అన్నం తిందాం రండి.. అరిటాకు వెయ్యండి

అరిటాకులో భోజనం..
చివరిసారిగా ఎప్పుడు చేశారో గుర్తుచేసుకోండి!.
గుర్తులేదు కదూ! అవును. అరిటాకులో అన్నం తినడం మనమెప్పుడో మరిచిపోయాం. మరి, కార్తీక మాసం వస్తోంది. కనీసం ఈ సందర్భాన్ని పురస్కరించుకునైనా అరిటాకులో తిందాం!. కార్తీకం.. ఆధ్యాత్మిక మాసం. ఉదయాన్నే చన్నీటి స్నానాలు.. ఉపవాసాలు.. దీపారాధనలు.. దానాలూ వ్రతాలూ.. ఇవన్నీ ఒకెత్తయితే ఇంటిల్లిపాదీ, బంధుమిత్ర జనమంతా ఒకచోట చేరి ఉల్లాసంగా విందారగించే సందర్భమూ కార్తీకంలోనే వస్తుంది. అవే- వన భోజనాలు. కార్తీక మాసం వస్తోందంటే చాలు అరిటాకు విస్తరి వేయాల్సిందే. మరి అరిటాకులో దాగున్న ఆరోగ్య రహస్యాలేమిటో చదివేయండి మరి.

కార్తీక మాసం.. వన భోజనాల వేళ.. ఉసిరిచెట్టు నీడలో చింకి చాపలు పరుచుకుని అరిటాకు విస్తరి వేసి పూర్ణం, చక్రపొంగలి, పులిహోర, గోంగూర పచ్చడి, పప్పూ దప్పళం, గడ్డపెరుగూ.. ఇలా వరుసగా అన్నీ వేస్తూ భోజనాన్ని వడ్డిస్తే.. ఒక్కో ముద్దా తింటుంటే.. ఆ ముద్ద నోట్లోకి వెళ్లేటపుడు కమ్మని పచ్చని అరిటాకు వాసన నాసికకు తాకితే.. తినేది అన్నమా?.. అమృతమా? అనిపించకమానదు. అసలు ఆ సమయంలో జిహ్వకందే ఆ కమ్మని రుచి మనం తినే ఆహార పదార్థాలదా? పచ్చని అరిటాకుదా? అనేది తేల్చి చెప్పడం కూడా కష్టమే!.
అయినా కార్తీక మాసమనే ఏముంది? అరటి ఆకులో భోజనం ఏడాది పొడవునా ఎప్పుడైనా చేయొచ్చు. అరిటాకులో భోజనం అనేది నేటి తరానికి కొత్తేమో కానీ, పాత తరాల వాళ్లంతా చాలా తరచుగా అరిటాకులో అన్నం తిన్నవాళ్లే. నాడు ప్రతి ఇంటి పెరట్లో అరటి చెట్టు తప్పక ఉండేది. భోజనానికి కూర్చోగానే ఆకు తెగేది. అరిటాకు విస్తరి అనగానే ఆపాత జ్ఞాపకాలెన్నో గుర్తుకువస్తాయి. పండుగలూ, పూజలూ, వ్రతాల సమయంలో అరిటాకుల్లోనే శుభప్రదమని,
శుచిగా ఉంటుందనీ భావించి దేవుడికి అందులోనే నైవేద్యం పెట్టడమే కాదు, ఇంటికి అతిథులు వచ్చినా పళ్లాల్లో కాకుండా ఆకుల్లోనే భోజనం పెట్టే అలవాటు పూర్వం ఉండేది. ఇక, పెళ్లీ పేరంటాల సందర్భంలో అయితే చెప్పనే అక్కర్లేదు. అరిటాకు విస్తరి లేనిదే విందు నడవదు. అరిటాకు విస్తట్లో చారు పోసినా, పెరుగు వడ్డించినా దాన్ని అటూఇటూ జారిపోకుండా కలుపుకుని తినడం నిజంగా ఒక సవాల్‍గానే ఉండేది.
అయినా, ఆకులో తినడం అంటే ఏదో తెలియని ఆనందం. ఇదంతా గతం. ఇప్పుడలా తినడంలోని ఆనందం నచ్చిందో, అరటి ఆకులోని రుచిని మెచ్చిందో లేదా అందులోని ఓషధీ గుణాలే గుర్తొచ్చాయో తెలియదు కానీ, నేటి తరం సైతం అరిటాకు భోజనాన్ని కోరుకుంటోంది. చాలా వరకు హోటళ్లు, రెస్టారెంట్లలో ప్రత్యేకంగా ఆకుల్లోనే వడ్డించడం లేదా ప్లేటులో అరిటాకు వేసి వడ్డించడం ద్వారా వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. బఫే భోజనాల సంత ఒకపక్క జోరుగా కొనసాగుతూనే ఉన్నా.. అదే సమయంలో చాలాచోట్ల చాలామంది మళ్లీ పాత పద్ధతిలో టేబుళ్లు వేసి ఆకులేసి వడ్డించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దాంతో మళ్లీ అరిటాకు తెర మీదికి వచ్చింది. పర్యావరణ రీత్యా ప్లాస్టిక్‍ వాడకం తగ్గించాలన్నది కూడా అరిటాకు వాడకం పెరగడానికి మరో కారణం.

