పుస్తకం అంటే ఆపాద మస్తకం మనల్ని స్ప•శించే ఓ నేస్తం.
మంచి పుస్తకం మన మస్తిస్కాన్ని తెరుస్తుంది.
భావాలను, ఆలోచనలను విశాలం చేస్తుంది.
జీవన సరళిని మారుస్తుంది. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతుంది.
అందుకే పుస్తకం అంటే కేవలం కాగితాల పుటలు కాదు..
పుస్తకం అంటే ఓ భావం.. ఓ బంధం.. ఓ భావోద్వేగం.
మనిషిని మహోన్నతుడిని చేసేది పుస్తకమే.
పుస్తకం మాట్లాడదు. కానీ, మనతో ఎన్నో భావాలను పలికిస్తుంది. ఆలోచనల్ని చిలకరిస్తుంది. ఊరడిస్తుంది. నవ్విస్తుంది. ఆలోచింపచేస్తుంది. కథలు చెబుతుంది. కలలు కనేలా చేస్తుంది. వాటిని సాకారం చేసుకునే సంకల్పాన్నిస్తుంది.
అక్షరమనే ఆయుధంతో లక్ష్యాలను ఛేదించే శక్తినిస్తుంది.
మంచి పుస్తకంలోని ఒక్క పేజీ తిరగేస్తే చాలు.. మనతో పరిచయం పెంచుకుని తనే ఓ ప్రపంచమవుతుంది.
పుస్తకమంటే ఏకాంతంలో తోడుండే నేస్తం..
ఓటమిలో ఓదార్పు.. లక్ష్యసాధనలో చేదోడువాదోడు..
కష్టంలో కుంగిపోనివ్వదు. విజయానికి పొంగిపోనివ్వదు.
మనలోని అసలైన మనిషికి ప్రాణం పోస్తుంది.
మన ఇంట్లో ఓ పాత పుస్తకం ఉందంటే మంచిచెడులు చెప్పే అవ్వ ఉన్నట్టే.. ఇంట్లోకి కొత్త పుస్తకం వచ్చిందంటే అప్పుడే పుట్టిన ఆడపిల్లంతటి అబ్బురం, అపురూపం.
అందుకే పుస్తకం అంటే ఓ బంధం.. ఓ భావోద్వేగం.
ఏటా డిసెంబరు – జనవరి నెలల్లో అనేక పండుగలు, పబ్బాలతో పాటు మన తెలుగు రాష్ట్రాల్లో పుస్తకాల పండుగ కూడా వస్తుంది. డిసెంబరులో హైదరాబాద్‍లోనూ, దీని తరువాత జనవరిలో విజయవాడలోనూ పుస్తక మహోత్సవం నిర్వహించడం ఏటా ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ‘పుస్తకం’ గురించి కాసింత మననం చేసుకుందాం. పుస్తకాన్ని మనదాన్ని చేసుకుందాం.
ఒకసారి ఓ వ్యాపార సంస్థకు సంబంధించిన
ఒకసారి ఓ వ్యాపార సంస్థకు సంబంధించిన డైరెక్టర్ల బోర్డు మీటింగ్ జరుగుతోంది. వ్యాపార సంస్థ యజమాని డైరెక్టర్లకు ఒక ప్రశ్న వేశాడు.
‘ఈ ప్రపంచంలో వెలకట్టలేని ఖరీదైన భూమి ఎక్కడ ఉంది?’.
‘గల్ఫ్ దేశాల్లో..’ అని కొందరు చెప్పారు.
‘ఆఫ్రికాలోని వజ్రాల గనులు..’ అని ఇంకొందరు చెప్పారు.
ఇవేవీ సరైన సమాధానాలు కాదని పెదవి విరిచాడు యజమాని. అక్కడంతా నిశ్శబ్దం అలముకుంది.
ఆయనే నిశ్శబ్దాన్ని చీలుస్తూ, ‘ఈ ప్రపంచంలో అతి ఖరీదైన స్థలం శ్మశానం’ అన్నాడు.
అక్కడ మళ్లీ నిశ్శబ్దం అలముకుంది.
‘శ్మశానమా? అదెలా?’ అనేదే అక్కడున్న అందరి సందేహం.
అప్పుడా యజమాని ఇలా చెప్పడం ప్రారంభించాడు.
‘ఈ లోకంలో అనాదిగా కోట్లానుకోట్ల మంది పుడుతున్నారు. మరణిస్తున్నారు. ఇంకా పుడుతూనే ఉన్నారు. చనిపోతూనే ఉన్నారు. పుట్టిన వారిలో చాలా కొద్దిమంది మాత్రమే తమలోని తెలివితేటల్ని ఈ ప్రపంచానికి పంచారు. కానీ, ఎక్కువ మంది మాత్రం తమలో నిగూఢంగా ఉన్న మేధస్సును, అద్భుతమైన ఆలోచనలను తమలోనే దాచుకుని ఈ లోకాన్ని దాటిపోయారు. అవేవీ వెలుగు చూడటం లేదు. వాటివల్ల ఈ ప్రపంచానికి దక్కాల్సిన ప్రయోజనమూ దక్కలేదు. వారి ఆలోచనలూ, భావాలూ అన్నీ సమాధుల్లోనే నిక్షిప్తమైపోయాయి. అంతటి విలువైన సంపదను దాచుకున్న శ్మశానం కంటే విలువైన భూమి ఇంకెక్కడైనా ఉంటుందా?’.
