
అమ్మ గురించి మన తెలుగు కవులు, సినీ గీత రచయితలు పలికించిన కమ్మని పలుకులు ఒకసారి చదువుదామా..
‘అమ్మ వంటి అంత మంచిది అమ్మ ఒక్కటే’ అని మనసు కవిగా పేరొందిన ఆత్రేయ అన్నారు.
‘పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా
కదిలే దేవత అమ్మ కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలిపాటలోని సరిగమ పంచుతుంది
ప్రేమ మధురిమా
మనలోని ప్రాణం అమ్మ మనదైనా రూపం అమ్మ
ఎనలేని జాలి గుణమే అమ్మ నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మ వరమిచ్చే తీపి శాపం అమ్మ’ అని సినీ గీత రచయిత చంద్రబోస్ రాసిన ఈ పాట వినిపించని తెలుగు లోగిలి ఉండదంటే అతిశయోక్తి కాదు.
ఇక డాక్టర్ సి.నారాయణరెడ్డి అమ్మ గురించి చేసిన వర్ణనకు సాటి మరేదీ లేదు.
‘అమ్మను మించి దైవమున్నదా..
జగమే పలికే శాశ్వత సత్యమిదే
అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే
అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే..’
తప్పటడుగులేసిన నాడు అయ్యో తండ్రి అని గుండెకద్దుకున్నావు
నింగికి నిచ్చెనలేసే మొనగాడినే అయినా నీ ముంగిట అదే అదే పసివాడినే
‘కంటేనే అమ్మ అని అంటే ఎలా..
కరుణించే ప్రతి దేవత అమ్మే కదా
కంటేనే అమ్మ అని అంటే ఎలా?
కడుపు తీపిలేని అమ్మ బొమ్మే కదా.. రాతి బొమ్మే కదా..
కణకణలాడే ఎండకు శిరసు మాడినా
మనకు తన నీడను అందించే చెట్టే అమ్మ
చారెడు నీళ్లయినా తాను దాచుకోక
జగతికి సర్వస్వం అర్పించే మబ్బే అమ్మ
ప్రతి తల్లికి మమకారం పరమార్థం
మదిలేని అహంకారం వ్యర్థం వ్యర్థం..’
కదిలించే పాటలు రాయడంలో దిట్ట అయిన సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా అమ్మ గురించి గొప్పగా చెప్పారు ఓ పాటలో..
‘ఎవరు రాయగలరూ అమ్మ అను మాటకన్నా కమ్మని కావ్యం
ఎవరు పాడగలరు అమ్మ అనురాగం కన్నా తీయని రాగం
అమ్మేగా.. అమ్మేగా తొలి పలుకు నేర్చుకున్న భాషకి
అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి
అవతారమూర్తి అయినా అణువంతే పుడతాడు
అమ్మ పేగు పంచుకునే అంతవాడు అవుతాడు
అమ్మేగా చిరునామా ఎంతటి ఘన చరితకి
అమ్మేగా కనగలదు అంత గొప్ప అమ్మని
నూరేళ్లు ఎదిగే బతుకు అమ్మ చేతి వేళ్లతో
నడక నేర్చుకుంది బతుకు అమ్మ చేతి వేళ్లతో
ధీరులకు దీనులకు అమ్మ ఒడి ఒక్కటే..’
మాస్ పాటలు రాయడంలోనే కాదు.. అమ్మ పాటలు రాయడంలోనూ అందెవేసిన చేయి వేటూరి సుందరరామమూర్తిది. ఆయన రాసిన ఓ సినీ గీతంలోని రెండు ఫంక్తులు చదవండి..
‘పట్టుపరుపులేలనే పండువెన్నెలేలనే
అమ్మ ఒడి చాలునే నిన్ను చల్లంగ జో కొట్టునే
నారదాదులేలనే నాదబ్రహ్మలేలనే
అమ్మలాలి చాలునే నిన్ను కమ్మంగ లాలించునే..’
ఇక, దాశరథి కృష్ణమాచార్య గారి కవితా వైదుష్యం అమ్మ గురించి ఏం చెబుతుందంటే..
‘అమ్మ అన్నది ఒక కమ్మని మాట
అది ఎన్నెన్నో తెలియని మమతల మూట
దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేదనువాడు అసలే లేడు
తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు
ఆ తల్లి సేవ చేసుకునే బతుకే బతుకు
అమ్మంటే అంతులేని సొమ్మురా
అది ఏనాటికీ తరగని భాగ్యమ్మురా
అమ్మ మనసు అమృతమే చిందురా
అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా
అంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే
అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే
అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏదీ..?’
Review అమ్మను మించి దైవమున్నదా...