చీకట్లను చీల్చి వెలుగును పంచే పర్వం- దీపావళి.
చెడుపై గెలిచిన మంచికి సంకేతం- దీపావళి.
పండుగంటే కొత్తబట్టలు.. ఘుమఘుమలాడే పిండివంటలు.. ఇవన్నీ అన్ని పండుగల్లోనూ ఉండేవే. కానీ వెలుగుల వేడుక దీపావళి ప్రత్యేకతే వేరు. ఈ పర్వదిన సందర్భాన ప్రత్యేక ఆకర్షణగా నిలిచేవి వెలుగులు విరజిమ్మే దీపాలూ.. కాంతులు చిందించే టపాసులే. అందుకే దీపావళి నాడు వాడేందుకు వీలుగా రూపుదిద్దుకునే దీపపు కుందులు, టపాసులు ఏటేటా కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. మార్కెట్లో ఎన్నో వెరైటీలు దొరుకుతున్నాయి. ఒకవైపు దీపాలన్నీ నోరూరిస్తూ వెలిగిపోతుంటే .. మరోవైపు జిగేల్ మెరుపులతో చప్పుడు చేసే టపాసులు ఇంటికొచ్చే అతిథుల నోటినీ తీపి చేస్తున్నాయి. అదేంటి..? టపాసులు, దీపాలు నోరూరించడం.. నోరు తీపి చేయడం ఏమిటని అనుకుంటున్నారా? అయితే ఆ దీపావళి ముచ్చట్లు మీ కోసమే..
కేకూ, బిస్కెట్, బ్రెడ్డూ.. తినడానికి కాదు!
దీపావళి అంటేనే దీపోత్సవం. దేవుడి ఎదుట, ఇంటి చుట్టూ, ద్వారాల వద్ద.. ఇల్లంతటినీ దీపాల వెలుగులతో ముస్తాబు చేస్తాం. దీపం వెలిగిస్తే ప్రమిద పెట్టి.. వత్తులేసి.. ప్రతిసారీ నూనె పోస్తూ ఓ కంట కనిపెడుతుండాలి. దీంతో ప్రస్తుతం చాలామంది కాస్త సౌకర్యంగా ఉండే కొవొత్తుల్ని ఎంచుకుంటున్నారు. అందుకోసమే మార్కెట్లో ఎన్నో రకాల కొవ్వొత్తులు లభిస్తున్నాయి. అలంకరణపరంగానే కాదు.. రూపంలోనూ ఆకట్టుకునేలా వెరైటీగా ఉండాలనుకుంటే రియలిస్టిక్ ఫుడ్ క్యాండిల్స్ ప్రయత్నించొచ్చు. ఈ పేరుతో లభించే కొవ్వొత్తులు మనం తినే అనేక రకాల ఆహార పదార్థాల ఆకారాల్లో లభిస్తున్నాయి. రస్‍మలై, మోతీచూర్ లడ్డూ, జాంగ్రీ, మైసూర్‍పాక్, కజ్జికాయ, జిలేబీ, గులాబ్‍జామూన్.. ఇలా తియ్యని మిఠాయిలు మొదలు సమోసా, ఇడ్లీ దాకా ఎన్నెన్నో తినుబండారాల క్యాండిల్స్ ఉన్నాయి. ఇంకా కేక్, ఐస్‍క్రీమ్, బిస్కెట్, బ్రెడ్డూ, పాప్‍కార్న్, పాస్తా, చిప్స్, పిజ్జా, బర్గర్, కూల్‍డ్రింక్, మిల్క్షేక్.. ఇలా మనసు కోరిన, మనకు నచ్చిన ప్రతి పదార్థం కొవ్వొత్తిలా దొరుకుతోంది. చూడ్డానికి అచ్చుగుద్దినట్టు ఆయా పదార్థాలనే పోలి ఉన్న వీటిని ఓ ప్లేట్‍లో ఉంచారంటే.. వచ్చిన అతిథులు రుచి చూద్దామని వాటి మీద ఓ చెయ్యేసినా ఆశ్యర్యం లేదు. ఇంకెందుకు ఆలస్యం? ఆన్‍లైన్‍లో అందుబాటులో ఉన్న నోరూరించే దీపాలతో ఈ దీపావళికి కొత్తందం తెచ్చేయండి.
