చింతచెట్టు నేర్పిన పాఠం

పొదుపుగా ఖర్చుపెడుతూ, కష్టపడి సంపాదించిన డబ్బు దానికదే ఆ తరువాత రెట్టింపు అవుతుంది. అలాకాకుండా, విలాసాలకు పోయి ఉన్న ధనం ఖర్చు చేస్తే బికారులు కావడం తథ్యం. ఈ నీతినే తెలియచెబుతుంది. ప్రాచీన చైనా దేశపు ఈ నీతి కథ.
పూర్వం చైనా దక్షిణ సముద్రతీరాన ‘స్వతేవు’ అనే ఓడరేవు దగ్గర గ్యాన్‍హాంగ్‍, హయాంగ్‍ అనే ఇద్దరు చైనా వర్తకులు ఇరుగుపొరుగున ఉండేవారు. ఇద్దరూ చిన్న నాటి నుంచీ ప్రాణ స్నేహితులు. వారు స్వతేవు ఓడరేవు దగ్గర చిన్న చిన్న వస్తువులను అమ్ముకుంటూ జీవనం గడిపేవారు. ఒకరోజు భయంకరమైన పెనుగాలి, తుఫాను వచ్చి ఆ ఓడరేవు పూర్తిగా ధ్వంసమైంది. ఈ తుఫాను వల్ల ఓడరేవు చుట్టుపక్కల ఉన్న అనేక ఇళ్లు కూలిపోయాయి. అనేకమంది జీవనోపాధి దెబ్బతిన్నది. గ్యాన్‍హాంగ్‍, హయాంగ్‍ కూడా చాలా నష్టపోయారు. వాళ్ల వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. అయినా వారు నిరాశ పడలేదు. థాయిలాండ్‍ వెళ్లి వ్యాపారం చేయాలని అనుకున్నారు. అందుకు అవసరమైన డబ్బు కోసం వారం రోజుల పాటు చాలా కష్టపడి దారి ఖర్చులకు సరిపడేంతగా కొంత డబ్బును సంపాదించారు.
ఒకరోజు వారిద్దరూ థాయిలాండ్‍కు బయలుదేరారు. వాళ్ల దగ్గర కొంచెం డబ్బు, వేసుకున్న దుస్తులు తప్ప ఇంకేమీ లేవు. కొద్ది రోజులు ఓడలో ప్రయాణించిన తరువాత థాయిలాండ్‍ అఖాతానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ‘మేనమ్‍’ నది మీదుగా థాయిలాండ్‍ రాజధాని బ్యాంకాక్‍ నగరానికి చేరుకున్నారు. వాళ్లిద్దరూ అక్కడే తమ వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకున్నారు.
అయితే, ఇద్దరూ కలిసి ఒకచోట వ్యాపారం చేయరాదనీ నిర్ణయించుకున్న మీదట ఒకరు బ్యాంకాక్‍ ఉత్తర దిశకూ, మరొకరు దక్షిణ దిశకూ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తమ వీలును బట్టి వివిధ వస్తువులతో వ్యాపారం చేయాలనీ, తక్కువ డబ్బు ఖర్చు పెట్టాలనీ, వ్యాపారంలో అన్ని మెలకువలూ ప్రదర్శించి యాభై చాంగ్‍ (థాయిలాండ్‍ కరెన్సీ పేరు)లు సంపాదించిన తరువాతనే తిరిగి తాము ఒకరినొకరు కలుసుకోవాలనీ ఒప్పందం చేసుకున్నారు మిత్రులిద్దరూ.
తాము కనీసం యాభై చాంగ్‍లు సంపాదించే వరకూ సాదాసీదా జీవితం గడపాలనీ, బియ్యం, ఊరగాయ, ఉప్పు, సముద్రపు చేపలు తినాలనీ, పంది, బాతు, కోడి మాంసం వంటి ఖరీదైన ఆహార పదార్థాలు తినకూడదనీ వాళ్లిద్దరూ వాగ్దానాలు కూడా చేసుకున్నారు. అనంతరం వాళ్లిద్దరూ తమ తమ దిశలకు వ్యాపారం నిమిత్తం వెళ్లిపోయారు.
గ్యాన్‍హాంగ్‍ తన ఒప్పందాన్ని అక్షరాలా పాటిస్తూ కష్టపడి పని చేయసాగాడు. మామూలు ఆహారం తిని జీవించసాగాడు. ఎప్పుడూ రుచికరమైన వస్తువులను కన్నెత్తి చూసేవాడు కాదు. తన వ్యాపార విషయంలో వినియోగదారులతో, తన వద్దకు ఆయా వస్తువులు కొనడానికి వచ్చిన వారితో, స్థానికులతో నమ్మకంగా, కలుపుగోలుగా ఉండేవాడు. అతని సాధారణ జీవితాన్ని, అతనిలోని సుగుణాలను చూసి అక్కడి ప్రజలు అతనంటే ఇష్టపడేవారు.