అరిటాకులో ఔషధ గుణాలు
భారతీయ సంప్రదాయంలో అరిటాకును పవిత్రంగా భావిస్తారు. దానికి ఎంగిలి ఉండదన్న భావనతోనే ప్రసాదాలను ఆ ఆకులో నివేదిస్తారు. అదెలా ఉన్నా శాస్త్రీయంగా చూస్తే- గ్రీన్‍ టీలో లభించే ఎపిగాలోకెటెచిన్‍ గాలేట్‍ (ఇజిసిజి) అనే పాలీఫినాల్‍ అరటి ఆకుల్లో ఎక్కువ. అందులో ఆకుల్లో వేడిగా వడ్డించడం వల్ల ఆ వేడికి వాటిల్లోని పాలీఫినాల్స్ ఆహారంలో కలిసి వ్యాధులను నిరోధిస్తాయి. అరిటాకులోని పాలీఫినాల్స్ క్యాన్సర్‍తో పోరాడేందుకూ తోడ్పడతాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ‘ఇజిసిజి’ అనేది అతినీలలోహిత కిరణాల కారణంగా చర్మం దెబ్బతినకుండా కాపాడుతుందట. ఆకుల్లోని యాంటీ బ్యాక్టీరియల్‍ గుణాలు ఆహారంలోని సూక్ష్మజీవులనూ నాశనం చేస్తాయి. వేడి పదార్థాలను వడ్డించడం వల్ల ఆకు మీద ఉన్న మైనం కరిగి పదార్థాలకు ఒకలాంటి రుచిని చేకూరుస్తుంది.
అరిటాకులోని క్లోరోఫిల్‍ పేగు అల్సర్లనీ, చర్మవ్యాధులనీ నిరోధించడంతో పాటు రక్తశుద్ధికి తోడ్పడుతుంది. ఆకలిని పెంచి, తిన్నది త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది. మూత్రాశయంలో, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది. ఇంకా ఇందులోని విటమిన్‍-ఎ, కాల్షియం, కెరోటిన్‍, సిట్రిక్‍ ఆమ్లం.. వంటివన్నీ కలిసి రోగనిరోధకశక్తిని పెంచుతాయి. అందుకే మన పూర్వీకులు ఇంట్లో ఖరీదైన కంచాలున్నా నేరుగా ఆకుల్లోనో లేదా తినే పళ్లాల్లో ఆకులు వేసుకునో తినేవారు. పైగా ఆకు పెద్దగా ఉండటం వల్ల వంటకాలన్నీ ఒకేసారి వడ్డించవచ్చు.

విస్తరాకు భోజనానికి కేరళలో బీజం
మలయాళీలు ప్రకృతి ప్రేమికులు. మొదటి నుంచీ వారిది ప్రకృతితో మమేకమైన జీవనం. ఆకుల్లో అన్నం తినడం అనే సంప్రదాయం కేరళలో మొదలైందని అంటారు. అందుకు ఇంటి చుట్టూ అరటిచెట్లు ఉండటం ఓ కారణమైతే, ఆయుర్వేద శాస్త్ర రీత్యా కూడా ఆకులో తినడం ఆరోగ్యానికి మంచిదనేది మరో కారణం. తమిళనాడులోని తిరునెల్వేలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికీ అచ్చంగా అరిటాకుల్లో మాత్రమే భోజనం చేస్తారు. దానివల్లే వాళ్లకి బట్టతల రాదని విశ్వసిస్తారు. ఎందుకంటే అరిటాకులోని కెరోటిన్‍ జుత్తు ఎదుగుదలకు తోడ్పడటమే వారి నమ్మకానికి కారణం. కొన్ని ప్రాంతాల్లో ఆయుర్వేద ఔషధాలను అరిటాకుల్లోనే ప్యాక్‍ చేసి ఇస్తుంటారు. అంతేకాదు, గాయాలకూ కొన్ని చర్మవ్యాధులకూ అరిటాకు నూరి తీసిన రసాన్ని పూస్తే త్వరగా తగ్గుతాయి.
భోజనాలకు ప్లేట్లులాంటివి వాడి, వాటిని సబ్బులతో కడగడం వల్ల ఆయా రసాయనాలు అంతోఇంతో ఆ ప్లేట్లకు అంటుకుంటాయి. అదే అరిటాకులపై ఉండే మైనం వల్ల వాటికి దుమ్మూధూళీ అతుక్కోదు సరికదా, నీళ్లు చిలకరిస్తే చాలు శుభ్రమైపోతాయి. అదీగాక వేడుకల్లో ప్లాస్టిక్‍, స్టైరోఫోమ్‍లతో తయారయ్యే డిస్పోజబుల్‍ ప్లేట్ల వల్ల పర్యావరణానికీ నష్టం కలుగుతుంది. అదే తిని పడేసిన అరిటాకులైతే నేలలో కలిసిపోతాయి. పైగా ఆ నేల వాటి ద్వారా పోషకాలనూ గ్రహిస్తుంది.

