శివ… శక్తి… శ్రద్దభక్తి

తెలుగు పంచాంగం ప్రకారం ఆశ్వయుజ మాసం ఆరవది. ఆంగ్లమానం ప్రకారం పదవ మాసం (అక్టోబరు). ఈ నెలలో ఆశ్వయుజం మాసంలోని కొన్ని రోజులు, కార్తీక మాసంలోని కొన్ని రోజులు కలుస్తాయి. దీపావళి, కార్తీక స్నానమారంభం, భగినీ హస్త భోజనం, నాగుల చవితి వంటి ఎన్నో పండుగలు, పర్వాలు ఈ మాసంలో నెలవై ఉన్నాయి.
ఈ నెలంతా (అక్టోబరు- ఆశ్వయుజం – కార్తీకం) అటు శక్తి ఆరాధనకు, ఇటు శివారాధనకు శ్రేష్ఠమైనది. ఆశ్వయుజంలోని కొన్ని మధ్య రోజులతో పాటు కార్తీక మాసం ఈ నెలలోనే ఆరంభమవుతుంది. కార్తీకమాస మంతా వెన్నెల వెలుగులు పరుచుకుని ఉంటాయి. భువిలో జ్యోతులుగా వెలిగే దీపాలు ఆ వెన్నెల వెలుగులకు మరింత శోభను చేకూరుస్తాయి. పూర్తిగా నెలంతా భగవధా రాధనకు అనుకూలమైనది. ఈ మాసంలో కూరలేమీ తినకుండా ఉసిరికాయ వ్యంజనంగా పులగం తిన్న వారికి, మోదుగు ఆకుల్లో భోజనం చేసే వారికి, తెల్లవారుజామునే గోపూజ చేసే వారికి అఖండమైన పుణ్యం ప్రాప్తిస్తుందని అంటారు. ఈ నెలలోని ఆశ్వయుజ, కార్తీక మాసాల్లో వచ్చే ఆయా తిథులు.. ఆ నాడు ఆచరించాల్సిన వ్రతాలు, పర్వాల గురించి తెలుసుకుందాం.
ఆశ్వయుజ శుక్ల ఏకాదశి
(అక్టోబరు 1, ఆదివారం)
ఆశ్వయుజ శుద్ధ ఏకాదశిని పాశాంకుదైకాదశి అని కూడా అంటారు. యమపాశానికి అంకుశంగా పనిచేసే ఏకాదశి ఇదని ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో పేర్కొన్నారు. ఈనాడు ఏకాదశి వ్రతాన్ని చేసిన వారికి ఇది నరకప్రాప్తి లేకుండా చేసి స్వర్గలోకాన్ని పొందేలా చేస్తుంది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు ఆచరించే మధన ద్వాదశి వ్రతానికి ఆశ్వయుజ శుక్ల ఏకాదశి ప్రారంభ దినం. ఈ వ్రతం స్త్రీలకు సౌభాగ్యప్రదమైనది. వ్రతం చేయదల్చిన వారు ఆశ్వయుజ శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి తులసీ సహిత శ్రీమహా విష్ణువును సమాహిత చిత్తంతో పూజించాలి. తులసి కోట వద్ద పంచ పద్మాలు •ట్టాలి. అయిదు దీపాలు వెలిగించాలి. అయిదు విధాలైన నైవేద్యాలు పెట్టాలి. ఇలా కార్తీక శుక్ల పక్ష ఏకాదశి వరకు చేయాలి. ద్వాదశి నాడు చలిమిడి పాత్రలో పాలుపోసి చెరకుగడలతో చిలకాలి.
ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి
అక్టోబరు 2, సోమవారం
ఈ తిథి నాడు విశోక దశి, గోవత్స ద్వాదశీ వ్రతాలు ఆచరించాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది. అఖండ ద్వాదశీ, పద్మనాభ ద్వాదశీ వ్రతం చేయాలని, వాసుదేవ పూజ ఆచరించాలని అందులో రాశారు. ఈనాడు ఉపవాసం ఉండాలని స్మ•తికౌస్తుభంలో ఉంది.
ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ
అక్టోబరు 5, గురువారం
ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ నాడు కౌము దోత్సవం, అక్షక్రీడ, కోజాగర్తి వ్రతం, లక్ష్మీంద్ర కుబేరాది పూజ చేస్తారని పంచాంగాలలో ఉంది. గదాధర పద్ధతి దీనిని కుమార పౌర్ణమాసీ అని, మహాశ్వినీ, కౌముదీ పూర్ణిమ అని పేర్కొంటోంది. దీనిని బట్టి ఈనాడు లక్ష్మిని, ఇంద్రుడిని పూజించాలని, రాత్రంతా జాగరణం చేయాలని వ్రత గ్రంథాలను బట్టి తెలుస్తోంది. ఇక, ఈనాడు ఆంధ్ర దేశంలో గొంతెమ్మ పండుగ నిర్వహిస్తారు. ఆశ్వయుజ మాసారంభం నుంచీ హరిజనులు వేషాలు వేసుకుని రైతుల ఇళ్లకు వచ్చి ధాన్యం తీసుకుంటారు. ఇలా పోగుచేసిన ధాన్యం, బియ్యం తదితరాలతో పూర్ణిమ నాడు లేదా అట్లతద్ది నాడు పెద్ద ఊరేగింపు నిర్వహిస్తారు. భవిష్యోత్తర పురాణంలో పేర్కొన్న కుంతీ వ్రతానికి గొంతెమ్మ పండుగకు మధ్య సారూప్యం ఉంది.
ఇక, ఆశ్వయుజ పూర్ణిమ నాడు నిర్వహించే మరో ముఖ్య వ్రతం కోజాగౌరీ పూర్ణిమ. ఇది లక్ష్మీదేవికి, శ్రీరామునికి ప్రియమైన వ్రతం. ఆనాటి అర్ధరాత్రి వేళ లక్ష్మీపూజ చేస్తారు. అతిథులకు కొబ్బరికాయలోని పాలు పంచుతారు. ఈ రోజు అక్షక్రీడ (జూదం) ఆడటానికి శాస్త్రాలు అనుమ తిస్తాయి. ఈనాడు అక్షక్రీడ భాగ్యవర్థకమని వ్రత గ్రంథాల్లో ఉంది. చుట్టాలు, స్నేహితులతో కలిసి రాత్రంతా జూదం ఆడటం వ్రత విధానంలో ఒక భాగం. ఆశ్వయుజ మాసంలో ఆచరించే వ్రతాల్లో మిక్కిలి విశేష భాగ్యప్రదాయిని అయిన వ్రతం ఏదని వాలఖిల్య రుషిని ఇతర రుషులు ప్రశ్నించా రట. వాలఖిల్యుడు అందుకు సమాధానంగా కోజాగౌరీ వ్రతాన్ని గురించి చెప్పారట!.
ఆశ్వయుజ కృష్ణ పాడ్యమి
అక్టోబరు 6, శుక్రవారం
ఈ తిథి నాడు జయావాప్తి అనే వ్రతాన్ని ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే వ్రత గ్రంథంలో ఉంది. అయితే, ఈ వ్రతాచరణ విధానం గురించి వివరాలు అంతగా అందు బాటులో లేవు.
ఆశ్వయుజ కృష్ణ విదియ
అక్టోబరు 7, శనివారం
ఆశ్వయుజ బహుళ విదియ నాడు అశూన్య వ్రతం ఆచరించాలని పురుషార్థ చింతామణిలో ఉంది. దీనినే అట్లతద్ది భోగి అని కూడా అంటారు. ఉండ్రాళ్ల తద్ది, అట్లతద్ది, మకర సంక్రాంతి.. ఈ పర్వాలకు ముందు రోజును భోగి అని వ్యవహ రిస్తారు. అంటే అట్లతదియకు ముందు వచ్చే రోజు ఇది. ఉండ్రాళ్ల తద్ది భోగి నాటి మాదిరిగానే అట్లతద్ది భోగి నాడు కూడా తలంటి పోసు కుంటారు. గోరింటాకు నూరి గోళ్లకు, వేళ్లకు, చేతులకు పెట్టుకుంటారు. తెల్లవారుజామునే ఉట్టి కింద ముద్ద తింటారు. తాంబూలం వేసుకుని కన్యలు, మహిళలు సాయంత్రం వరకు ఆటపాటలతో గడుపుతారు. అట్లతద్ది భోగి, అట్లతద్ది పర్వాలు పల్లెల్లో నాడు కమనీయంగా జరిగేవి.