గ్యాన్‍హాంగ్‍ వ్యాపారం బాగా జరగసాగింది. ఆ ప్రాంతంలో అతను మంచి పేరూ, డబ్బూ కూడా బాగా సంపాదించాడు. ప్రణాళిక ప్రకారం త్వరలోనే యాభై చాంగ్‍లు సంపాదించాడు. అయినప్పటికీ అతడు సాధారణ జీవితమే గడిపేవాడు. అతను నూరు చాంగ్‍లు సంపాదించిన తరువాత, తన వ్యాపారానికి ఇంకేమీ ఆటంకం లేదని తన సంపాదనతో తృప్తిపడి, మంచి ఇల్లు కట్టించాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. తరువాత కొంతకాలం గడిచాక మంచి ఖరీదైన ఆహారం తింటూ సంతోషంగా జీవించసాగాడు.
మరోపక్క బ్యాంకాక్‍కు మరో దిశగా బయల్దేరిన హయాంగ్‍ కూడా ఏదో వ్యాపారం ప్రారంభించాడు. తన కష్టానికి తగినట్టు అతడికి డబ్బు వచ్చేది. తన మిత్రుడికి ఇచ్చిన మాట ప్రకారం అతడు కూడా మొదట మామూలు ఆహారమే తింటుండే వాడు. కానీ, ఒకే రకపు ఆహారం తిని తిని అతడికి విసుగనిపించింది. తాను తినే దాంట్లో రుచిగానీ, శక్తిగానీ లేదని అనుకునే వాడు. ‘నేను రోజురోజుకూ బలహీనమైపోతున్నాను. అక్కడ నా స్నేహితుడు గ్యాన్‍హాంగ్‍ మంచి భోజనం తింటున్నాడేమో! అతడు నేనిలా బలహీనమైపోవడానికే ఖరీదైన ఆహారం తినకూడదనే నియమం పెట్టాడేమో’ అనుకున్నాడు హయాంగ్‍.
‘డబ్బు కూడబెట్టాల్సిందే కానీ, రోజూ నేను సాధారణమైన తిండి కోసం ఎంత డబ్బు ఖర్చుపెడుతున్నానో అంతే డబ్బుకు ఏదైనా బాతు దొరికితే దాన్ని తినడంలో తప్పేముంది?’ అని హయాంగ్‍ తన నియమ ఉల్లంఘనను తానే సమర్థించుకునే వాడు.
ఒకరోజు అతడికి తక్కువ ధరలో ఒక బాతు దొరికింది. ఆ బాతు ఏదో జబ్బుతో చనిపోయింది. అందుచేత తక్కువ ధరకే దొరికింది. హయాంగ్‍ దాన్ని కొని ఆహారంగా వండుకుని తిన్నాడు. చాలా రోజుల తరువాత బాతు మాంసం తిన్నందు వల్ల అతనికి కుళ్లిన బాతు మాంసం కూడా రుచిగానే అనిపించింది.
మర్నాడు అక్కడే ఇంకొక చనిపోయిన బాతును కొన్నాడు. కానీ, ఆ రోజతనికి ఆ మాంసం రుచించలేదు. మూడవ రోజు అతను బతికి ఉన్న మంచి బాతును కొని తిన్నాడు. దాని మాంసం అతనికి చాలా రుచిగా ఉంది. రోజూ బాతు, కోడి, పంది వంటి రకరకాల జంతువుల మాంసం తినేవాడు.
కడుపు నిండా మంచి ఆహారం పడితే నిద్ర కూడా ఎక్కువగా వస్తుంది. మరి, మనిషి సోమరిపోతుగా కూడా మారిపోతాడు కదా! హయాంగ్‍ కూడా అలాగే మారాడు. రోజూ కడుపునిండా తిని హాయిగా నిద్రపోతూ కాలం గడిపేసేవాడు. రోజూ సంపాదించినదంతా తిండికే ఖర్చు చేసేవాడు. అందువల్ల అతడు యాభై చాంగులు కూడా కూడబెట్టలేకపోయాడు.
ఒకరోజు హయాంగ్‍కు తన స్నేహితుడిని చూడాలని అనిపించింది. అతడు అక్కడి నుంచి గ్యాన్‍హాంగ్‍ ఉందే దిశగా బయల్దేరాడు. అక్కడకు వెళ్లిన తరువాత తన స్నేహితుడు ఒక పెద్ద భవనంలో ఉంటున్నాడని తెలిసి చాలా ఆశ్చర్యపోయాడు. అతడి దగ్గరకు వెళ్లి తన స్థితిని గురించి తెలిపాడు హయాంగ్‍.
