విజయవాకిట..ఆదిశంకరుల ఆధ్యాత్మిక బావుటా

మనం విజయవాడగా పిలిచే ఇంద్రకీలాద్రి పర్వతంపైకి ఎన్నోసార్లు వెళ్లి ఉంటాం. అక్కడ కొలువైన కనకదుర్గమ్మను కనులారా దర్శించుకుని ఉంటాం. కానీ, ఈ విషయాలు ఎప్పుడైనా గమనించారా?.. వీటి గురించి మీకు తెలుసా? దసరా (అక్టోబరు 24/25) సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ గురించి మనకు తెలియని కొన్ని సంగతులు తెలుసుకుందాం.
ఇంద్రకీల పర్వతంపై కనకదుర్గ అమ్మవారు బంగారు పసిడి వర్ణంతో మేలి మెరుపుతో ప్రకాశిస్తుంటారు. ఈ కారణంగానే ఇంద్రకీలాద్రికి కనకాచలమనే మరో పేరు కూడా ఉంది.

ఇంద్రకీలాద్రిపై కొలువైన ప్రధాన ఆలయంలో దుర్గమ్మ రాక్షసుడిని సంహరిస్తున్న భంగిమలో కనిపిస్తారు. అయితే, ఆమె మూర్తి ఇంద్రకీలాద్రి పర్వతం మీదనే వేరొకచోట అవ్యక్త రూపంలో ఉందని అంటారు. ఈ మూర్తిమత్వాన్ని నిత్యం మహర్షులు, సిద్ధులు, యోగులు, కిన్నరులు దర్శించుకుని ఆరాధిస్తారట. ఆ కనకదుర్గాదేవి మూర్తిని ‘చింతామణి దుర్గ’ అని వారు పిలుస్తారట.
విజయవాకిట (విజయవాడ)లో కొలువైన దుర్గాదేవి విగ్రహంలో ఒక ప్రత్యేక లక్షణం కనిపిస్తుంది. అమ్మవారు ఈశాన్య దిక్కు వైపు చూస్తున్నట్టు ఉంటుంది. అమ్మవారు ఈశాన్య దిక్కు వైపు చూడటం అనేది అత్యంత శుభసూచకమని అంటారు. భక్తుల ప్రార్థనలను దుర్గాదేవి ఆలకిస్తుందనడానికి ఇదే నిదర్శనమని నిజ భక్తులు చెబుతారు.

ఇప్పుడు మనం విజయవాడగా పిలుచుకుంటున్న ప్రాంతం పేరు ఒకప్పుడు విజయవాటిక. అప్పట్లో ఇంద్రకీలాద్రి పర్వత్వంపై కొలువైన దుర్గాదేవి సన్నిది వామాచారాలకు నిలయంగా ఉండేది. విచ్చలవిడిగా జంతుబలులు జరుగుతుండేవి. ఒక మహానుభావుడి రాకతో అక్కడి సంప్రదాయాలు సమూలంగా మారిపోయాయి. జగన్మాతను ప్రసన్నం చేసుకోవడమే కాక, ఇంద్రకీలాద్రి క్షేత్రాన్ని సుసంపన్నం చేసిన ఆ మహానుభావుడు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. వందల సంవత్సరాల క్రితం చోటుచేసుకున్న అద్భుతమిది. అదెలా జరిగిందంటే..
దశవక్త్రా దశభుజా దశపాదాంజనప్రభా!
విశాలయా రాజమానా త్రింశల్లోచనమాలయా!!
పై విధంగా ఆదిశంకరులు జగన్మాతను స్తుతిస్తున్నారు. అక్కడున్న వాళ్లంతా ఆయనను నిశ్చేష్టులై చూస్తున్నారు. ఒక కాంతిగోళం భువిపై దిగినట్టు.. ముట్టుకుంటే చాలు కందిపోతారన్నంత సున్నితంగా.. ఆయన కనిపిస్తున్నారు. కాషాయ దుస్తులతో, ప్రశాంత వదనంతో ఆయన అడుగిడుతుంటే అక్కడ అణువణువున దైవత్వం తొణికిసలాడుతున్నట్టయింది. నేలపై రాలిన పూలు ఆయన పాదస్పర్శ కోసం తరిస్తున్నట్టు ఉన్నాయి.
ఆయన మాత్రం జగన్మాతను స్తుతిస్తూనే ఉన్నారు. తానున్నది మామూలు పర్వతం కాదని, అది సాధారణ స్థలం కాదని ఆయనకు తెలుస్తోంది. ఆ ఆనందంలో ఆయన కన్నుల వెంట ఆనందాశ్రువులు రాలుతున్నాయి.

