ఆంగ్లమానం ప్రకారం సంవత్సరంలో తొమ్మిదో మాసం- సెప్టెంబరు. ఇది తెలుగు సంవత్సరాల వరుసలో భాద్రపద- ఆశ్వయుజ మాసాల కలయిక. సెప్టెంబరు 21, ఆదివారం వరకు భాద్రపద మాస తిథులు కొనసాగుతాయి. ఆ తరువాత సెప్టెంబరు 22 నుంచి ఆశ్వయుజ మాస తిథులు ఆరంభమవుతాయి. ఈ మాసంలో వచ్చే ప్రధాన పర్వాలలో అనంత పద్మనాభస్వామి చతుర్దశి ముఖ్యమైనది. అలాగే ఉండ్రాళ్లతద్ది, మహాలయ పక్షం వంటివీ ఈ నెలలోనే. వర్ష రుతువు, శరదృతువు కలగలసిన ఈ మాసం చివరిలోనే దేవీ శరన్నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి. తెలంగాణలో బతుకమ్మ పండుగ, తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వం చేసేది ఈ మాసంలోనే..
2025- సెప్టెంబరు 1, సోమవారం, భాద్రపద శుద్ధ నవమి నుంచి
2025- సెప్టెంబరు 30, మంగళవారం, ఆశ్వయుజ శుద్ధ అష్టమి వరకు..
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం-భాద్రపదం/ఆశ్వయుజం-వర్ష/శరద్రుతువులు- దక్షిణాయణం
పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర పూర్ణిమ నాడు చంద్రుడు ఆయా నక్షత్రాల్లో ఉంటే అది భాద్రపద మాసం అవుతుంది. భాద్రపద మాసం ఆధ్యాత్మికంగా విశిష్టమైనది. అసలు ఆదిలో కలియుగం భాద్రపద మాసంతోనే మొదలైందనే వాదనలు కూడా ఉన్నాయి. అందుకేనేమో నిజానికి మన భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలోని ప్రధాన పర్వాలన్నీ ఈ మాసం నుంచే ఆరంభమవుతాయని అంటారు. మిగతా పండుగలకు మనల్ని సన్నద్ధం చేసి మనకు శుభాలు (భద్ర) కలిగేలా చేస్తుంది కాబట్టి ఇది భద్రమాసం. అదే భాద్రపదం అయ్యింది. వినాయకుడికి ఈ మాసం అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసం నుంచి మొదలయ్యే పండుగలన్నింటికీ మనల్ని సన్నద్ధం చేసి, ఆయా రోజుల్లో ఆయా దేవతల్ని కొలిచేందుకు, వారి ఆరాధనలో మనకు విఘ్నాలు రాకుండా ఉండేందుకు గణపతిని మొదట పూజించాలి. మన తెలుగు మాసాలలో ప్రత్యేకమైన వైజ్ఞానిక ధర్మం ఉంది. ఈ మాసంలో గృహ నిర్మాణం ఆరంభించరాదని మత్స్య పురాణం చెబుతోంది. ఆషాఢం తరువాత మళ్లీ భాద్రపదంలోనే ఆడపిల్లలు అరచేతులకు గోరింటాకు పెట్టుకుని మురిసిపోతారు. భాద్రపదంలో వర్షాలు ధారాళంగా కురుస్తాయి. నేలంతా చిత్తడిగా మారుతుంది. రోగాలు ముసురుకుంటాయి. వాటిని ఎదుర్కోవడానికి తగిన ఆహార నియమాలతో ఈ మాసంలో వివిధ వ్రతాలు, నోములను మన పెద్దలు నిర్దేశించారు. భాద్రపద మాసంలో వచ్చే పర్వాల్లో ఆయా దేవతలకు నివేదించే ప్రధాన నైవేద్యం ఉండ్రాళ్లు. వీటిని ఆవిరి మీద ఉడికిస్తారు. సెప్టెంబరు నెలలో నెలకొని ఉండే వర్ష రుతు వాతావరణం రీత్యా ఈ ఉండ్రాళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇక సెప్టెంబరు మాసం మూడో వారం నుంచి ఆశ్వయుజ మాస తిథులు ఆరంభమవుతున్నాయి. ఆశ్వయుజం అమ్మవారి ఆరాధనకు ఉద్ధిష్టమైనది. అశ్వనీ నక్షత్రంతో కూడిన పూర్ణిమ కలిగినదే ఆశ్వయుజ మాసం. ఆశ్వయుజి అంటే స్త్రీ. దేవి, సరస్వతి, లక్ష్మి- వీరి ఆరాధన ఈ మాసంలో వైశిష్ట్యం. శరత్కాలం వర్షాలు తగ్గి ప్రకృతి వింతశోభను సంతరించుకునే కాలం. శరత్కాలంలో వచ్చే ఆశ్వయుజంలో వెన్నెల పుచ్చపువ్వులా కాస్తుంది. మేఘాలు దూదిపింజల్లా ఉంటాయి. అందమైన ఈ రుతువులో వచ్చే నవరాత్రులు ఆధ్యాత్మిక సంస్క•తిలో విలక్షణమైనవి. ఈ మాసంలో సూర్యచంద్రులు నిర్మలంగా కనిపిస్తారు.
సూర్యుడు శక్తి కారకుడు. చంద్రుడు మనఃకారకుడు. సర్వసృష్టి స్త్రీ నుంచే సంభవిస్తుంది. పురుషుడు ప్రాణదాత. స్త్రీ శరీరధాత్రి. సకల బ్రహ్మంలో సత్వరజోస్తమో గుణాలు ఉంటాయి. సత్యం నిలువెల్లా నింపుకుని ఉన్న పరతత్వాన్ని విష్ణువుగా, రజస్సుతో కూడిన దాన్ని బ్రహ్మగా, తమస్సుతో ఏర్పడిన పరతత్వాన్ని శివుడిగా వేద పురాణాలు రూపొందించాయి. సృష్టి, పోషణ, లయం వంటి నిర్దిష్ట కార్యాలను నెరవేర్చేందుకు వారికి సహకరించే శక్తి స్వరూపాలు- సరస్వతి, లక్ష్మి, పార్వతి. భాద్రపద, ఆశ్వయుజ మాసాల కలయిక అయిన సెప్టెంబరు మాసంలో వచ్చే ప్రధాన పర్వాలు, పండుగల పరిచయం..
భాద్రపద శుద్ధ నవమి
సెప్టెంబరు 1, సోమవారం
భాద్రపద శుద్ధ నవమి తిథిని పుణ్యస్త్రీలుగా చనిపోయిన వారి శ్రాద్ధ దినంగా భావించే సంప్రదాయం ఉంది. పుణ్య స్త్రీల భర్తలు ఈ తిథి నాడు బతికి ఉన్నంత కాలం శ్రాద్ధాలు పెడతారు. కొడుకులు లేకపోతే భర్తే స్వయంగా చేస్తాడు. కొడుకులు ఉంటే పెద్ద కొడుకు చేయడం ఆచారం. పిండ ప్రదానం మొదలైనవి ఉండవు. ఇంకా ఈనాడు శ్రీవృక్ష నవమీ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి, నందికా నవమి, గోధూమ నవమి అంటారని నీలమత పురాణం అనే వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. ఈ తిథిని నందా నవమి అంటారని, ఈనాడు దుర్గాపూజ చేయాలని స్మ•తి కౌస్తుభంలో రాశారు. ఈ తిథి కేదార వ్రత దినం కూడా. సాధారణంగా కొన్ని ప్రాంతాలలో కేదార వ్రతాన్ని దీపావళి సమయంలో లేదా కార్తీక మాసపు పౌర్ణమి నాడు జరుపుకుంటారు. దీన్ని భార్యాభర్తలు కలిసి ఆచరించాలి. శివుడి అనుగ్రహం కోసం పార్వతీదేవి 21 రోజుల పాటు కేదారేశ్వర వ్రతమాచరించిందట. ఈ వ్రత ఫలితంగా ఆమె కోరిక నెరవేరి శివుడు పతిగా లభించాడని అంటారు.
