మనలో చాలా మందికి వ్యాయామం అంటే కొన్ని అపోహలు ఉన్నాయి. లావుగా ఉన్న వాళ్ళే వ్యాయామం చెయ్యాలని లేదా లావుగా ఉన్న వాళ్ళు గంటల తరబడి వ్యాయామం చెయ్యకూడదని, లేదా చెయ్యాలని, సన్నగా ఉన్న వాళ్లు అసలు వ్యాయామం జోలికి పోకూడదని.. ఇలా రకరకాల అపోహలు వ్యాప్తిలో ఉన్నాయి. అయితే, ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. మన శరీర నిర్మాణాన్ని, ఫిజియాలజీని అనుసరించి మాత్రమే మనం వ్యాయామాన్ని నిర్ణయించుకోవాలి. పై విషయానికే వద్దాం. లావుగా ఉన్నవాళ్ళు ఎక్కువ వ్యాయామం చెయ్యాలనేది తప్పు ఆలోచన. లావుగా ఉన్నంత మాత్రాన అంతలావు శ్రమ అవసరం లేదంటుంది సైన్సు. నిజానికి లావుగా ఉన్నవాళ్ళు చిన్న చిన్న తేలికపాటి వ్యాయామాన్ని ఎక్కువ సేపు చేయాలి. ఇలా చేసినపుడు మాత్రమే వాళ్ళ శరీరంలోని మెటబాలిజం మార్పు చెంది వాళ్ళ కొవ్వు శాతం కరుగుతుంది. రీసెర్చ్ ఏం చెబుతుందంటే తొందర తొందరగా కష్టపడి పనిచేసే వ్యాయామాల వలన మన శరీరంలోని కార్బొహై డ్రేట్స్ (పిండి పదార్ధాలు) మాత్రమే కరుగుతాయి. నెమ్మదిగా, ఎక్కువసేపు చేసే వ్యాయామం మాత్రమే కొవ్వును కరిగించగలదు.
అదే విధంగా పైన చెప్పినట్టుగానే ‘అధికస్య అధికం ఫలం’ అన్నట్టుగా ఎంత చెమటపడితే అంత మంచిది. ఎంతగా శరీరాన్ని కష్టపెట్టి వ్యా యామం చేస్తే అంత మంచిది అనే అపోహ కూడా మనలో ఉంది. మన శరీరం నుంచి ఎక్కువగా జీవశక్తిని ఉపయోగించేలా చేసే అధిక శ్రమ కలిగించే వ్యాయామం వలన మన శరీరాన్ని చాలా ఇబ్బందులకి గురిచేసిన వాళ్ళమవుతాం. అవి చిన్న చిన్న కండరాల నొప్పుల దగ్గర నుంచి అతి ప్రమాదకరమైన గుండెపోటు కావచ్చు. కాబట్టి అధికంగా శ్రమపడి చేసే శరీరాన్ని ‘స్ట్రెస్’కి గురిచేసే వ్యాయామాలు మంచివి కావనే చెప్పొచ్చు. దాన్ని ఎంత దూరంగా ఉంచితే అంత మేలు. మనం చేసే వ్యాయామం మనకి ఆరోగ్యంతోపాటు ఆనందాన్ని కలుగచేయాలి. అలా అని ఎప్పుడూ ఏదో తప్పనిసరి కార్యక్రమంలా ఉండకూడదు. చాలామంది చదువు కున్న వాళ్ళల్లోనూ, మేధావులలో కూడా వ్యాయామం అనగానే శరీరాన్ని కష్టపెట్టాలి. చెమటలు పట్టాలి అనే అభిప్రాయం ఉంది. వ్యాయామం అనేది ఉల్లాసకరమైన పనిలా ఉండాలి. చిన్న పిల్లలు బంతి కోసం ఎలా బోసినవ్వులతో పరుగెడతారో అలాంటి ఉత్సాహం మనలో వ్యాయామం చేస్తున్నప్పుడు కలగాలి. శరీరాన్ని, మనసుని కష్టపెడుతూ చేసేది వ్యాయామం కాదు. మనుషులందరూ మైండ్-బాడీ సిస్టమ్‍లుగా గుర్తుపెట్టుకోండి. ఒక దానికోసం చేసే పని రెండో దాన్ని కష్టపెట్ట కూడదు. అందుకే పతంజలి యోగాసనాల గురించి వ్యాఖ్యానిస్తూ ‘స్థిర సుఖమాసనం’ అంటాడు. ఏ శారీరక పక్రియ స్థిరంగా ఉండి మనసుకి, శరీరానికి సుఖాన్ని కలిగిస్తుందో అదే ఆసనం అంటాడు. కాబట్టి మనం వ్యాయామం ఎప్పుడు చేసినా ‘నో పెయిన్ నో గెయిన్’గా ఉండాలి.
