
ప్రపంచంలోనే అతి పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన దేశం- అమెరికా. అక్కడ చీమ చిటుక్కుమన్నా ప్రపంచం మొత్తం ఉలిక్కిపడుతుంది. అక్కడేం జరిగినా.. ఆసక్తిగా, ఉత్కంఠగా అంతర్జాతీయ సమాజం మొత్తం తొంగి చూస్తుంది. అటువంటి ఎన్నికలు ఏడాది పాటు సాగే సుదీర్ఘ పక్రియ.. ఆ ఎన్నికలో గెలుపొందబోయే అధ్యక్షుడు ఎవరనేది ఇంకెంత ఉత్సుకత కలిగిస్తుందో వేరే చెప్పనక్కర్లేదు. మన దేశంలో మాదిరి అక్కడ ఎన్నికల షెడ్యూల్ విడుదల, నోటిఫికేషన్ వంటి హడావుడి ఏమీ ఉండదు. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి.. నవంబర్ మాసంలో వచ్చే మొదటి మంగళవారం ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికల్లో గెలుపొందిన అధ్యక్ష అభ్యర్థి ఆ మరుసటి ఏడాది జనవరి 20న దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇదొక్కటే కాదు.. అమెరికా సంయుక్త రాష్ట్రాల ఎన్నికల పక్రియలో ఇంకా ఆసక్తి కలిగించే అంశాలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. అవేమిటో చదివేయండి.
అమెరికాలో ఎన్నికలు నవంబర్లో వచ్చే తొలి మంగళవారం నాడే నిర్వహించడం వెనుక పెద్ద కారణమే ఉంది. క్రైస్తవ దేశమైన అమెరికాలో ఆదివారం ప్రజలంతా ప్రార్థనలతో గడుపుతారు. ఈ కారణంగా వారంతా ఆదివారానికి ముందు ఏ పనీ పెట్టుకోరు. ఇక, మిగిలిన రోజుల్లో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోతారు. అందువల్ల మంగళవారం అయితే ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండదనే ఉద్దేశంతోనే ఆ రోజును ఎంచుకున్నారు.
- అమెరికా అధ్యక్ష పదవికి ఏ ఒక్కరూ రెండుసార్లు మించి పోటీ చేయడానికి వీలులేదు.
- అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేసే అభ్యర్థి 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. జన్మత దేశ పౌరుడై ఉండాలి. అమెరికాలో 14 సంవత్సరాల పాటు నివసించి ఉండాలి.
- అతి చిన్న వయసులోనే అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తిగా జాన్ ఎఫ్ కెన్నడీ అప్పటికీ, ఇప్పటికీ అమెరికా చరిత్రలో నిలిచిపోయారు. 35 ఏళ్ల వయసులోనే ఆయన అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. ఇప్పటికీ ఈ రికార్డు ఆయన పేరిటే ఉంది.
- అమెరికాలో ఇప్పటి వరకు అధ్యక్ష పదవి చేపట్టిన వారిలో అతి పెద్ద వయస్కుడు ప్రస్తుతం 2020లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన జో బైడన్. ఈయనే అమెరికాకు అతి పెద్ద వృద్ధ అధ్యక్షుడు. ఆయన వయసు 77 సంవత్సరాలు. 2021, జనవరి నాటికి ఈయనకు 78 వస్తాయి. ఈయన డెమొక్రటిక్ పార్టీకి చెందిన వారు.
– అమెరికాకు జో బైడెన్ 46వ ప్రెసిడెంట్ కాబోతున్నారు
Review అమెరికా ఎన్నికలు ఎన్నెన్నో విశేషాలు.