భాద్రపద శుద్ధ దశమి
సెప్టెంబరు 2, మంగళవారం
భాద్రపద శుద్ధ దశమి దశావతార వ్రత దినంగానూ ప్రసిద్ధి. ఈనాడు దశావతారాలను పూజించాలని అంటారు. ఈ కారణంగానే దీనికి దశావతార వ్రతమనే పేరు వచ్చింది. నీలమత పురాణంలో ఈనాడు వితస్తోత్సవం చేస్తారని ఉంది. వితస్త అనేది పాంచాల దేశంలోని ఒక నది. ఈ నది ఈనాడే పుట్టిందని అంటారు. ఈ దశమి మొదలుకుని ఏడు రోజులు విడవకుండా వితస్తానదిలో స్నానం చేయడం వల్ల పుణ్యం కలుగుతుందని చెబుతారు.
దశావతార వ్రతం నాడు దేవతలకు, రుషులకు, పితరులకు తర్పణం ఇవ్వాలి. మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతార ప్రతిమలను చేసి పూజించాలి. భోజనం చేయకూడదు. శక్తి లేని వారు ఒంటి పూట భోజనం చేయవచ్చు.
భాద్రపద శుద్ధ ఏకాదశి
సెప్టెంబరు 3, బుధవారం
భాద్రపద శుద్ధ ఏకాదశిని వామన ఏకాదశి, పరివర్తినీ ఏకాదశి అని అంటారు. పార్శ్వ ఏకాదశి అనీ అంటారు. విష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు నిద్రకు ఉపక్రమిస్తాడు. అప్పటి నుంచి భాద్రపద శుద్ధ ఏకాదశి నాటికి ఆయన శయనించి రెండు మాసాలవుతుంది. ఆయన భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు కాస్త ఒత్తిగిలుతాడు. ఆ ఒత్తిగిలడం కూడా ఎడమ నుంచి కుడికి.. అందుచేత దీనికి పార్శ్వపరివర్తిన్యేకాదశి అని పేరు వచ్చింది. కాగా, పరివర్తన ఏకాదశిని ప్రకృతిలో చోటుచేసుకునే మార్పులకు ప్రతీకగా భావిస్తారు. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని అంటారు. ఈ పర్వాన్ని పురస్కరించుకుని దేవాలయాల్లో జరిగే ఉత్సవాలు సంధ్యాకాలంలో జరగడం కొన్నిచోట్ల ఆచారంగా ఉంది. అలాగే, ఈనాడు కటదానోత్సవం అనే వ్రతం ఆచరించాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. కటము అంటే చాప. కటకారుడు అంటే చాపలు అల్లేవాడు. అంటే ఈనాడు చాప దానం చేయాలి. ఈ ఏకాదశి రోజునే శ్రీమహావిష్ణువు వామన అవతారాన్ని దాల్చి బలి చక్రవర్తిని పాతాళ లోకానికి పంపిస్తాడు. అందువల్లే ఈ ఏకాదశిని వామన ఏకాదశి అని కూడా అంటారు. ఈనాడు వామనావతారాన్ని పూజించడం వల్ల త్రిమూర్తులను పూజిస్తే కలిగే ఫలమంతా లభిస్తుందని అంటారు. విష్ణువు ఐదవ అవతారమైన వామనుడికి ఇది ప్రియమైన తిథి అని అంటారు. ఈ తిథి తరువాత వచ్చే భాద్రపద శుద్ధ ద్వాదశి కూడా వామనుడితోనే ముడిపడి ఉంది. ఆ రోజు కూడా వామనుడిని విశేషంగా పూజిస్తారు.
భాద్రపద శుద్ధ ద్వాదశి
సెప్టెంబరు 4, గురువారం
భాద్రపద శుద్ధ ద్వాదశి వామన ద్వాదశిగా ప్రతీతి. భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు వామనవాతరాన్ని దాల్చాడని చెబుతున్నా.. ఈ ద్వాదశి తిథి నాడే వామనావతార జయంతి తిథిని నిర్వహించడం ఆచారంగా ఉంది. వామనుడు బ్రహ్మచారి వటుడు. తపస్విని అయిన అదితికి, కశ్యప రుషి వల్ల పుట్టిన వాడు. విరోచనుడు అనే దైత్యుని కొడుకు బలి. దైత్య కులంలో పుట్టిన బలి గొప్ప విష్ణు భక్తుడు. విష్ణువు అభిమానాన్ని చూరగొన్నాడు. దీంతో అతనికి గర్వం కలిగి దేవతలను బాధించడానికి పూనుకున్నాడు. అప్పుడు దేవతలు శేష నారాయణుని సన్నిధికి వెళ్లి బలి బాధ పోగొట్టవలసిందిగా కోరారు. అయితే బలి తన ఇష్ట భక్తుడు కావడంతో అతని జోలికి వెళ్లడానికి విష్ణువుకు ఇష్టం లేదు. దేవతల బలవంతంతో ఆయన వామనమూర్తి అయిన బ్రాహ్మణ యాచకుని వేషంలో బలి చక్రవర్తి వద్దకు వెళ్లాడు. బలి సింహాసనంపై నుంచి లేచి దానిపై వామనుడిని కూర్చోబెట్టాడు. మిక్కిలి వినయంతో రాకకు కారణం అడిగాడు. తన వేద పఠనానికి తనకు ‘త్రిపద్భూమి’ కావాలని వామనుడు కోరాడు. త్రిపద్భూమి అంటే మూడు అడుగుల నేల. బలి అలాగే ఇస్తానన్నాడు. మంత్రయుక్తంగా ఆ దానం చేయడానికి బలి తన గురువైన శుక్రుడికి కబురంపాడు. శుక్రుడు వచ్చి వామనుడి ఆంతర్యం గ్రహించి బలికి అసలు విషయం చెబుతాడు. దానం ఇవ్వడంతోనే నిన్ను పాతాళానికి తొక్కివేస్తాడని కూడా అంటాడు. అయినా సరే, తాను ఆడిన మాట తప్పనని బలి అంటాడు. అంతట వామనుడు ్ర•హ్మాండాంత సంవర్థియై ఒక పాదంతో భూమిని, మరో పాదంతో ఆకాశాన్ని ఆక్రమించి మూడో పాదం బలి నెత్తి మీద ఉంచి అతనిని పాతాళంలోకి తొక్కివేశాడు.
హేమాద్రి, భవిష్య పురాణాలలోని కథ ఇది. భాద్రపద మాస శుక్ల ద్వాదశి శ్రవణ నక్షత్రంలో వామనావతార జయంతి ఉత్సవం జరుపుతారు. దీనిని విజయ ద్వాదశి అనీ అంటారు. వామన ద్వాదశికి ముందు ఏకాదశి ఉపవాసం ఉండి, రాత్రి జాగారం చేసి వామనావతార విగ్రహాన్ని పూజించాలి. విగ్రహానికి శిఖ, సూత్రం, యజ్ఞోపవీతం, కమండలం ఉండాలి. శ్రావణ ద్వాదశి నాడు ఉపవాసం చేసిన వారికి బ్రహ్మహత్యా దోషాలు పోతాయి.
అలాగే, కేరళీయులకు ముఖ్యమైన ఓనం పండుగ ఈనాడే. వామనుడి చేత పాతాళానికి తొక్కబడిన బలి చక్రవర్తి తను పాలించే ప్రాంతంగా చెప్పే కేరళ రాజ్యానికి ఈనాడే స్వర్గం నుంచి తమను చూడ్డానికి వస్తాడని కేరళవాసులు నమ్ముతారు. తనవాళ్లందరినీ తృప్తిగా చూసుకుని తిరిగి స్వర్గానికి వెళ్లిపోతాడని అంటారు. అందు నిమిత్తం నిర్వహించే పండుగే ఓనం. ఈనాడే తిరిగి సగౌరవంగా బలిని స్వర్గానికి పంపుతారు.
అలాగే, భాద్రపద శుద్ధ ద్వాదశి తిథి కల్కి ద్వాదశి దినమని కూడా అంటారు.
భాద్రపద శుద్ధ త్రయోదశి
సెప్టెంబరు 5, శుక్రవారం
భాద్రపద శుద్ధ త్రయోదశి తిథి మొదలుకుని మూడు రోజుల పాటు అగస్త్యార్ఘ్య దానం చేయాలని కృత్యసార సముచ్చయం అనే వ్రత గ్రంథంలో ఉంది. అలాగే, చతుర్వర్గ చింతామణిలో ఈనాడు గో త్రిరాత్రి వ్రతం ఆచరించాలని ఉంది. భాద్రపద శుద్ధ త్రయోదశిని గోత్రిరాత్రి వ్రతమని, దూర్వాత్రి రాత్రి వ్రతమని చతుర్వర్గ చింతామణిలో రాశారు.
