
ఉగాది అనగానే షడ్రుచుల పచ్చడి.. శ్రీరామ నవమి అనగానే పానకం – వడపప్పు..
ఇవెలాగూ ఏటా సంప్రదాయబద్ధంగా ఉండేవే. ఇవి కాకుండా ఉగాది నాడు కాస్త కొత్తగా ఉండేలా.. జగదభిరాముడికి నచ్చేలా.. ఇంకేం నైవేద్యంగా పెట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే వీటినోసారి ప్రయత్నించి చూడండి..
అటుకుల పొంగలి
కావాల్సినవి: మందంగా ఉండే అటుకులు: పెద్ద కప్పు, బెల్లంపొడి: ముప్పావు కప్పు, నీళ్లు: అరకప్పు, పాలు: అరకప్పు, నెయ్యి: రెండు టేబుల్ స్పూన్లు, జీడిపప్పు: పది, కిస్‍మిస్: పది, ఉడికించిన పెసరపప్పు: పావుకప్పు, యాలకుల పొడి: అరచెంచా.
తయారు చేసే విధానం: స్టవ్ మీద గిన్నె పెట్టి పావుకప్పు నీళ్లు పోసిన తరువాత బెల్లంపొడి వేయాలి. బెల్లం కరిగి లేతపాకంగా మారుతున్న సమయంలో దించేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి చెంచా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‍మిస్‍ను వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అనంతరం అదే కడాయిలో మరో చెంచా నెయ్యి వేసి అటుకుల్ని దోరగా వేయించుకోవాలి. రెండు నిమిషాల పాటు ఇలా చేసిన తరువాత మిగిలిన నీళ్లూ పాలూ పోసి కలుపుతూ ఉండాలి. అటుకులు కాస్త మెత్తగా అవుతున్నపుడు అప్పటికే సిద్ధం చేసి పెట్టుకున్న బెల్లంపాకం, పెసరపప్పు ముద్ద, యాలకుల పొడి, మిగిలిన నెయ్యి వేసి బాగా కలపాలి. పొంగలి దగ్గరకు అవుతున్న సమయంలో చివరిగా వేయించి సిద్ధం చేసిపెట్టుకున్న జీడిపప్పు, కిస్‍మిస్ పలుకులు వేసి కొద్దిగా కలిపి దించేయాలి. ఇది అటు నైవేద్య వంటకంగానూ, ఇటు ఆరోగ్యదాయకంగానూ ఉంటుంది.
బంగాళాదుంప వడలు
కావాల్సినవి: ఉడికించిన బంగాళాదుంపలు: రెండు, బియ్యప్పిండి: కప్పు, జీలకర్ర: చెంచా, నువ్వులు: అరటేబుల్ స్పూను, కారం: అరచెంచా, అల్లంపేస్టు: అరచెంచా, పచ్చిమిర్చి పేస్టు: చెంచా, కొత్తిమీర తరుగు: పావుకప్పు, ఉప్పు: తగినంత, నూనె: వేయించుకునేందుకు సరిపడా.
త•యారు చేసే విధానం: స్టవ్ మీద కడాయిని పెట్టి రెండు కప్పుల నీళ్లు పోయాలి. అందులో జీలకర్ర, నువ్వులు, కారం, అల్లం పేస్టు, పచ్చిమిర్చి పేస్టు, కొత్తిమీర తరుగు, తగినంత ఉప్పు, చెంచా నూనె వేసి బాగా కలపాలి. ఈ నీళ్లు మరుగుతుండగానే బియ్యప్పిండి వేసి కలిపి స్టవ్‍ను సిమ్‍లో పెట్టి దగ్గరకు వచ్చాక దించేయాలి. ఇందులో బంగాళాదుంపల ముద్ద కూడా వేసి మరోసారి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లా అద్దుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుంటే చాలు.. వేడి వేడి బంగాళాదుంపల వడలు రెడీ.
మామిడికాయ
పులియోదరై..
కావాల్సినవి: బియ్యం: రెండు కప్పులు, మామిడికాయ తురుము: కప్పు, నూనె: రెండు టేబుల్‍స్పూన్లు, పల్లీలు: పావుకప్పు, ఆవాలు: చెంచా, ఇంగువ: చిటికెడు, ఉప్పు: తగినంత, సెనగపప్పు: చెంచా, మినప్పప్పు: చెంచా, కరివేపాకు రెబ్బలు: రెండు
మసాలా కోసం: ధనియాలు: అర టేబుల్ స్పూను, మిరియాలు: చెంచా, మినప్పప్పు: చెంచా, సెనగపప్పు: చెంచా, ఎండుమిర్చి: 8, ఎండుకొబ్బరిపొడి: టేబుల్ స్పూను, మెంతులు: పావుచెంచా.
తయారు చేసే విధానం
ముందుగా స్టౌ మీద కడాయిని పెట్టి మసాలా కోసం పెట్టుకున్న పదార్థాలను ఒక్కొక్కటిగా వేయించుకుని ఆ తరువాత అన్నీ కలిపి మెత్తగా పొడి చేసుకుని పెట్టుకోవాలి. బియ్యాన్ని కడిగి మూడున్నర కప్పుల నీళ్లు పోసి పొడిపొడిగా అన్నం వండి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద కడాయిని పెట్టి నూనె వేయాలి. అది వేడెక్కాక ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు, పల్లీలు వేయించుకోవాలి. తరువాత ఇంగువ, కరివేపాకు, మామిడికాయ తురుము, తగినంత ఉప్పు కూడా వేసి వేయించుకుని రెండు నిమిషాలు అయ్యాక స్టౌని కట్టేయాలి. ఈ తాలింపుతో పాటు రెండు చెంచాల మసాలా పొడిని అన్నంపైన వేసి అన్నింటినీ కలిపితే చాలు.. మామిడికాయ పులియోదరై సిద్ధం!.
Review ‘ఆహా’రం.