సకల విఘ్నాలు తొలగించేంది వినాయకుడు. పెద్దతల గొప్పగా ఆలోచించమంటుంది. గొప్ప ఆలోచనతోనే గొప్ప ఆచరణ. గొప్ప ఆచరణ ద్వారానే గొప్ప విజయాలు. పాతాళాన్ని చూస్తూ ఆకాశాన్ని అందుకోలేం. ఆకాశాన్ని చేరుకోవాలంటే ఆకాశమంత ఉన్నతంగానే ఆలోచించాలి. చిన్నకళ్లు.. చూపు లక్ష్యం వైపే ఉండాలన్న సత్యన్ని నర్మగర్భంగా చెబుతాయి. పెద్దకళ్లకు చంచలత్వం ఎక్కువ. ఎటుపడితే అటు తిరిగేస్తుంటాయి. చిన్నకళ్లకు ఆ అవరోధాలేం ఉండవు. గురి చుట్టూ గిరిగీసుకుంటాయి. చాట చెవులు.. నలు దిక్కుల విజ్ఞానం నా వైపు ప్రసరించు గాక అని ప్రార్థిస్తారు వేదర్షులు. ఆ పౌరుషేయా వాక్యానికి ప్రతీక ఏనుగు చెవులు. బుల్లినోరు.. నోరు పెద్దదైతే బుద్ధి చిన్నదవుతుంది. గణపతిని ‘సుముఖుడు’ అంటారు. ఆ మాటకు ముద్దుమోము వాడనే కాదు ముచ్చటైన మాటతీరు కలిగిన వాడని అర్థం. తొండం వివేకానికి గుర్తు. వివేకపు వడపోత తరువాతే ప్రతి మాటా నోట్లోంచి రావాలన్న అంతర్లీన సందేశమిది.
అట్లాంటాలో వినాయకచవితి వేడుకలు అత్యంతవైభవంగా జరిగాయి. ఆగష్టు 25, శుక్రవారం, భాద్రపద శుక్ల పక్ష చతుర్థి రోజున అట్లాంటాలోని వ్రాసాంధ్రులు వినాయకచవితి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా గణేషుని పండగలో చిన్నారులు సందడి చేశారు. అట్లాంటాలోని పలు దేవాలయాల్లో మట్టి వినాయకుడి ప్రతిమలు తీసుకువచ్చి ఆ గణనాధుడిపై తమకున్న ప్రేమను చాటారు.
చిన్నారుల సందడి
వినాయకచవితి వచ్చిందంటే చాలు చిన్నారుల్లో ఎనలేని ఉత్సాహం కనిపిస్తుంది. విఘ్నాలకు అధిపతి అయిన ఆ వినాయకుడి పట్ల చిన్నారుల్లో ఆసక్తి పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అట్లాంటాలోని హిందూ టెంపుల్‍లో మట్టి వినాయక ప్రతిమలు తయారీ చేయడంలో చిన్నారులు పోటీపడ్డారు. సుమారు మూడు వేలకు పైగా చిన్నారులు ఈ మట్టి వినాయకుడి ప్రతిమలు తయారుచేశారు. వివిధ ఆకృతులలో తయారు చేసిన గణపయ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. మరోవైపు ఇప్పుడిప్పుడే మాటలు మాట్లాడే చిన్నారులు కూడా మట్టిని పట్టుకుని వినాయకుని బొమ్మలా తయారు చేయడం విశేషం. దీనిని బట్టి చూస్తే చిన్నారుల్లో వినాయకునిపై ఉన్న ప్రేమ, భక్తి ఎలాంటిదో చెప్పవచ్చు. మరోవైపు వినాయకుడి ప్రతిమలు తయారు చేస్తూనే గణపతి బప్పా మోరియా.. ఆదా లడ్డూ కాలియా, గణపతి మహరాజ్ కి జై అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆలయప్రాంగణం మొత్తం వినాయకుడి నామస్మరణతో మార్మోగిపోయింది. ఈ కార్యక్రమం అంతా హిందూ టెంపుల్ ఆఫ్ అట్లాంటా సహకారంతో హిందూ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ మట్టి వినాయకుడి ప్రతిమల తయారీ కార్యక్రమంలో రవించందర్ ప్రధాన భూమిక పోషించారు. మరోవైపు నంద చాట్ల, శ్వేతా ధావన్, స్వదేశ్, కుసుమ కొట్టే, సుబ్బయ్య ఇమాని, రాధిక సుధా, స్నేహ తాళిక, వైశేషి, షీలా లింగం తదితరులు పాల్గొన్నారు.
Review అట్లాంటా గణేష్ ఉత్సవాలో సందడి చేసిన చిన్నారులు.