అలాగే, సెప్టెంబరు 5.. మనకు ఉపాధ్యాయ దినోత్సవం. ఈనాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి. ఆయన జయంతినే ఏటా ఈరోజు టీచర్స్డేగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇంకా, సెప్టెంబరు 5.. మదర్ థెరిసా వర్ధంతి దినం కూడా.
భాద్రపద శుద్ధ చతుర్దశి
సెప్టెంబరు 6, శనివారం
భాద్రపద శుద్ధ చతుర్దశి అనంత పద్మనాభ చతుర్దశిగా ప్రసిద్ధి. అందుకే ఈ తిథిని పద్మనాభ చతుర్దశిగానూ వ్యవహరిస్తారు. ఈనాడు అనంత వ్రతాన్ని ఆచరించాలి. అనంతుడు అనేది విష్ణువు యొక్క అనేక నామాల్లో ఒకటి. అనంత చతుర్దశీ వ్రతం మిక్కిలి విశేషమైనదని స్మ•తి దర్పణం అనే వ్రత గ్రంథంలో ఉంది. ఉత్కళ దేశంలో దీనిని అఘోర చతుర్దశి అంటారని ఆమాదేర్ జ్యోతిషీ వ్రత గ్రంథంలో రాశారు. ఈ వ్రతాచరణకు త్రయోదశితో కూడిన చతుర్దశి పనికి రాదు. పూర్ణిమతో కూడిన చతుర్దశి ఈ వ్రతానికి ముఖ్యము. అనంత వ్రతం గురించి భవిష్యోత్తర పురాణంలోనూ, తిథి ప్రాముఖ్యం గురించి హేమాద్రి వ్రత గ్రంథంలోనూ ఉంది.
భారతీయులు ఆచరించే కామ్య వ్రతాల్లో అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం ఒకటి. ఈ వ్రతాచరణకు ఉదయ వ్యాపిని అయిన చతుర్దశి ముఖ్యం. పూర్ణిమ ఘడియలు ఏ కొంచెం ఉన్నా ఈ వ్రతానికి ఇంకా శ్రేష్ఠమై ఉంటుంది. అనంతుని వ్రతానికి ముఖ్యమైన అంగాలు మూడు. అవి-
1. యమునా జల పూజనం
2. అనంతుని పూజ
3. ప్రతిసర పూజ
అనంతుడు అనగా ఆదిశేషువు. విష్ణువు, రుద్రుడు అనే అర్థాలూ ఉన్నాయి. కానీ, ఇక్కడ పూజను అందుకునేది విష్ణువు పాన్పు, భూమిని మోసేవాడు అయిన ఆదిశేషువు. పద్మాల పిండితో ఏడు పడగలు గల పామును చిత్రించాలి. దర్భలతో పాము బొమ్మను వేస్తారు. దీని మీద కలశాన్ని ఉంచుతారు. ‘సహస్ర శిరసేనమ:’, ‘ఫణైస్సప్తభిరావిష్టం’ అనే మంత్రాలతో అనంతుని పూజించాలి. అలాగే అనంతుని ముందు ఒక తోరాన్ని ఉంచి పూజించాలి. అది పద్నాలుగు ముళ్లు గలదిగా ఉండాలి. కుంకుమాయుక్తమై ఉండాలి. పూజారంభానికి ముందు ముందటి సంవత్సరపు పాత తోరం ధరించాలి. పూజచేసిన అనంతరం దీనిని దక్షిణ కరానికి కట్టుకుని అప్పుడు పాత తోరాన్ని తీసివేయాలి.
అనంతుని పూజలో పద్నాలుగు (14) సంఖ్యకు ప్రాముఖ్యం ఉంది.
విష్ణువుకు పానుపు అయిన ఆదిశేషుడికి ఏడు (పద్నాలుగులో సగం) 3పడగలు.
చతుర్దశి తిథి పద్నాలుగోది.
తోరం పద్నాలుగు పోచలతో చేసినది.
ఆ తోరానికి పద్నాలుగు గ్రంథులు.
అలాగే, అనంతుని పూజకు ఉపయోగించే పత్రులు- పద్నాలుగు.
నైవేద్యానికి పద్నాలుగు రకాల పండ్లు, పద్నాలుగు రకాల పిండివంటలు వాడటం ఆచారం.
వాయన దానానికి పద్నాలుగు అతిరసములు వాడాలి.
గోధుమ పిండితో ఇరవై ఎనిమిది (రెండు పద్నాలుగులు) అతిరసములు చేయాలని వ్రత వివరణలో ఉంది.
అలాగే, పద్నాలుగేసి ఏళ్లకు ఒకసారి వ్రతానికి ఉద్యాపనం చేయాలి.
మనిషికి పోయిన అధికారం, సంపద, రాజ్యం మొదలైనవి అనంతుని పూజించడం వల్ల తిరిగి వస్తాయని అంటారు. అందుకే భారతదేశంలో అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం చాలా ప్రాముఖ్యమైది. ఈ చతుర్దశి నాడు దేశవ్యాప్తంగా విశేష పూజలు నిర్వహిస్తారు. కేరళలో ప్రసిద్ధి చెందిన అనంత పద్మనాభస్వామి ఆలయం ఉంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయాల్లో ఇది ఒకటి. ఈ ఆలయ నేలమాళిగల్లో అనంత సంపద పోగుపడి ఉందని, దానికి భారీ సర్పాలు కాపలా కాస్తుంటాయని అంటారు.
ఇంకా, భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు పాలీ చతుర్దశీ వ్రతం, కదలీ వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది.
భాద్రపద శుద్ధ పూర్ణిమ
సెప్టెంబరు 7, ఆదివారం
భాద్రపద శుద్ధ పూర్ణిమ నాడు ఉమామహేశ్వర వ్రతం, పుత్ర వ్రతం, ఉపాంగ లలితాగౌరీ వ్రతం, లోక పాలక పూజ, వంధ్యత్వ హారిలింగార్చనా వ్రతం, వరుణ వ్రతం, బ్రహ్మసావిత్రీ వ్రతం, అశోక త్రిరాత్ర వ్రతం వంటివి చేస్తారని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. కాబట్టే ఈ తిథి అనేక విధాలుగా ప్రతీతమై ఉంది. శ్రావణ శుద్ధ పూర్ణిమ నాడు మంచిది కాకపోయినా, వీలులేక పోయినా ద్విజులు భాద్రపద శుద్ధ పూర్ణిమ నాడు ఉపాకర్మ చేసుకుంటారు. భాద్రపద పూర్ణిమ నాడు భాగవత పురాణాన్ని దానం ఇస్తే పరమపదం కలుగుతుంది.
భాద్రపద శుక్ల త్రయోదశి నాడు ప్రారంభించిన అగస్త్యార్ఘ్య దానాన్ని భాద్రపద పూర్ణిమతో ముగిస్తారని తిథి తత్వం చెబుతోంది.
ఈనాడు దిక్పాల పూజ చేయాలని నీలమత పురాణంలో ఉంది. దీనినే ఇంద్ర పౌర్ణమాసీ అంటారని గదాధర పద్ధతి అనే గ్రంథంలో రాశారు. అలాగే, భాద్రపద శుద్ధ పూర్ణిమ ‘మహా భాద్రీ’ అని, ఈనాడు బదర్యాశ్రమంలో గడిపితే విశిష్ట ఫల ప్రదమై ఉంటుందని గదాధర పద్ధతిలో ఉంది.
నైష్కికులకు పౌర్ణమాసీ కృత్యాలైన నాన్దీ శ్రాద్ధం, పితృ శ్రాద్ధం మొదలైనవి ఈనాడు తప్పకుండా చేయాలని చెబుతారు. భాద్రపద శుద్ధ పౌర్ణమి మరునాటి నుంచే మహాలయ పక్షం ప్రారంభం అవుతుంది.
