ఆనందమార్గం.. ఇదిగో ఇదే!

గతం.. భవిష్యత్తు..
ఒకటి వెంటాడుతుంది. మరొకటి భయపెడుతుంది.
ఈ రెండింటి మధ్యా చిక్కుకుని మనిషి విలవిల్లాడతాడు. ఫలితంగా విలువైన వర్తమానం చేజారిపోతుంటుంది. గడిచిపోయిన క్షణం తిరిగిరాదు. అందుకే జీవితంలో ఏ చిన్న అనుభూతినీ వదులుకోకూడదు. ‘
ఈ రోజు కలిగిన అనుభూతి రేపు కలగొచ్చు.. కలగకపోవచ్చు. కానీ, కరిగిపోయిన కాలమైతే తిరిగి రాదు కదా!. కాబట్టి ఈ క్షణంలోనే జీవించు.. ఈ క్షణాన్నే ఆనందించు’.. అనేది జపనీయుల ఆనంద జీవన మార్గం. ఇదే వాళ్ల ఆనంద మంత్రం. దాని పేరే
‘ఇచిగో ఇచి’.
ఇది మరింత బాగా అర్థం కావాలంటే కింది కథ చదవండి.
అనగనగా ఓ వేటగాడు. జింకను వేటాడుతూ తానున్న చోటు నుంచి ఎక్కడెక్కడికో పోతూ చివరకు హిమాలయ పర్వతాల మీదికి చేరుకున్నాడు. ఆ జింకను ఎలాగైనా పట్టుకుని తీరాలనే కసితో ఆ పర్వతాలను ఎక్కి దిగాడు. అలా వెళ్లగా, వెళ్లగా ఆ వెండి కొండల మధ్య అద్భుతమైన బంగారు నగరం కనిపించింది. ఆ నగరంలోకి ఇతరులు ప్రవేశించకుండా బలమైన ప్రహరీని, దానికి అంతకంటే బలమైన సింహద్వారాన్ని నిర్మించారు. అక్కడున్న కాపలా మనిషి అటుగా వచ్చిన వేటగాడిని పలకరించాడు.
‘మా నగర అందాలను చూస్తావా? లోపలికి వెళ్తావా?’ అని అడిగాడు కాపలాదారు.
‘చూడాలనే ఉంది. కానీ, ప్రస్తుతం వేటలో ఉన్నాను. జింకను పట్టుకొన్నాక మీ నగరంలోకి వెళ్లి అందాలన్నీ చూస్తాను’ అన్నాడు వేటగాడు.
మొత్తానికి అతడి వేట కొనసాగింది. జింక దొరికింది. వేట ముగిసింది. పనైపోయింది కాబట్టి ఆ నగర అందాలను చూడాలని ద్వారం వద్దకు వచ్చాడు. కానీ, అక్కడి కాపలాదారు లేడు. ఎంత ప్రయత్నించినా ఆ నగరం ద్వారాలు తెరుచుకోలేదు.
ఊసురోమని నిట్టూర్చాడు వేటగాడు.
జింకదేముంది? రేపైనా దాన్ని వేటాడొచ్చు. అది కాకపోతే ఇంకొకటి దొరుకుతుంది. కానీ, ఆ అందాల నగరంలోకి ప్రవేశం మాత్రం దొరికినప్పుడే వెళ్లాలి కదా!. అందివచ్చిన స్వర్గంలాంటి అవకాశం చేజారిపోయిందేనని వేటగాడు బాధపడ్డాడు.
ఆ నగరం వర్తమానానికి ప్రతీక.
జింక గతానికీ, భవిష్యత్తుకూ సూచిక.
నిన్నటి చింతలతో, రేపటి ఆశలతో.. ఈ క్షణంలో దొరికే అనుభూతులనూ, అవకాశాలనూ, ఆనందాలనూ ఆ వేటగాడిలా దూరం చేసుకోవద్దని చెబుతుంది ‘ఇచిగో ఇచి’.