ఆనాటి సమావేశంలో పాల్గొన్న వారిలో టాడ్ హెన్రీ (•శీ•• •వఅతీ•)
ఒకరు.
కంపెనీ యజమాని చెప్పిన మాటలు హెన్రీ మనసులో గట్టిగా నాటుకుపోయాయి. అంతకుమించి హత్తుకుపోయాయి.
ఆ ప్రేరణతోనే హెన్రీ నిణఱవ వఎజూ•••
అనే పుస్తకం రాశాడు. తరువాత కాలంలో అద్భుతమైన రచయితగా పేరొందాడు.
ఆయన ఈ పుస్తకంలో ఏమంటాడంటే..
మీరు మీలోని సృజనాత్మకతను మీలోనే దాచుకుని సమాధుల్లో శాశ్వతంగా నిద్రించడానికి వెళ్లకండి. మీలో ఉన్న ఆలోచనలను, మంచిని ఈ లోకానికి పంచేసి వెళ్లండి’.
ఈ పుస్తకం చెప్పేదేమంటే-
‘మీలోని మంచిని మీరు ఈ లోకాన్ని వీడేలోగా ప్రపంచానికి పంచేసి వెళ్లండి.
మీ దగ్గర మంచి ఆలోచన ఉంటే చనిపోయేలోగా దాన్ని ఆచరణలో పెట్టండి.
మీలోని జ్ఞానాన్ని నలుగురికీ పంచండి.
మీకు ఏదైనా లక్ష్యం ఉంటే చనిపోయేలోగా దాన్ని సాధించండి.
ప్రేమను పంచండి. దాన్ని మీలోనే దాచుకుని వృధా చేయకండి.
ఇవ్వాల్సిందంతా లోకానికి ఇచ్చేశాక ఖాళీగా వెళ్లిపోదాం..
అప్పుడు హాయిగా, ప్రశాంతంగా.. Let us Die Empty!
ఇదే కథను పుస్తకాలకు అన్వయించి చూడండి.
కాలక్రమంలో ఎన్ని పుస్తకాలు గతించిపోతున్నాయి?..
అందులోని మంచి విషయాలు నలుగురికీ చేరకుండా ఎలా మరుగైపోతున్నాయో గమనించారా?.
మన భారతదేశంలో.. అందునా తెలుగునేలపై అద్భుతమైన సాహిత్యం వెల్లివిరిసింది. అందులో పిల్లల కథల నుంచి పెద్దల విషయాల వరకు స్ప•శించని అంశమంటూ లేదు. కానీ మనం అసలు పాత పుస్తకం వాసనే చూడటం లేదు. ఇంట్లో పాత పుస్తకం ఉంటే పాత సామాను వాడికి అమ్మేయడమే నైజమైపోయింది.
ఇలా ఎన్ని పుస్తకాలు తమలోని మంచిని లోకానికి చాటకుండానే చిరిగిపోయాయో? ఇంకెన్ని అక్షరాలు చెరిగిపోయాయో?!. మరెన్ని అక్షరాలు చెదిరిపోయాయో!?
మనిషికి విషయజ్ఞానంతో పాటు మానసిక వికాసం, వినయం, విచక్షణా జ్ఞానం, మానవ సంబంధాలు.. ఇలా ఎన్నో నేర్పే గురువు పుస్తకం. పిల్లల జీవితాలను తీర్చిదిద్దడం మన బాధ్యతే అయినా వారిని బడిలో చేర్చి చదివించడం ఒక్కటే ఆ బాధ్యతకు పరమావధి కాకూడదు. వారికి ఆలోచనల రెక్కలు తొడగడానికి మంచి పుస్తకాలను చదివించడం అలవాటుగా చేయాలి. వాళ్ల జీవితానికి, వ్యక్తిత్వానికి ఈ పుస్తకాలన్నీ పునాదులవుతాయి.
పిల్లల చేత చదివించడమే కాదు, పెద్దలుగా మనమూ చదివి, ఏది మంచి పుస్తకమో.. ఏ పుస్తకంలో యే మంచి విషయాలు ఉన్నాయో వారికి చెప్పాలి.
ఏ పుస్తకం చదవాలో చెబుతారా?
మంచి వ్యక్తిగా ఎదగాలంటే మంచి పుస్తకాలు చదవాలి.
బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లో చెప్పాలంటే, మనం మనకంటే ఎవరైనా పెద్దవాళ్లను కలిస్తే, ‘అయ్యా! నేను జీవితంలో తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఏదైనా సూచిస్తారా?’ అని అడగాలట. అప్పుడు ఆ పెద్దలు తమ అనుభవంతో మంచి పుస్తకాలేవో చెబుతారట.