ఆశ్వయుజ కృష్ణ తదియ
అక్టోబరు 8, ఆదివారం
ఆశ్వయుజ బహుళ తదియ నాడు కనక గణేశ వ్రతం, లలితా గౌరీ వ్రతం, చంద్రోదయోమా వ్రతం తదితర వ్రతాలు ఆచరిస్తారని ఆయా వ్రత గ్రంథాల్లో ఉంది. వీటిలో చంద్రోదయోమా వ్రతం ‘అట్లతద్ది’ అనే పేరుతో తెలుగు నాట బాగా ప్రసిద్ధి. ఈ రోజు స్త్రీలు చంద్రుడు ఉదయించిన తరువాత ఉమాదేవిని పూజించి, భుజిస్తారు. ‘అష్టాదశ వర్ణాలకు అట్లతద్ది’ అని నానుడి. తెలుగు నాట బాగా ప్రాచుర్యంలో, ఆచరణలో ఉన్న వ్రతమిది. అట్లతద్దికి లేదా అట్ల తదియకు ముందు రోజును అట్లతద్ది భోగి అంటారు. ఆనాడు స్త్రీలంతా తలంటి పోసుకుంటారు. గోరింటాకు పెట్టుకుంటారు. తెల్లవారుజామునే (తదియ నాడు) తొలి కోడి కూయగానే నిద్రలేచి ఉట్టి కింద కూర్చుని చద్ది అన్నం తింటారు. తాంబూలం వేసుకుంటారు. అప్పటి నుంచి మళ్లీ తెల్లవారే వరకు నిద్రపోరు. కొత్త బట్టలు కట్టుకుని ఆటపాటలతో కాలక్షేపం చేస్తారు. ఊయలలు ఊగుతారు. పగటి పూట భోజనం చేయరు. పొద్దు పొడిచాక స్త్రీలు అందంగా ముస్తాబై తోటలు, దొడ్ల వెంట తిరిగి సాయంకాలం తాము చేయబోయే పూజకు అవసరమైన పువ్వులు, పత్రి సమకూర్చుకుంటారు. పగలంతా వీలైనప్పుడల్లా ఊయల ఊగుతారు. ఆ సాయంత్రం ఉమాదేవి (పార్వతి)ని పూజించి చంద్రుడిని చూసి అట్లు తదితర పిండివంటలతో భోజనం చేస్తారు.
ఇది అతివల పర్వం. తోటలలో, దొడ్లలో విసంగా తిరుగుతూ పత్రి, పువ్వులు సేకరించడం, యథేచ్ఛా విహారం, ఊయలలూగడం, వినోదించడం అంగనలకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. నగరాలలో కంటే పల్లెల్లో ఈ పండు గను మనోజ్ఞంగా జరుపుకొంటారు. తెల్లవారు జామునే చద్ది అన్నం, గోంగూర పచ్చడి, నువ్వుల ఉండ, ఉల్లిపాయ పులుసు వంటివి తినక పోయినా, అట్లతద్ది నోము నోచకున్నా, గోరింటాకు పెట్టుకోకపోయినా, ఉయ్యాల ఊగకపోయినా ముసలి మొగుడు వస్తాడని మరీ భయపెట్టి తమ ఆడపిల్లలు ఈ నోము ఆచరించేలా ఇంట్లోని పెద్దలు చేస్తారు. గోరింటాకు పెట్టుకోవడం ఆడవాళ్లకు వరణీయం. ఆషాఢంలో ఒకసారి, భాద్రపదంలోని ఉండ్రాళ్ల తద్దికి, ఆశ్వయుజంలోని అట్లతద్దికి.. ఇలా ఏడాదిలో మూడుసార్లు అతివలు గోరింటాకు పెట్టుకుంటారు. ఇది ఎంత బాగా పండితే అంత శుభప్రదమని భావిస్తారు. పెళ్లి కాని అమ్మాయిలు మంచి భర్త కోసం, పెళ్లయిన వారు భర్త ఆయురారోగ్యాల కోసం ఈ వ్రతం చేయడం తెలుగు నాట ఆచారంగా కొనసాగుతోంది.