మరింత ఆనంద పారవశ్యంలో మునిగిపోతూ ఆయన-
దుర్గమాసుర హంత్రీ దుర్గమాయుధ ధారిణీ।
దుర్గమాంగీ దుర్గమాతా దుర్గమ్యా దుర్గమేశ్వరీ।।
అంటూ అమ్మ నామాన్ని స్తోత్రం చేస్తున్నారు.
అక్కడి నుంచే తలపైకెత్తి ఇంద్రకీల పర్వత శిఖరానికి చేతులెత్తి నమస్కరించారు.
ఆదిశంకరులు అఖండ భారతాన్ని కాలినడకనే చుట్టి.. పొరుగున ఉన్న పూరీ క్షేత్ర మహిమను వెయ్యింతలు చేసి ఇప్పుడు విజయవాకిట చేరిన క్షణాలవి.
ఆయన పాదాలను తాకాలని పూలు పరితపిస్తుంటే.. ఆయన పాదాలు కడగాలని కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.
తెలతెలవారుతున్న వేళ ఇంద్రకీలాద్రి పర్వతాగ్రంపై నుంచి చల్లనిగాలులు వీస్తున్నాయి. పర్వతం నిండా మారేడు చెట్లు.. సంపెంగ మొగ్గలు.. దిరిసెన పువ్వులు.. కొండగోగు పూలచెట్లు.. అమ్మవారి అలంకారం కోసం సమస్త ప్రకృతి అక్కడ రంగరించినట్టుగా ఉంది.
ప్రభాత వేళ భానుడి లేలేత కిరణాలు నేరుగా పడి.. ఇంద్రకీలాద్రి పర్వతశ్రేణి మరింతగా ప్రకాశిస్తోంది.
అనుష్టాన విధులన్నీ పూర్తి చేసుకుని ధ్యానానికి ఉపక్రమించారు ఆదిశంకరులు. ఆయన మనోవీధిలో ఏదో తెలియని ఆనందం.. దివ్యకాంతి పరివేషం ఆయనను చుట్టుముడుతోంది. తాదాత్మ్య భావనలు ఆయన అంతరంగాన్ని కమ్ముకుంటున్నాయి.
ఆదిశంకరులు ఇంద్రకీల పర్వతాన్ని అధిరోహిస్తున్నారు. ఆయన వెనుకే శిష్యులు కూడా.. అంతలో కొంతమంది జానపదుల గుంపు కూడా అటుగా వచ్చింది. డప్పు వాద్యాల ఘోషతో అక్కడంతా సందడి నెలకొంది. ఆ బృందంలోని వారు, ‘అమ్మోరు తల్లీ! కాపాడమ్మా।’ అంటూ తల్లికి మొక్కారు. అంటే ఒక్క వేటుకు జంతువుల తలలు తెగిపడ్డాయి. బలి కార్యక్రమం పూర్తయింది.
మళ్లీ అమ్మకు మొక్కుతూ ఆ బృందం వెళ్లిపోయింది.
ఇదంతా చూసిన శంకరుల మనసు విచలితమైపోయింది. మనసంతా విచారం కమ్ముకుంది. జంతుబలి జరిగిన ప్రాంతాన్ని ఆయన చేరుకున్నారు. అక్కడ జగన్మాత విగ్రహం మహోగ్రరూపంలో దర్శనమిచ్చింది. అమ్మకు ఆదిశంకరులు సాగిలపడ్డారు.