వెలుగుల రంగవల్లి
నూనె పోసి వత్తి పెట్టి వెలిగించినపుడు దాని చుట్టూ రంగుల ముగ్గుతో వచ్చే త్రీడీ రిఫ్లెక్షన్ దీపాలు ఎంత ముచ్చటగా ఉంటాయో చెప్పనక్కర్లేదు. అసలు నూనే లేకుండా, నీళ్లు పోస్తే వెలిగే వాటర్ సెన్సర్ దీపాలూ ఎంత సౌకర్యంగా ఉంటాయో చూపనక్కర్లేదు. అయితే ఇప్పుడు ఈ రెండు దీపాలూ ఒకటిగా కలిసిపోయాయి. నీళ్లు పోస్తే వెలుగుతూనే చుట్టూ రంగుల ముగ్గునూ తీసుకొచ్చే ‘వాటర్ సెన్సర్ త్రీడీ రిఫ్లెక్షన్ దియా’లుగా ఇవి మార్కెట్లో దొరుకుతున్నాయి. రకరకాల డిజైన్లలో వస్తున్న వీటిని పూజ గది ఎదుట ఉంచారంటే వెలుగుల ముగ్గు పెట్టినట్టుగా ఎంత ముచ్చటగా ఉంటుందో!.
సోలార్ దీపం.. రాత్రంతా వెలుగు
పూజ గదిలో వెలిగించిన దీపం ఎక్కువసేపు వెలిగేలా చూడగలం. కానీ, బాల్కనీలోనో, తులసి కోట దగ్గరనో, బయట ద్వారానికి పక్కనో పెట్టే దీపాల విషయంలో అది కుదరదే. అలాంటప్పుడు కొత్తగా వచ్చిన సోలార్ బాస్కెట్ అఖండ దీపాన్ని ఎంచుకోవచ్చు. సౌరశక్తితో పనిచేసే ఎన్నెన్నో వస్తువులు వచ్చినట్టే ఇప్పుడు ఇలాంటి దీపాలూ దొరుకుతున్నాయి. దీపపు కుందులూ, ప్రమిదల్లాంటి ఆకారాల్లో పూజలో పెట్టుకునేలా ఉంటాయివి. సిల్వర్ కోటెడ్, ప్లాస్టిక్ పదార్థాలతో ఉండే వీటికి చిన్న సోలార్ ప్యానెల్ ఉంటుంది. దాని సాయంతోనే దీనిలోని ఎల్‍ఈడీ లైట్లు వెలుగుతాయి. పగటిపూట కాసేపు ఎండలో ఉంచితే చాలు, రాత్రిపూట ఎంచక్కా కాంతులీనుతాయీ దీపాలు.
మంత్రదీపం
దేవుడిని మనసారా వేడుకుంటూ ఈ దీపం బటన్ నొక్కగానే ఒకవైపు అది వెలుగుతూనే మరోవైపు ‘ఓం భూర్భువస్వ:’ అంటూ గాయత్రీ మంత్రాన్ని వినిపిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా! సూపర్ గాయత్రీ మంత్ర మ్యూజికల్ ఎలక్ట్రిక్ దియా అలాంటిదే. అంతేకాదు, ఎల్‍ఈడీ లైట్‍తో వెలిగే ఈ రీచార్జబుల్ దీపంలో మనకు నచ్చిన మంత్రాలనూ, మ్యూజిక్‍నూ రికార్డు చేసుకోవచ్చు కూడా. ప్రమిదలతో పాటు ఈ ఎలక్ట్రిక్ దీపాన్నీ పూజగదిలో చేర్చుకుంటే ప్రత్యేకంగా మరే ఇతర డివోషనల్ చాంటింగ్ బాక్సులూ పెట్టుకోనవసరం లేదు. ఇవి వెలుగుతున్నంతసేపూ మంత్రం వినిపిస్తూనే ఉంటుంది.
టపాసులే కానీ కాల్చలేం.. తినేయొచ్చు!