ఆశ్వయుజ కృష్ణ పంచమి
అక్టోబరు 10, మంగళవారం
ఈనాడు ఘోటక పంచమి. గదాధర పద్ధతి అనే వ్రత గ్రంథంలో ఈ తిథి నాడు ఘోటక పంచమి వ్రతాన్ని ఆచరించాలని ఉంది.
ఆశ్వయుజ కృష్ణ అష్టమి

అక్టోబరు 12, గురువారం
ఆశ్వయుజ శుక్ల అష్టమినే జితాష్టమి అనీ అంటారు. ఈనాడు జీమూతవాహన పూజ చేస్తారు. ఇది స్త్రీలకు పుతప్రదాన్ని కలిగించే వ్రతం. సౌభాగ్యప్రదమైనది. సాయంకాల ప్రదోష సమయాన ఈనాడు పూజలు ఆచరిస్తారు. ఉత్తర భారతదేశంలో ఈ వ్రతం మిక్కిలి ఆచారంలో
ఉంది. చతుర్వర్గ చింతామణిలో ఈనాడు మంగళా వ్రతం, కృత్సరా సముచ్ఛయంలో మహాలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలని ఉంది. కృత్యసార సము చ్ఛయంలో ఈ అష్టమిని జీవత్పుత్రికాష్టమీ అని పేర్కొన్నారు. అంటే పుత్ర సంతానాన్ని కలిగించే వ్రతమని ప్రతీతి. ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో ఈ తిథిని కాలాష్టమిగా వ్యవహ రించారు.
ఆశ్వయుజ బహుళ నవమి

అక్టోబరు 13, శుక్రవారం
ఆశ్వయుజ బహుళ నవమి నాడు రథ నవమీ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి గ్రంథంలో పేర్కొన్నారు. ఈనాడు దుర్గాపూజ చేయాలని వ్రత విధానం. వివిధ వ్రత గ్రంథాలలో ఈ పూజా విధానం గురించి పెద్దగా వివరాలు అందుబాటులో లేవు.
ఆశ్వయుజ కృష్ణ ఏకాదశి

అక్టోబరు 15, ఆదివారం
ఆశ్వయుజ బహుళ ఏకాదశిని రమైకాదశిగా ఆమాదేర్‍ జ్యోతిషీ అనే గ్రంథంలో పేర్కొన్నారు. శోభనుడు అనే రాజు ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి స్వర్గలోక ప్రాప్తి పొందాడని ప్రతీతి. కొన్ని గ్రంథాలలో ఈనాడు వాల్మీకి జన్మించిన రోజని ఉంది. బోయి కులస్తులు ఈనాడు వాల్మీకి జయంతి ఉత్సవాన్ని నిర్వహిస్తారు.
ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి

అక్టోబరు 16, సోమవారం
ఈ తిథి ధన్వంతరి జయంతి దినం. ధన్వం తరి గొప్ప వైద్య విద్యావేత్త. పాల కడలి నుంచి అమృతభాండాన్ని పట్టుకుని విష్ణుమూర్తే ధన్వం తరిగా అవతరించాడని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ధన్వంతరి కలశం నుంచి పుట్టాడు. అది ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు జరిగిందని బ్రహ్మాండ పురాణంలో ఉంది. భరద్వాజుని వద్ద ధన్వంతరి శిష్యరికం చేసి ఆయర్వేద విద్యను నేర్చుకున్నాడని ప్రతీతి. దివోదాసు పేరుతో ఆయన కాశీకి రాజయ్యాడని కూడా పురాణ కథనం. ఒక చేత్తో జలగ, మరో చేత్తో అమృతభాండం పట్టుకుని ధన్వంతరి జన్మించాడని అంటారు. ధన్వంతరి అమృత కలశంతో పుట్టాడని, ఆ కలశంలోని అమృతం సేవించడం వల్ల అన్ని విధాలైన రోగాలు నశించాయని ఐతిహ్యం. ధన్వంతరి జయంతి నాడు ధన్వంతరి పూజ చేసే వారికి రోగ భయం ఉండదని చెబుతారు. ఇక, ఇదే రోజును దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వ్యాఘ్ర ద్వాదశిగా కూడా జరుపుకొనే ఆచారం ఉంది. గుజరాతీలు దీనిని ‘వాగ్‍బరాస్‍’ అంటారు. అక్కడి వాగ్‍ బరాస్‍ నాటికి దీపావళి మూడు రోజులు ఉంటుంది. దీపావళి పండుగ గుజరాతీయులకు కొత్త సంవత్సరాది. మాళవ దేశ మహిళలు గోవత్స ద్వాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. దూడతో కూడిన ఆవును పూజించడం వారి ఆచారం. ఈ పూజ శిశువు క్షేమార్థం నిర్వహిస్తారని అంటారు.
ఆశ్వయుజ బహుళ త్రయోదశి