జీవితంలో నిర్లక్ష్యంతో, నిర్లిప్తతతో మనం ఆస్వాదించకుండా వదిలేసే క్షణాలు, ఆనందాలు, అనుభూతులు చాలా ఉంటాయి. అవి ఆ క్షణమే ఉంటాయి. తరువాత మళ్లీ రావచ్చు.. రాకపోవచ్చు. ప్రతి రోజూ విలువైనదే. ప్రతి నిమిషం అపురూపమైనదే. ప్రతి అనుభవం అద్భుతమైనదే. గతాన్ని గుర్తు చేసుకుంటూనో, భవిష్యత్తు గురించి అతిగా బెంగపడుతూనో.. గతం, భవిష్యత్తుల ధ్యాసలో పడి వర్తమానాన్ని విస్మరించకూడదు. జపాన్‍ దేశపు వికాస సూత్రం- ‘ఇచిగో ఇచి’ సారాంశం ఇదే.
ఇచిగో ఇచి అంటే ‘ప్రతి క్షణం అమూల్యమైనదే’ అని అర్థం.
జపాన్‍కు చెందిన సోజీ ఈ ఇచిగో ఇచి సృష్టికర్త. అతనో సాధారణ మనిషి. చాయ్‍ మాస్టర్‍. జపనీయుల జీవితంలో చాయ్‍ (టీ) ఆస్వాదన అనేది ఓ అందమైన అనుభవం. వాళ్ల దేశంలో తరచూ టీ వేడుకలు జరుగుతుంటాయి. వాటిలో జపనీయులు హృదయపూర్వకంగా పాల్గొంటారు. అతిథులూ, ఆత్మీయుల సమక్షంలో ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తారు. చాయ్‍ మాస్టర్‍గా సోజీ.. అలాంటి అనుభూతులకు అక్షర రూపం ఇవ్వాలనే తలంపుతో ‘ఇచిగో ఇచి’ పేరుతో పుస్తకం రాశాడు. చాయ్‍ మాస్టర్‍గా తన వద్దకు వచ్చే వారి అనుభూతుల్ని వర్ణిస్తూ, ‘ప్రతి భేటీ అమూల్యమే’ అనే అర్థంలో ఈ పదాన్ని వాడాడు. ఆ భేటీ ప్రకృతితో కావచ్చు, వ్యక్తులతో కావచ్చు.. ప్రతీ క్షణాన్నీ ఆస్వాదించాలనేది ఈ ఇచిగో ఇచి సిద్ధాంతం.
జపనీస్‍ మార్షల్‍ ఆర్టస్లో కూడా ఇచిగో ఇచి గురించి లోతైన వివరణ ఉంది.
‘యుద్ధంలో ఈ క్షణమే కీలకం. అప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ స్పందించలేం. స్పందించడానికి మనం బతికుండకపోవచ్చు కూడా’ అనే సత్యాన్ని ‘ఇచిగో ఇచి’ చాటుతుంది. జపాన్‍లో ‘ఇచిగో ఇచి’కి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు.
జపనీయులకు ఈ మాటంటే ప్రాణం.
ఆ పేరుతో ఆ దేశంలో పలు కంపెనీలు ఉంటాయి.
వీధికో రెస్టారెంట్‍ కనిపిస్తుంది.
‘ఇచిగో ఇచి’ని అనుసరించడం అంటే, నడుస్తూ, మాట్లాడుతూ, పనిచేస్తూ, భోజనం చేస్తూ, టీ తాగుతూ కూడా ధ్యానం చేయడమే’ అని జపనీయులు సగర్వంగా చెప్పుకుంటారు.
ఇంటి పెరట్లో నాటిన మొక్క మొగ్గ తొడిగి పూవుగా పూయడం కూడా జపనీయులకు వేడుకే. అందుకే జపనీయులు చెర్రీ చెట్లు మొగ్గ తొడుగుతున్న సమయంలో ఒకసారి, పూలు పూసినప్పుడు మరోసారి, పూలు రాలే కాలంలో ఇంకోసారి.. మొత్తం మూడు వేడుకలు చేసుకుంటారు. నిజానికి ఇదొక సాకు మాత్రమే. అన్ని వైపుల నుంచీ ఆనందాన్ని వెతుక్కోవాలనే తలంపే ఈ వేడుకల ఉద్దేశం.
