క్యాన్సర్‍.. టేక్‍ కేర్‍

మానవ జీవితంలో ఒకప్పుడు పెనవేసుకునిపోయిన
చెట్టు ఏదైనా ఉందంటే.. అది వేప చెట్టు. పొద్దుటే లేవగానే
పళ్లు తోముకోవడానికి వేప పుళ్ల.. మధ్యాహ్నం కాసేపు నడుం వాల్చడానికి పెరట్లో వేపచెట్టు నీడ.. పిల్లలకు అమ్మవారు సోకితే వేపాకు పడక.. ఇంటి నిర్మాణానికి వేప.. ఊళ్లోని పెద్దలు పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకోవడానికి వేపచెట్టు కింద రచ్చబండ.. ఇలా రోజువారీ కృత్యాల్లో ఈ చెట్టుతో మనిషిది విడదీయరాని బంధం.
మరి ఇప్పుడో..!?
పండక్కో పబ్బానికో ఇంటి గుమ్మానికి రెండు వేపరెబ్బలు కట్టుకోవడానికి మాత్రమే పరిమితమైంది. ఇక ఉగాది వస్తే పచ్చడిలో కాసిన్ని వేపపూలు వేసుకుంటున్నాం. ఇంతేనా ఈ చెట్టు అవసరం? ఇంకేమీ లేదా? అంటే చాలా ఉందంటున్నారు పర్యావరణ నిపుణులు. ఇప్పుడున్న వేపచెట్లకు రెట్టింపు ఉంటే కానీ భవిష్యత్తులో మన అవసరాలు తీరవని చెబుతున్నారు. ఎందుకంటే ఇది ఔషధ వృక్షం. కొంచెం రూపం మార్చుకుని వేర్వేరు రూపాల్లో ఇది ఇప్పుడూ మన నిత్య జీవితంలో భాగమైపోతోంది. ఉగాది వేళ మాత్రమే మనం పలవరిస్తున్న వేప.. ఔషధపరంగా ఎంత ప్రాముఖ్యం గలదో, దీని ఆరోగ్య ప్రయో•నాలేమిటో తెలిపే శీర్షిక ఇది..

ఆయుర్వేదంలో వేపచెట్టును సర్వరోగ నివారిణిగా పరిగణిస్తారు. పగటి పూట వేపచెట్టు నీడన విశ్రమించే వారు ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవిస్తారని ‘చరకసంహిత’ చెబుతోంది.
సిద్ధవైద్యంలోనూ వేపచెట్టు ప్రస్తావన ఉంది.
చెన్నైలోని సెంటర్‍ ఫర్‍ ట్రెడిషనల్‍ మెడిసిన్‍ ండ్‍ రిసెర్చ్ లైబ్రరీలో భద్రపరిచిన దాదాపు 400 ఏళ్ల నాటి తాళపత్ర గ్రంథంలో వేప ఔషధ గుణాల గురించి ఉంది.
నకుల సహదేవులు తమ గుర్రాల గాయాలను మాన్పడానికి వేప గింజల నూనె, వేపాకు రసాన్నీ వాడేవారని మహాభారతంలో ఉంది.
‘ఉపవన వినోద’ అనే సంస్క•త గ్రంథం నేలకీ, పంటలకీ, పశువులకీ వేప ంత మేలు చేస్తుందో చెబుతుంది.
కౌటిల్యుడి అర్థశాస్త్రంలోనూ, వరాహమిహిరుడి బృహత్‍ సంహితలోనూ వేప ఔషధ గుణాల గురించి ప్రస్తావన ఉంది.
యునానీ వైద్యులు వేపచెట్టును ‘బ్లెస్డ్ ట్రీ’ అంటారు.
ఐదు వేల ఏళ్ల నాటి సింధు నాగరికత అవశేషాల్లోనూ వేపగింజలను మందులుగా వాడిన ఆనవాళ్లు వెలుగుచూశాయి.
ఇప్పుడంటే కొబ్బరిచెట్టును కలియుగ కల్పవృక్షం అంటున్నారు కానీ, ఒకప్పుడు కల్పవృక్షం అంటే వేపచెట్టే అంటున్నాయి కొన్ని గ్రంథాలు. తన పచ్చదనంతో పరిసరాలను ఆహ్లాదంగా మారుస్తూ, నీడనిస్తూ, సేదదీరుస్తూ, ఆరోగ్యాన్నిస్తూ చివరికి ఎండి రాలిపోయిన ఆకులు, పండ్లతో నేలను పోషకభరితం చేస్తూ అణువణువూ పరోపకారానికే ఉపయోగపడుతుందనీ, అందుకే అసలైన కల్పవృక్షం వేపేనని అంటారు.