అక్టోబరు 17, మంగళవారం
ఆశ్వయుజ బహళ త్రయోదశి నాడు గోత్రి రాత్ర వ్రతం ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. ఈ రోజుకి దీపావళి రెండు రోజులు ఉంటుంది. దీపావళి గుజరాతీయులకు సంవత్స రాది. ఇక, ఆమాదేర్‍ జ్యోతిషీ గ్రంథం ఈ రోజును ధన త్రయోదశిగా పేర్కొంటోంది. త్రయోదశి అనగా పదమూడో తిథి. పాశ్చాత్యుల్లో 13 అంకె మంచిది కాదనే అభిప్రాయం ఉంది. కానీ, భారతీయ సంప్రదాయంలో ఇది మంచి థి. గుజరాత్‍, మహారాష్ట్రలలో ఈ పర్వం కన్నులపండువగా జరుగుతుంది. ఈ రోజు పూజలు ఆచరిస్తే లక్ష్మీదేవి తమ ఇంటికి వస్తుందని వారి విశ్వాసం. ధన త్రయోదశి రోజు శుచిగా, శుభ్రంగా ముస్తాబై ఇంట్లోని బంగారు, వెండి ఆభరణాల్ని పాలతో కడుగుతారు. ఇక, మాళవ దేశంలో ఈ రోజున వర్తకులు తమ లెక్కలు సరి చూసుకుంటారు. ఇళ్లకు శుభ్రంగా వల్లె కొట్టి అందంగా అలంకరించుకుంటారు. ఈనాడు యమలోకంలోని పితురులు తమ పూర్వ గృహాలకు తిరిగి వస్తారని మాళవ దేశస్తుల నమ్మిక. ధన త్రయోదశి నాడు సాయంత్రం వారు తమ ఇంటి ముందు రోడ్డు మీద దక్షిణ దిక్కుగా దీపం ఉంచుతారు. వచ్చే పిత్రులకు అది దారి చూపు తుందని నమ్ముతారు. ఈనాడు ఇంటిలో గదికి ఒక దీపమైనా ఉంచుతారు. ఇంటిలో దీపాలు స్త్రీలు పెడతారు. రోడ్డు మీద దక్షిణ దిక్కుగా పెట్టే దీపం తల్లిదండ్రులు లేని ఇంటి యజమాని మాత్రమే పెడతాడు.
తెలుగు రాష్ట్రాల్లో ధన త్రయోదశిని మరో విధంగా జరుపుకుంటారు. ధన్‍తేరస్‍గా కూడా దీనిని వ్యవహరిస్తారు. ఈనాడు ఎంతో కొంత మొత్తంలో బంగారం కానీ, కనీసం వెండినైనా కానీ కొనాలనే ఆచారం ప్రాచుర్యంలో ఉంది. ఆ రోజు పెద్ద మొత్తంలో బంగారం కొనుగోళ్లు జరుగుతాయి. వర్తక, వ్యాపారాలు మంచి లాభ సాటిగా కొనసాగుతాయి. ఇక, తెలుగు నాట ఇళ్లలో లక్ష్మీపూజ కూడా ఈనాడు ఆచరిస్తారు. మనకు కూడా దీపావళికి రెండు రోజుల ముందే ఈ పుణ్యతిథి వస్తుంది.

ఆశ్వయుజ బహుళ చతుర్దశి
అక్టోబరు 18, బుధవారం
ఏ చతుర్దశి నాడు అభ్యంగన స్నానం వల్ల, దీపదానం వల్ల, యమతర్పణం వల్ల మానవులు తమకు నరకం లేకుండా చేసుకుంటారో దానికి నరక చతుర్దశి అని పేరు. దీనికే ‘ప్రేత చతుర్దశి’ అనే పర్యాయ నామం కూడా ఉంది. ఈనాడు నరకవిముక్తి కోసం యమధర్మరాజును ఉద్దేశించి దీపదానం చేయాలని వ్రత చూడామణి అనే గ్రంథంలో ఉంది. ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి – చతుర్దశి తిథుల మధ్య కృష్ణుడు నరకాసురుడిని సంహరించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా ఈ పండుగను జరుపుకోవడం ఆచారం. నరకాసురుడిని కృష్ణుడు సంహరించిన దినం కావడం వల్లనే దీనికి నరక చతుర్దశి అనే పేరు వచ్చిందని చెబుతారు. కానీ, వ్రత గ్రంథాలను బట్టి చూస్తే నరకాసురునికి, నరక చతుర్దశికి సంబంధం లేదని తెలుస్తోంది. నరకం నుంచి ఉద్ధరించేదే నరక చతుర్దశి అని శాస్త్ర వచనం. ఈనాడు అభ్యంగన స్నానం చేసిన అనంతరం యముడికి తర్పణం చేయ్యాలి. తర్పణం చేసే టప్పుడు ఉత్తరేణి ఆకుల్ని తలపై ఉంచుకోవాలి. ఇది పద్నాలుగవ (చతుర్దశి) తిథి. కాబట్టి యముడిని పద్నాలుగు నామాలతో అర్చించాలనే నియమాన్ని మన పెద్దలు ఏర్పరిచారు.