గ్యాన్‍హాంగ్‍ అతడిని ఏమీ అనలేదు. హయాంగ్‍ ఇష్ట ప్రకారం అతడిని గ్యాన్‍హాంగ్‍ తన వద్దనే ఉంచుకున్నాడు. అతడికి రోజూ అన్నం, ఊరగాయ, ఉప్పు, సముద్రపు చేపలూ వండి పెట్టేవాడు. రోజూ ఒకటే ఆహారం తిని హయాంగ్‍కు విసుగుపుట్టింది. మిత్రుడు పెట్టే ఆహారంతో పాటు చింతాకులు కూడా ఉడికించి తింటానని తన మిత్రుడిని అడిగాడు. తన మిత్రుడి ఇష్టం ప్రకారమే తన తోటలోని ఒక చిన్న చింతమొక్కను గ్యాన్‍హాంగ్‍ చూపించి, ‘దీని ఆకులు నువ్వు బియ్యంతో ఉడికించి తింటూ ఉండు’ అని చెప్పాడు. మర్నాడు నుంచి హయాంగ్‍ ఆ మొక్క ఆకులు తెంచి, బియ్యంతో పాటు ఉడికించుకుని తింటుండసాగాడు. కొన్ని రోజుల తరువాత ఆ మొక్క ఆకులన్నీ అయిపోయాయి. మోడు మాత్రం మిగిలింది. తరువాత అది కూడా ఎండిపోయింది. హయాంగ్‍ గ్యాన్‍హాంగ్‍ వద్దకు వెళ్లి, ‘ ఆ మొక్క ఆకులన్నీ అయిపోయాయి. మొక్క కూడా ఎండిపోయింది’ అని చెప్పాడు.
అప్పుడు కూడా గ్యాన్‍హాంగ్‍ తన మిత్రుడిని ఏమీ అనలేదు. ‘మరేం పర్వాలేదు. నేను నీ కోసం వేరే ఏర్పాటు చేస్తాను. నువ్వు నాకు రేపు గుర్తుచేయి’ అన్నాడు గ్యాన్‍హాంగ్‍.
మర్నాడు హయాంగ్‍కు గ్యాన్‍హాంగ్‍ తన తోటలోని ఒక పెద్ద చింతచెట్టును చూపించి, ఆ చెట్టు ఆకులు తినమన్నాడు. ‘ఈ చెట్టు ఆకులు కూడా అయిపోయిపుడు నాతో చెప్పు. నేను నీకు మాంసం, చేపలున్న మంచి భోజనం ఏర్పాటు చేస్తా’ అన్నాడు గ్యాన్‍హాంగ్‍. హయాంగ్‍ సంతోషించాడు. చెట్టు ఆకులు తొందరగా అయిపోవాలని ఎక్కువ బియ్యంలో ఎక్కువ ఆకులు వేసి ఉడికించి తినేవాడు. అయినా చింతచెట్టు ఆకులు తరిగిపోలేదు. ‘ఎంత తిన్నా చింతచెట్టు ఆకులు తరగడం లేదు. ఎన్ని ఆకులు తుంచితే అన్ని ఆకులు మర్నాటికి పుట్టుకొస్తున్నాయి’ అన్నాడొక రోజు హయాంగ్‍.
గ్యాన్‍హాంగ్‍ నవ్వి, ‘ఇది అలాగే జరుగుతుంది. ప్రపంచ రీతే అంత. నీ సంపాదన చిన్న చింత మొక్కంత ఉన్నపుడు నువ్వు దాన్ని వెంటనే ఖర్చు పెట్టేశావు. అందువల్ల అది వృద్ధి కాలేదు. కానీ, నేను నా శ్రమ, శ్రద్ధతో చిన్న చింత మొక్కలా ఉన్న నా సంపాదనను పెంచుకున్నాను. దాన్ని పెద్ద చింతపెట్టులా చేశాను. అందువల్ల దాని నుంచి ఎంత ఖర్చు చేసినా పెరుగుతుందే కానీ తరగదు’ అన్నాడు.

హయాంగ్‍ సిగ్గుపడ్డాడు. ‘నాకు మంచి పాఠం నేర్పావు. దీన్ని జీవితాంతం గుర్తుంచుకుని మళ్లీ శ్రద్ధగా పనిచేస్తాను. అప్పుడే నీకు మళ్లీ నా ముఖం చూపిస్తాను’ అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు హయాంగ్‍.

Review చింతచెట్టు నేర్పిన పాఠం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top