
మాట పొందికగా ఉండాలి.
మనం వాడే భాష అందంగా ఉండాలి.
అప్పుడే మనకు, మనం మాట్లాడే మాటలకు మర్యాద, మన్నన.
మాట మన్నన తేవాలి. మన్నన లేని మాట మాటే కాదు.
మన సంభాషణలో మర్యాద – మన్నన అనేవి ఉండటం చాలా అవసరం.
సంభాషణలో అప్రియత్వానికి, నిష్కప•త్వానికి భేదం తెలియని వారున్నారు.
అప్రియం మర్యాదకు భిన్నమైనది. అది మనకు మన్నన తీసుకురాదు.
కొందరు తామనుకున్నదే చెప్పాలనుకుంటారు. ఈ క్రమంలో అప్రియమైన పదాలు వాడతారు.
నిజానికి ఎవరైనా తామెలా భావిస్తున్నారో అలా నిజంగా మాట్లాడవచ్చును. కానీ, అది వినే వారికి అప్రియంగా ఉండకుండా చూసుకోవడం ముఖ్యం. నిజం మాట్లాడేటపుడు, నిజం చెప్పేటపుడు మాటలు మరింత పొందికగా ఉండాలి. అప్రియమైన పలుకులు పలకకూడదు.
సత్యం బ్రూయాత్ ప్రియం బూయాత్
నభ్రూయాత్ సత్యమప్రియం
ఇది లోకోక్తి. దీని ప్రకారం- ప్రియంగా మాట్లాడటం నేర్చుకోవాలి. నిష్కాపట్యం అప్రియం కాదు. దానికి భిన్నమైనది.
సన్నిహితులతో మాట్లాడేటపుడు మాటలను ఆచితూచి వాడాలి.
ఏమాత్రం మాట తూలినా సంబంధ బాంధవ్యాల్లో తేడా వస్తుంది.
మాట ‘ఈటె’ వంటిది.
పరులకు వ్యధ కలిగించే మాటలు అసలు మాట్లాడకూడదు.
కొందరి నోరు మాట్లాడుతూ ఉంటే, నొసలు వెక్కిరిస్తూ ఉంటాయి.
ఇది అనర్థదాయకమైన ధోరణి. దీనిని పరిహరించాలి.
మర్యాద ఇచ్చి, మర్యాద తెచ్చుకోవాలని పెద్దలు చెప్పాలి.
మర్యాద అనేది దానంతట అది రాదు.
మనం ఎదుటి వారికి ఇచ్చే మర్యాదను బట్టే మనకు అది లభిస్తుంది.
కాలు జారితే తీసుకోవచ్చును. కానీ, నోరు జారితే ఆ మాట వెనక్కి తీసుకోలేం.
అసలే నరం లేని నాలుక. అదెలాగైనా మాట్లాడుతుంది. ఏమైనా అంటుంది.
కాబట్టి నాలుకను స్వాధీనంలో ఉంచుకోవాలి.
నాలుక స్వాధీనంలో ఉంటే లోకమంతా స్వాధీనంలో ఉంటుంది.
– కుమార్ అన్నవరపు
రాజేశ్వరి అన్నవర
Review మాటామంతీ...