భాద్రపద బహుళ పాడ్యమి
సెప్టెంబరు 8, సోమవారం
మన క్షేమం కోరే
మహాలయ పక్షం
భాద్రపద బహుళ పాడ్యమి నుంచి మహాలయ పక్షం ఆరంభమవుతుంది. ఇది వేద కాలం నుంచీ ఆచరణలో ఉన్న పండుగ. దీనినే పితృపక్షమనీ అంటారు. భాద్రపద పూర్ణిమతో ఆరంభమై భాద్రపద బహుళ అమావాస్యతో పితృపక్ష కాలం ముగుస్తుంది. మహాలయ పక్షం సాముదాయకంగా పితృ దేవతలను పూజించడానికి ఏర్పడింది. రోమన్ జాతీయుల్లో ఫిబ్రవరి 19వ తేదీ పితృ దేవతల పూజకు నిర్ధిష్టమై ఉండేది. ఆనాడు వారు రోమ్ నగరం సమీపంలోని కొండలలో ఒక కొండపై పెద్ద గొయ్యి తీసేవారు. పితృ దేవతలు భూమి కింద ఉంటారని వారి విశ్వాసం. ఆ గోతుల్లో అన్నం ఉంచే వారు. వివాహాలు, వ్యాపారాలు, ఇతర
శుభకార్యాలు ఆనాడు ఆచరించరు. మనలో కూడా దాదాపు ఇదే ఆచారం కొనసాగుతోంది. మన శాస్త్రాల్లో ఏడాదిలో చేయాల్సినవి 96 శ్రాద్ధాలని ఉంది. వీటిలో పితృపక్షం ముఖ్యమైనది. శ్రాద్ధ దినం నాడు కర్మ చేసే వాడు శ్రాద్ధం పూర్తయ్యే వరకు ఉపవసిస్తాడు. చివరిలో పితృలకు నైవేద్యంగా ఉంచిన పదార్థాలను కాకి వచ్చి ఎంత తొందరగా ముడితే పితృ దేవతలు అంత ఎక్కువ తృప్తి పడినట్టు. ఈ రోజు శ్రాద్ధ కర్మ చేయడం వీలుపడని వారు తర్పణం వదులుతారు.
తండ్రి బతికి ఉండగా తల్లిని కోల్పోయిన వాడు భాద్రపద కృష్ణ పక్ష నవమి నాడు తల్లి శ్రాద్ధ కర్మ చేస్తాడు. ఈ సందర్భంలో మూడు పిండాలు దానం చేయాలి. ఒకటి చనిపోయిన తల్లికి, రెండోది కర్మ చేసే వాని పితామహికి, ఒకవేళ ఆమె సజీవురాలై ఉంటే రెండోది ప్రపితామహికి, మూడోది ప్రపితామహి తల్లికి. అలాగే, తండ్రికి కూడా శ్రాద్ధకర్మను నిర్వహించాలి.
పురోహితులు సూచించిన మేరకు దర్బగడ్డి మీద అవిసె చెట్టు ఆకులు వేస్తారు. దాని మీద విష్ణు పాదమనే ఆకు వేస్తారు. దాని మీద పిండాలు ఉంచుతారు. ఇవి పెద్ద పిండాలు. ఈ పిండాల పక్కన చిన్న పిండాలు, మరికొన్ని ధర్మ పిండాలు ఉంచుతారు. వీటినన్నింటినీ పూజిస్తారు. తరువాత దీపారాధన చేస్తారు. ఆ మీదట మంత్ర పుష్పాంజలి చేస్తారు. చివరగా నైవేద్యపు వస్తువును ఆరుబయట కాకి తినడం కోసం ఉంచుతారు. కాని ఈ నైవేద్యాన్ని ఎంత తొందరగా ముట్టుకుంటే పితృ దేవతలు అంత ఎక్కువగా తృప్తి పడ్డారని తలుస్తారు. ఇలా కర్మ చేయడానికి పాలుమాలిన తమ వంశీకుడిని పితృ దేవతలు శపిస్తారని అంటారు. ఒక మనిషి జీవితకాలంలో ఈ మహాలయ పక్షంలో గంగ, యమున, ఫల్గుణి నదుల సంగమంలో గయలో శ్రాద్ధ కర్మ చేయడం మహత్కార్యంగా మహారాష్ట్రులు భావిస్తారు.
భాద్రపద బహుళ విదియ
సెప్టెంబరు 9, మంగళవారం
భాద్రపద బహుళ విదియ ఉండ్రాళ్ల తద్ది భోగి. కొన్ని పండుగలకు ముందు వచ్చే రోజును భోగిగా వ్యవహరిస్తారు. ఉండ్రాళ్ల తద్ది, అట్లతద్ది, మకర సంక్రాంతి.. ఈ పండుగల పూర్వ దినాలను భోగి అని వ్యవహరిస్తారు. ఈ కోవలో ఉండ్రాళ్ల తద్దికి ముందు వచ్చేది భాద్రపద బహుళ విదియ. ఇది ఉండ్రాళ్ల తద్ది భోగి. దీని తరువాత రోజు (బహుళ తదియ, సెప్టెంబరు 20) ఉండ్రాళ్ల తద్ది. ఇది స్త్రీల పండుగ. కన్నెలు, పడుచులు, చిన్నారి మగపిల్లలు కూడా ఈ పర్వంలో పాల్గొంటారు. ఇక ఉండ్రాళ్ల తద్ది భోగి నాడు ఆడపిల్లలు అందరూ తలంటి పోసుకుంటారు. దీంతో భోగి పీడ వదులుతుందని అంటారు. తలంటు అయిన తరువాత చేతి, కాలి వేళ్లకు గోరింటాకు పెట్టుకుంటారు. తెల్లవారుగట్ల గోంగూర పచ్చడి, నువ్వు పొడి, ఉల్లిపాయ పులుసు, గట్టి పెరుగు వంటివి వేసుకుని భోజనం చేసి, తాంబూలం వేసుకుని ఉయ్యాల ఊగడం, ఆడుకోవడం మున్నగు వాటితో కాలక్షేపం చేస్తారు.
భాద్రపద బహుళ తదియ
సెప్టెంబరు 10, బుధవారం
భాద్రపద బహుళ తదియ (తద్ది) అమ్మాయిలకు అత్యంత ప్రీతిపాత్రమైన పర్వం. ఈనాడు ప్రతి ఇంట యువతులు ఆనందోత్సాహాలతో గడుపుతారు. వారి ఆనందమే తమ భాగ్యంగా పెద్దలు వారిని ఆశీర్వదిస్తారు. భాద్రపద బహుళ తదియకు ముందు రోజైన భాద్రపద బహుళ విదియ ఉండ్రాళ్ల తద్ది భోగి. ఈనాడు స్త్రీలు తెల్లవారుజామునే అభ్యంగన స్నానాలు చేసి వేళ్లకు గోరింటాకు పెట్టుకుంటారు. పిదప గవ్వలాట ఆడతారు. ఊరి బయట తోటలకు అట్లు, బెల్లపట్లు, పెరుగన్నం పట్టుకెళ్లి, వాటిని ఆరగించాక ఉయ్యాలలూగుతారు. రాత్రి గౌరీ పూజ చేస్తారు. ఈ పండుగ ప్రధానంగా స్త్రీల సౌభాగ్యం కోసం చేసే పండుగ. శ్రావణ, భాద్రపద మాసాలలో కొన్ని స్త్రీ సౌభాగ్యకారకమైన వ్రతాలు గురించి వివిధ వ్రత గ్రంథాలలో పేర్కొన్నారు. కానీ, ఉండ్రాళ్ల తద్ది గురించి ఆయా గ్రంథాలలో లేదు. హేమాద్రి పండితుడు చెప్పిన ప్రకారం.. చైత్ర, భాద్రపద, మాఘ మాసాలలో రూప సౌభాగ్య సౌఖ్యదమైన తృతీయా వ్రతాన్ని గురించి తనకెందుకు చెప్పలేదని యుధిష్టరుడు కృష్ణుడిని ప్రశ్నించాడు. కృష్ణుడు- భవిష్యోత్తర పురాణం నుంచి ఓ వ్రతాన్ని ఉదహరించాడు. భాద్రపద తృతీయ అన్నాడే కానీ, భాద్రపద బహుళ తదియ అని స్పష్టంగా చెప్పలేదు. సాధారణంగా భాద్రపద
శుద్ధ తృతీయ నాడు చేయాల్సిన వ్రతాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ, ‘గుడ తృతీయ’మనే ఒక వ్రతాన్ని కృష్ణుడు ఉదహరించాడు. గుడాపూపములు దేవికి నైవేద్యంగా పెట్టి, జలాశయాల్లో దేవీ ప్రతిమలను విసర్జిస్తారు. వామదేవుని ప్రీతి కోసం పాయసాన్ని సమర్పించాలని ఈ వ్రతంలో ఉంది. ఈ వ్రతం కూడా ఏ పక్షపు తృతీయ అనేది స్పష్టంగా లేదు. గుడాపూపములు నైవేద్యంగా ఇవ్వాలని అనడం వల్ల నేటి ఉండ్రాళ్ల తద్దియే ఆ వ్రతమై ఉండవచ్చని వ్రతకారుల అభిప్రాయం. వర్షాకాలంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలనేది ఆరోగ్య సూత్రం. దానికి అనుగుణంగానే ఉండ్రాళ్లు ఆరగించే ఈ పండుగ ఆచరణలోకి వచ్చి ఉండవచ్చు.