‘అమ్మా। లోకంలోని ప్రాణులన్నీ నీ బిడ్డలే కదా! మరి ఎందుకీ హింస? చంద్రరేఖలను పోలిన నీ దరహాసం, శరజ్జోత్స్యలు కురిసే నీ వదనం, కమాలలనుకుని భ్రమరాలు కూడా భ్రమించే నీ నేత్రద్వయం, సూర్యచంద్రుల వెలుగుల్ని పంచే నీ వైభవం, దయాసాగరానికి నెలవైన నీ హృదయ మందిరం మాకు ప్రసాదించమ్మా!’ అంటూ శంకరులు ప్రార్థించారు.
ఆయన ప్రార్థనను అమ్మ వారు ఆలకించినట్టున్నారు.
ఆదిశంకరులు వెంటనే శిష్య బృందాన్ని ఆదేశించారు.
అంతా కలిసి సమంత్రకంగా శ్రీవిద్యా పద్ధతిలో శ్రీచక్రాన్ని అమ్మ సమీపంలో ప్రతిష్ఠించారు.
షోడశ కళాన్యాసం నిర్వహించారు.
పవిత్ర కృష్ణానదీ జలాలతో అమ్మకు అభిషేకం నిర్వహించారు.
ఖడ్గమాలం, త్రిశతీ విధానాలతో అమ్మకు అర్చనలు చేశారు.
ఆదిశంకరుల వంటి బిడ్డ పిలిస్తే అమ్మ రాకుండా ఉంటుందా?
పరిపూర్ణమైన మాతృమూర్తి ఆమె.
పరమశాంత స్వరూపిణిగా శాశ్వతంగా ఇంద్రకీల పర్వతం మీద కొలువై ఉండాలన్న తన భక్తుడి ప్రార్థనను మన్నించింది.
అప్పటి దాకా ప్రకటించిన మహోగ్రరూపాన్ని విడిచిపెట్టి దయాస్వరూపిణిగా, కనకదుర్గగా దర్శనమిచ్చింది.
‘దుర్గా దేవీ! నమోస్తుతే!!’ అంటూ ఆదిశంకరాచార్యులు పరిపరి ఇక నుంచి ఇంద్రకీల పర్వతంపై జంతుబలులు జరగకూడదని, తాంత్రిక పద్ధతుల్లో అమ్మవారిని అర్చించకూడదని ఆయన నియమం విధించారు.
సనాతన వైదిక పద్ధతుల్లో అమ్మను త్రికాలాల్లో ఎలా అర్చించాలో నిర్ధేశించారు.

ఆదిశంకరుల వారు రాకముందు వరకు ఉన్న ఇంద్రకీలాద్రి వేరు.
క్రీస్తు శకం ఎనిమిదో శతాబ్దంలో శంకరుల పాదధూళి సోకిన తరువాత ఇంద్రకీలాద్రి వేరు.
ఆయన సందర్శన తరువాత అదో మహోన్నత క్షేత్రంగా మారింది.
పరమ శాంతమూర్తిగా, అమ్మలగన్నయమ్మగా, కనకదుర్గగా భక్తకోటి నీరాజనాలందుకోవడం మొదలైంది.
ఇదీ మనం ఇప్పుడు దర్శించుకుంటున్న ఇంద్రకీలాద్రి క్షేత్రం వెనుక ఉన్న మనకు తెలియని కథ.
అమ్మవారి రణన్నినాదమే.. మహిషాసురమర్దిని స్తోత్రం
జగన్మాత రూపాన్ని తలుచుకోగానే వెంటనే కళ్లలో కదలాడే రూపం- కనకదుర్గ అమ్మవారే. అదే సమయంలో నాలుకపై ఆలవోకగా పలికే స్తోత్రం- మహిషాసురమర్దిని స్తోత్రం.
సరళమైన పదాలు, లలితమైన భావాలు, లోతైన అంతరార్థాలు కలగలిసి ఈ మహిమాన్విత స్తోత్రాన్ని రచించింది కూడా ఆదిశంకరుల వారే. మొత్తం 21 శ్లోకాలతో ఆయన అమ్మ లీలా వైభవాన్ని మనోహరంగా వర్ణించారు. అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు, శతకాలు ఎన్నో ఉన్నా.. ఈ స్తోత్రానికి మాత్రం ఎంతో ప్రత్యేకత ఉంది.
మహిషాసురమర్దిని స్తోత్రం శబ్దోపాసనకు ప్రతీక. ఓంకారం ఈ సృష్టిలో తొలి శబ్దం. దాని నుంచి జరిగిన మహా విస్ఫోటన ఫలితమే ఈ సకల ప్రపంచం. ప్రణవోపాసన ద్వారా కైవల్యాన్ని చేరుకున్న మహనీయులెందరో ఉన్నారు. అటువంటి సాధకులకు మహిషాసురమర్దిని స్తోత్రం మేలు మార్గం చూపుతుంది. ఈ స్తోత్రంలోని శబ్దాల ఉచ్ఛారణ ద్వారా మనిషిలో ఉండే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలనే పంచకోశాలు ఉత్తేజితం అవుతాయి. వాక్కు శుద్ధి అవుతుంది. అప్పుడా వాక్కుకు మహత్తరమైన శక్తి కలుగుతుంది. అంటే సరస్వతీ శక్తి సాధకుడి వశం అవుతుంది.
మహిషాసురమర్దిని స్తోత్రం గొప్ప అలంకారిక శోభతో ఉంటుంది. పద విన్యాసాలు, శబ్దాలంకారాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. ఒకే పదాన్ని విభిన్న అర్థాల్లో, విభిన్న పదాల్ని ఒకే అర్ధంలో వాడుతూ స్తోత్రానికి సొగసైన నడక చేకూర్చారు ఆదిశంకరులు. సందర్భాన్ని బట్టి శ్లోక పాదాలను పూర్తిగా సరళాక్షరాలతో రాయడంతో స్తోత్రం గంభీరతతో పాటు, కొత్త సొబగుల్ని సంతరించుకుంది. ఈ స్తోత్రంలో జగన్మాత విశ్వరూప విలాసం దర్శనమవుతుంది. అమ్మవారి కాలి మువ్వుడుల సవ్వడులు, భ్రమరాల ఝుంకార ధ్వనులతో పాటు రణన్నినాదాలు కనిపిస్తాయి. అనంతమైన భక్తితో పాటు అద్భుతమైన ఆయుధ సంపత్తి దర్శనమిస్తుంది. ప్రతి వర్ణనా భక్తులను ఆనందడోలికల్లో ముంచెత్తుతుంది.
ఇక, ఈ శ్లోక రచనకు ఆదిశంకరులను పురిగొల్పిన క్షణాన్ని మననం చేసుకుంటే.. ఆధ్యాత్మిక భావనలతో ఒళ్లంతా పులకరిస్తుంది. తొమ్మిది రోజుల పాటు భీకరయుద్ధం చేసి రాక్షస సంహారం చేసిన జగన్మాత స్వరూపమే మహిషాసురమర్దిని. చివరి రోజున జగన్మాత రణన్నినాదం చేసింది. సర్వ దుర్లక్షణాలకు ప్రతీక అయిన మహిషాసురుడిని మట్టుబెట్టింది.
ఆ సమయంలోనే విశ్వాంతరాళాల్లోకి వ్యాపించిన ఆమె రూపాన్ని దర్శించిన ఆదిశంకరులు అమితానందాన్ని పొందారు.