క్షణ కాలమంటే ఎంత? రెప్పపాటు సమయం. అయితేనేం? గొప్ప అనుభూతిని మూటగట్టి ఇవ్వగల అద్భుతమైన శక్తి దానికుంది.

మీ చేతిలో అందమైన పువ్వు ఉంది. దాని వర్ణాలు చూసి మీరెంతో మురిసిపోతూ ప్రకృతి పువ్వులకు ఇన్నిన్ని అందాలను ఎలా అద్దిందా అని ఆశ్చర్యపోతున్నారు. లేదా మీ చేతిలో ఓ పువ్వుంది. కానీ, చేతిలో ఉన్న దాని కంటే ఇంకా అందమైన పుష్పమేదో కావాలని చేతిలో ఉన్న ఆనందాన్ని కాదనుకుని ఆ క్షణంలో లేని దాని కోసం ఆరాటపడుతున్నారు.
పై రెండింట్లో మీరు ఏది?.
దీన్ని బట్టే మన ఆనందాల స్థాయిలు ఆధారపడి ఉంటాయి.
కొన్ని ఆనందాలు పొందాలనుకున్నా ఆ క్షణంలో మనసులో పుట్టే ఉద్వేగాలు మనల్ని స్థిమితంగా ఉండనివ్వవు.
మనం గతానికి దూరంగా ఉన్నపుడు, భవిష్యత్తుపై బెంగే లేనప్పుడు, నూటికి నూరుపాళ్లు వర్తమానంలోనే జీవిస్తున్నప్పుడు కోపం ఉండదు. విషాదం కనిపించదు. మనసు నిండా ఆనందమే. కళ్ల నిండా సంతృప్తే.
ఆనందంగా ఉన్నప్పుడే మనలోని అసలు మనిషి బయటికి వస్తాడు. ప్రతిరోజూ, ప్రతి క్షణమూ అలాగే ఉండగలిగితే ఎంత బాగుంటుందో కదా!. ఆ మధ్య కాలంలో ప్రపంచంలోనే అత్యంత ఆనందస్వరూపుడిని టిబెట్‍లోని ఓ బౌద్ధారామంలో గుర్తించారట శాస్త్రవేత్తలు. వారలా గుర్తించే వేళలో అతడి చేతిలో చిల్లిగవ్వ కూడా లేదట. అయితేనేం, పేదరికం అతని మహదానందానికి అడ్డు కాలేదు. నిత్యానందమూ, సత్యానందమూ, బ్రహ్మానందమూ అని ఉపనిషత్తులు వర్ణించేది ఇలాంటి మానసిక స్థితినే.
ఆంగ్లంలో ‘ప్రజంట్‍’ అనే పదం ఒకటుంది. వర్తమానం, బహుమతి అనే రెండు అర్థాలు ఈ పదానికి ఉన్నాయి.
రెండూ ఒకదానితో మరొకటి ముడిపడినవే. అవును. మనిషికి వర్తమానాన్ని మించిన బహుమతి మరొకటి లేదు.
‘సృష్టిలో నువ్వే ఒక అద్భుతం. ఇంకో అద్భుతం కోసం ఎదురుచూస్తూ ఈ క్షణాన్ని వృథా చేసుకోవద్దు’ అని చెబుతారు బౌద్ధ గురువులు.
ప్రతి క్షణాన్నీ పరిపూర్ణంగా ఆస్వాదించడమే కాదు, ఆ అనుభూతిని కలకాలం పదిలపరుచుకునే ప్రయత్నమూ చేయాలని చెబుతుంది- ‘ఇచిగో ఇచి’.

ఇచిగో ఇచి..