కార్తీక శుద్ధ పాడ్యమి
అక్టోబరు 20, శుక్రవారం
కార్తీక మాసం ఈ తిథితో ఆరంభం. కార్తీక శుద్ధ పాడ్యమి తిథి బలి చక్రవర్తికి ప్రీతికరమైన రోజు. అందుకే దీన్ని బలి పాడ్యమి అనీ అంటారు. ఈనాడు సంఘటక క్షీర వ్రతం, రథయాత్రా వ్రతం, భాస్కర కృచ్ఛ వ్రతం ఆచరిస్తారని గదాధర పద్ధతిలో ఉంది. ఈ తిథి నాడు కూడా దీనికి ముందు రోజులైన చతుర్దశి, అమావాస్యల మాదిరిగానే అభ్యంగన స్నానం చేయాలి. బలికి ప్రీతికరమైన బలిపూజ, గోక్రీడనం, గోవర్ధన పూజ, మార్గపాలీ బంధనం, వృష్టికాకర్షణం, నవవస్త్రాది ధారణం, ద్యూతం, హారతి, మంగళమాలిక వంటి పక్రియలు ఆచరించాలి.

కార్తీక శుద్ద విదియ
అక్టోబరు 21, శనివారం
ఈ తిథినే యమ ద్వితీయ, భ్రాతృ విదియ అనీ అంటారు. ఈనాడు భగినీ హస్త భోజనం, పుష్ప ద్వితీయ వ్రతాలు చేస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. ఇది ముచ్చటైన పండుగ. ఈ రోజు యమపూజ, చిత్రగుప్తాది పూజ, భగినీ గృహే భోజనం నిర్వహించాలని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. యముని చెల్లెలు యమునా నది. తన అన్నను భోజనానికి రావాలని ఆమె ఎన్నోసార్లు కోరుతుంది. కానీ, తీరిక లేక యముడు వెళ్లలేకపోతాడు. ఎలాగో ఒకసారి వీలు చూసుకుని చెల్లెలు ఇంటికి విందుకు వెళ్తాడు. ఆనాడు సరిగ్గా కార్తీక శుక్ల విదియ. సపరివారంగా వచ్చిన యముడికి చెల్లెలు యమున ఎన్నెన్నో మర్యాదలు చేస్తుంది. చిత్రగుప్తుడిని పూజిస్తుంది. స్వయంగా వంట చేసి అందరికీ వడ్డిస్తుంది. ఆ మర్యాదకు సంతుష్టుడైన యముడు ఏదైనా వరం కోరుకొమ్మం టాడు. ‘ఈ రోజు చెల్లెలి ఇంట ఆమె చేతి వంట తినే సోదరుడికి నరకలోక ప్రాస్తి, అపమృత్యు దోషం లేకుండా వరం ప్రసాదించాలి’ అని కోరుతుంది. యముడు సరేనంటాడు. ఇదంతా జరిగిన రోజు- యముడికి, యమునకు మధ్య సౌహార్ధ్రం నడిచిన విదియ- కాబట్టి దీనికే యమ ద్వితీయ అనే పేరు కూడా వచ్చింది. ఈనాడు బలి చక్రవర్తికి వీడ్కోలు పూజ కూడా జరుపుతారు.

