మూఢనమ్మకాలు మనిషి జీవితంలో అత్యంత ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. ఇవి తల్లి నుంచి పిల్లలకు, ఒక తరం నుంచి మరొక తరానికి క్రమం తప్పకుండా వస్తూనే వున్నాయి. ఈ మూఢనమ్మకాలను పామరులు, గ్రామీణ ప్రజలే కాకుండా విద్యా వంతులు, పట్టణ ప్రాంతాలవారు కూడా పాటిస్తున్నారు. ఆ మూఢనమ్మకాల మూలంగా మేలు జరగకపోగా, అనేక ఇబ్బందులు ఎదురౌతుంటాయి. మహిళలు గర్భధారణ సమయంలో తెలిసీ తెలియని వారి మాటలు విని వాటిని ఆచరిస్తుంటారు. ఫలితంగా ఇటు తల్లికీ అటు గర్భంలోనున్న శిశువు కూడా ప్రమాదం ఏర్పడు తుంది. గర్భధారణ సమయం నుంచి క్రమం తప్పకుండా డాక్టరును సంప్రదిస్తూ సూచనలు పాటించడం తల్లికి శిశువుకీ ఎంతో ఆరోగ్యకరం.
గర్భిణీ స్త్రీకి మంచి కలలు వస్తే మగశిశువు పుడతాడనీ, పిచ్చి కలలు అనగా కలలో పాములు, కుక్కలు కనిపిస్తే ఆడపిల్లలు పుడతారని అంటారు. నిజానికి శిశువు లింగభేదాన్ని నిర్థారించేది జన్యుకణాలనబడే క్రోమోజోములు. అంతేకాని నిద్రలో వచ్చే కలలు ఎంత మాత్రమూ కాదు. అప్పటికే ఇద్దరు ఆడపిల్లలను కన్న తల్లికి తప్పకుండా మళ్ళీ ఎవరు జన్మిస్తారని ఆలోచన ఉంటుంది. ఆలోచనలతో సరిగా నిద్ర పట్టక కలలు కంటుంది. అదే ముందు మగపిల్లవాడిని కన్న తల్లి ఏ ఆలోచనలూ లేకుండా తృప్తిగా నిద్రపోతుంది.
నెలలు నిండుతున్నకొద్దీ గర్భంతోనున్న మహిళ తనకు శిశువుకు కూడా ఆహారాన్ని తీసుకోవాలి. అలాగని తాను ప్రతిరోజూ తినే ఆహారానికి రెట్టింపు మాత్రం కాదు. ఈ సమయంలో మంచి పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తగినంత పరిమాణంలో తీసుకోవాలి. అది సులభంగా జీర్ణమయ్యేలాగా ఉండాలి. కొంతమంది ఎక్కువగా తింటే శిశువు బాగా పెరిగి ప్రసవసమయంలో కష్టమవుతుందని అనుకుంటారు. ఈ అభిప్రాయం వలన సరిగా ఆహారం తీసుకోకపోవడంతో తల్లి బలహీనంగా తయారై, రక్తక్షీణత వస్తుంది. కొందరు మహిళలు మొదటి నెలల కాలంలో తినే ఆహారం తల్లికి ఆరోగ్యాన్నిచ్చి ఆ తరువాత కాలంలో తీసుకునే ఆహారం శిశువును సరిగా ఉంచుతుందని నమ్ముతారు. కాని నిజానికి గర్భం ధరించిన తొలి రోజులలో ఆకలి తక్కువగాను, వాంతి చేసుకునేలా ఉండి చాలా తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. నెలలు గడిచాక శిశువు బరువు పెరుగుతాడని తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. ఇది చాలా తప్పు.
ఇంకొందరు ఖరీదైన తిండి అంటే జీడిపప్పులు, బాదం పప్పు మొదలైన కొవ్వు అధికంగా ఉండే పదార్థాలు తింటే తమ శిశువు అందంగాను, ధృడంగాను పెరుగుతాడనుకుంటారు. విటమిన్ సి, బి కాంప్లెక్స్ మరియు ఇనుము తల్లి తీసుకునే ఆహారంలో అధికంగా ఉంటే శిశువు పెరుగుదల చక్కగా ఉంటుంది. అంతేగాని కొవ్వు పదార్థాలతో నిండిన ఆహారాన్ని తీసుకుంటే ఒళ్ళు పెరగడంతో పాటు ప్రసవ సమయంలో రక్తపోటు అధికమై ప్రమాదాలకు దారి తీస్తుంది.
కొంతమంది పాలలో నెయ్యి కలిపి తాగితే ప్రసవం సులభంగా అవుతుందని నమ్ముతారు. పాపం నెయ్యి కలిపిన పాలను తాగలేక చాలామంది వాంతులు చేసుకుని నీరసపడతారు. సుఖప్రసవం దేవుడెరుగు అసలు ప్రసవం సమయంలో శక్తిలేక ఇబ్బందుల పాలవుతారు. గర్భం ధరించిన సమయంలో సంభోగించడం కూడదని అంటారు. ప్రత్యేక పరిస్థితులలో తప్ప సంభోగం నిషిద్ధమేమీ కాదు. కాని తగిన జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యవంతమైన మహిళలు వ్యాయామం చేయడం కూడా అవసరం. దానవలన సులభంగా ప్రసవమయ్యే అవకాశం ఉంది.
కొంతమంది ప్రసవం అయ్యాక చాలా దాహంగా ఉన్నా తాగడానికి నీరు ఇవ్వరు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రతిరోజూ తగినంత నీరు తప్పక తాగాలి. దానివలన మూత్రపిండాలు సరిగా పని చేస్తాయి. కొన్ని ప్రత్యేక మందులు గర్భిణీ స్త్రీకి హానికరం. అలాగని ఐరన్ టానిక్‍లు, కాల్షియం, విటమిన్స్ మరియు బికాంప్లెక్స్ తప్పక తీసుకోవాలి. వాటివలన తల్లి ఆరోగ్యంగా ఉండి శిశువు దృఢంగా పెరుగుతుంది. అంతేగాని లావుగా తయారుకారు. మాతృత్వం ప్రతి స్త్రీకి ఓ తీయని కల. గర్భం ధరించిన దగ్గరనుంచి బిడ్డ ఆరు నెలలు పెరిగే వరకూ తగు జాగ్రత్తలు తీసుకుంటే ఆ కల ఫలించి కలల పంట కనులముందుగా తిరుగాడుతూ ఎనలేని ఆనందాన్ని పంచిపెడుతుంది.
Review మాతృత్వం ఓ తీయని కల.