పుస్తకాలు చాలా ఉంటాయి. చాలా దొరుకుతాయి. అలాగని ఏవి పడితే అవి చదవకూడదు. అప్పుడు మంచి పుస్తకం ఏదనేది ఎలా తెలుస్తుందంటే.. ‘మంచి పుస్తకాలను సూచించాల’ని మన పెద్దలను అడిగినపుడు.. లేదా వాటిని చదివిన వారిని అడిగినపుడు. మనం చదివే పుస్తకాల ద్వారా మనలోని సునిశిత ప్రజ్ఞ బయటపడాలి. మంచి ఆలోచనలు కలగాలి. మన ఆలోచనా పరిధిని ఆ పుస్తకంలోని అంశాలు పెంచాలి. చదివే ప్రతి మంచి పుస్తకంపై చదువరి వ్యక్తిగత సమీక్ష రాసుకోవాలి.
పుస్తకం ఎందుకు నచ్చింది? అందులో నచ్చిన/నచ్చని అంశాలేమిటి? అనేవి ఆ పుస్తకంలోని ఖాళీ పేజీల్లో రాయాలి. ఈ అలవాటు జీవితంలో ఏది మంచి? ఏది చెడు? అనే వివేచించుకునే నిర్ణయాత్మక శక్తిని ఇస్తుంది. తుదిగా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కారణమవుతుంది.
మన దేశంలో గొప్ప గొప్ప నాయకులుగా ఎదిగిన వారి ఇళ్లు చూస్తే.. అది ఇల్లా? గ్రంథాలయమా? అన్నట్టుంటుంది. ఎందుకంటే గొప్పవాళ్ల ఇళ్లలో ఉండేవి అనవసర వస్తువులు కావు. పుస్తకాలే!.
ఢిల్లీలోని మన భారత తొలి ప్రధాని జవహర్‍లాల్ నెహ్రూకు చెందిన తీన్‍మూర్తి భవన్‍కు వెళ్తే.. ఇప్పటికీ చాలా షెల్ఫ్లు పుస్తకాలతో నిండిపోయి ఉంటాయి.
విద్యార్థులు ఇప్పుడు సందిగ్ధావస్థలో ఉన్నారు. చదువుల ఒత్తిడి, పోటీతో సతమతం అవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వారికి పుస్తకమే మంచి నేస్తం అవుతుంది. సందిగ్ధావస్థలో ఉన్నపుడు మంచి నిర్ణయాలు తీసుకోగల ప్రజ్ఞ అంకురించాలంటే మంచి విషయాలను తెలిపే పుస్తకాలను చదువుతుండాలి.
పాఠ్య పుస్తకాల్లోని విషయాలు జీవించడం నేర్పవు. భగవాన్ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, అబ్దుల్ కలాం వంటి వారి ప్రసంగాలు, రామాయణం, భారతం, భాగవతం వంటి గ్రంథాలను చదవడం, మననం చేసుకోవడం పిల్లల దినచర్యలో భాగమైతే.. మహోన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోగలుగుతారు.
ఇవి తప్పక చదివించండి సుమా!
పాఠ్య పుస్తకాలు తప్ప అన్య పుస్తకాల ముఖమెరుగని పిల్లలను నేడు చూస్తున్నాం. గతంలో బడిలో చదువులతోపాటు రామాయణ-భారతాలు, పంచతంత్ర కథలు వంటివి పిల్లల చేత పెద్దలు చదివించే వారు. ఇప్పుడు పాఠ్య పుస్తకాలు తప్ప ఇతర పుస్తకాలు పట్టుకుంటే పిల్లల వీపు పగలగొట్టే పరిస్థితి. బడికెళ్లడం, అక్కడ చెప్పింది వినడం, తీరిక దొరికితే వీడియో గేమ్‍లు ఆడటం విద్యార్థుల దినచర్యగా మారింది.
రోజులో అరగంటైనా మంచి పుస్తకాలు చదవాలి. స్వయంగా చదవడం అనేది మెదడుకు బాగా ఎక్కుతుంది. విశ్లేషిస్తుంది. ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఈ పక్రియ అంతా మన నియంత్రణలోనే జరుగుతుంది. అదే వీడియోలు, కంప్యూటర్లు చూసి చదవడం, నేర్చుకోవడం చేస్తే పైన చెప్పిన పక్రియయేదీ జరగదు. దృశ్యం ఎప్పుడూ డిస్ట్రబెన్స్ కలిగిస్తుంది. పిల్లల్లో విషయాల్ని అర్థం చేసుకుని విశ్లేషించుకునే సామర్థ్యం పెరగాలంటే పఠనమే ఏకైక మార్గం. అందుకు వారి కోసం తల్లిదండ్రులు కొన్ని మంచి పుస్తకాలను చదివించాలి. ఇటీవల ప్రతి భారతీయ విద్యార్థి తప్పక చదవాల్సిన కొన్ని పుస్తకాల జాబితాను వెలువరించారు. ఇవే అత్యుత్తమ పుస్తకాలని కాదు. అంతకంటే మంచివీ ఉండొచ్చు. కానీ వీటి పఠనంతో విద్యార్థుల మనో సామర్థ్యాలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. అవేమిటంటే..
