పసి మనసులు దైవంతో సమానం అంటారు. అందుకేనేమో..
ప్రేమను చూపితే పరవశించిపోతారు..
ఆకట్టుకునేలా చెబితే అల్లుకుపోతారు..
ఆప్యాయత కురిపిస్తే ఆనందాన్ని వర్షిస్తారు..
వెన్నుతట్టి ప్రోత్సహిస్తే.. ఇక మిమ్మల్ని వదలమంటూ వెన్నంటి ఉండిపోతారు.
పిల్లలంటే ప్రేమకు తలవంచే పూలకొమ్మలు.
సిరులొలికించే వారి నవ్వులు శరత్కాల వెన్నెలంతటి స్వచ్ఛం.
నిర్మలమైన ప్రేమకు, నిష్కల్మషమైన మనసుకు పిల్లలు ప్రతీకలు.
అటువంటి పసి హృదయాల్లో దేవుడు కాక మరెవరు నివాసం ఉంటారు.
పక్షులు గూళ్ల నుంచి బయటకు వచ్చినపుడు కిలకిలరావాలతో ఆనందిస్తాయి. తిరిగి గూళ్లలోకి వెళ్లేటపుడూ కిలకిల సరిగమ రాగాలనే ఆలపిస్తాయి.
పిల్లలూ అంతే.
నవ్వడం.. కాసింత నొప్పి కలిగితే ఏడవటం.. తప్పితే మరేమీ తెలియని నిర్మలత్వం చిన్నారుల సొంతం.
దూషణలు, దండనలు, అవమానాలు.. వేటినైనా పిల్లలు తొందరగా మరిచిపోతారు. అది వారికి భగవంతుడు ఇచ్చిన వరం. కాదు.. కాదు.. ఆ భగవంతుడు తల్లిదండ్రులకు ఇచ్చిన వరం.. పిల్లలు.
పూవుల్లాంటి పిల్లల్ని కళ్లలో పెట్టుకుని చూసుకుని మురిసిపోతాం. వారు నవ్వితే మనమూ నవ్వుతాం. వారు ఏడిస్తే మన కళ్లు చెమ్మగిల్లుతాయి. ‘అమ్మా..నాన్నా..’ అంటూ వరుసలు పెట్టి పిలిస్తే పరవశించని హృదయం ఉండదు.
అటువంటి పిల్లలు నేడు ఎలా పెరుగుతున్నారు?
మన భావి భారత పౌరులు సవ్యమైన బాటలోనే నడుస్తున్నారా?
పిల్లల పెంపకంలో నాటికీ నేటికీ వచ్చిన మార్పులు ఏమైనా ఉన్నాయా?
అమ్మ ఒడి నుంచి బడిలో చేరిన పిల్లలు లోకజ్ఞానం నేర్చుకోగలుగుతున్నారా?
నేటి బాలల మనో వికాసం ఏ స్థాయిలో ఉంది?
…
ఇంకా ఎన్నో విషయాలు.. మరెన్నో విశేషాలు..
నవంబరు 14, బాలల దినోత్సవం సందర్భంగా ‘తెలుగు పత్రిక’ చిన్నారుల బోసి నవ్వుల వెలుగులను రంగరించుకుని మీ ముందుకు వచ్చింది.
పసి హృదయాల సంగతులను మనసారా ఆస్వాదించండి.
Review బోసి నవ్వుల దేవుళ్లు!.