ఆనందానికి 5 సూత్రాలు

‘ఇచిగో ఇచి’ సూత్రాలను జీవితంలో భాగం చేసుకోవడం పెద్ద కష్టమైన పనేం కాదు. ఈ క్షణాన్ని ఆస్వాదించడానికి డబ్బుతో పనిలేదు. సాంకేతికత అవసరం లేదు. అప్పటి ఆనందాన్ని అప్పుడే అనుభూతి చెందాలనే మనసుంటే సరిపోతుంది. జీవితం పట్ల మమకారం దానికి తోడైతే చాలు.
1. సూర్యోదయాన్ని చూడాలనిపిస్తే మరుసటి రోజు తెల్లవారుజామునే చూసేయండి. బద్ధకంతోనో, నిర్లిప్తతతోనో ఆ అనుభూతిని వాయిదా వేసుకోవద్దు. కన్యాకుమారికి వెళ్లాలనిపించినా, కశ్మీర్‍లో పర్యటించాలని ఉన్నా.. వెంటనే ఏర్పాట్లు చేసుకోండి. ఆఫీసు పనులున్నాయనో, వ్యాపార వ్యవహారాలు కొలిక్కి వచ్చాక నిర్ణయం తీసుకుందామనో వెనక్కి తగ్గొద్దు. ఇక్కడ ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మీకు మండువేసవిలో ఊటీకో, కశ్మీర్‍కో వెళ్లాలని ఉంది. కానీ, ఆఫీసు పని లేదా మరేదైనా వ్యాపకం వల్ల అసలు వీలు కాదనుకోండి. అసలు ఊటీకో, కశ్మీర్‍కో వెళ్లాలనే ఆలోచనే వద్దు. అంతేతప్ప, ఆఫీసు పనిని భారంగా ఈడుస్తూ అక్కడికో ఇక్కడికో వెళ్లలేకపోయామే అనే బాధ వద్దు. అసలు అలాంటి ఆలోచనే వద్దు.
2. ఒకే పనిని పదేపదే చేస్తూ సరికొత్త ఫలితాన్ని ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. జీవితం పాతబడిపోయిన వెలితి వేధిస్తున్నప్పుడు మళ్లీ ఆ పాతనే పట్టుకుని వేలాడటం ఎందుకు? కొత్తదారి ఎంచుకోండి. కొత్త అనుభూతుల్ని వెతుక్కోండి. చేస్తున్న పనిలో మార్పులు చేసుకోండి.
3. మనసును వర్తమానంలోనే నిలువరించడంలో జెజెన్‍ సాధన ఉపకరిస్తుంది. ఇందులో మంత్రాలుండవు. బీజాక్షరాలుండవు. ప్రశాంతంగా ఓ చోట కూర్చుని ఆ క్షణాన్ని ఆస్వాదించడమే జెజెన్‍ సాధన అంటే. ఇదీ ఓ ధ్యాన పక్రియే.
4. పంచేంద్రియాలకు చేతినిండా పని పెట్టాలి. మనం మాట్లాడటమే కాదు, ఇతరులు చెప్పేదీ శ్రద్ధగా వినాలి. రెండు కళ్లతో ప్రకృతిని పరికించాలి. కమ్మని రుచులను ఆస్వాదించాలి. ఆలింగన, కరచాలనాలతో స్పర్శలోని అయస్కాంత శక్తిని ఆత్మీయులకు పంచాలి.
5. ఒంటరిగా ఉన్నామనే ఆలోచనే వద్దు. బీభత్సమైన ఒంటరితనంలోనూ మీతో మీరు ఉంటారనే విషయం మరిచిపోవద్దు. రోజులో కొద్దిసేపు మీ గురించి మీరు సమీక్షించుకోండి. మీతో మీరు మాట్లాడుకోండి.

నొప్పి అనివార్యం.. బాధ మాత్రం ఐచ్ఛికం
ఓ విద్యార్థి బౌద్ధాశ్రమానికి వెళ్లాడు.
