దిగులు లేదా నిరాశ మనల్ని చుట్టిముట్టినప్పుడు పరిసరాలను, పరిస్థితులను వేలెత్తి చూపిస్తాం. అవే మన దిగులకు, నిరాశకు కారణమైనట్టుగా వాటిని నిందిస్తాం. అవి మనకు తీరని కష్టనష్టాలు కలిగించాయని దుఃఖిస్తాం. అయితే, మనకు సంభవించిన కష్టాలు మనం చేసిన పనుల తాలూకు ఫలితాలేనని ఎంతకీ గ్రహించం. సంతోషం కలగడం లేదా అది దూరం కావడం అనేది మన చర్యల ఫలితమే. సంతోషం అనేది లేదా ఆనందం అనేది ఒక వస్తువు కాదు. దానిని మనం పొందడం, పొందలేకపోవడం అనేది ఉండదు. వాటిని ఎవరూ మన నుంచి దూరం చేయలేరు. నిజానికి సంతోష, ఆనందాలు అనేవి ఒక భావన. మనం ఎలా భావిస్తామో అలాగే అనుభూతి చెందుతాం. ఒక పనిని చేయడాన్ని ఇష్టపడితే ఆనందిస్తాం. దానిని చేయడం పట్ల ఆసక్తి కనబరచపోతే అది దిగులుకు, నిరాసక్తతకు కారణమవుతుంది. చేయవలసిన పనిలో ఇష్టం కనబరచడంలోనే ఆనందం లభిస్తుంది. మనకు కలిగే ఆటంకాలు, అసౌకర్యాలు మనల్ని అసంతృప్తికి గురి చేస్తుంటాయి. అసంతృప్తి నుంచి బయటపడాలంటే అభినివేశం (పట్టుదల), ప్రేమ, మనోబలం (ధైర్యం) పెంపొందించుకోవాలి. వీటి నుంచే సంతోషం ఉత్పన్నమవుతుంది. అలసట నుంచి బయటపడాలంటే కొద్ది కాలం ప్రకృతి ఒడిలో సేదదీరాలి. అప్పుడు జీవితంలోని విసుగు నుంచి కొంతైనా విముక్తి లభిస్తుంది. వాస్తవ ప్రపంచంలోని పరిస్థితులను అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా మసలుకోవడం కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. మనమంతా ఓడలకు అధిపతులం కాలేం. కానీ, మనలో కొందరు ఓడను నడిపే బృందంలోని సభుల్యం కాగలం. కాబట్టి మనకు లభించిన దానితో మనం తృప్తి పడాలి. అన్ని పరిస్థితుల్లో సంతోషంగా ఉండగలగడం ఆనందానికి ఉత్తమ మార్గం. జీవితంలో అన్ని విసుగులను దూరం చేసేది- ‘పని’. ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకొని దానిని సాధించే క్రమంలో ఆ లక్ష్య సాధనలో నిమగ్నం అయిపోవడమే సంతోషానికి హేతువు. మనకు నచ్చిన పనిలో, మనం ఇష్టపడి చేసే పనిలో అలసిపోవడం, దిగులు చెందడం, నిరాశ కలగడం, నిరాసక్తత ఏర్పడటం, ఆసక్తి కోల్పోవడం వంటివి కలగవు. మనకు నచ్చిన పనిలో లేదా ఇష్టపడి చేసే పనిలో లేదా ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకొని దానిని సాధించేందుకు చేసే కృషిలో ఎప్పటికీ నిరాశ అనేది కలగదు. పైగా ఆ లక్ష్యసాధనకు చేరువ అవుతున్న కొద్దీ మనకు ఎదురవుతాయని భావించే భయాలన్నీ పటాపంచలు అయిపోతాయి.
సంతోషం అనేది తాళం వేసి ఉండే ఒక వస్తువు అనుకొంటే.. ఆ తాళాన్ని తీసే తాళపు చెవి- ‘‘పని’’.
కాబట్టి చేసే పనిని ప్రేమిద్దాం.
తలపెట్టిన పనిని ఇష్టపడి చేద్దాం.
అప్పుడు అన్నీ శుభాలే.. అంతా ఆనందమే
Review పని పట్టుదలను పెంచండి.