రామాయణం/మహా భారతం/భాగవతం
ఈ గ్రంథాలను ఇప్పటికే పలువురు పలువిధాలుగా రాశారు. కానీ, భారతీయ రాజకీయవేత్త, ప్రముఖ చరిత్రకారుడు సి.రాజగోపాలాచారి గారు రాసిన రామాయణ, భారతాలను పిల్లలు తప్పక చదవాలి. ఇందులో ఆయన ఆయా పాత్రల లక్షణాలు, వారు పాటించిన విలువల గురించి ఎంతో బాగా వివరించారు. అవి పిల్లలపై మంచి ముద్ర వేస్తాయి. ఇక, భాగవత కథలు సరళ భాషలో అందుబాటులో ఉన్నాయి.
అమర్ చిత్రకథలు: పిల్లలు చదవడానికి బాగా ఇష్టపడే కథల్లో ఇవీ ఒకటి. ఇందులో భారత చరిత్ర, పురాణాలు, మతం, సంప్రదాయాల వంటి బోలెడు విషయాలున్నాయి. మాల్గుడి డేస్: ఆర్కే నారాయణ్ రాసిన ఈ పుస్తకంలో 32 కథలుంటాయి. స్వామి అనే పిల్లవాడు రెండో తరగతి విద్యార్థి. అతని స్నేహితులు, ఇల్లు, తను చదివే పాఠశాల గురించి ఈ కథలు ఎన్నో విషయాలను చెబుతాయి.
పంచతంత్ర: విష్ణుశర్మ రాసిన ఈ కథల పుస్తకం పిల్లలకు ప్రియమైనది. ఐదు భాగాల ఈ పుస్తకంలోని కథలన్నీ జంతువుల చుట్టూ తిరుగుతూ పిల్లల్లో ఆసక్తిని పెంచుతాయి. మనిషి పాటించాల్సిన ధర్మాలను, నీతి సూత్రాలను చక్కని కథల రూపంలో మలిచారు.
ది వేదాస్ అండ్ ఉపనిషద్స్ ఫర్ చిల్డ్రన్: వేదాలు, పురాణాలు అంత తేలిగ్గా అర్థం కావు. వీటిని పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో సరళంగా రాశారు.
హితోపదేశం: ఇందులోని కథలు జంతువుల పాత్రలతో ఉంటాయి కాబట్టి పిల్లలను ఆసక్తిగా చదివిస్తాయి. విధి, దయ, నైపుణ్యం, తెలివి వంటివి నేర్పుతాయి.
ది హిస్టరీ ఆఫ్ ఇండియా ఫర్ చిల్డ్రన్: భారతీయ చారిత్రక వారసత్వం గురించి పిల్లలకు ఇది అవగాహన కలిగిస్తుంది.
ఇంకా, కాశీ-మజిలీ కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, చందమామ కథలు, విక్రమార్క-భేతాళ కథలు, పేదరాశి పెద్దమ్మ కథలు వంటివి పిల్లల్లో పఠనాసక్తిని, జిజ్ఞాసను, నైతికత, క్షమ, దయ వంటి సుగుణాలను పెంచుతాయి.
ఇప్పుడు నడక నేర్వని బుడతడు కూడా వేలి కొసలతో డిజిటల్ విద్య సాగిస్తున్నాడు. వర్చువల్, ఆన్‍లైన్ క్లాసులతో కుస్తీ పడుతున్నాడు. అయితే, ఈ డిజిటల్ మాధ్యమాల్లోని కృత్రిమత్వం, యాంత్రికత్వం పిల్లల్ని ఆలోచనల్లేని మనుషులుగా మారుస్తోంది.
స్కూలు/కాలేజీ పుస్తకాలు చదవడం తప్ప వేరే లోకం లేదన్నంతగా పిల్లల ప్రపంచానికి ద్వారాలు మూసేస్తున్నాం.
మనం పైసా పైసా కూడబెట్టి పిల్లలకు ఆస్తిని ఇవ్వడానికి ప్రాణం పెడుతున్నాం తప్ప, మనిషికి ప్రాణం పోసి మనీషిని చేసే పుస్తక సంపదను మాత్రం పిల్లలకు వారసత్వంగా అందించలేకపోతున్నాం.
అందుకే మన అజ్ఞానానికి పుస్తకం పగలబడి నవ్వుతోంది.
ఒకప్పుడు బాల్యం, ‘అనగనగా..’ అంటూ అమ్మో, అమ్మమ్మో, తాతయ్యో చెప్పే కథలతో ప్రారంభమయ్యేది. ఇప్పుడు కథలు చెప్పే వారు లేరు. పిల్లల్లో ఆ జిజ్ఞాస కలిగించే తీరికా ఎవరికీ లేదు.
ఇక, మన తెలుగు నాట ప్రసిద్దికెక్కిన అత్యుత్తమ పుస్తకాలను పరిచయం చేసుకుందాం.