కాగా, ఉండ్రాళ్ల తద్ది (తదియ) నాడు కొన్ని వర్ణాల వారు గొంతెమ్మ (కుంతి) పూజ చేయడం కూడా ఆచారం.
భాద్రపద బహుళ చవితి
సెప్టెంబరు 11, గురువారం
భాద్రపద బహుళ చతుర్థి.. సంకష్టహర చతుర్థి దినం. ఈనాడు గణపతిని విశేషంగా పూజిస్తారు. భాద్రపద బహుళ చతుర్ధి నాడు దికాల్ప పూజ చేయాలని నీలమత పురాణం చెబుతోంది. అలాగే ఈ తిథి నుంచే మహా భరణి. ఇదో నక్షత్రం పేరు. ఇది పితృపక్షంలో వస్తుంది. ఈ రోజున పూర్వీకులకు శ్రాద్ధ కర్మలు చేయడం ఆచారం. ఫలితంగా పూర్వీకులు ఆశీర్వాదాలు మనకు లభిస్తాయని నమ్ముతారు. గతించిన పెద్దల ఆత్మలకు శాంతి చేకూరుస్తుందని భావిస్తారు. ఇది యముడితో ముడిపడి ఉన్న పర్వమని తెలుస్తోంది.
భాద్రపద బహుళ పంచమి
సెప్టెంబరు 12, శుక్రవారం
భాద్రపద బహుళ పంచమి నాడు నాగులకు పాలు పోయడం ద్వారా వాటిని తృప్తిపరచాలని అంటారు. ఈనాడు రుషులను పూజించాలి. ఇది ప్రధానంగా పురుషులు చేసేదిగా ఉంది. మొదట స్నానం చేసి మట్టితో వేదిక చేయాలి. దానిని పేడతో అలకాలి. పువ్వులతో అలంకరించాలి. దర్భలు పరిచి దాని మీద గంధం ఉంచాలి. పువ్వులు ఉంచాలి. ధూపం వేయాలి. దీపం ఉంచాలి. సప్తరుషి పూజ చేయాలి. అర్ఘ్యదానం ఇవ్వాలి. దున్నకుండా, నాటకుండా పండిన శ్యామాక ధాన్యంతో బియ్యం చేసి వండి నైవేద్యం పెట్టి తాను ఆ అన్నమే తినాలి. ఇలా చేస్తే సప్తర్షుల అనుగ్రహం కలుగుతుంది.
భాద్రపద బహుళ షష్ఠి
సెప్టెంబరు 13, శనివారం
భాద్రపద బహుళ షష్ఠి కుమారస్వామి పూజకు ఉద్ధిష్టమైనది. ఈనాడు సుబ్రహ్మణ్యేశ్వరుడిని పూజించాలి. దీనిని సంస్కంద షష్ఠిగా వ్యవహరిస్తారు. తిథానుసారం భాద్రపద బహుళ షష్టి నాడు ఎంఎస్ సుబ్బులక్ష్మి జయంతి దినం. ఈమె విఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు. గాయని. భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను పొందిన మొదటి సంగీత కళాకారిణి. సుబ్బులక్ష్మి గారు పాడిన అనేక దైవగీతాలను ప్రతి ఇంటా వింటారు.
భాద్రపద బహుళ సప్తమి
సెప్టెంబరు 13, శనివారం
భాద్రపద బహుళ సప్తమి తిథి కూడా షష్ఠి తిథి ఘడియల్లోనే కూడి ఉంది. ఈ తిథి సూర్యారాధనకు అనుకూలమైనది. అందుకే దీనిని భాను సప్తమిగానూ వ్యవహరిస్తారు. భాద్రపద శుద్ధ అష్టమి నాడు ఆరంభమయ్యే మహాలక్ష్మీ వ్రతం ఈనాటితో పరిసమాప్తమవుతుంది. అలాగే ఈనాటి నుంచి ఉత్తర కార్తె ప్రారంభం అవుతుంది.
భాద్రపద బహుళ అష్టమి
సెప్టెంబరు 14, ఆదివారం
భాద్రపద బహుళ అష్టమి నాడు జీమూత వాహనుడిని పూజించాలని అంటారు. అశోకాష్టమీ వ్రతం ఈనాడు ప్రారంభించి ప్రతి కృష్ణాష్టమి నాడు దేవీపూజ చేయాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఇక, ఈనాటి ప్రధాన దైవనమైన జీమూత వాహనుడి గురించి వివరణ..
జీమూత వాహనుడు విద్యాధర యువకుడు. ఆయన ఆత్మత్యాగులలో అతిలోకుడు. అతనికి పట్టము కట్టి తల్లిదండ్రులు వానప్రస్థానికి వెళ్లారు. రాజ్యం చేస్తూనే తరచూ తల్లిదండ్రులకు పరిచర్యలు చేయడానికి జీమూతవాహనుడు వనాలకు వెళ్తూ ఉండేవాడు. అలా వెళ్లిన క్రమంలో ఒకసారి మలయవతి అనే కన్యను చూసి మోహించాడు. ఆమె తల్లిదండ్రుల సమ్మతితో ఇద్దరూ ఒక్కటయ్యారు. కొంతకాలం తరువాత ఓనాడు జీమూత వాహనుడు విహారం చేస్తూ ఒకచోట పాముల ఎముకలు గుట్టలుగా పడి ఉండటం చూశాడు. విచారించగా, అవి గరుడినికి ఆహారమవుతున్న పాముల ఎముకలని తెలిసింది. అలా గరుడుడు రోజూ ఎన్నో పాములను చంపసాగాడు. దీంతో రోజూ ఒక పామును తామే అతనికి ఆహారంగా ఇచ్చేలా నాగరాజైన వాసుకి గరుడునితో ఒప్పందం చేసుకున్నాడు. ఆ విధంగా గరుడుడు చాలా పాములను చంపకుండా వాసుకి నియమం చేశాడు.
జీమూత వాహనుడు అక్కడ ఉండగానే ఆనాడు గరుత్మంతునికి ఆహారం కావాల్సిన వంతు వచ్చిన శంఖచూడుడనే నాగ కుమారుడు వచ్చాడు. అతని వెంట ఏడుస్తూ అతని తల్లి వచ్చింది. గరుడినికి ఆహారం కావడానికి పూర్వం పన్నగ కుమారుడు ధరించాల్సిన ఎర్రని బట్టలు నాగరాజు తెచ్చాడు. ఆహారబలికి అంతా సిద్ధమవుతోంది. ఇదంతా చూసి జీమూత వాహనుని హృదయం ద్రవించింది. శంఖచూడునికి బదులుగా తానే గరుడికి ఆహారం కావాలని అతను నిశ్చయించుకున్నాడు. నాగరాజు తెచ్చిన ఎర్రబట్టలు తనకివ్వాలని కోరగా, శంఖచూడుడు తానే బలికి వెళ్తానని ఇవ్వడానికి నిరాకరించాడు. అంతలో విద్యాధరుల్లో ఉన్న ఆచారాన్ని బట్టి కొత్త పెళ్లికొడుక్కి ఇవ్వాల్సిన కొత్త ఎర్రబట్టలను జీమూత వాహనుడికి అత్తగారు పంపుతుంది. వాటిని ధరించిన జీమూత వాహనుడు వధ్యశిల ఎక్కుతాడు. అంతలో గరుత్మంతుడు వస్తాడు. తనకై వచ్చిన నాగ కుమారుడే అతను అనుకుని తినడానికి సిద్ధమవుతాడు. ఈలోగా శంఖచూడుడు వధ్యశిలపైకి వచ్చిన తనను తినాలని కోరతాడు. తననే తనివి తీరా ఆరగించాలని జీమూత వాహనుడు అడుగుతాడు. గరుడుడు తానప్పుడు తింటున్నది పన్నగ కుమారుడిని కాదని తెలుసుకుంటాడు. జీమూత వాహనుడి త్యాగబుద్ధికి వెరగొందుతాడు. ఈలోగా జీమూత వాహనుడిని వెతుక్కుంటూ కాబోయే భార్య మలయవతి, ముసలి తల్లిదండ్రులు అక్కడికి వస్తారు. అమృతం తెచ్చి ఇచ్చి అయినా తమ కుమారుడిని బతికించాలని వారు గరుత్మంతుడిని కోరతారు. గరుడుడు చలించి.. అమృతం తెచ్చి జీమూత వాహనుడిని బతికిస్తాడు. అనంతరం తనతో పాటు అప్పటి వరకు చచ్చిన పాములన్నిటిపై కూడా జీమూత వాహనుడు అమృతపు జల్లులు చల్లి బతికిస్తాడు. అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమై జీమూత వాహనుడిని విద్యాధర చక్రవర్తివి కమ్మని ఆశీర్వదిస్తుంది. ఇకపై పాములను చంపనని గరుత్మంతుడు చెబుతాడు. జీమూత వాహనుడి ఆత్మత్యాగం గరుడునిలో ఈ పరివర్తన తెచ్చింది. అనంతరం జీమూత వాహనుడు మలయవతితో కూడి సుఖంగా రాజ్యపాలన చేస్తూ విద్యాధర చక్రవర్తి అయ్యాడు.