ఇంతకుముందు ఆహార పదార్థాల ఆకారాల్లోని కొవ్వొత్తుల గురించి తెలుసుకున్నాం కదా! ఇవి పూర్తి డిఫరెంట్. టపాసులే కానీ.. కాల్చలేం. ఎంచక్కా నమిలి మింగేయొచ్చు. పండుగను పురస్కరించుకుని ఆచరించే ప్రతి సందర్భంలోనూ ఆ ‘పండుగ’ ఫ్లేవర్‍ను చూపిస్తే ఆ ఆనందమే వేరు. అలాంటి ఆనందానికి ఈ తినే టపాసులు అద్దం పడతాయి. ఈ తినే బాణసంచాలో బోలెడన్ని వెరైటీలు ఉన్నాయి. ఫైర్ క్రాకర్ చాక్లెట్లు, కాకరపువ్వొత్తులు, లక్ష్మీబాంబులు, భూచక్రాలు, సీమ టపాకాయలు, రాకెట్లు.. ఇలా రకరకాల టపాసులు, బాణసంచా ఆకారంలో చాక్లెట్లను తయారు చేస్తున్నారు. ఇంకా కోకోనట్ లడ్డూ బాంబు, చాక్లెట్ బర్ఫీ క్రాకర్స్, గులాబ్ జామూన్ రాకెట్ పాప్స్, జిలేబీ ఫైర్‍వర్కస్ పేరుతో వివిధ ప్రాంతాల్లో స్వీటు దుకాణాల వాళ్లు క్రాకర్స్ మిఠాయిలూ అమ్ముతున్నారు. అందంగా అమర్చిన రకరకాల ఫైర్ క్రాకర్స్ చాక్లెట్ బాక్సులూ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇక, పిల్లలకు ఇంతకుమించిన వండర్ మరేదీ ఉండదు. నచ్చిన చాక్లెట్లను దీపావళి పండుగ వేళ టపాసుల ఆకారంలో ఉండటం.. వాటిని తినడం.. వాళ్లకు నిజంగా పండుగే. పిల్లలకే కాదు పండుగ పూట ఇంటికి వచ్చే అతిథులకూ మామూలు స్వీట్లు ఇవ్వడం కన్నా ఈ ఎడిబుల్ ఫైర్ క్రాకర్స్ను పంచారంటే కచ్చితంగా థ్రిల్ కావడం ఖాయం. అంతేకాదు, బాణసంచా కాల్చడం అంటే ఇష్టమున్నా.. వాటిని కాల్చడం వల్ల పర్యావరణానికి జరిగే నష్టాన్ని తెలిసి వాటికి దూరంగా ఉన్న వారికీ సరదాగా ఈ స్వీట్లను బహుమతిగా ఇవ్వచ్చు.
నూనె లేకుండానే కొంగొత్త కాంతులు
దీపావళి సాయంత్రం హోరున వీచే గాలి మధ్య దీపాలు వెలిగించడం అతివలకు పెద్ద ప్రయాస. ఒకపక్క గాలికి దీపాలు ఆరిపోకుండా చూసుకోవడం.. మరోపక్క ప్రమిదల్లో నూనె అయిపోతుంటే నింపడం.. ఇలాంటి ప్రయాస వద్దనుకుంటే వత్తి, జెల్ రూపంలోని మైనపు దీపాలు అందుబాటులో ఉన్నాయి. వీటితో చిటికెలో పని పూర్తవుతూనే, దీపారాధన చేసిన సంతృప్తీ కావాలనుకునే ఆధునిక మహిళలకు ఇవి ఓ వరం. అలాంటి వారి కోసం వచ్చినమే ఈ జెల్‍వ్యాక్స్ దీపాలు. చూడ్డానికి మామూలు మట్టి దీపాల్లానే కనిపించినా ఇందులోనే వత్తీ, జెల్ రూపంలోని మైనం ఉంటాయి. మనకు నచ్చిన చోట ఆ దీపాలను ఉంచి అందులో నూనెలాంటివేమీ పోయకుండానే వెలిగించవచ్చు. రంగుల డిజైన్లలోని ఈ వెరైటీ దీపాలు కచ్చితంగా పండుగలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
దసరా, దీపావళి జంట పర్వాల వేళ ఏం చేయాలనేది ఎప్పుడూ ప్రశ్నే. మొదట దసరా విషయానికి వస్తే.. అమ్మవారికి శక్తి కొద్దీ సమర్పించే నివేదనల్లో పాయసం, పొంగలి, పులిహోర వంటివి ఉండటం మామూలే. అవి కాకుండా కాస్త మార్పుగా కొత్త వంటకాలు చేయాలనుకున్నప్పుడు ఇలాంటివి ప్రయత్నిస్తే పండుగ పూట విందు పసందుగా ఉంటుంది. ప్రయత్నించి చూడండి.