వేప శాస్త్రీయ నామం- అజాడిరక్టా ఇండికా. మహాగని కుటుంబంలోని ‘మెలియేసీ’ జాతికి చెందిన దీన్ని ‘ఇండియన్‍ లిలాక్‍’ అనీ అంటారు. సంస్క•తంలో ‘నింబ’ అనీ, ఆఫ్రికా భాషలో ‘మార్వోబైని’ అనీ పిలుస్తారు. మార్వోబైని అంటే ‘నలభై చెట్టు’ అని అర్థం. అంటే నలభై రకాల వ్యాధుల్ని నయం చేస్తుందని దాన్నలా పిలుస్తారట.
మన దేశంలో వేపచెట్టు తొలి నుంచీ మన జీవన విధానంలో భాగమైంది. పల్లెటూళ్లలో కాస్త ఖాళీ స్థలం ఉంటే వేపమొక్క పెంచే వారు. టూత్‍బ్రష్‍లూ, పేస్టులూ రాకముందు పళ్లు తోముకోవడానికి వేపపుల్లే వాడేవారు. పల్లెటూళ్లలో కొందరు ఇప్పటికీ దంతధావనానికి వేపపుల్లలనే వాడుతుండగా, నగరాల్లో ‘నీమ్‍ చ్యూ స్టిక్స్’ ఆధునికులను ఆకట్టుకుంటున్నాయి.
వేపచెట్టు కింద స్వచ్ఛమైన గాలి వీస్తుంది. ఇది ఆరోగ్యానికెంతో మంచిది. మండుటెండల్లోనూ ఈ చెట్టు నీడ దొరికితే చాలు హాయిగా కునుకు తీస్తారు శ్రామికులు, కర్షకులు. ప్రకృతిలో ఉండే చాలా మొక్కలకు, చెట్లకు ఔషధ గుణాలుంటాయి. అయితే వాటన్నిటికీ తలమానికంలాంటిది వేప. ఆయుర్వేదం, యునాని, హోమియోపతి మందుల్లో వేప సంబంధిత పదార్థాలు ఎక్కువగా వాడతారు. వేపచెట్టులోని వివిధ భాగాల నుంచి 140కిపైగా రకాల రసాయన సంయోగాలను తీయగలిగారు. ఆకులు, పువ్వులు, పండ్లు, విత్తనాలు, కాండం, వేళ్లు.. ఇలా వేపలోని అన్ని భాగాలూ వేర్వేరు ఆరోగ్య సమస్యలకు ఔషధాలుగా ఉపయోగపడతాయి. ఇన్‍ఫ్లమమేషన్‍, ఇన్‍ఫెక్షన్లు, జ్వరాలు, చర్మవ్యాధులు, దంతవ్యాధులు.. అన్నింటికీ వేప మంచి మందుగా పనికొస్తుంది. వాయు, నీటి కాలుష్యాలనూ, వేడినీ తట్టుకుని నిలిచే ఈ చెట్టు నేల సారాన్నీ కాపాడుతుంది.
వేపా.. అమ్మో చేదు అనొద్దు..
వేప అనగానే వెంటనే గుర్తొచ్చేది దాని చేదు రుచి. ఘాటు వాసన కూడా భరించలేం. అలా అని వేప ప్రయోజనాలకు దూరం కానవసరం లేదు. అద్భుతమైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. నిత్యం వాడుకోవడానికి పనికొచ్చే వేప ఉత్పత్తులు ఎన్నో మార్కెట్లో లభిస్తున్నాయి.
సబ్బులు, ఫేస్‍వాష్‍లు, ముఖానికి వేసుకునే ప్యాక్‍లు, వేపాకు పొడి, వేపాకు రసం, వేపపువ్వుల నీరు, వేపగింజల నూనె, పందుం పుల్లలూ, టంగ్‍ క్లీనర్లూ, వేప టూత్‍ పేస్టు, మౌత్‍ వాష్‍, వేప బెరడు పొడి, వేప బెరడుతో చేసిన దువ్వెనలు, టూత్‍ బ్రష్‍లు, ఇంటిని శుభ్రం చేసుకునే క్లీనర్లూ, పెంపుడు జంతువులకు వాడే షాంపూలు.. ఇలా ఎన్నో ఉత్పత్తులు ఇప్పుడు రెడీమేడ్‍గా మార్కెట్లో దొరుకుతున్నాయి. ఘాటైన వాసన లేకుండానే వేప ప్రయోజనాలను ఇవి అందిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేసే నీమ్‍ క్యాప్సూల్స్ కూడా దొరుకుతున్నాయి.