ఇదెంతో కదిలించే కథ. ఒకప్పుడు ప్రాథమిక స్థాయి పాఠ్యాంశాలలో ఈ గాథ ఉపవాచకంగా ఉండేది. ఇటువంటి కథలే చిన్నారులకు త్యాగం, దయ, కరుణ బుద్ధులను నేర్పుతాయి. పెద్దలు కూడా తప్పక చదవాల్సిన త్యాగగాథ ఇది.
ఇంకా అష్టమి తిథి మధ్వాష్టమి. మధ్వ వైష్ణవులు ఈనాడే శ్రీకృష్ణుని జయంతిని జరుపుకుంటారు. అందుకే ఈ తిథిని వారు మధ్వ శ్రీకృష్ణ జయంతిగా వ్యవహరిస్తారు. ఇంకా ఈ తిథి కాలభైరవాష్టమి, రుద్రాష్టమిగానూ కూడా ప్రసిద్ధి. ఈనాడు రోహిణి వ్రతం కూడా ఆచరిస్తారు.
భాద్రపద బహుళ నవమి
సెప్టెంబరు 15, సోమవారం
భాద్రపద బహుళ నవమి తిథి నాడు నీరాజన నవమి పర్వమని నీలమత పురాణం చెబుతోంది. ఈనాడు దుర్గాపూజ, గౌరీపూజాధికాలు చేయాలని అందులో వివరించారు. ఇక, కొన్ని పంచాంగాలలో ఈ తిథిని అహిర్ణవమిగానూ, దుర్గోత్థాపనగానూ వ్యవహరిస్తున్నారు. సెప్టెంబరు 15.. భారత జాతీయ ఇంజనీర్ల దినోత్సవం. ప్రఖ్యాత ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి దినాన్ని ఇంజనీర్ల దినోత్సవంగా నిర్వహించుకోవడం రివాజు.
భాద్రపద బహుళ దశమి
సెప్టెంబరు 16, మంగళవారం
భాద్రపద బహుళ దశమి తిథి నాడు పంచాంగాలలో ప్రత్యేకంగా ఆచరించాల్సిన నియమాల గురించి ఏమీ ప్రస్తావించలేదు. కాకపోతే దశమి తిథి దుర్గాపూజకు ఉద్దేశించినది.
భాద్రపద బహుళ ఏకాదశి
సెప్టెంబరు 17, బుధవారం
భాద్రపద బహుళ ఏకాదశిని ఇందిరైకాదశి అని ఆమాదేర్ జ్యోతిషీ అనే గ్రంథంలో రాశారు. ‘హిందువుల పండుగలు’ అనే గ్రంథంలో దీనిని ‘ఇంద్రైకాదశి’గా పేర్కొన్నారు. ఇంద్రసేనుడనే వాడు ఈనాడు యమలోకంలో యాతనలు పడసాగాడు. అదే సమయంలో భూలోకంలో అతని కొడుకు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఫలితంగా యమలోకం నుంచి ఇంద్రసేనుడు స్వర్గలోకానికి వెళ్లాడని పురాణకథ.
ఈనాడు విశ్వకర్మ జయంతి దినం కూడా. మన దేవీ దేవతలకు ఆయుధాలను, వారికి ఆవాసాలను నిర్మించి ఇచ్చినది ఈయనేనని అంటారు. ఏటా భారత ప్రభుత్వం విశ్వకర్మ జయంతి దినాన్ని చేతివృత్తుల దినంగా పాటిస్తోంది. వృత్తిపనివారలు ఈనాడు విశ్వకర్మను విశేషంగా పూజిస్తారు. ఈ రోజు సాయంత్రం ఐదు గంటల పన్నెండు నిమిషాల నుంచి కన్యా సంక్రమణం.
భాద్రపద బహుళ ద్వాదశి
సెప్టెంబరు 18, గురువారం
భాద్రపద బహుళ ద్వాదశి తిథిని యతి మహాలయ, యతి ద్వాదశిగా కూడా వ్యవహరిస్తారు. ఈ రోజున యతులను, సన్యాసులను ఆరాధిస్తారు. ఇది పితృపక్షంలో ఒక భాగమైన తిథి.
భాద్రపద బహుళ త్రయోదశి
సెప్టెంబరు 19, శుక్రవారం
భాద్రపద బహుళ త్రయోదశి నాడు ప్రదోష వ్రతాన్ని ఆచరించాలి. భాద్రపద బహుళ త్రయోదశి కలియుగాది అని ఆమాదేర్ జ్యోతిషీలో రాశారు. ద్వాపర యుగాది అని తిథి తత్వంలోనూ, చతుర్వర్గ చింతామణిలోనూ ఉంది. భాద్రపద కృష్ణ త్రయోదశి కలియుగాది దినం. ఈ యుగమున ఒక పాదాన మాత్రమే ధర్మం నడుస్తుందని అంటారు. కొంతకాలానికి అది కూడా నశిస్తుంది. అధర్మమే ప్రవర్తిస్తుంది. భగవంతుడు కృష్ణవర్ణధారిగా ఉంటాడు. ప్రజలు అనాచారవంతులై ఉంటారు. దీనిని అయోమయ యుగమని కూడా అంటారు. ఈ యుగమున ప్రజలు అన్నగత ప్రాణులు. ఈ యుగ ప్రమాణం 4,32,000 మానవ సంవత్సరాలు.
భాద్రపద బహుళ చతుర్దశి
సెప్టెంబరు 20, శనివారం
భాద్రపద బహుళ చతుర్దశి తిథి నాడు మాసశివరాత్రి. ఈనాటి ఉపవాసం వలన శివలోకప్రాప్తి అని తిథి తత్వం చెబుతోంది. స్మ•తి కౌస్తుభంలో ‘శస్త్రాదిహితన్యైకోదిష్టం తత్పార్వణంచ’ అని పేర్కొన్నారు.
భాద్రపద బహుళ అమావాస్య
సెప్టెంబరు 21, ఆదివారం
భాద్రపద బహుళ అమావాస్యను పితృకామావాస్యగా ఆయా వ్రత గ్రంథాలలో పేర్కొన్నారు. దీనినే పితరమావాస అనీ, మహాలయ అమావాస్య అని కూడా అంటారు. ఈనాడు పితృ దేవతల సంతృప్తి కోసం తగిన విధాయ కృత్యాలు ఆచరించాలని వాటిలో ఉంది. ఇంకా ఈనాడు కన్యకా సంక్రమణం అనీ, అశ్వశిరోదేవ పూజ చేసి ఉపవాసం ఉండాలని హేమాద్రి పండితుడు చెబుతున్నాడు. సంక్రాంతి స్నాన వ్రతం కూడా ఆచరించాలని ఆయా వ్రత గ్రంథాలలో రాశారు.
