వరాలనీయవే..వరలక్ష్మి!

‘వ్రతం’ అంటే ప్రవర్తన. మంచి నడవడిక కలిగి వారందరూ ఒకచోట చేరి, ఒక సత్కార్యం చేసినపుడు, ఒంటరిగా చేసిన దానికన్నా కలిసి చేసిన దాని ఫలితం అధికంగా ఉంటుంది. కనుకనే పూజలు, వ్రతాలను సామూహికంగా చేయాలంటారు. అలా చేస్తే వచ్చే ఫలితం అందరికీ సమానంగా అందుతుంది. భగవంతుడి పూజకు తారతమ్యాలు అడ్డురావు. వరలక్ష్మీ పూజలలోని విశిష్టత ఇదే.

‘వర’ అంటే శ్రేష్ఠమైనది అని అర్థం.
అష్టలక్ష్ములు ఇచ్చే ఫలాన్ని అనుగ్రహించే శక్తి కలిగినది కాబట్టి ఆమె ‘వరలక్ష్మి’గా శ్రావణ మాసపు వేళ పూజలందుకుంటోంది.
శ్రావణ మాసంలోని మంగళవారాలలో మంగళగౌరీ వ్రతాన్ని, శుక్రవారాలలో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. వీటిలో ఒకటి గౌరి (పార్వతి) ఆరాధన అయితే, మరొకటి లక్ష్మీదేవి ఆరాధన. ఇద్దరూ జగన్మాత భిన్న రూపాలే.
మంగళగౌరీ వ్రతాన్ని సౌభాగ్యానికి గుర్తుగా నవ వధువులు వివాహమైన మొదటి సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాలు ఆచరిస్తారు. అయితే, ప్రధానంగా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నిర్వహించే వరలక్ష్మీ వ్రతం జీవితాంతం చేసుకునేది. పెళ్లయిన వారు, అవివాహితులు.. ఇలా అందరూ ఈ వ్రతం ఆచరిస్తారు.
వరలక్ష్మీ వ్రతం ఎంతో ప్రత్యేకమైనది. ఇది సాధారణంగా చేసే వ్రతాల వంటిది కాదు. చాలా వ్రతాలూ, నోములూ కామికమైనవి. అంటే ఏదో ఒక ఫలాన్ని ఆశించి ఆచరించేవి. వాటిని నిర్వహించిన తరువాత, ఆచరించే వారి విశ్వాసం కోసం ఒక కథ చెబుతారు. వరలక్ష్మీ వ్రత కథకు వ్రతానికి ఉన్నంత ప్రాధాన్యం ఉంది. ఈ కథను కుమారస్వామి ప్రార్థన మేరకు, పార్వతీదేవి సమక్షంలో శివుడు చెప్పినట్టూ, అతని ద్వారా భూలోకానికి వ్యాపించినట్టు పురాణ కథనం. ఇది నియమనిష్టలతో కూడుకున్నది. ఆ నియమాలన్నీ పాటించినట్టయితే సత్ఫలితాలు పొందుతారన్నది ఫలశ్రుతి.
వరలక్ష్మీ వ్రతం నాడు పచ్చి బియ్యం పిండితో చలిమిడి, ఉండ్రాళ్లు చేసి వాయనంగా ఇస్తారు. ఇవి ఉడికించి వండే ఆహార పదార్థాలు. వర్షాకాలంలో ఉడికించి వండిన పదార్థాలనే తినాలి.
శ్రావణ మాసపు వ్రతాల్లో నైవేద్యంగా సమర్పించి, ఆరగించే చలిమిడి గర్భధారణ సమయంలో వచ్చే అవరోధాలను తొలగిస్తుంది.
వరలక్ష్మీ వ్రతం నాడు వాయనంగా ఇచ్చే మొలకెత్తిన శనగలు పోషక నిలయాలు. వీటిలోని మాంసకృత్తులు తక్షణ శక్తినిస్తాయి.
వరలక్ష్మీ వ్రత కథ..
వరలక్ష్మీ వ్రతంలో లక్ష్మీదేవికి షోడశోపచారాలతో పూజ చేసిన తరువాత తోరపూజ చేస్తారు. ఇది ఎంతో ముఖ్యమైనది. అనంతరం కథా శ్రవణం ఉంటుంది. వరలక్ష్మీ దేవి విశిష్టతను తెలిపే ఆ కథ క్లుప్తంగా ఇది..
మగధ దేశంలో కుండిన నగరంలో చారుమతి అనే ఇల్లాలు ఉండేది. ఆమె భర్తను దైవంగా భావించేది. అత్తమామలకు సేవలు చేసేది. మితంగా మాట్లాడేది. మేలిమి గుణాలు కలిగి, సౌమ్యంగా, ఒద్దికైన జీవితాన్ని గడిపేది. గృహిణి ధర్మాన్ని సమర్థవంతంగా పాటించేది. ఆమె సత్ప్రవర్తనకు మెచ్చి, లక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించింది. తాను వరలక్ష్మినని, తనను శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు పూజిస్తే సకల సంపదలూ ప్రసాదిస్తానని చెప్పింది.
జగన్మాతకు చారుమతి నమస్కరించి, స్తుతించింది. వరలక్ష్మీ పూజా విధానాన్ని ఆమెకు లక్ష్మీదేవి వివరించింది.
తెల్లవారగానే, భర్తకు, అత్తమామలకూ తాను కన్న కలలోని విశేషాలను చారుమతి చెప్పింది. వారి అనుమతితో శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాటి పూజకు సన్నద్ధమయ్యింది. చారుమతిది మంచి మనసు. వరలక్ష్మీ వ్రతం గురించి అందరికీ చెప్పాలని కలలో కనిపించిన లక్ష్మీదేవి ఆమెతో అనలేదు. అలాగని వద్దనలేదు కూడా. కానీ, తనకు కలగబోయే మేలు అందరికీ కలగాలని చారుమతి ఆకాంక్షించింది. అందుకని తోటి గృహిణులందరికీ చెప్పి, తనతో పాటు వ్రతం ఆచరించాల్సిందిగా ఆహ్వానించింది. వ్రత విధానాన్ని అనుసరించి, అన్ని వర్ణాల ముత్తయిదువలతో కలిసి వరలక్ష్మిని చారుమతి పూజించింది. అందరూ తోర పూజ చేసి, ఒక తోరాన్ని వరలక్ష్మిని ఉంచిన కలశానికి కట్టి, మేరొకటి తాము ధరించారు. తమ వారికీ తోరాలను కట్టారు. కథను పురోహితుడు చెప్పగా, భక్తిశ్రద్ధలతో విని వరలక్ష్మీ దేవిని ఉంచిన కలశం చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ చేశారు.
మొదటి ప్రదక్షిణ పూర్తయ్యేసరికి వారి పాదాలకూ, చేతులకూ ఆభరణాలు అమరేయి.
రెండో ప్రదక్షిణకు సర్వాలంకార భూషితులయ్యారు. మూడవ ప్రదక్షిణ చేస్తుండగా, వారి భర్తలు తమ సతులను తోడ్కొని వెళ్లడానికి వచ్చారు.
అలా అందరూ వరలక్ష్మీదేవిని, చారుమతిని కొనియాడుతూ తమ ఇళ్లకు వెళ్లారు. ప్రతి సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేస్తూ సకల సౌభాగ్యాలతో జీవించారు. ఇదీ వ్రతకథ.
ఈ కథలో ప్రత్యేకత ఏమిటంటే, అడగకుండానే చారుమతిని వరలక్ష్మీదేవి అనుగ్రహించడం. అందుకు కారణం చారుమతి సత్ప్రవర్తన. ఆమెలా అందరూ మంచి నడవడిక కలిగి ఉండాలనీ, లోకంలో ఒక ఆదర్శాన్ని నిలపడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహానికి అర్హత పొందుతారనీ ఈ కథ సందేశం.
(శ్రావణ శుక్రవారాలు, 2024 ఆగస్టు 9, 16, 23, 30)