కార్తీక శుద్ధ తదియ
అక్టోబరు 22, ఆదివారం
కార్తీక శుద్ద తదియ నాడు వైష్ణవ కృచ్ఛ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. గ్రంథాంతరంలో విష్ణు గౌరీ వ్రతం చేయాలని ఉంది. విష్ణుగౌరీ వ్రతంలో లక్ష్మీదేవిని పూజించి, ముత్తయిదువను మంగళ ద్రవ్యాలతో గౌరవించి భోజనం పెడతారు. అలాగే, ఈనాడు త్రిలోచన గౌరీ వ్రతం చేయాలని మరికొన్ని వ్రత గ్రంథాలు చెబుతున్నాయి. అలాగే, ఈ తిథి సోదరి తృతీయ వ్రతంగానూ ప్రసిద్ధి. విదియ నాడు సోదరి నుం•రవ మర్యాదలు పొందే సోదరుడు.. తదియ నాడు ఆమెను యథాశక్తి సత్కరించాలని ఆచారం. తన స్థోమతకు తగినట్టుగా సారె, చీరలు ఇవ్వాలి. ఇవి ఉత్తర భారతాన బాగా ప్రాచుర్యంలో ఉన్న పర్వాలు.

కార్తీక శుద్ధ చతుర్దశి
అక్టోబరు 23, సోమవారం
కార్తీక శుద్ధ చవితి తెలుగునాట కొన్ని ప్రాంతాలలో నాగుల చవితి పర్వమై ఉంది. భారతదేశంలో ఎక్కువ ప్రాంతాల్లో శ్రావణ శుద్ధ పంచమి నాగపంచమిగా ప్రసిద్ధి. ఇక, కార్తీక శుద్ధ చవితి నాడు కూడా నాగులను పూజించే ఆచారం ఉంది. ఈనాడు నాగ వ్రతం చేయాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది. తెలుగు వారికి, ప్రత్యేకించి ఆంధ్రులకు నాగులతో ప్రత్యేక అనుబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ఆంధ్రులు నాగజాతి వారని అంటారు. కృష్ణానది తీరాన నాగజాతి వారుండే వారని బౌద్ధ గ్రంథాల వల్ల తెలుస్తోంది. దీపావళి పండుగ వెళ్లిన నాలుగో నాడు నాగుల చవితి వస్తుంది. చవితి నాడు పుట్టలో పాలుపోసి ఆ పుట్టమట్టిని కొంచెం తీసు కుని చెవులకు పెట్టుకోవడం ఆచారం. ఆ మట్టిని పుట్ట బంగారం అనే గొప్ప పేరుతో పిలుస్తారు.

కార్తీక శుద్ధ పంచమి
అక్టోబరు 25, బుధవారం
కార్తీక శుద్ధ పంచమినే జయ పంచమిగానూ వ్యవహరిస్తారు. జ్ఞాన పంచమిగా కొన్నిచోట్ల ఆచారంలో ఉంది. ఈనాడు పాత పుస్తకాల భాండాగారాలన్నీ దులిపి కొత్తగా సున్నం వేసి మళ్లీ పుస్తకాలను యథా స్థానంలో ఉంచుతారు. ఇది జైనుల్లో మిక్కిలి ఆచారంలో ఉన్న విధి. ఇంకా ఈనాడు జయపంచమి, శాంతి వ్రతాలు ఆచరిస్తారని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈ రోజు నుంచి వరుసగా ఏడు రోజులు సప్తర్షి కృచ్ఛ వ్రతం ఆచరిస్తారు.

కార్తీక శుద్ధ షష్ఠి
అక్టోబరు 26, గురువారం
కార్తీక శుద్ధ షష్ఠి మహా షష్ఠి పర్వదినం. ఈనాడు వహ్ని పూజ చేయాలని స్మ•తి కౌస్తుభం చెబుతోంది. ఈనాడు స్కంద షష్ఠి వ్రతం ఆచ రించాలని చతుర్వర్గ చింతామణి పేర్కొంటోంది. ఈ రోజు మొదలు మూడు రాత్రులు పాలు తాగి ఉపవాసం ఉండాలని అంటారు. ఈ ఆచరణను మహేంద్ర కృచ్ఛ వ్రతం అంటారని మరో వ్రత గ్రంథంలో ఉంది.