ఈనాటి నుంచే తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. పూలను అందంగా అలంకరించి గ్రామ దేవతలను పూజించే ప్రకృతి పర్వం బతుకమ్మ. ఈనాటి నుంచి తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు కొనసాగుతాయి. మొదటి రోజును ఎంగిలిపూల బతుకమ్మ పేరుతో వేడుకలు నిర్వహిస్తారు. దసరాకు ముందు రోజు నాడు బతుకమ్మ వేడుకలు ముగుస్తాయి.
ఈనాటితో సెప్టెంబరు మాసంలో భాద్రపద మాస తిథులు ముగుస్తాయి. సెప్టెంబరు 22 నుంచి ఆశ్వయుజ మాస తిథులు ఆరంభమవుతాయి.
ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి
సెప్టెంబరు 22, సోమవారం
ఆశ్వయుజ మాసం ప్రారంభం. దేవీ శరన్నవరాత్రులు ఈనాటి నుంచే శ్రీకారం చుట్టుకుంటాయి. దేవీ శరన్నవరాత్రులకు ఇది ఆరంభ తిథి. ఈ తిథి నాడు స్తనవృద్ధి గౌరీవ్రతం ఆచరించాలని నియమం. నీలమత పురాణంలో ఈనాడు గృహదేవీ పూజ చేయాలని ఉంది. స్మ•తి కౌస్తుభంలో- ఈనాటి నుంచి నవరాత్రారంభమని పేర్కొన్నారు. దేవీ నవరాత్రుల పూజలు ఈ పాడ్యమి మొదలుకుని విజయదశమి వరకు చేస్తారు. ఈ గడియల్లోనే భద్రకాళి అష్టాదశ భుజ మహిషాసురమర్దనిగా అవతారమెత్తింది. ఆదిశక్తి- మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాదుర్గలుగా అవతరించింది. ఈ దేవతను హ్రీం, శ్రీం, క్లీం సంకేతమూర్తిగా ఆరాధిస్తారు. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటుగా ప్రశాంతమైన చిత్తాన్ని ప్రసాదించే త్రిభువన పోషిణి, శంకరతోషిణి, విష్ణువిలాసిని ఈ అమ్మలగన్న అమ్మ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు దుర్గాదేవిని శైలపుత్రిగా అలంకరించి పూజిస్తారు.
అలాగే, బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఈనాడు తెలంగాణ అటుకల బతుకమ్మను పూజిస్తారు.
ఆశ్వయుజ శుద్ధ విదియ
సెప్టెంబరు 23, మంగళవారం
ఆశ్వయుజ శుద్ధ విదియ నాడు చంద్ర దర్శనం. దేవీ నవరాత్రి ఉత్సవాలు రెండో రోజైన ఈనాడు అమ్మవారిని కొన్ని ప్రాంతాలలో బ్రహ్మచారిణి దేవిగా, మరికొన్ని ప్రాంతాలలో బాలా త్రిపురసుందరిగా అలంకరించి పూజిస్తారు.
ఇక, బతుకమ్మ వేడుకల్లో ఇది మూడో రోజు. ఈనాడు ముద్దపప్పు బతుకమ్మ వేడుక జరుపుకుంటారు. ఈనాటి నుంచే హస్త కార్తె ప్రారంభమవుతుంది.
ఆశ్వయుజ శుద్ధ తదియ
సెప్టెంబరు 24, బుధవారం
ఆశ్వయుజ శుద్ధ తదియ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో మూడో రోజు. ఈనాడు అమ్మవారిని చంద్రఘంటాదేవిగా,
శ్రీ అన్నపూర్ణదేవిగా అలంకరించి కొలుస్తారు.
ఇక, తెలంగాణ బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు నాను బియ్యం బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారు.
అలాగే, పంచాంగానన్నుసరించి.. ఆశ్వయుజ
శుద్ధ తదియ తిథి నాడు మేఘపాలీయ తృతీయా వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే గ్రంథంలో రాశారు.
ఇక, తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగేది ఈనాడే. సెప్టెంబరు 24 నుంచి అక్టోబరు 2 వరకు ఇవి అంగరంగ వైభవంగా జరుగుతాయి. మొదటి రోజు ధ్వజరోహణం గావిస్తారు.
ఆశ్వయుజ శుద్ధ చవితి
సెప్టెంబరు 25, గురువారం
ఆశ్వయుజ శుద్ధ చతుర్థి నాటికి దేవీ శరన్నవరాత్రులు నాలుగో రోజుకు చేరుకుంటాయి. ఈనాడు అమ్మవారిని కొన్ని ప్రాంతాలలో కూష్మాండదేవిగానూ, మరికొన్ని ప్రాంతాలలో శ్రీగాయత్రి దేవిగానూ అలంకరిస్తారు.
అలాగే, తెలంగాణ బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈనాడు అట్ల బతుకమ్మ పండుగ జరుపుకుంటారు.
ఇక, తిథానుసారం.. ఈనాడు దేవతలను, సువాసినులను పూజించాలని నీలమత పురాణంలో ఉంది. చవితి తిథి వినాయకుడికి ప్రీత్యర్థం కాబట్టి ఈనాడు గణేశ చతుర్థి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు.
ఆశ్వయుజ శుద్ధ చవితి
సెప్టెంబరు 26, శుక్రవారం
ఆశ్వయుజ శుద్ధ చతుర్థి తిథి సెప్టెంబరు 26న కూడా కొనసాగుతోంది. ఈనాడు అమ్మవారిని స్కందమాతగా అలంకరించి కొలుస్తారు. అలాగే, తెలంగాణ బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఆర•వ రోజైన ఈనాడు అలిగిన బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారు.
ఆశ్వయుజ శుద్ధ పంచమి
సెప్టెంబరు 27, శనివారం
ఆశ్వయుజ శుద్ధ పంచమి తిథి నాడు ఉపాంగ లలితా వ్రతం ఆచరించాలి. శాంతి పంచమీ వ్రత దినమని చతుర్వర్గ చింతామణిలో ఉంది. లలితా పంచమి అని కూడా అంటారు.
ఇక, దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా ఆరో రోజైన ఈనాడు దుర్గాదేవిని కాత్యాయనిదేవిగా అలంకరించి పూజిస్తారు. తెలంగాణ బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈనాడు వేపకాయల బతుకమ్మను పూజిస్తారు. వేపకాయలు, బెల్లం, పాలు నైవేద్యంగా సమర్పిస్తారు.
ఆశ్వయుజ శుద్ధ షష్ఠి
సెప్టెంబరు 28, ఆదివారం
ఆశ్వయుజ శుద్ధ షష్ఠి స్కంద షష్ఠిగా ప్రతీతి. ఈనాడు కుమారస్వామిని విశేషంగా ఆరాధిస్తారు. ఆశ్వయుజ శుద్ధ షష్టితో దేవీ శరన్నవరాత్రులు ఏడవ రోజుకు చేరుకుంటాయి. ఈనాడు అమ్మవారిని కాళరాత్రిగా,
శ్రీ సరస్వతిదేవిగా అలంకరించి పూజిస్తారు. తెలంగాణ బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా ఈనాడు వెన్నముద్దల బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారు.
ఆశ్వయుజ శుద్ధ సప్తమి
సెప్టెంబరు 29, సోమవారం
ఆశ్వయుజ శుద్ధ సప్తమి తిథి సూర్యారాధనకు ఉద్ధిష్టమైనది. అందుకే ఈ తిథిని భాను సప్తమిగా వ్యవహరిస్తారు.
అలాగే, ఈనాడు గరుడ జయంతి దినం అని కూడా అంటారు. ఈ తిథి శుభ సప్తమీ, ద్వాదశ సప్తమీ వ్రతాల దినమని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈనాడు స్నానం చేసి కపిల గోవును పూజించి అనంతరం, పంచగవ్యములను మాత్రమే సేవించి మర్నాడు భోజనం చేయాలి. ఈనాడే దేవీ త్రిరాత్ర వ్రతం కూడా ఆచరిస్తారు. దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా ఈనాడు అమ్మవారిని మహాగౌరిదేవిగా ఆరాధిస్తారు. ఇక, తెలంగాణ బతుకమ్మ ఉత్సవాలకు ఇది ముగింపు రోజు. ఈనాడు సద్దుల బతుకమ్మ పేరుతో అమ్మవారిని పూజించి, నిమజ్జనం చేయడంతో వేడుకలు ముగుస్తాయి.