అదే విధంగా అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి చేసే వ్యాయామంతో పాటుగా గుర్తు పెట్టుకోవాల్సింది ఇంకొకటి ఉంది. వ్యాయామం చేసేటప్పుడు దానితో పాటుగా చాలా తక్కువ తినాలి అని, ఇది కూడా తప్పుడు అభిప్రాయమే. ఎందుకంటే ఎప్పుడయితే మీరు తక్కువగా తినడం మొదలు పెట్టారో శరీరంలోని సహజ ధర్మం, మీ ఫిజియాలజీలో మార్పులు తీసుకువస్తుంది. అది ఏమిటంటే ఎప్పుడైతే శరీరానికి ఆహారం దొరకదో అప్పుడు మన శరీరంలోని మెటబాలిక్ రేట్ తగ్గుతుంది. ఇది శరీరానికి ఒక ప్రొటెక్టివ్ మెకానిజమ్- కరువులు- ఆహారం దొరక్క పోవడం వంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన శరీరం మిగతా శరీర పక్రియల్ని తగ్గించుకుని శరీరాన్ని కొన్నాళ్ళు ఆహారం లేకపోయినా గడపగలిగేలా మనలో ఒక ఏర్పాటు ఉంది. దీనికి మంచి ఉదాహరణ… వేసవిలో కప్పలు రాళ్ళ మధ్యలో దాగి ఉండి వర్షాకాలం వచ్చే వరకు వేచి ఉంటాయి. ఈ సమయంలో వాటి యొక్క మెటబాలిక్ రేట్ తగ్గి అవి జీవించడానికి ఉపయోగపడతాయి. దీనినే హైబర్నేషన్ అంటారు. మనం తక్కువగా తినేటప్పటికి ఈ పక్రియ మొదలవుతుంది. తిరిగి మన మెటబాలిక్ రేట్ పెరిగే సరికి బరువు తగ్గడం ఆగిపోయి, బరువు పెరిగే అవకాశం ఉంటుంది.
మనం ఎప్పుడైతే వ్యాయామం చెయ్యడం మొదలు పెడతామో మనం మన శరీరానికి ఒక చక్కటి సందేశాన్ని పంపిస్తున్నామన్నమాట. అది ఏమిటంటే మనం ఈ రోజు నుంచి ఉత్సాహంగా ఉండబోతున్నాం. మరింత ఉల్లాసంగా ఉండబోతున్నాం. అంతే కాకుండా మరింత శక్తివంతంగాఉండబోతున్నామని మనం మన శరీర వ్యాయామం వలన వీలైనంత శక్తిని కూడ గట్టుకుంటున్నాం అనేది తెలుసుకోవాలి. ఇలా మీకు మీరు చెప్పుకుని మొదలు పెట్టడం వలన మీ శరీరం యొక్క ఫిజియాలజీ తన మార్పుల్ని తను చేసుకుంటుంది. మీ శరీరతత్వాన్ని బట్టి ఎంత కొవ్వుని కరిగించాలి. లేదా ఎంత శక్తిని వినియోగించిన తర్వాత మళ్ళీ మీ రక్తంలోని షుగర్ లెవెల్స్ని మార్పు చెందించా లనే విషయం. ఇది ఒకింత సంక్లిష్టమైన చర్య. ఇలా మన శరీరాన్ని, మనసుని సరి చేసుకుని మన ఆహారపు అలవాట్లని కూడా సరిచూసుకుని వ్యాయామం మొదలు పెడితే మన శరీరంలోని కొవ్వు శాతం మెల్లగా కరగడం మొదలై మనకి కావలసిన శక్తిని ఇవ్వడం జరుగుతుంది. ఈ మార్పుని మీరు చాలా సులభంగానే గుర్తిస్తారు. మీలో మార్పు ఎలా కనిపిస్తుందని కాకుండా మనం ఎలా ఫీలవుతున్నామనే దాంట్లో కూడా తేడా గమనించండి.
ఇంకా మనం వ్యాయామం చేసేటప్పుడు గమనించాల్సింది ఇంకొకటి ఉంది. మనం వ్యాయామం చేసేటప్పుడు ‘మన శరీరంలోని ఫిజియాలజీలో జరిగే ముఖ్యమైన మార్పుల్ని గమనించినట్లయితే’ వ్యాయామం వలన మన శరీరంలో కొవ్వు కరగడం మొదలవుతుంది. కాబట్టి మనం చేసే వ్యాయామం కేవలం ఈ కొవ్వు కరిగించడానికి మాత్రమే ఉపయోగపడేదిలా ఉండాలి. అంతేకాని మన ఇతర మార్పుల్ని ముఖ్యంగా నెర్వస్ సిస్టంపై ఒత్తిడి తీసుకుని రాకూడదు. దీని వలన మన ఫిజియాలజీలో సమతుల్యత దెబ్బతింటుంది. అందుకే మనం చేసే ఏ వ్యాయామం అయి నా ‘న్యూరోమస్క్యులర్ ఇంటిగ్రేషన్’ కల్గించేదిగా ఉండాలి. ఈ సమతుల్యత ఉంటూ వ్యాయామం చెయ్యడం వలన మన ఆరోగ్యానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఇదే యోగ సంప్రదాయంలో జరిగేది. యోగాలో చెప్పిన వ్యాయామం న్యూరో మస్క్యులర్, న్యూరో రెస్పిరేటరీ వ్యాయామాలని వర్ణించారు.
నేడు ఆధునిక కాలంలో మరెన్నో సుఖవంతమైన, సౌలభ్యకరమైన వ్యాయామాలు చేయగల అవకాశం ఉంది. తేలికపాటి వ్యాయామాలతోనే ఆరోగ్యాన్ని పొందే పద్ధతులు, విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ఎవరి శరీరతత్వానికి తగినట్టు వారు తగిన వ్యాయామాన్ని ఎంచుకోవచ్చు. •
Review కసరత్తు మంచిదేగా.