దివ్యౌషధం.. వేప తేనె
కిలో 3 వేల రూపాయలపైనే ధర పలికే వేప తేనె గురించి విన్నారా? ఈ తేనెను తేనెటీగలు అచ్చంగా వేపపువ్వుల మకరందం తాగి తయారు చేస్తాయి. చిక్కటి రంగులో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్‍ గుణాలతో ఉండే ఈ తేనెను ఆయుర్వేదంలో విరివిగా వాడతారు. రోగనిరోధక శక్తిని పెంచడమే కాక, బీపీ, షుగరూ, ఎలర్జీలు, అల్సర్లూ, గొంతు ఇన్ఫెక్షన్లూ, అజీర్తి, చర్మ సమస్యలతో బాధపడే వారికిది మంచి ఔషధంలా పనిచేస్తుంది.
తినగ.. తినగ వేప తీయన
తినగ తినగ వేము తీయన అని వేమన అన్నాడు. కానీ అంతగా ఇబ్బంది పడకుండానే తీయగా ఉండే వేప కూడా ఉందంటోంది వరల్డ్ నీమ్‍ ఆర్గనైజేషన్‍. పశ్చిమబెంగాల్‍లోని హౌరా జిల్లాలోనూ, కర్ణాటకలోని బెల్గామ్‍లోనూ ఈ తీపి రకం వేప చెట్లు ఉన్నాయట. ఈ చెట్ల ఆకులూ, పండ్లూ తీయగా ఉన్నా ఔషధ గుణాలకేమీ లోటు ఉండదట. అలాగే ఊదా రంగు పువ్వులు పూసే వేప రకం కూడా ఉంది. కొత్త కొత్త రకాల మొక్కలకు పేరొందిన మన ఆంధప్రదేశ్‍లోని కడియం నర్సరీకి వెళ్తే నల్ల వేప, ఆకుల మీద తెల్లని మచ్చలతో క్రోటన్‍ మొక్కలా కనిపించే వేప రకాలు కూడా కనిపిస్తాయి. వీటిని పెరటి తోటలోనూ, బాల్కనీ కుండీల్లోనూ కూడా పెంచుకోవచ్చు. కమ్మని ఆ వాసనను నిత్యం ఆఘ్రాణించవచ్చు.
అవగాహన పెరగాలి..
చాలా దేశాలు వేపచెట్టును ఔషధ గుణాలు కలిగినదిగా గుర్తించినా.. ఇంకా కొన్ని దేశాలు కలుపు మొక్కగానే భావిస్తున్నాయి. 1992లో వాషింగ్టన్‍లోని నేషనల్‍ అకాడెమీస్‍ ప్రెస్‍ ప్రచురించి ‘నీమ్‍- ఏ ట్రీ ఫర్‍ సాల్వింగ్‍ గ్లోబల్‍ ప్రాబ్లమ్స్’ లాంటి పుస్తకాలూ, వరల్డ్ నీమ్‍ ఆర్గనైజేషన్‍, నీమ్‍ ఫౌండేషన్‍ లాంటి సంస్థలూ వేపచెట్టు ప్రాధాన్యం గురించి ఆధునిక తరాలకు తెలిసేలా చేశాయి.. చేస్తున్నాయి. మనం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకి వేప రూపంలో సహజసిద్ధమైన పరిష్కారాలు ఉన్నాయని, వాటిని వదిలేసి రసాయనాల వెంట వెళ్లడం అనర్థదాయకమని చెబుతున్నాయీ సంస్థలు.
