివలీల-6
దక్షిణాన పొత్తపినాడు అనే ప్రాంతంలో అరణ్యం ఉండేది. అందులో శబరులు ఉండేవారు. ఉడుమూరు అనేది వాళ్ల ముఖ్య నగరం. ఆటవికులైన శబరులు వేట, వ్యవసాయం చేసి జీవిస్తుండే వారు.
శబరులకు రాజు నాథనాథుడు. అతని భార్య పేరు తండె. వారికి తిన్నడు అనే కుమారుడు కలిగాడు. వాడు పెద్దవాడవుతూ విలువిద్య నేర్చుకున్నాడు. వాడికా విద్య పుట్టుకతోనే వచ్చింది. విల్లు పట్టుకున్న నలభై రోజులకే అరణ్యంలో పరుగెత్తే లేడిని, ఆకాశంలో ఎగిరే పక్షిని కొట్టగలిగాడు. శబరులు తమ రాజుతో తిన్నడికి వేటవిద్యలు నేర్పాలన్నారు. ముందుగా శబరులు శివుడిని పూజించి, యాటలు బలిపెట్టి వేడుక చేసుకున్నారు. మర్నాడు శబరరాజు తన కొడుకు వెంట వేటకు వెళ్లాల్సిన వారిని ఎన్నుకుని, వేటకు కావాల్సిన ఉచ్చులూ, వలలూ, కుక్కలూ మొదలైన జంతువులూ సిద్ధం చేశాడు. పెద్ద సన్నాహంతో తిన్నడు తన జాతివాళ్లను వెంటబెట్టుకుని తిరుపతి కొండలకేసి బయల్దేరాడు. వేట విజయవంతంగా సాగింది. శబరులు రకరకాల అడవి జంతువులనూ, పక్షులనూ చంపారు. మాంసం ముక్కలు పుల్లలకు గుచ్చి కాల్చి, అడవితేనెతో కలిపి తిన్నారు. ఇలా వన్యమృగాలను వేటాడుతూ చాలా రోజులు అడవిలోనే మకాం పెట్టారు.
ఒకనాడు తిన్నడు వేటాడి అలసి, పొగడచెట్టు నీడన నిద్రపోయాడు. ఆ నిద్రలో వాడికి కల వచ్చింది. కలలో ఒక మహా పురుషుడు కనిపించాడు. ఆ మనిషి ఒంటి నిండా విభూతి పూసుకుని, పులితోలు కట్టుకుని, ఎర్రటి జెడలు వేలాడుతూ, భుజాల పుర్రెమాల ధరించి, మెడలో లింగాన్ని ధరించి ఉన్నాడు. ఆయన తిన్నడితో ప్రేమగా, ‘అబ్బాయీ! ఇక్కడ కొండ పక్కన సువర్ణముఖీ నదీ తీరాన మర్రిచెట్టు కింద శివుడున్నాడు. అక్కడికి వెళ్లి పూజించు నాయనా!’ అని చెప్పి అంతర్థానమయ్యాడు. తిన్నడు అదిరిపడి నిద్రలేచి, ఆశ్చర్యంతో నాలుగు దిక్కులా చూశాడు. తనతోటి వాళ్లు వేటలో నిమగ్నులై ఉన్నారు. వాళ్ల ఈలలు, కేకలు వినిపిస్తున్నాయి. ఒక అడవిపండి వేటగాళ్లను తప్పించుకుని గుర్రుమని అరుస్తూ, పరుగెత్తుకుని రావడం తిన్నడి కంటపడింది. వాడు దాన్ని కొట్టడానికి వెంటపడ్డాడు. అడవిపంది వాడికి దొరక్కుండా పరిగెత్తుతూ చాలా దూరం తిప్పి, అకస్మాత్తుగా అదృశ్యమైంది.
అది మాయమైన చోటనే శివాలయం ఉంది. కలలో తిన్నడికి కనిపించిన మహా పురుషుడు చెప్పినది ఈ ఆలయం గురించే అందుచేత జరిగినదంతా శివమాయ అని గ్రహించి తిన్నడు ఆనందభాష్పాలు రాల్చుతూ ఆ లింగానికి సాష్టాంగ నమస్కారం చేశాడు.