కార్తీక శుద్ధ సప్తమి
అక్టోబరు 27, శుక్రవారం
కార్తీక శుద్ధ సప్తమి కల్పాది దినమని ఆమాదేర్‍ జ్యోతిషీ గ్రంథంలో ఉంది. ఈనాడు శాక సప్తమీ వ్రతం చేస్తారని చతుర్వర్గ చింతామణి చెబుతోంది. అందులోనే లక్ష్మీప్రద వ్రతం చేస్తారని కూడా ఉంది. సప్తమి మొదలు దశమి వరకు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి. నీరు, బిల్వ దళాలు, పద్మాలు, తామర తూళ్లు గ్రహించాలని వ్రత నియమం.

కార్తీక శుద్ధ అష్టమి
అక్టోబరు 28, శనివారం
ఈనాడు గో పూజ చేయాలని స్మ•తి కౌస్తుభంలో ఉంది. ఈనాడు కార్తవీర్య జయంతి దినం.

కార్తీక శుద్ధ నవమి
అక్టోబరు 29, ఆదివారం
కార్తీక శుద్ధ నవమి కృత యుగాది దినం. యుగాలలో కృత యుగం శ్రేష్ఠమైనది. ఈ యుగంలో ధర్మాలు చెడకుండా ఉంటాయి. ప్రజలు జ్వర పీడితులు కారు. అస్థిగత ప్రాణులుగా ఉంటారు. అంటే, ఎముకలు ఉండే వరకు ప్రాణాలు ధరిస్తారు. తపస్సు ప్రధానమైనది. దీనిని స్వర్ణ యుగమని అంటారు. దీని పరిమితి 17,28,000 మానవ సంవత్సరాలు. తిథి తత్త్వం, చతుర్వర్గ చింతామణి, గదాధర పద్ధతి, ఆమాదేర్‍ జ్యోతిషి మున్నగు గ్రంథాల్లో ఈనాడు త్రేతా యుగాదిగా పేర్కొన్నారు. ఇక, ఆమాదేర్‍ జ్యోతిషీ గ్రంథం ఈ తిథిని దుర్గా నవమిగా కూడా చెబుతోంది. చండికా పూజ చేయాలని తిథి తత్త్వంలో ఉంది.
కార్తీక శుద్ధ దశమి
అక్టోబరు 30, సోమవారం
ఈనాడు సార్వభౌమ వ్రతం ఆచరించాలని, రాజ్యావ్యాప్తి దశమీ వ్రతం కూడా చేయాలని చతుర్వర్గ చింతామణిలో ఉంది. ఈ వ్రత విధా నాలను బట్టి ఈ తిథి రాజుల పూజకు శ్రేష్ఠమైన దని అర్థమవుతోంది. అలాగే, ఈనాడు యాజ్ఞ వల్క్య జయంతి దినం కూడా.

కార్తీక శుద్ధ ఏకాదశి
అక్టోబరు 31, మంగళవారం
ప్రతి పదిహేను రోజులకు ఓ ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశిలన్నింటిలోకీ ఆషాఢ శుద్ధ ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి ముఖ్యమైనవి. ఆషాఢ శుద్ధ ఏకాదశికే శయనైకాదశి అని పేరు. ఆనాడు విష్ణువు నిద్రకు ఉపక్రమిస్తాడు. ఆ నిద్ర నుంచి ఆయన కార్తీక శుద్ధ ఏకాదశి నాడు లేస్తాడు. అందుచేత ఈ ఏకాదశికి ప్రబోధన్యేకాదశి అని పేరు. ఈనాడు కాయధాన్యాలతో చేసిన ఆహారం ఏదీ తినకూడదు. ఫలహారం మాత్రమే తీసు కోవాలి. ఈ ఏకాదశి విష్ణువుకు ప్రియమైన పర్వం. ఆషాఢ మాసపు శుద్ధ ఏకాదశితో ప్రారంభమయ్యే చాతుర్మాస్య దీక్షలకు ఈనాడు ముగింపు దినం. చాతుర్మాస్య కాలంలో భక్తి గ్రంథాలు, పురాణ గ్రంథాలు పఠిస్తారు. ఈ కాలంలో విష్ణు దేవాలయాల్లో నిత్యం సంకీర్తనలు సాగుతాయి. తులసీ దళాలతో తయారు చేసిన మాలలు భగవంతుడికి సమర్పిస్తారు. పండరీపురంలోని చంద్రభాగా నదీ తీరాన ఉన్న విఠలేశ్వరస్వామి ఆలయంలో కార్తీక శుద్ధ ఏకాదశి నాడు గొప్ప
ఉత్సవం జరుగుతుంది.

Review శివ… శక్తి… శ్రద్దభక్తి.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top