జ్యోతిర్లింగ వెలుగుల్లో మనసు కడిగిన ముత్యం కావాలి

ఒక యువకుడు కొత్తగా పోలీసు ఉద్యోగంలో చేరాడు. తొలి రోజు డ్యూటీకి ఉత్సాహంగా హాజరయ్యాడు. యువకుడు.. ఉడుకులెత్తే రక్తం.. తన విధి నిర్వహణలో సమాజాన్ని మార్చేయాలన్నది అతని ఉద్దేశం.
సీనియర్ పోలీసు అధికారితో కలిసి ఆ యువ పోలీసు అధికారి ఓ ప్రధాన రోడ్డు మీదుగా వాహనంలో వెళ్తున్నాడు. అంతలో వారి వాహనంలోని వైర్లెస్ సెట్కు ఒక సందేశం వచ్చింది. ‘ఫలానా రహదారిపై జనం పెద్దసంఖ్యలో గుమికూడారు. అక్కడేం జరుగుతోందో తెలుసుకోండి’ అనేది మెసేజ్ సారాంశం.
దాంతో ఇద్దరు పోలీసు అధికారులు సదరు ప్రదేశానికి వెళ్లారు. నిజంగానే అక్కడ జనం పెద్దసంఖ్యలో గుమికూడి ఉన్నారు. వారలా ఎందుకు గుమికూడారో తెలియదు. ఆ యువ పోలీసు అధికారి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.
తన వాహనంలో నుంచి దిగుతూనే.. ‘అందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోండి. ఒక్క క్షణం ఉన్నా.. మర్యాదగా ఉండదు’ అని ఆ యువ పోలీసు అధికారి అక్కడున్న వారిని హెచ్చరించాడు.
ఈ అనాలోచిత హెచ్చరికతో అక్కడి జనం విస్తుపోయారు. నిజానికి వారంతా అక్కడున్నది ఏదో ఆందోళన చేయడానికో, మరేదో ఉద్యమం చేయడానికో కాదు. ఒక సేవా కార్యక్రమం నిమిత్తం సామూహికంగా విరాళాలు సేకరిస్తున్నారు.
తాము ఇంత మంచి పని చేస్తుంటే, ఈ యువ పోలీసు అధికారి ఇలా హెచ్చరిస్తున్నాడేంటి అంటూ ఆశ్చర్యపోతూ, అక్కడి నుంచి మాత్రం కదలలేదు.
తన మాటను వారు లెక్క చేయకపోయే సరికి, మన యువ పోలీసు అధికారికి చిర్రెత్తుకొచ్చింది.
‘చెబుతుంటే అర్థం కావడం లేదా? వెళ్తారా? వెళ్లరా? లాఠీకి పని చెప్పాలా?’ అని కాస్త అధికార దర్పం ప్రదర్శించాడు.
అసలే పోలీసు.. ఆపై కొంత దురుసుగా ఉన్నాడు. అతనితో మనకెందుకులే అనుకుని అక్కడ గుమికూడిన స్వచ్ఛంద సంస్థ తాలూకు సభ్యులంతా అక్కడి నుంచి మెల్లగా వెళ్లిపోయారు.
తన మాట నెగ్గడంతో యువ పోలీసుకు పట్టరాని ఆనందం కలిగింది. తన పక్కనే ఉన్న సీనియర్ అధికారి వైపు తిరిగి- ‘తొలిరోజు డ్యూటీ ఎలా చేశాను సర్’ అన్నాడు గర్వంగా.
‘ఫర్వాలేదు. బాగానే చేశావు. కానీ, అదిగో.. అదే బస్సు స్టాప్’ అంటూ దారి కూడా చూపించాడు సీనియర్ పోలీసు అధికారి.
మనం కూడా ఆ యువ పోలీసు అధికారి మాదిరిగానే నిజ జీవితంలోనూ, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లోనూ ‘పని చేస్తున్నాం’. ఎంతలా అంటే.. ఏమాత్రం స్పష్టత లేకుండా చాలా ‘విపరీతంగా పని చేస్తున్నాం’.
తగినంత స్పష్టత లేకుండా చేసే పని ఏదైనా, అది చివరిలో విపత్కర పరిస్థితులకు దారి తీస్తుంది.
మనం ఏం చేయాలి? ఎలా చేయాలి? అనేది తెలియాలంటే ఒక ‘వెలుగు’ కావాలి. ఆ వెలుగు పేరే వివేకం. అదెంత ఎక్కువగా ఉంటే మనం చేసే పని పట్ల అంత స్పష్టత కలిగి ఉంటాం.
ఆకాశాన్ని కారుమబ్బులు కమ్ముకున్నట్టు.. మన మనసులను చీకట్లు కమ్ముకుంటున్నాయి. అటువంటి అజ్ఞాన చీకటిని తొలగించుకోవడానికి మహా శివరాత్రి పర్వం ఒక మంచి సందర్భం. జ్యోతిర్లింగ స్వరూపుడై, శివుడు లింగాకారంలో వెలిసినది మహా శివరాత్రి నాడే. ఆ మహా లింగం ప్రసరించే వెలుగుల్లో శివతత్వాన్ని ఒంటబట్టించుకుని, మన మనసులను కడిగేసుకుందాం. మనుషులమవుదాం.
మహా శివరాత్రి, రథ సప్తమి శుభాకాంక్షలు
-కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు

Review జ్యోతిర్లింగ వెలుగుల్లో మనసు కడిగిన ముత్యం కావాలి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top