‘స్వామీ! ఈ కొండ ప్రదేశంలో పులులూ, సింహాలు సంచరించే చోట, ఏటి ఒడ్డున ఎందుకు కూర్చున్నావు? నీకు ఆకలైతే తిండీ, నీరూ ఎవరు తెచ్చిపెడతారు? మీ ఉడుమూర్తి రావయ్యా! చిన్నక్కలూ, పెద్దక్కలూ నీకు పంది, దుప్పి మాంసమూ, పిట్టల మాంసమూ కమ్మగా వండిపెడతారు. రకరకాల బియ్యాలతో పాయసం చేసి పెడతారు. రకరకాల తేనెలూ, పండ్లూ నీకు లభిస్తాయి. మా వూరికి వచ్చెయి. నీ వెంట వచ్చావా సరి. లేకపోతే నేను ఇక్కడి నుంచి కదలను’ అన్నాడు తిన్నడు.
ఇంతలో మిగిలిన శబరులు తిన్నడిని వెతుక్కుంటూ వచ్చి, ‘తిన్నా! నువ్వు తరిమిన అడవిపంది ఏమైంది?’ అని అడిగారు.
శివధ్యానంలో ఉన్న తిన్నడు మాట్లాడలేదు. వాళ్లు అతడిని ఇంటికి పోదాం పదమన్నారు. ఈ శివుడు నా వెంట వస్తే గాని నేను ఇక్కడి నుంచి కదలను. మీరు వెళ్లండి’ అని తిన్నడు అన్నాడు.
‘పాపం! శివుడు ఎంతకాలంగా పస్తులుంటున్నాడో!’ అనుకుని తిన్నడు విల్లు భుజాన పెట్టుకుని వెళ్లి, అడవిపందిని చంపి, ముక్కలు కాల్చి సువర్ణముఖి నదిలోని నీరు తెచ్చి, అంతా శివుడి ముందు పెట్టి ‘ఆరగించు’ అన్నాడు. దానికి శివుడు జవాబు ఇవ్వలేదు.
‘నువ్వు తినకపోతే నీ పాదాల దగ్గరే నా ప్రాణాలు విడుస్తాను’ అంటూ తిన్నడు ఏడవడం మొదలుపెట్టాడు. శివుడు అతడి భక్తికి మెచ్చి, ‘లే బాబూ! అలాగే తింటాను’ అని తిన్నడు పెట్టినదంతా తినేశాడు.
ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాడు శివభక్తుడైన శివగోచరుడనే బ్రాహ్మణుడు ఆ గుడికి వచ్చి, ‘ఈ ఎంగిలి పుల్లలేమిటి? స్వామీ! నీ ఆలయాన్ని ఎవరు ఇలా మైల పరిచారు? చెప్పకపోయావో తిండి మాని ప్రాణాలు విడుస్తాను’ అన్నాడు.
‘కంగారుపడకు. ఒక ఆటవికుడు తన ధోరణిలో నన్ను మహాభక్తితో కొలుస్తున్నాడు. వాడి పూజను నేను స్వీకరిస్తున్నాను. వాడి భక్తి చూడదల్చుకుంటే నా వెనుక పక్క కనిపించకుండా దాక్కో’ అన్నాడు శివుడు.
అంతలోనే తిన్నడు గుడికి వచ్చి, లింగం ముందున్న ఎంగిలిని కాలితో ఒకపక్కకు తోసి నీళ్లు పుక్కిలించి లింగం మీద అభిషేకించి, పత్రి పెట్టి, తినమని మాంసం ముక్కలు శివుడి ముందు పెట్టాడు. శివుడు తిన్నడి భక్తిని పరీక్షించాలని భావించి, వాడు పెట్టిన నైవేద్యం తినకుండా, మూసిన కంటి నుంచి నీరు కార్చడం ఆరంభించాడు. అది చూసి తిన్నడు ఆందోళనపడి శివుడి కంటికి చికిత్సలు చేయసాగాడు. వాడు తనకు తెలిసిన చికిత్సలూ, విన్నవీ ఎన్నో చేశాడు. అవేవీ పని చేయకపోగా, శివుడి కంటి నుంచి ఈసారి నెత్తురు కారసాగింది. తిన్నడికి ఏం చేయాలో పాలుపోలేదు. ‘కంటికి కన్నే మందు’ అనుకుని తన కన్ను ఒకటి తీసి శివుడికి కన్నుగా అమర్చాడు. వెంటనే శివుడి రెండో కంటి నుంచి కూడా రక్తం కారసాగింది. ‘భయం లేదు. దానికి కూడా చికిత్స నా దగ్గర ఉంది’ అంటూ తిన్నడు తన రెండో కన్నును పెకలించబోతుండగా శివుడు, ‘ఆగు.. ఆగు!’ అంటూ తిన్నడి చెయ్యి పట్టుకుని వాడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు.
