హృదయపూర్వక హితం..

అరమరికలు లేని హృదయపూర్వక హితం- స్నేహితం.
మన జీవితంలో పెరిగే వయసు.. గడిచిపోయే కాలాన్ని బట్టి స్నేహితులు మారుతుంటారు. కానీ, స్నేహం విలువ మాత్రం మారదు.
ఒక వయసు వచ్చేసరికి తల్లిదండ్రులే స్నేహితులుగా మారుతుంటారు కూడా.
కానీ, మన జీవితంలో నిజమైన స్నేహితుడు మాత్రం భగవంతుడే.
భగవంతుడు నిత్య చైతన్య స్వరూపి. దేవుడిని అర్చించడానికి మన పెద్దలు ‘నవవిధ భక్తులు’ బోధించారు. వాటిలో అత్యంత ముఖ్యమైనది- ‘సఖ్య భక్తి’.
సఖ్యం అంటే స్నేహం. అంటే, భగవంతుడినే స్నేహితుడిగా భావించాలి.
స్నేహభక్తికి అద్దంపట్టే విశేషాలు మన పురాణాల్లో చాలా ఉన్నాయి.
భాగవతంలో- శ్రీకృష్ణ, కుచేల స్నేహం అపురూపమైనది. సాందీపుడి వద్ద వీరిద్దరూ చిన్న వయసులోనే సహ విద్యార్థులుగా చేరతారు. పెరిగి పెద్దవారయ్యాక.. శ్రీకృష్ణుడు మధురలో శ్రీమంతుడైన పరమాత్మగా స్థిరపడితే.. కుచేలుడు దుర్భర దారిద్య్రంతో మగ్గిపోయాడు. అయితే, తమ దారిద్య్రాన్ని పోగొట్టుకోవడానికి బాల్య స్నేహితుడైన కృష్ణుడిని ఆశ్రయించాలని భార్య చెబితే, కాసిన్ని అటుకులు మూటగట్టుకుని వెళ్లాడు కుచేలుడు. వాటిని ఎంతో ఇష్టంగా తిన్న కృష్ణుడు.. కుచేలుడికి ఎనలేని ఐశ్వర్యాలను ప్రసాదించాడు.
ఇక, మహా భారతంలో శ్రీకృష్ణుడు, అర్జునుడి స్నేహం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అర్జునుడితో స్నేహ బాంధవ్యాన్ని పెనవేసుకున్న కృష్ణుడు.. అతడికి అడుగడుగునా అండగా నిలిచాడు. కష్టాల్లో వెన్నుతట్టి ప్రోత్సహించాడు. డీలా పడితే చేయందించి నిలబెట్టాడు. కురుక్షేత్ర సంగ్రామంలో గీతాబోధ చేసి విజయానికి బాటలు వేశాడు.
ఇంకా, రామాయణంలో శ్రీరాముడు, సుగ్రీవులది జాతి భేదాలకు అతీతమైన స్నేహబంధం. ఇద్దరికీ ఒకరిపై మరొకరికి గట్టి నమ్మకం, విశ్వాసం కలగాలంటే స్నేహం కన్నా మరొకటి లేదని నమ్మిన హనుమంతుడు ఇద్దరికీ అగ్నిసాక్షిగా మిత్రత్వాన్ని కలిగించాడు.
అలాగే, దుర్యోధన-కర్ణులది కూడా మంచి స్నేహమే. కానీ, వారి మనసుల్లోని ఉద్దేశాలు మాత్రం పరస్పరం స్వార్థపూరితమైనవి. కర్ణుడి అండ ఉంటే పాండవులను జయించవచ్చని, తద్వారా రాజ్యాన్ని చేజిక్కించుకోవచ్చనే స్వార్థంతో దుర్యోధనుడు కర్ణుడిని చేరదీశాడు. ఇక, తన పుట్టుకను అవమానించారనే కోపంతో కర్ణుడు దుర్యోధనుడి చెంత చేరాడు. తనకు క్షత్రియ హోదాను కట్టబెట్టినందుకు కృతజ్ఞతగా దుర్యోధనుడికి అండగా నిలుస్తానని ప్రతినబూనాడు. ఇలా పరస్పరం ఆకాంక్షలతో నడిచిన వీరి స్నేహం చివరకు విషాదంతో ముగిసింది.
మనుషుల్లో అన్యోన్యత పెరగాలంటే పరస్పరం స్నేహభావం ఉండాలి. మనసు విప్పి తనలోని భావాలను, ఆలోచనలను పంచుకునే సామీప్యం ఉంటేనే స్నేహం అనే పుష్పం వికసిస్తుంది.
స్నేహ పుష్పం వాడిపోయేది కాదు. అది నిత్యనూతన హృదయ కమలం.

స్నేహితుల దినోత్సవం, వరలక్ష్మీ వ్రతం, కృష్ణాష్టమి, రక్షాబంధన్‍ శుభాకాంక్షలు

– కుమార్‍ అన్నవరపు
రాజేశ్వరి అన్నవరపు

Review హృదయపూర్వక హితం...

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top