‘స్వామీ! మీ విద్యాలయంలో చదువుకోవడానికి అనుమతించండి’ అని కోరాడు.
‘తప్పకుండా’ అంటూ ఆ విద్యార్థిని ఓ తరగతి గదికి తీసుకుని వెళ్లాడు గురువు.
అక్కడ విద్యార్థులు లేరు. ఉపాధ్యాయులూ లేరు. అదే మాట అడిగాడు విద్యార్థి.
‘స్వామీ! ఇక్కడ నాకు పాఠాలు చెప్పే వారేరి?’ అని.
‘ఇక్కడ నువ్వే గురువు. నువ్వే శిష్యుడు’ అని బదులిచ్చాడు గురువు.
ప్రతి క్షణాన్నీ ఓ అనుభవంగా, ప్రతి అనుభవాన్నీ ఓ పాఠంగా భావించినపుడే మనలోని గురువు గొంతుక మనకు స్పష్టంగా వినిపిస్తుంది.
ఇష్టమైన పని చేస్తున్నప్పుడూ, ఇష్టమైన జీవితం గడుపుతున్నప్పుడూ జీవితం వేగంగా సాగిపోతున్నట్టు అనిపిస్తుంది.
అదే, నిస్సారమైన బతుకులో వేగం ఉండదు. రోజులు భారంగా గడుస్తున్నట్టు ఉంటాయి. దీనికి సంబంధించి ఐన్‍స్టీన్‍ ఓ మంచి ఉదాహరణ చెబుతారు.
‘నిప్పుల్లో చేయి పెట్టి చూడండి. ఒక్క క్షణమే అయినా ఓ యుగంలా అనిపిస్తుంది. అదే, ఆత్మీయులతో ఏదైనా రెస్టారెంట్‍కు వెళ్లండి. గంటలైనా నిమిషాల్లా గడిచిపోతాయి’. ‘ఇచిగో ఇచి’ సూత్రంలో ‘ఒకసారి ఒకే పని’ అనే అంతర్లీన సందేశం కూడా ఇమిడి ఉంది. ఉదాహరణకు ఈ రోజు సోమవారం అయితే, మనం సోమవారంలోనే ఉంటాం. ఉండాలి. మంగళవారమైతే మంగళవారంలోనే ఉంటాం. అంతేకానీ, ఒకేసారి సోమ, మంగళవారాల్లో జీవించలేం కదా!.
అలాగే, ఒకసారి ఒక పని మాత్రమే చేయగలం. రెండు మూడు బాధ్యతల్ని ఒకేసారి నెత్తినేసుకోవడం కంటే, అందులోంచి అతి ముఖ్యమైన, అత్యవసరమైన పనిని ముందుగా ఎంచుకోవడం మేలు. అదే సర్వస్వమన్నట్టు చేయాలి. రేపటి పని గురించి ఆలోచిస్తూ ఉంటే ఈ రోజు చేయాల్సిన పనిపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా ఏకాగ్రత దెబ్బతింటుంది.
దు:ఖం గురించి ఆలోచిస్తూ మరింత దు:ఖానికి గురవుతుంటారు కొందరు. దీనినే మానసిక శాస్త్రంలో ‘మెటా ఎమోషన్‍’ అంటారు.
వైఫల్యం సహజమే. కానీ, వైఫల్యం వల్ల కలిగిన బాధ గురించి ఆలోచిస్తూ మరింత బాధపడిపోవడం మాత్రం మానసిక జాడ్యమే. జీవితంలో నొప్పి అనివార్యం. తప్పించుకోలేం. కానీ, బాధ మాత్రం ఐచ్ఛికం.ఎంత బాధపడాలో, ఎంతకాలం బాధపడాలో మనమే నిర్ణయించుకోవచ్చు. వర్తమానం విలువ తెలిసిన వారికే ఆ నైపుణ్యం ఒంటబడుతుంది.

Review ఆనందమార్గం.. ఇదిగో ఇదే!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top