క్యారెట్ గులాబ్‍జామూన్
కావాల్సినవి: కారెట్లు: మూడు, నెయ్యి: టేబుల్ స్పూన్, పాలు: కప్పు, బొంబాయి రవ్వ: రెండున్నర టేబుల్‍స్పూన్లు, పాలపొడి: అరకప్పు, చక్కెర: కప్పు, నీళ్లు: అరకప్పు, యాలకుల పొడి: అరచెంచా, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారు చేసే విధానం: • ఓ గిన్నెలో చక్కెర, నీళ్లుపోసి స్టవ్ మీద పెట్టాలి. చక్కెర కరిగి లేతపాకంలా తయారవుతున్నప్పుడు యాలకుల పొడి వేసి దింపేయాలి.
• ఇప్పుడు క్యారెట్లు చెక్కు తీసి ముక్కల్లా కోసి మిక్సీలో వేసుకుని వీలైనంత మెత్తగా చేసుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టి నెయ్యి వేసి క్యారెట్ మిశ్రమాన్ని బాగా వేయించి పాలు పోయాలి. • ఇది ఉడుకుతున్నప్పుడు బొంబాయిరవ్వ, పాలపొడి వేసి దగ్గరకు అయ్యే వరకూ కలిపి దింపేయాలి. ఈ మిశ్రమం చల్లారాక చిన్న చిన్న ఉండల్లా చేసుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. వేడి కాస్త చల్లారాక ఈ ఉండల్ని పాకంలో వేస్తే క్యారెట్ గులాబ్‍జామూన్ రెడీ.
మినప్పప్పు క్యాబేజీ వడ
కావాల్సినవి: మినప్పప్పు: ఒకటిన్నర కప్పు, పచ్చిమిర్చి: నాలుగు, అల్లం తురుము: టేబుల్‍స్పూన్, ఉప్పు: తగినంత, క్యాబేజీ తరుగు: కప్పు, కరివేపాకు రెబ్బలు: రెండు, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారీ విధానం ఇలా..• మినప్పప్పును నాలుగైదు గంటలు నానబెట్టాలి. తరువాత నీళ్లు పూర్తిగా వంపేసి గారెల పిండిలా మెత్తగా రుబ్బుకోవాలి.
• ఈ పిండిలో నూనె తప్ప మిగిలిన పదార్థాలు, సన్నగా తరిగిన పిచ్చిమిర్చి వేసి బాగా కలపాలి.• ఐదు నిమిషాలయ్యాక కాగుతున్న నూనెలో గారెల్లా వేస్తూ ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి.
కొబ్బరి పల్లీ బర్ఫీ
కావాల్సినవి:వేయించిన పల్లీలు: ఒకటిన్నర కప్పు, ఎండుకొబ్బరి పొడి: అరకప్పు, యాలకుల పొడి: అరచెంచా, పాలపొడి: రెండు టేబుల్‍స్పూన్లు, పాలు: ఒకటిన్నర కప్పు, చక్కెర: కప్పు, నెయ్యి: పావుకప్పు.