ప్లాస్టిక్‍ ప్లేట్లు వద్దు.. ఆకే ముద్దు
ఆకుల్లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్‍-ఎ, సిట్రిక్‍ ఆసిడ్‍, కాల్షియం, కెరోటిన్‍ వంటివన్నీ ఆహారంలో కలిసి ఆ ఆకులో వడ్డించిన వంటకానికి ఓ ప్రత్యేక రుచిని తెస్తాయి. ఆ కారణంతోనే అనేక ప్రాంతాల్లో ఆకుల్ని వంటల తయారీకి వాడుతుంటారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‍ రాష్ట్రాల్లో చేప, పుట్టు, ఇడ్లీ, డోక్లా వంటి కొన్ని ప్రత్యేకమైన వంటకాలను ఆకుల్లో పెట్టి వండుతారు. మలబారు తీరంలో అరిటాకులో వండే కిజి బిర్యానీ రుచి ఈ మధ్య దేశవిదేశీయులెందరినో అలరిస్తోంది. జపాన్‍, మెక్సికో, హవాయ్‍ల్లో కూడా వంటలకు అరటి ఆకుల్ని వాడుతుంటారు. కొన్ని రెస్టారెంట్లలో ఇడ్లీ, దోసె, వడ, ఊతప్పం వంటి టిఫిన్లనూ అరిటాకుల్లోనే వడ్డిస్తున్నారు. కూరల్నీ అరిటాకు గిన్నెల్లోనే వడ్డించడం విశేషం. ఫుడ్‍ పార్సిల్స్ కోసం కాగితం, ప్లాస్టిక్‍, అల్యూమినియం ఫాయిల్‍.. ఇలా వేటిని వాడినా అందులోని ఇంకూ, ఇతరత్రా రసాయనాలన్నీ ఆహారంలో అంతో ఇంతో కలుస్తాయి. అందుకే వాటి వాడకాన్ని తగ్గించడానికి ఆకుల వాడకం పెరుగుతోంది. ప్లాస్టిక్‍కు ప్రత్యామ్నాయంగా కూరగాయలూ, ఆకుకూరల ప్యాకింగ్‍ కోసం అరటి ఆకులనే వాడుతున్నారు.
ఏటా సుమారు 11 కోట్ల టన్నుల అరటి ఆకుల్ని వృథాగా పారేస్తున్నాం. అందుకే బనానా లీఫ్‍ టెక్నాలజీ వంటి సంస్థలు ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‍కు బదులుగా ఏడాది పాటు నిల్వ ఉండే అరిటాకుల కప్పులూ, ప్లేట్లూ, కవర్లూ తయారు చేస్తున్నాయి. వీటిల్లో పదార్థాలను ప్యాక్‍ చేయడం వల్ల వైరస్‍, బ్యాక్టీరియా, ఫంగస్‍ వంటివి దరిచేరవట.
మొత్తం మీద అరిటాకుకీ, ఆహారానికీ విడదీయరాని అనుబంధం ఉంది. తామర, బాదం, విస్తరాకు, పనస.. ఇలా ఆకులేవైనా వాటిల్లోని ఆస్ట్రింజెంట్‍ గుణాలు పదార్థాలకు ఒకలాంటి రుచితో పాటు చర్మానికీ మేలు చేస్తాయి. అందుకే మరి, ఇక ఆకుల్లోనే తిందాం.. అతిథులకు ఆకుల్లోనే వడ్డిద్దాం.

Review అన్నం తిందాం రండి.. అరిటాకు వెయ్యండి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top