తీరిక చేసుకుని ఇవి తప్పక చదవండి..
కొందరికి ఫిక్షన్ ఇష్టం.. కొందరికి చరిత్ర ఇష్టం.. మరికొందరికి వేర్వేరు అభిరుచులు, ఆసక్తి ఉంటాయి. కాబట్టి ఫలానా పుస్తకమే ఉత్తమమైనదనీ చెప్పడం భావ్యం కాదు. కాకపోతే చాలామంది చదివిన పుస్తకాల్లో గొప్పగా అనిపించినవి మాత్రం కొన్ని కామన్‍గా ఉంటాయి. అటువంటి కొన్ని పుస్తకాలివి.. జీవితంలో తప్పక చదవాల్సినవి.
తెలుగు భాష, అలవాట్ల గురించి తెలుసుకోవాలన్నా, అచ్చ తెలుగు అందాలను చదివి ఆనందించాలన్నా శ్రీపాద సుబ్రహ్మణశాస్త్రి గారి ఆత్మకథ అనుభవాలూ – జ్ఞాపకాలూ చదవాలి.
గత శతాబ్దంలో వచ్చిన ఆత్మకథల్లో అద్భుతమైనది- హంపీ నుంచి హరప్పా దాకా (తిరుమల రామచంద్ర).
మహాత్మాగాంధీ జీవితాన్ని గురించి తెలుసుకోవాలంటే సత్యశోధన అనే ఆయన రాసిన ఆత్మకథ చదవాలి.
గిరీశం లెక్చర్లు, మధురవాణి ముచ్చట్లు, రామప్పపంతులు కోతలు, చీపురుకట్ట తిరగేసే పూటకూళ్లమ్మ.. వీళ్లందరి మనస్తత్వాల్ని పట్టి చూపుతుంది గురజాడ వారి కన్యాశుల్కం నాటకం.
తెలుగు వచ్చిన వారంతా, తెలుగు వారమని చెప్పుకునే వారంతా చదవాల్సింది- విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడగలు.
పుస్తకం నిండా తన బాధేదో తాను పడుతున్నా.. ఆయా సన్నివేశాల ద్వారా చదివే వారిని మాత్రం నవ్వించే రచన ముళ్లపూడి గారి కోతికొమ్మచ్చి (3 భాగాలు).
ఇక, ముళ్లపూడి మాటలు, బాపు గీతలు గిలిగింతలు పెట్టాలంటే బుడుగు పిల్లలూ, పెద్దలూ తప్పక చదవాల్సిందే.
తానొక విశ్వనరుడినని ఎలుగెత్తారు నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారు. ఆయన కవితా విశ్వరూపం చూడాలంటే ఆయన అన్ని రచనలు ఒకే పుస్తకంలో లభించే సంకలనాన్ని చదవాలి.
ఉమర్ ఖయ్యూం రుబాయీలను తేనెతో కలిపి తెలుగు వారితో తాగించిన కవి దువ్వూరి రామిరెడ్డి. ఈయన పానశాలలో కవితలను తాగితే ఆనందంతో మత్తెక్కిపోవాల్సిందే.
‘నేను సైతం’ అంటూ శ్రీశ్రీ పారించిన విప్లవం మహాప్రస్థానం.. ఇది చదివితే మనం, మన ఆలోచనలు మరో ప్రస్థానం వైపు సాగుతాయంటే అతిశయోక్తి కాదు.
సరదా కథలతో చెంపలు ఛెళ్లుమనిపించే చక్కులతో కూడినవి పానుగంటి లక్ష్మీనరసింహారావు గారి సాక్షి వ్యాసాలు.
హిందూమతం గురించి, సనాతన ధర్మం గురించి ఏమైనా సందేహాలున్నాయా? అయితే వెంటనే కంచి పరమాచార్య శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వాముల వారి జగ•ద్గురు బోధలు తిరగేయండి.
ఎందరో తత్త్వవేత్తలు.. వారి తత్త్వసారం గురించి తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పింది త్రిపురనేని గోపీచంద్ తత్వవేత్తలు.
ఇంకా, విద్యాప్రకాశానంద స్వామి వారి గీతామకరందం, సత్యం శంకరమంచి గారి అమరావతి కథలు, పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కృష్ణపక్షం.. ఇవన్నీ ఆధ్యాత్మికతను, కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి.
చలం అన్ని పుస్తకాలూ అద్భుతమే. మైదానంతో అలజడి సృష్టించిన ఈయన ప్రేమలేఖలు పుస్తకం కూడా చాలా బాగుంటుంది.
కథలెలా రాయాలో నేర్చుకోవాలని ఉందా? అయితే, వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారి కథాశిల్పం చదివేయండి.
స్వయంగా సరస్వతీదేవే కొన్ని విషయాల మీద మాట్లాడటం మొదలుపెడితే ఎలా ఉంటుంది? ఆ భావన కలగాలంటే మల్లాది వారి చలవ మిరియాలు చదవండి.