తయారీ విధానం ఇలా.. •పల్లీల పొట్టు తీసి పొడి చేసుకోవాలి. స్టవ్‍పై కడాయి పెట్టి నెయ్యి వేసి కొబ్బరిపొడిని వేయించుకోవాలి. • రెండు నిమిషాలయ్యాక ఇందులో పల్లీల పొడి, యాలకుల పొడి, పాలపొడి వేసి మరోసారి కలిపి పాలు పోయాలి. ఇది ఉడుకుతున్నప్పుడు చక్కెర వేయాలి.• ఈ మిశ్రమం బాగా ఉడికి దగ్గరకు అయ్యాక దింపేసి నెయ్యి రాసిన ప్లేటులో పరిచి వేడి చల్లారాక ముక్కల్లా కోయాలి.
పెసర చెక్కలు
కావాల్సినవి:
పెసరపప్పు: అరకప్పు, బొంబాయి రవ్వ: పావుకప్పు, వాము: అరచెంచా, ఉప్పు: తగినంత, పసుపు: పావు చెంచా, కసూరీమేథీ: అరచెంచా, వంటసోడా: చిటికెడు, గోధుమపిండి: పెద్దకప్పు, నెయ్యి: టేబుల్‍స్పూన్, కలోంజీ గింజలు: టేబుల్‍స్పూన్, నూనె: వేయించేందుకు సరిపడా.
తయారు చేసే విధానం: పెసరపప్పును గంటసేపు నానబెట్టుకుని ఆ తరువాత నీళ్లు వంపేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. • ఇందులో గోధుమపిండి, నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసుకుని బాగా కలపాలి. చివరగా గోధుమపిండి కూడా వేసి చపాతీపిండిలా చేసుకుని మూత పెట్టాలి. • పావుగంట అయ్యాక కాస్త పిండి తీసుకుని చపాతీలా ఒత్తి.. రోల్ మాదిరి చుట్టి ముక్కల్లా కోయాలి. ఈ ముక్కల్ని కాస్త వెడల్పుగా ఒత్తుకోవాలి. ఇలాగే మిగిలిన పిండినీ చేసుకోవాలి. • వీటిని కాగుతున్న నూనెలో నాలుగైదు చొప్పున వేసి వేయించుకుంటే చాలు.
దీపావళి అంటేనే దీపాల కాంతులు.. టపాసుల మోతలు.. మరి, వీటికి మిఠాయిలు, పిండివంటల జతకడితే ఆ పండుగ ఆనందమే వేరు. అందుకే ఈసారి దీపావళికి స్వీట్లను బయట కొనకుండా ఇంట్లోనే సింపుల్‍గా ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. మతాబుల మెరుపులకు, దీపాల వెలుగులకు మిఠాయిల రుచులను జోడించేయండిలా..
క్యారెట్ మాల్పువా
కావాల్సినవి: క్యారెట్లు: రెండు, పాలు: ఒకటిన్నర కప్పు, గోధుమపిండి: కప్పు, బొంబాయి రవ్వ: పావుకప్పు, యాలకుల పొడి: పావుచెంచా, సోంపు: అరచెంచా, చక్కెర: టేబుల్‍స్పూన్, క్రీమ్: రెండు టేబుల్ స్పూన్లు, నూనె: వేయించేందుకు సరిపడా.
పాకం కోసం:
చక్కెర: రెండు కప్పులు, యాలకులు: మూడు, ఆరెంజ్ ఫుడ్‍కలర్: చిటికెడు.
తయారు చేసే విధానం: • మిక్సీలో చెక్కుతీసిన క్యారెట్ ముక్కలు, అరకప్పు పాలు పోసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఇందులో గోధుమపిండి, బొంబాయి రవ్వ, యాలకుల పొడి, సోంపు, చక్కెర, క్రీమ్ కలపాలి. • ఇప్పుడు మిగిలిన పాలుపోస్తూ గరిటెజారుగా కలిపి అరగంట నాననివ్వాలి. ఈలోగా ఓ గిన్నెలో చక్కెర, యాలకులు, ఫుడ్‍కలర్ వేసుకుని, రెండు కప్పుల నీళ్లుపోసి స్టవ్ మీద పెట్టాలి. చక్కెర కరిగి పాకంలా మారుతున్నప్పుడు దింపేయాలి.• స్టవ్ మీద కడాయిని పెట్టి నూనె వేయాలి. ఇది వేడెక్కాక క్యారెట్ మిశ్రమాన్ని గరిటెతో తీసుకుని కాగుతున్న నూనెలో కొద్దిగా వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఈ మాల్పువాలను చక్కెర పాకంలో వేసి కాసేపయ్యాక ప్లేటులోకి తీసుకోవాలి.