ఆశ్వయుజ శుద్ధ అష్టమి
సెప్టెంబరు 30, మంగళవారం
ఆశ్వయుజ శుద్ధ అష్టమి దుర్గాష్టమీ తిథి. మన తెలుగు రాష్ట్రాల్లో ఇది శరన్నవరాత్రుల్లో భాగమైన అష్టమి దినం. దుర్గాష్టమీగా వ్యవహరించే ఈనాడు మహాష్టమి, దుర్గపూజ, భద్రకాళీ పూజ వంటివి ఆచరిస్తారు. దుర్గాష్టమి వ్రతం ఆచరించాలి. ఇక, మాళవ దేశంలో ఈనాటి సాయంకాలం ఒక ఇంట స్త్రీలందరూ సమావేశమవుతారు. సీసామూతి దగ్గర నోటితో ఊది బాలురు శబ్దం తెప్పించేటట్లు ఈనాడు స్త్రీలు ఒక కుండమూతిలో కానీ, ఇత్తడి బిందె మూతిలో కానీ ఊది శబ్దం చేస్తారు. ఇలా ఊదుతూ బాగా శబ్దం చేసిన స్త్రీని మహాలక్ష్మి పూనినట్టు మిగతా స్త్రీలు నమ్ముతారు. ఆ పూనిన స్త్రీ వేసిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెబుతుందట. తెల్లవారడంతోనే ఆ పూనకం పోతుంది. రాత్రి దేవత పూనిన స్త్రీకి ఇంటి యజమానురాలు ఉదయాన్నే కుంకుమ, కొబ్బరికాయ, బియ్యం, రవికల గుడ్డ ఇస్తుంది. ఈ ఉత్సవానికి పురుషులు రాకూడదు. ఇది మాళవ దేశపు ప్రత్యేక పర్వాల్లో ఒకటి.
ఆశ్వయుజ శుద్ధ అష్టమి ఉన్న ఘడియల్లోనే తెలుగు పంచాంగాలు నవమి వేడుకలను కూడా చూపిస్తున్నాయి. కాబట్టి ఈనాడు మహర్నవమి. శరన్నవరాత్రుల్లో తొమ్మిదో రోజైన ఈనాడు దుర్గాదేవిని మహిషాసురమర్దనిదేవిగా, సిద్ధిధాత్రిదేవిగా అలంకరించి పూజిస్తారు. ఈనాటి అమ్మవారి ప్రధాన అలంకరణ- మహిషాసుర మర్దిని. మహిషాసురుడనే రాక్షసుడిని అమ్మవారు ఈనాడే సంహరించారని అంటారు. ఈనాడు ఆయుధ పూజ చేస్తారు. వివిధ కులవృత్తుల వారు తమ పనిముట్లను, విద్యార్థులు తమ విద్యాసామగ్రిని, వివిధ బతుకుదెరువులు, జీవనోపాధులకు ఆధారమైన వస్తువులను ఈనాడు విశేషంగా పూజిస్తారు.ఇంకా ఈనాడు మాతృ వ్రతం ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. ఇంకా నామ నవమి వ్రతమనీ, దుర్గా నవమీ వ్రతమని, శౌర్యవ్రతం, భద్రకాళీ వ్రతం, కోటి గుణ కరందానం, మహా ఫలవ్రతం, ప్రదీప్త నవమీ వ్రతం మున్నగు వ్రతాలు ఈనాడు ఆచరిస్తారని వివిధ వ్రత గ్రంథాలలో ఉంది. అలాగే, ఆశ్వయుజ శుద్ధ నవమి స్వారోచిష మన్వంతరాది దినమని కూడా అంటారు. ఈనాడు అమ్మవారిని సిద్ధిధాత్రి దేవిగా అలంకరిస్తారు.
మన క్షేమం కోరే మహాలయ పక్షం
మన తెలుగు మాసాలలో ప్రత్యేకమైన వైజ్ఞానిక ధర్మం ఉంది. ఆ వరుసలో ఆరోగ్యానికి భద్రత కల్పించేది- భాద్రపదం. ప్రతి నెలలోనూ పౌర్ణమి రోజు వచ్చే నక్షత్రం ఆధారంగా ఆ మాసానికి పేరు పెట్టడం ఆయా మాసాల ప్రత్యేకత. ఈ క్రమంలో పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర పూర్ణిమ నాడు చంద్రుడు ఆయా నక్షత్రాల్లో ఉంటే అది భాద్రపద మాసం అవుతుంది. తెలుగు నెలల వరుసలో ఇది ఆరవది. పూర్తి వర్ష రుతువు. వానలు మెండుగా పడతాయి. ఇంకా ఈ మాసపు విశేషాల్లోకి వెళ్తే..
భాద్రపద మాసంలో ఏకాన్న ఆహార వ్రతాన్ని ఆచరిస్తారు. దీనివల్ల ధనం, ఆరోగ్యం ప్రాప్తిస్తాయని అంటారు.
భాద్రపద మాసంలో పెరుగును ఆహారంలో తీసుకోకూడదని చెబుతారు. అలాగే స్త్రీలు మొక్కజొన్న గింజలు, దోసకాయ ముక్కలు తప్పకుండా ఈ మాసంలో తినాలనే నియమం ఉంది.
గణపతి నవరాత్రులు భాద్రపదం ప్రత్యేకం (వినాయక చవితి ఆగస్టులోనే అయిపోయినా.. నవరాత్రులు మాత్రం సెప్టెంబరు మాసంలో కొనసాగుతున్నాయి. నిమజ్జనం కూడా సెప్టెంబరులోనే).
రుషి పంచమి నాడు స్త్రీలంతా రుషులను పూజించి ఉపవాసం ఉండాలి. అలా చేస్తే రుషుల అనుగ్రహంతో తమలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయని అంటారు.
పరివర్తన ఏకాదశి రోజున ఉపవాసం ఉండి, జాగరణ చేస్తే.. గృహస్తు జీవితంలో చేసిన పాపాలన్నీ నశించిపోతాయని అంటారు.
భాద్రపద మాసంలో మరో ప్రత్యేకత.. మహాలయ పక్షం. భాద్రపద పౌర్ణమి మర్నాటి నుంచి పదిహేను రోజుల పాటు ఈ మహాలయ పక్షం వస్తుంది. పితృదేవతలందరినీ ఈ కాలంలో తలుచుకోవడం, వారికి వైదిక కర్మలు నిర్వహించడం వంటివి ఈ పదిహేను రోజుల కాలంలో చేయాలని చెబుతారు. మనకీ జన్మనిచ్చిన మన పూర్వుల రుణం తీర్చుకునే అవకాశం మహాలయ పక్షంతోనే సాధ్యమవుతుంది
అసలు ఆదిలో కలియుగం భాద్రపద మాసంతోనే మొదలైందని అంటారు.
భాద్రపద మాసంలో వచ్చే ముఖ్యమైన తిథుల సమయంలో విరివిగా దానధర్మాలు చేయాలని అంటారు. ముఖ్యంగా ఉప్పు, బెల్లం వంటివి దానం చేస్తే విశేష ఫలితాలు కలుగుతాయని అంటారు.
భాద్రపద అమావాస్య హిందువులకు చాలా ముఖ్యమైనది. ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే స్నానం చేసి, ఇష్టదైవాన్ని పూజించి దానధర్మాలు చేసిన అనంతరం పూర్వీకులకు (తల్లిదండ్రులు, ఇతర పెద్దలు) నైవేద్యం సమర్పిస్తారు. ఈనాడు నదిలో కాకుంటే చెరువులో స్నానం చేయడం ముఖ్యం. ఉదయాన్నే సూర్య నమస్కారాలు ఆచరించాలి. అనంతరం నది తీరాన పూర్వీకులకు పిండ ప్రదానం సమర్పించాలి. అలాగే పేదలకు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల పితురులకు శాంతి, విముక్తి లభిస్తాయని చెబుతారు.
భాద్రపద అమావాస్య నాడు శనిదేవుడిని పూజించే ఆచారం కూడా ఉంది. రావి చెట్టు కింద ఆవగింజల నూనెతో దీపం వెలిగించి, పూర్వీకులను తలచుకుని, ఆ చెట్టు చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేయాలి.




















































































Review అమ్మ ఆశీర్వాదం.