మన వేషభాషలు, అలవాట్లు, మనస్తత్వాలపై సెటైర్లు వేసిన వారు భమిడిపాటి కామేశ్వరరావు గారు. అన్నీ తగాదాలే, మన తెలుగు, లోకో భిన్నరుచి.. వీటిని చదువుతున్నంతసేపూ నవ్వుతూనే ఉంటారు.
మునిమాణిక్యం – కాంతం గార్లు తెలుగు నాట పంచిన హాస్యం కూడా తక్కువేమీ కాదు. ముని మానిక్యం గారి అన్ని రచనలూ చదివిస్తాయి, నవ్విస్తాయి.
సమాజం, సాహిత్యం.. ఈ రెండింటి గురించి తెలుసుకోవాలంటే కొడవగంటి కుటుంబరావు గారి అన్ని పుస్తకాలూ చదవాలి.
‘నువ్వు ఎక్కదల్చుకున్న రైలు జీవితకాలం లేటు’ వంటి ప్రసిద్ధ కవితా వాక్యం ఏ పుస్తకంలోనిదో తెలుసా? అయితే, ఇలాంటి కొటేషన్లు మరిన్ని కావాలంటే ఆరుద్ర త్వమేవాహమ్ చదివేయండి. ఇంకా ఈయన రూపుదిద్దిన సమగ్ర ఆంధ్ర సాహిత్యం సమస్త తెలుగు సాహిత్య చరిత్రను కళ్లకు కడుతుంది.
తెలుగు వారిని జ్ఞానపీఠం ఎక్కించిన వారు డాక్టర్ సి.నారాయణరెడ్డి. ఈయన విశ్వంభరలో మనిషే మహా నాయకుడు.
తెలుగు సినీ రంగ ప్రముఖుల విశేషాలు తెలుసుకోవాలంటే వేటూరి సుందరరామ్మూర్తి గారి కొమ్మ కొమ్మకో సన్నాయి చదవాలి.
సినీ పరిశ్రమలో కథానాయికగా ఎదిగి.. అథపాతాళానికి పడిపోయిన మంజరి కథను పాకుడురాళ్లుగా మలిచారు రావూరి భరద్వాజ గారు.
కరుణశ్రీ గారి ఉదయశ్రీ, పుట్టపర్తి నారాయణాచార్యుల వారి అనువాద పుస్తకాలు, అగ్నిధారలు కురిపించి, రుద్రవీణలు మోగించిన దాశరథి సాహిత్యం, గుంటూరు శేషేంద్రశర్మ కవితలు, కాళోజీ నా గొడవ, వంశీ పసలపూడి కథలు, కేఎన్‍వై పతంజలి కథలు-పతంజలి భాష్యం, శ్రీరమణ మిథునం, దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి అమృతం కురిసిన రాత్రి తప్పక చదవాల్సిన జాబితాలో ఉండే పుస్తకాలు.
నండూరి రామ్మోహనరావు గారి రాజు-పేద, విచిత్ర వ్యక్తి, కాంచనద్వీపం వంటి పుస్తకాలు పిల్లల్లో ఊహాశక్తిని, భాషా పటిమను పెంచుతాయి.
రాచకొండ విశ్వనాథశాస్త్రి (రావి శాస్త్రి), చాగంటి సోమయాజులు (చాసో), వేలూరి శివరామశాస్త్రి గారి కథలు మళ్లీ మళ్లీ చదవాలనిపించేవే.
తెలుగు కథకు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది పాలగుమ్మి పద్మరాజు గారి గాలివాన.
పైన చెప్పుకున్న వారిలో చాలామంది ఇప్పుడు లేరు.
అసలు సిసలు తెలుగు సాహిత్యానికే గతి లేదంటే ఇక అనువాద పుస్తకాల గురించి చెప్పేదేముంది? పాత కాలం నాటి తెలుగు అనువాద పుస్తకాలు అమూల్య సంపద వంటివి. కొన్నాళ్లకు అవేవీ దొరకకపోవచ్చు. ముందు తరాల కంటబడకుండానే మాయమైపోవచ్చు. అలాంటి కొన్ని అపురూపమైన అనువాద పుస్తకాల జాబితా ఇది. ఇవి పెద్దలతో పాటు పిల్లలూ తప్పక చదవాల్సినవి. ఈ జాబితాలో లేనివి కూడా ఇంకా మంచి పుస్తకాలై ఉండొచ్చు. ఒకసారి ప్రయత్నించండి..