మంగళగౌరీ వ్రతాచరణ ఇలా..
ఒకసారి ద్రౌపది శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి- ‘అన్నా! మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పు’ అని అడిగిందట.
అందుకు కృష్ణుడు- ‘మంగళగౌరీ మహా దేవత. ఆది పరాశక్తియే మంగళగౌరీగా ప్రసిద్ధి చెంది. త్రిపురాసుర సంహారం సమయంలో పరమశివుడు మంగళగౌరీ దేవిని పూజించి విజయం సాధించాడు. అంగారకుడు మంగళగౌరీని పూజించే గ్రహరాజై, మంగళవారానికి అధిపతిగా వెలుగొందుతున్నాడు. మంగళగె•రీ వ్రతాన్ని శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాలలో ఆచరించి, పూజిస్తే మహిళలకు వైధవ్యం కలగదు. సకల సౌభాగ్యాలు కలుగుతాయి’ అని బదులిచ్చాడట.
పురాణ కాలం నుంచీ ఈ వ్రతాచరణ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వ్రతం గురించి ఒకసారి నారదుడు సావిత్రికి కూడా చెప్పాడని అంటారు.
వ్రత నియమాలు ఇవీ..
• వివాహమైన తొలి ఏడాది పుట్టింట్లోనూ, ఆ తరువాత నాలుగేళ్లు మెట్టినింట • వ్రతాన్ని ఆచరించాలి (మొత్తంగా ఐదు సంవత్సరాలు ఈ నోము నోచాలి).
• తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించడం శ్రేష్ఠం. తొలి వాయినాన్ని తల్లికే ఇవ్వాలి.
• వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాణి పెట్టుకోవాలి.
• ఉ వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి.
• వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు, వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి.
• వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తయిదువులను పేరంటానికి పిలిచి, వారికి వాయనాలివ్వాలి.
• ఒకే మంగళగౌరీ విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికి ఒకటి ఉపయోగించకూడదు.
• ఆ సంవత్సరం వ్రతం పూర్తయిన పిమ్మట వినాయక చవితి పండుగ మర్నాడు వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారినీ నిమజ్జనం చేయాలి.
• పూజకు గరికె, ఉత్తరేణి, తంగేడుపూలు తప్పక వాడాలి.
పూజకు కావాల్సిన వస్తువులు:పసుపు, కుంకుమ, వాయనానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికె గుడ్డ, గంధం, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరాలకు దారం, టెంకాయ, పసుపుతాడు, దీపపు కుందులు- 2, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన హారతి పళ్లెం, గోధుమపిండితో కానీ, పూర్ణంతో కానీ చేసిన ఐదు ప్రమిదెలు, కర్పూరం, అగరవత్తులు, బియ్యం, కొబ్బరిచిప్ప, శనగలు, దీపారాధనకు నెయ్యి మొదలైనవి. శనగలు ముందురోజు నానబెట్టుకుని మరుసటి రోజు వడగట్టుకోవాలి.
(శ్రావణ మంగళవారాలు, 2024 ఆగస్టు 6, 13, 20, 27),

Review వరాలనీయవే..వరలక్ష్మి!.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top