‘అయిగిరినందిని, నందిత మేదిని’ అంటూ పులకించిపోయారు.
‘అయిజగదంబ కదంబ వనప్రియా’ అంటూ కీర్తించారు.
‘మధుమధురే మధుకైటభభంజనీ’ అంటూ ప్రార్థించారు.
అదే 21 శ్లోకాల మహిషాసురమర్దిని స్తోత్రంగా అవతరించింది.
ఇందులోని ప్రతి అక్షరం మంత్రంగా మారింది. ప్రతి పదం, ప్రతి పాదం భక్తుల ఇహానికి, పరానికి బాటలు
వేసింది. ఈ శ్లోకంలోని
కొన్ని ముఖ్య
పాదాలకు

అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
అయినిజ హుంకృతి మాత్రనిరాకృత ధూమ్రవిలోచన ధూమ్రశతే
సమరవిశోషిత శోణిత బీజసముద్భవ శోణిత బీజరతే శివ శివ శుంభ నిశుంభ మహాహవతర్పిత భూతపిశాచరతే
జయజయహే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శేలసుతే
కేవలం హుంకారంతో ధూమ్రాక్షుడు, విలోచనుడు వంటి రాక్షసులను అమ్మ నిర్జించింది. శుంభ, నిశుంభులను రణరంగ మధ్యంలో రక్తపుటేరులో ముంచెత్తింది. మహా సమరంలో రాలిపడే ప్రతి చెమటచుక్క నుంచి, ప్రతి రక్తపు బొట్టు నుంచి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ మహాశక్తి ఎదిగిపోతూ ఉంది. జగదంబ విసిరిన అర్ధచంద్రాకృతి ఉన్న బాణం దెబ్బకు దుర్ధరుడు విలవిల్లాడుతూ మరణించాడు. త్రినేత్రుడనే రాక్షసుడు గదతో అమ్మను అడ్డుకోబోతే త్రిశూలంతో అతడిని సంహరించింది. అంధకాసురుడిని ఆమె సింహమే మింగేసింది.
అమ్మ సమరానికి కదిలిన సమయంలో ఆమె వెనుక దేవతలంతా చతురంగ బలాలుగా బారులుదీరి ఉన్నారు. మెరిసే కత్తి, ఇత్తడిమొన కలిగిన బంగారు బాణాలతో కూడిన ధనుస్సును ధరించింది ఆమె. శత్రువుపై ఉరకడానికి సిద్ధపడుతున్న సమయంలో ఆమె దేహంతో పాటు యుద్ధ పరికరాలు, ధరించిన స్వర్ణాభరణాలు చిత్రంగా ఊగుతూ విశేష ప్రతిభ కలిగిన కళాకారిణి చేస్తున్న నాట్యవిన్యాసంలా కనిపిస్తున్నాయి.
జయ జయ జప్య జయే జయ శబ్దపరస్తుతి తత్పర విశ్వనుతే
భణ భణ భింజిమి భింకృతనూపుర సింజితమోహిత భూతపతే