ప్రకృతి పిలుపు (జాక్ లండన్ – కొడవగంటి కుటుంబరావు)
• వనవాసి (భిభూతిభూషణ్ బందోపాధ్యాయ – సూరంపూడి సీతారాం)
• పథేర్ పాంచాలి (భిభూతిభూషణ్ బందోపాధ్యాయ – మద్దిపట్ల సూరి)
• అన్నా కరేనినా (లియో టాల్‍స్టాయ్ – ఆర్వీయార్)
• యుద్ధము- శాంతి (లియో టాల్‍స్టాయ్ – రెంటాల గోపాలకృష్ణ, బెల్లంకొండ రామదాసు)
• చెంఘీజ్‍ఖాన్ (హెన్రి హోవర్త్ – తెన్నేటి సూరి)
• నేరము – శిక్ష (దోస్తాయే విస్కీ -శివం)
• ఏడు తరాలు (అలెక్స్ హేలీ – సహవాసి)
• గోరా (రవీంద్రనాథ్ ఠాగూర్ – శివశంకరస్వామి)
• యయాతి (విష్ణుసఖారాం ఖండేకార్ – యార్లగడ్డ లక్ష్మీప్రసాద్)
• దాటు (ఎస్.ఎల్.భైరప్ప – పరిమి నరసింహం)
• మరణాంతం (శివరాం కారంత్ – తిరుమల రామచంద్ర)
• ఫౌంటెన్‍హెడ్ (అయాన్‍రాండ్ – రెంటాల శ్రీవేంకటేశ్వరరావు)
• అమ్మ (మాక్సింగోర్కీ – క్రొవ్విడి లింగరాజు)
• సాగరగర్భంలో సాహసయాత్ర (జుల్స్ వెర్న్ – వినాయక)
• ఆదర్శ జీవులు (అంతోనియా కొప్తాయెవా – అట్లూరి పిచ్చేశ్వరరావు)
• స్వామి స్నేహితులు (ఆర్‍కే నారాయణ్ – శ్రీనివాస చక్రవర్తి)
• 80 రోజుల్లో భూప్రదక్షణం (జుల్స్ వెర్న్ – ముళ్లపూడి వెంకటరమణ)
• ఓల్గా నుంచి గంగ వరకు (రాహుల్ సాంకృత్యాయన్ – అల్లూరి సత్యనారాయణ రాజు)
• జీవనపాశం (సోమర్సెట్ మాం – కాకాని చక్రపాణి),
• రంగభూమి (ప్రేమ్‍చంద్ – సుంకర, ఆలూరి, కౌముది),
• తమస్ (భీష్మ సహానీ – యార్లగడ్డ లక్ష్మీప్రసాద్),
• ఆనందమఠం (బంకించంద్ర చటర్జీ – అక్కిరాజు రమాపతిరావు).
కానీ, తెలుగు అందాలను అక్షరాలలో గుదిగుచ్చి మనకందించిన వారి రచనా సంపద మాత్రం ఇంకా మిగిలి ఉంది. వాటిని చదివి ఆస్వాదించడం మన వంతు.
రామాయణంలోని ప్రతి శ్లోకం రమణీయమే. 24 వేల శ్లోకాలూ టీకా తాత్పర్యాలతో సహా చదవాలనుకుంటే పుల్లెల శ్రీరామచంద్రుడి గారి రామాయణం తిరగేయాలి.
తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆంధ్ర మహాభారతం (15 పుస్తకాల సెట్టు), పోతన భాగవతం, రామకృష్ణ మఠం వారి ఉపనిషత్తుల పుస్తకాలు, తాళ్లపాక అన్నమాచార్యుల వారి కీర్తనలు ఆధ్యాత్మికానుభూతిని పంచుతాయి.
ఇవి కూడా చదవండి..
ముందే చెప్పినట్టు ఫలానా పుస్తకమే మంచిదని తీర్మానించడానికి లేదు. వేటికవే ప్రత్యేకతలున్న పుస్తకాలు మన తెలుగు సాహిత్యంలో కోకొల్లలుగా ఉన్నాయి. ఆ మధ్య ప్రముఖ తెలుగు దినపత్రిక పలువురు రచయితలు, సాహితీ అభిమానులతో మాట్లాడి తప్పక చదవాల్సిన వంద తెలుగు పుస్తకాల జాబితాను రూపొందించింది. వాటిలో కొన్ని పుస్తకాలను ఈ వ్యాసంలో వివిధ చోట్ల ప్రస్తావించడం జరిగింది. అలా ప్రస్తావించినవి గాక మిగతా అరుదైన, తప్పక చదవాల్సిన పుస్తకాల జాబితా ఇది.