వేపగింజలతో ఉపాధి
ఛత్తీస్‍గఢ్‍లోని కొన్ని వేల మంది మహిళలు వేపగింజలతో ఉపాధి పొందుతున్నారు. చెట్ల నుంచి రాలిన కాయల్ని ఏరి, వాటిని ఎండబెడతారు. మరి కొన్ని బృందాలు ఆ పండ్ల నుంచి గింజలను వేరుచేసి నూనె తీసే బాధ్యత చేపడతారు. లీటరు నూనెను రూ.250 చొప్పున విక్రయించడం ద్వారా ఉపాధి పొందుతున్నారు. నూనె తీయగా వచ్చిన వ్యర్థాలను కూడా పిడకలుగా మార్చి ఎరువుగా అమ్ముతారు. ఇన్నాళ్లూ వేపాకు, పూత మాత్రమే పనికి వస్తాయనుకున్నాం కానీ పండ్లు ఎందుకూ పనికిరావని చెత్తలో పారబోసే వాళ్లమనీ, ఇప్పుడవే తమకు ఉపాధి కల్పిస్తున్నాయని అంటున్నారీ మహిళలు. ఛత్తీస్‍గఢ్‍లో ఇలా దాదాపు 16 వేల వేపచెట్లను గుర్తించి వాటి బాధ్యతను చూసే మహిళలంతా గ్రీన్‍ ఆర్మీగా ఏర్పడ్డారు. ఆ చెట్లనే జీవనాధారంగా మలుచుకుని ఉపాధి పొందుతున్నారు.

వేప.. ఔషధ గుణాల గుళిక
• వేపాకుల్లో యాంటీ ఇన్‍ఫ్లమేటరీ, యాంటీ హైపర్‍ గ్లైసెమిక్‍, యాంటీ అల్సర్‍, యాంటీ మలేరియల్‍, యాంటీ ఫంగల్‍, యాంటీ బ్యాక్టీరియల్‍, యాంటీ వైరల్‍, యాంటీ ఆక్సిడెంట్‍, యాంటీ మ్యుటాజెనిక్‍, యాంటీ కార్సినోజెనిక్‍ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే పిల్లలకు చికెన్‍పాక్స్, మీజిల్స్ వంటి జ్వరాలు వచ్చినపుడు పక్క మీద వేపాకు పరుస్తారు.
• బియ్యం పురుగు పట్టకుండా నిల్వ చేసే డబ్బాలో వేపాకులు వేయడం చాలాచోట్ల ఇప్పటికీ ఉంది.
• వేపాకు పసరును పాములూ, కీటకాల కాటుకి మందుగా వాడేవారు.
• కొన్నిచోట్ల వేపాకు, పువ్వుల పచ్చడిని ఊరగాయలా చేసుకుంటారు.
• వేపాకు ఎండబెట్టి చేసే టీ తాగితే గొంతునొప్పి, జలుబు, అజీర్తి వంటి సమస్యలు రావని ఆఫ్రికన్ల నమ్మకం.
• వేపరెమ్మల్లో ఆల్కలాయిడ్స్, రెసిన్స్, గమ్‍, ఫ్లోరైడ్‍, సల్ఫర్‍, టానిన్స్, ఆయిల్స్, సపోనిన్స్, ఫ్లేవనాయిడ్స్, స్టెరాల్స్, కాల్షియం వంటివి పుష్కలంగా ఉంటాయి. మేకలకే కాకుండా ఇతర పాడి జంతువులకూ వేపాకు మంచి పౌష్టికాహారం.
• వేపగింజలు ఫ్యాటీ ఆసిడ్స్, ప్రొటీన్స్కు మంచి వనరు. వేపగింజల నుంచి తీసిన నూనె చేదుగా, గాఢమైన వాసనతో ఉంటుంది. దీన్నే మార్గోసా నూనె అంటారు. సహజమైన క్రిమిసంహారిణిగా పనిచేసే దీనిని ఒకప్పుడు పంటల మీదే వాడేవారు. 350 రకాల క్రిమికీటకాలు, మరెన్నో జాతుల ఫంగస్‍లూ వేప వాసన తట్టుకోలేవని తేలింది.
• వేప నూనె నేరుగా క్రిములను సంహరించదు. రిపెలెంట్‍గా పని చేస్తుంది. క్రిముల హార్మోన్ల మీద ప్రభావం చూపి వాటి గుడ్లు పెట్టే శక్తినీ, ఆహారాన్ని జీర్ణం చేసుకునే సామర్థ్యాన్ని హరిస్తుంది. దాంతో సహజంగానే అవి నశిస్తాయి. వాటి వల్ల పంటలకు నష్టం జరగదు.
• వేపనూనె వల్ల క్యాన్సర్‍ కణాలు చనిపోతాయని ఎలుకలపై చేసిన ప్రయోగంలో రుజువైంది. ప్రొస్టేట్‍ క్యాన్సర్‍ కణాల పెరుగుదల తగ్గిపోతుందని మరో పరిశోధనలో తేలింది.