నటితనటార్ధ నటీనటనాయక నాటిత నాట్య సుగానరతే..
అసురులను సంహరించే క్రమంలో జగన్మాత చేస్తున్న వీరవిహారానికి యావత్ప్రపంచం విస్తుపోతోంది. ఆ తల్లి విజయ విహారానికి జయజయధ్వానాలు పలుకుతోంది. దేవతలు నాట్యం చేస్తున్నారు. సురకాంతలు తతథై తథై తతథై అంటూ నట్టువాంగం మొదలుపెట్టారు. హాసవిలాసాలతో దేవి చూపు ప్రసరించింది. నమస్కరిస్తున్న భక్తులందరినీ ఒకసారి ప్రేమగా వీక్షించిందామె. ధిమికిట ధిక్కిట ధిక్కిట ధిమి ధిమి అంటూ మృదంగనాదం ప్రారంభమైంది. జయజయ జయజగదంబ అంటూ జయధ్వానాలు మిన్నుముట్టాయి.
అయి సుమన: సుమన: సుమన: సుమన: సుమనోహర కాంతియుతే
శ్రిత రజనీ రజనీ రజనీ రజనీ రజనీకర వక్తవ్రృతే
సునయన విభ్రమర భ్రమర భ్రమర భ్రమర భ్రమరాధిపతే..

పరాశక్తి ధరించిన కాలి మువ్వల నుంచి వస్తున్న సవ్వడితో పాటు విస్తరిస్తున్న కాంతింపుంజాలు బాలభానుడి కిరణాలను అధిగమిస్తున్నాయి. అమ్మవారి నేత్ర సౌందర్యం ముందు భ్రమరాలు చిన్నబోతున్నాయి. ఆ నేత్రాలు పద్మాలని భావిస్తున్న తుమ్మెదలు మకరందం గ్రహించాలని అటుగా వచ్చాయి. హేలా నృత్యవేళ అంబ వేగంగా పదం కదుపుతుంటే ఏ దిక్కున చూసినా చందమామ అప్పుడే ఉదయించినట్టు ఆమె ముఖబింబమే కనిపించింది. అన్ని దిక్కులా సుమనోహర కాంతిపుంజాలు దర్శనమిస్తుంటే జగత్తు పావనమవుతోంది. కరమురళీరవవీజితకూజిత లజ్జితకోకిల మంజుమతే..
అమ్మ చేస్తున్న మురళీరవం ముందు కోకిలగానం చిన్నదైపోతోంది.
త్రిభువన పోషిణి శంకర తోషిణి కిల్బిష మోషిణి ఘోషరతే..
త్రిభువనాలను పోషించే శక్తి, శంకరుడి పాపాలను కూడా పోగొట్టగలిగిన సరోన్నత శక్తి కలిగిన పరాశక్తి.. అంటూ అమ్మ వైభవాన్ని అనేక విధాలుగా వర్ణిస్తూ సాగుతుందీ అద్భుత స్తోత్రం.

మహిషాసురమర్దిని స్తోత్రంలోని ప్రతి నామం ఓ తారకమంత్రం. ప్రతి పదం ఓ బీజాక్షరం. అ కారం నుంచి క్ష కారం వరకు ఉన్న అన్ని వర్ణాలు అమ్మ స్వరూపమేనని శాస్త్ర వచనం. అలాంటి బీజాక్షరాల మేలు కలయిక ఈ స్తోత్రానికి మహత్తరమైన శక్తిని తీసుకువచ్చింది.

Review విజయవాకిట..ఆదిశంకరుల ఆధ్యాత్మిక బావుటా.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top