శివుడు తన వెనుక ఉన్న బ్రాహ్మణుడితో, ‘శివగోచరా! చూశావు కదా ఈ పామరుడి భక్తి! నీకు నచ్చింది కదా!’ అన్నాడు.
శివుడు బ్రాహ్మణుడినీ, తిన్నడినీ తన ఎదురుగా నిలబెట్టుకుని, ‘మీకేం వరం కావాలి?’ అని అడిగాడు.
‘మీకు తోచిన వరం ఇవ్వండి. మేమా అడిగేవాళ్లం’ అంటూ వారిద్దరూ శివుడి ముందు సాష్టాంగపడ్డారు.
శివుడు వారి భక్తికి మెచ్చి, వారిని తిరిగి ప్రాపంచిక విషయాలలో పడనీయక, ఇద్దరినీ తనలో ఐక్యం చేసుకున్నాడు.
అలా తిన్నడితో పాటు బ్రాహ్మణుడు కూడా చివరిలో శివసాయుజ్యం పొందారు.
శివలీల-7
మార్కండేయుడు శివుడి అనుహ్రంతో దీర్ఘాయుష్షును పొంది చిరంజీవి అయ్యాడు. కానీ, అతని కన్న ఎక్కువ కాలం జీవించిన వాళ్లు ఇంకా చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఇంద్రద్యుమ్నుడు అనే రాజు ఒకడు.
ఇంద్రద్యుమ్నుడు గొప్ప రాజు. బతికి ఉండగా, ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ గొప్ప యశస్సును సంపాదించాడు. అది నిలిచినంత కాలమూ స్వర్గసుఖాలు అనుభవించాడు. తరువాత స్వర్గంలోని వాళ్లు ఆ పుణ్యం అయిపోగానే, ‘భూలోకంలో నిన్ను తలచే వాళ్లు లేరు. అందుచేత ఇకపై నీకు స్వర్గంలో చోటు లేదు. భూమికి తిరిగి వెళ్లు’ అన్నారు. ఇంద్రద్యుమ్నుడు భూలోకానికి తిరిగి వచ్చి, తన పేరు విన్న, తెలిసిన వారి కోసం వెతుకుతూ మార్కండేయుడి వద్దకు వచ్చాడు.
‘నేను మీకు తెలుసా?’ అని అడిగాడు.
‘నేను నిన్ను ఎరుగను. కానీ నా కంటే పెద్దవాడు ప్రావారకర్ణుడు అనే గుడ్లగూబ ఉంది. దానిని అడుగు అన్నాడు మార్కండేయుడు.
ఇద్దరూ కలిసి ప్రావారకర్ణుడి వద్దకు వెళ్లారు. ‘నేను నిన్ను ఎరుగను. కానీ నా కన్నా పెద్దవాడు నాళీకజంఘుడు ఉన్నాడు. వాడిని అడుగుదాం’ అంది గుడ్లగూబ.
నాళకజంఘుడు కూడా ఇంద్రద్యుమ్నుడిని ఎరుగడు. అతను వారిని వెంటబెట్టుకుని తనకన్నా వయసు గల ఆకూపారుడు అనే తాబేలు వద్దకు తీసుకెళ్లాడు.
ఆకూపారుడు ఇంద్రద్యుమ్నుడిని చూసి, ‘నేను నిన్ను ఎరుగుదును. నేను ఉంటున్న ఈ కొలను ఎలా వచ్చింది? నువ్వు అనేక యజ్ఞాలు చేసి గోవులను దానం ఇవ్వగా, ఆ గోవులు ఈ నేలను తొక్కడం చేత ఇక్కడ కొలను ఏర్పడింది’ అని చెప్పాడు. అప్పుడు దేవదూతలు వచ్చారు. ఇంద్రద్యుమ్నుడి కీర్తి ఇంకా భూలోకంలో నిలిచి ఉన్నదని చెప్పి అతడిని స్వర్గానికి తీసుకువెళ్లారు.
Review పరవశింపచేసే కథలు.. పరమేశ్వరుని గాథలు.