మూంగ్‍దాల్ లడ్డు
కావాల్సినవి: పెసరప్పప్పు: కప్పు, చక్కెర పొడి: కప్పు, నెయ్యి: అరకప్పు, తాజా క్రీమ్: పావుకప్పు, యాలకుల పొడి: అరచెంచా, వేయించిన డైఫ్రూట్స్ పలుకులు: పావుకప్పు.
తయారీ విధానం ఇలా..
• పెసరపప్పును గంట ముందు నానబెట్టుకుని ఆ తరువాత మెత్తని వస్త్రంపై పరవాలి. తడి పూర్తిగా ఆరిపోయాక కడాయిలో దోరగా వేయించుకోవాలి. చల్లారాక మెత్తగా పొడి చేసుకోవాలి.
• ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి టేబుల్‍స్పూన్ నెయ్యి వేసి పెసరపొడిని వేయించాలి. తరువాత ఇందులో మరికొంచెం నెయ్యి వేసి వేయించాలి. ఐదు నిమిషాలు అయ్యాక క్రీమ్, డైఫ్రూట్స్ పలుకులు వేసి కలిపి దింపేయాలి.
• ఈ మిశ్రమంలో చక్కెర పొడి, యాలకుల పొడి, మిగిలిన నెయ్యిని కరిగించి వేస్తూ.. లడ్డూల్లా చుట్టుకుంటే చాలు.. నోరూరించే మూంగ్‍దాల్ లడ్డు సిద్ధం. ఇది మంచి పోషకాహారం కూడా. పిల్లలు మరీ మరీ ఇష్టంగా తింటారు.
కొబ్బరి లౌకీ బర్ఫీ
కావాల్సినవి:
సొరకాయ: ఒకటి, నెయ్యి: పావుకప్పు, పాలు: రెండు కప్పులు, చక్కెర: ముప్పావు కప్పు, గ్రీన్‍ఫుడ్ కలర్: చిటికెడు, బాదం పలుకులు: 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి: పావుచెంచా.
కోవా కోసం: నెయ్యి: చెంచా, పాలు: ఒకటిన్నర కప్పు, పాలపొడి: ముప్పావు కప్పు, కొబ్బరి తురుము: కప్పు.
తయారు చేసే విధానం:
• ముందుగా కోవా మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టి నెయ్యి వేయాలి. అది వేడెక్కాక పాలు పోసి, పాలపొడి వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలయ్యాక కొబ్బరి తురుమును కూడా వేసి మరోసారి కలిపి గట్టిపడుతున్నప్పుడు దింపేయాలి.
• ఇప్పుడు సొరకాయ చెక్కు తీసి తురుముకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టి రెండు టేబుల్‍స్పూన్ల నెయ్యి వేసి సొరకాయ తురుమును వేయించుకుని పాలు పోయాలి. పాలల్లో సొరకాయ మిశ్రమం ఉడికాక చక్కెర, గ్రీన్‍ఫుడ్ కలర్ వేసి మరోసారి కలపాలి.
• ఈ మిశ్రమం ఉడుకుతున్నప్పుడు చేసిపెట్టుకున్న కొబ్బరికోవాలను కలపాలి. దగ్గరకు అవుతున్నప్పుడు బాదం పలుకులు, యాలకుల పొడి, మిగిలిన నెయ్యి వేసి మరోసారి కలిపి దింపేసి నెయ్యి రాసిన ప్లేటులో పరిచి ముక్కల్లా కోయాలి.





















































































Review దివ్వి దివ్వి దీపావళి దివ్య దీపాల రంగవెలి.