• వేపచెట్టు బెరడును కషాయంగా కాచి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. చర్మవ్యాధులు నయమవుతాయి. బెరడు, ఆకులను కొబ్బరినూనెలో వేసి, నీటిని కలిపి మరిగించి తలకు పట్టిస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.
• చెంచాడు వేపాకు రసానికి అరచెంచా తేనె చేర్చి తాగితే నులిపురుగులను నివారించవచ్చట.
• మామూలు పుండ్లు, మచ్చలే కాక కుష్టువ్యాధిలో వచ్చే పుండ్లకూ వేప చక్కని ఔషధం.
• గులాబీ పువ్వులతో చేసినట్టు వేపపువ్వులతోనూ గుల్కంద్‍ అనే పదార్థాన్ని తయారుచేస్తారు. దీనిని తినవచ్చు.
• మధుమేహం, అతిమూత్ర వ్యాధి.. ఇలా అన్నిటికీ వేపతో చికిత్సలు ఉన్నాయి. వేపకు చెందిన అన్ని ఉత్పత్తులనూ లోపలికి తీసుకోవచ్చు లేదా పైపూతగానూ వాడొచ్చు.
• మనుషుల ఆరోగ్యానికే కాదు.. పంటల ఆరోగ్యంలోనూ వేప కీలకపాత్ర పోషిస్తోంది. ఎరువులు, క్రిమిసంహారక పరిశ్రమల్లో దీనికి డిమాండ్‍ ఎక్కువ. వేప ఉత్పత్తుల్ని జీవ ఎరువుగా, జీవ పురుగుమందులుగా వాడుతున్నారు. దాదాపు వంద రకాల ఫెస్టిసైడ్స్లో దీన్ని చేరుస్తున్నారు. వేపాకులు, గింజలు, బెరడు, పువ్వుల నుంచి తయారు చేసే ఉత్పత్తుల్ని ‘నీమ్‍ ఎక్స్ట్రాక్ట్’ అంటున్నారు. ప్రపంచంలో ఇప్పుడు వీటి విలువ దాదాపు 20 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.

వేపచెట్టుకీ ఓ రోజుంది
వేపచెట్టుకు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని దానికి ఒక రోజును కూడా కేటాయించారు.
చైత్ర మాసంలోని తొలి రోజు, అంటే ఉగాది నాడే ‘వరల్డ్ నీమ్‍ డే’ నిర్వహిస్తున్నారు.
వేప పువ్వుతో ఉగాది పచ్చడి చేసుకోవడం తెలుగు వారికి ఆనవాయితీ అయినట్టే అదే రోజున గుడి పడ్వా పండుగ చేసుకునే మహారాష్ట్ర, కొంకణి ప్రాంతవాసులకు వేపాకు నమిలి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం ఆనవాయితీ. లేత వేప రెమ్మలతో గుమ్మాలకు తోరణాలు కట్టి కుటుంబసభ్యులంతా ఆనాడు వేపాకు తింటారు.
మన సంస్క•తిలో భాగమైన వేపకు ఉన్న అద్భుత శక్తుల గురించి, దాని ఔషధ గుణాల గురించి అందరికీ తెలియ చేయాలని, వేపచెట్లను పెంచడం ద్వారా దేశ సౌభాగ్యానికి పాటుపడాలని భావించిన కొందరు ‘నీమ్‍ ఫౌండేషన్‍’ పేరుతో 1993లో లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు. ప్రభుత్వాలూ ఆ దిశగా కృషి చేసేలా చూడటం ఈ సంస్థ ఆశయం. ఈ సంస్థ ఆధ్వర్యంలోనే మొట్టమొదటి ప్రపంచ వేప సదస్సు జరిగింది.
వేప గురించి పరిశోధన చేసి, వేప ప్రయోజనాలపై ప్రచారం చేసే వ్యక్తులు, సంస్థలకు తోడ్పాటు అందిస్తూ నాలుగు ప్రపంచ స్థాయి సదస్సులను ఇప్పటి వరకు నీమ్‍ ఫౌండేషన్‍ నిర్వహించింది. పర్యావరణ, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపగల శక్తి ఒక్క వేపచెట్టుకే ఉందని అంటోందీ సంస్థ.

Review క్యాన్సర్‍.. టేక్‍ కేర్‍.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top