ఆంధ్ర మహాభారతం (కవిత్రయం), మాలపల్లి (ఉన్నవ లక్ష్మీనారాయణ), చివరకు మిగిలేది (బుచ్చిబాబు), అసమర్థుని జీవయాత్ర (గోపీచంద్), కాలాతీత వ్యక్తులు (డాక్టర్ శ్రీదేవి), కళా పూర్ణోదయం (పింగళి సూరన), గబ్బిలం (గుర్రం జాషువా), వసు చరిత్ర (భట్టుమూర్తి), అతడు-ఆమె (ఉప్పల లక్ష్మణరావు), అముక్త మాల్యద (శ్రీకృష్ణదేవరాయలు), ఎంకి పాటలు (నండూరి సుబ్బారావు), కవితత్వ విచారము (డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి), వేమన పద్యాలు (యోగి వేమన), కృష్ణపక్షం (కృష్ణశాస్త్రి), మట్టి మనిషి (వాసిరెడ్డి సీతాదేవి), ఆంధ్రుల సాంఘిక చరిత్ర (డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి), ఆంధ్ర మహాభాగవతం (పోతన), బారిస్టరు పార్వతీశం (మొక్కపాటి నరసింహశాస్త్రి), మొల్ల రామాయణం (మొల్ల), కాశీయాత్ర చరిత్ర (ఏనుగుల వీరాస్వామి), వర విక్రయం (కాళ్లకూరి నారాయణరావు), వైతాళికులు (ముద్దుకృష్ణ), ఫిడేలు రాగాల డజన్ (పఠాభి), సౌందరనందము (పింగళి, కాటూరి), విజయ విలాసం (చేమకూర వేంకటకవి), కీలుబొమ్మలు (జీవీ కృష్ణారావు), కొల్లాయి గడితేనేమి (మహీధర రామమోహనరావు), మను చరిత్ర (అల్లసాని పెద్దన), పాండురంగ మహాత్మ్యం (తెనాలి రామకృష్ణ), ప్రజల మనిషి (వట్టికోట ఆళ్వార్ స్వామి), జీవనయానం, చిల్లర దేవుళ్లు (డాక్టర్ దాశరథి రంగాచార్య), పాండవోద్యోగ విజయములు (తిరుపతి వేంకట కవులు), దిగంబర కవిత (దిగంబర కవులు), ఇల్లాలి ముచ్చట్లు (పురాణం సుబ్రహ్మణ్యశర్మ), నీలిమేఘాలు, స్వేచ్ఛ (ఓల్గా), శివతాండవం (పుట్టపర్తి నారాయణాచార్యులు), అపంశయ్య (నవీన్), గణపతి (చిలకమర్తి లక్ష్మీనరసింహం), రాజశేఖర చరిత్ర (కందుకూరి వీరేశలింగం పంతులు), నారాయణరావు (అడవి బాపిరాజు), నేను – నా దేశం (దర్శి చెంచయ్య), నీతిచంద్రిక (చిన్నయసూరి), ప్రతాపరుద్రీయం (వేదం వెంకటరాయశాస్త్రి), పారిజాతాపహరణం (నంది తిమ్మన), పల్నాటి వీర చరిత్ర, శృంగార నైషధం (శ్రీనాథుడు), రాధికా సాంత్వనము (ముద్దు పళని), స్వప్న లిపి (అజంతా), సారస్వత వివేచన (రాచమల్లు రామచంద్రారెడ్డి), ఉత్తర రామాయణం (కంకంటి పాపరాజు) విశ్వదర్శనం- పాశ్చాత్య చింతన, విశ్వదర్శనం- భారతీయ చింతన (నండూరి రామమోహనరావు), అనుక్షణికం (వడ్డెర చండీదాస్), ఆధునిక మహాభారతం (గుంటూరు శేషేంద్ర శర్మ), అడవి ఉప్పొంగిన రాత్రి (విమల), చాటు పద్య మంజరి (వేటూరి ప్రభాకరశాస్త్రి), కుమార సంభవం (నన్నెచోడుడు), కొయ్య గుర్రం (నగ్నముని), మైనా (శీలా వీర్రాజు), మా భూమి (సుంకర, వాసిరెడ్డి), రాముడుండాడు.. రాజ్యముండాది, అతడు అడవిని జయించాడు (కేశవరెడ్డి), రంగనాథ రామాయణం (గోన బుద్ధారెడ్డి), సౌభద్రుని ప్రణయయాత్ర (నాయని సుబ్బారావు), సూత పురాణం- 1,2 భాగాలు (త్రిపురనేని రామస్వామి చౌదరి), శివారెడ్డి కవిత (శివారెడ్డి), సాహిత్యంలో దృక్పథాలు (ఆర్‍ఎస్ సుదర్శనం), కరుణశ్రీ (జంధ్యాల పాపయ్య శాస్త్రి), తృణకంకణం (రాయప్రోలు), హృదయనేత్రి (మాలతీచందూర్), బ్రౌను నిఘంటువు (చార్లెస్ బ్రౌన్), మరవరాని మాటలు (బూదరాజు రాధాకృష్ణ), తెలుగు సామెతలు – జనజీవనం (డాక్టర్ పాపిరెడ్డి నరసింహారెడ్డి), హాస వ్యాస మంజరి (నల్లాన్ చక్రవర్తి శేషాచార్య).
చివరిగా- ఓ మంచి పుస్తకం చదివితే అది మనసుపై చెరగని ముద్ర వేయాలి. ఆలోచనల్ని, ప్రశ్నల్ని లేవనెత్తాలి. మనల్ని మనం తడిమి చూసుకోవాలి.
తల్లిదండ్రులు, గురువులు మనల్ని కొంత వరకే తీర్చిదిద్దగలరు. కానీ, మనల్ని మనం కొత్తగా రూపుదిద్దుకోవాలంటే మాత్రం తప్పకుండా పుస్తకాలు చదవాలి.
అందుకే పుస్తకమే సమస్తం..
అదే మన నేస్తం.
Review సమస్తం.. పుస్తకం.