కమలా హారిస్ మీద ఆమె తల్లి శ్యామలా గోపాలన్ హారిస్ ప్రభావం చాలా ఎక్కువ. చాలాసార్లు ఆమె ఈ విషయం గురించి మాట్లాడారు. తన తల్లిని కమలా స్ఫూర్తిగా భావిస్తారు. శ్యామల గోపాలన్ హారిస్‍కు నలుగురు తోబుట్టువులు. ఢిల్లీ యూనివర్సిటీలో ఆమె చదువుకున్నారు. 19 ఏళ్ల వయసులోనే బర్కెలీ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకుని, చదువు కోసం 1958 ప్రాంతంలో అమెరికాలో అడుగుపెట్టారు. న్యూట్రిషన్, ఎండాక్రినాలజీలో డాక్టరేట్ చేసేందుకు అమెరికా వెళ్లిన శ్యామల.. చివరకు క్యాన్సర్ పరిశోధకురాలిగా మారారు. ‘అమ్మను అమెరికాకు పంపించడం మా అమ్మమ్మ, తాతయ్యలకు ఎంత కష్టమైన విషయమో నాకు తెలుసు. కమర్షియల్ జెట్ ప్రయాణాలు అప్పుడప్పుడే మొదలయ్యాయి. వాళ్లతో కాంటాక్ట్లో ఉండటం కూడా అప్పట్లో కష్టమే. కాలిఫోర్నియా వెళ్తానని మా అమ్మ అడిగినపుడు వాళ్లు అడ్డు చెప్పలేదు’ అని కమల తన ఆత్మకథలో గుర్తుచేసుకున్నారు. చదువు పూర్తయిపోగానే, భారత్‍కు తిరిగి వచ్చి పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటానని మా అమ్మ తన తల్లిదండ్రులకు మాట ఇచ్చింది. కానీ, విధి మరోలా ఉంది అని ఆ పుస్తకంలో రాశారు.
కుటుంబానికి రాజకీయ నేపథ్యం..
భారత్‍లోని తమిళనాడులో శ్యామల కుటుంబంలోనూ రాజకీయ వాతావరణం ఉండేది. కమల అమ్మమ్మ పెద్దగా చదువుకోలేదు. కానీ, గృహహింస, కుటుంబ నియంత్రణ గురించి ఇతరులకు ఆమె అవగాహన కలిగించే వారు. కమల తాతయ్య భారత ప్రభుత్వంలో సీనియర్ దౌత్యవేత్త. ఆయన జాంబియాలో పనిచేశారు. ఆ దేశానికి స్వాతంత్య్రం వచ్చాక, శరణార్థులకు పునరావాసం కల్పించేందుకు ఆయన కృషి చేశారు. కమల తన పుస్తకంలో తన భారత పర్యటనల గురించి పెద్దగా ప్రస్తావించలేదు. తన మేనమామతో, చిన్నమ్మలతో తనకు సాన్నిహిత్యం ఉండేదని, ఫోన్‍కాల్స్, లేఖలు, అప్పుడప్పుడు పర్యటనలతో వారితో టచ్‍లో ఉండేదాన్నని కమలా రాసుకున్నారు. కమలా తల్లి శ్యామల గోపాలన్ హారిస్ 2009లో చనిపోయారు. అప్పటికి ఆమె వయసు 70 సంవత్సరాలు.
నాయకత్వ లక్షణాలు..
కమలా హారిస్‍కు ఉండాల్సిన ముఖ్య లక్షణాలన్నీ ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఆమె నాయకత్వ లక్షణాలను ఇదివరకే నిరూపించుకున్నారు. ఆమె మొదటి రోజు నుంచే ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించగలిగే సత్తా ఉన్న వ్యక్తి. ఇంటెలిజెన్స్, జ్యుడీషియరీ విభాగాల్లో ఆమె ఒక దృఢమైన, సమర్ధవంతమైన సెనేటర్‍గా గుర్తింపు పొందారు. నేరస్తులను శిక్షించే విధానంలోనూ, వివాహ వ్యవస్థలో సమానత్వం తీసుకురావడంలోనూ ఆమె గొప్ప నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి సందర్భంగా తలెత్తిన జాతి అసమానతలపై ఆమె చాలా కఠినంగా వ్యవహరించారు. ఆమె రెండు జాతుల నేపథ్యం కలిగిన మహిళ కావడంతో చాలా వర్గాలు అమెరికా ఎన్నికల సందర్భంగా ఆమెతో కనెక్ట్ అయ్యాయి.
బిర్యానీ కూడా చేసుకునేవాళ్లం..
కమలా హారిస్ 2020 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి డెమొక్రటిక్ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం ప్రయత్నించినపుడు.. భారత సంతతికి చెందిన కమెడియన్ మిండీ కలింగ్‍తో కలిసి ఓ కుకింగ్ వీడియోలో కనిపించారు. భారతీయ వంటకాన్ని వండుతూ, తమ దక్షిణ భారత నేపథ్యం గురించి ఈ వీడియోలో వాళ్లిద్దరు ముచ్చటించారు. కమల తన యూట్యూబ్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. కమలా భారత నేపథ్యం గురించి ఇంకా చాలా మందికి తెలియదని, భారత సంతతి వాళ్లు ఆ విషయం గురించి తెలుసుకుని సంతోషపడుతున్నారని మిండీ ఆమెతో అనడం వీడియోలో ఉంది. చిన్నప్పుడు దక్షిణాది వం•కాలు తిన్నారా? అని మిండీ ప్రశ్నించగా, ‘అన్నం, పెరుగు, ఆలుగడ్డ కూర, పప్పు, ఇడ్లీ..’ అంటూ తను చిన్నప్పుడు అమ్మమ్మ ఇంట్లో తిన్న వంటకాల జాబితాను వివరించారు కమలా.
‘నేను భారత్‍లో అమ్మమ్మ వాళ్లింటికి వెళ్తుండేదానిని. మా అమ్మమ్మ శాఖాహారి. ఆమె ఎటైనా వెళ్లినపుడు గుడ్లతో ఫ్రెంచ్ టోస్ట్ చేసుకుందామని మా తాతయ్య అడుగుతుండే వారు’ అని ఆ వీడియోలో కమలా చెప్పారు. ‘మా ఇంట్లో బిర్యానీ కూడా చేసుకునే వాళ్లం’ అని కమల తన పుస్తకంలో రాశారు.
‘మన విముక్తి కోసం పనిచేసే సమయం భవిష్యత్తులో ఎప్పుడో లేదు. ఈ సవాలు ఇప్పటిదే. ఎప్పుడైనా సరే ఇప్పుడే సమయం.’ అంటూ 2014లో ఫెర్గూసన్ జాతివివక్ష నిరసనలను ఉటంకిస్తూ హోవార్డ్ యూనివర్సిటీ విద్యార్థులకు కమలా హారిస్ సందేశాన్నిచ్చారు.
కెనడాలోనూ కొంతకాలం నివాసం..
కమలా హారిస్ కొంతకాలం కెనడాలో కూడా నివసించారు. శ్యామలా గోపాలన్ హారిస్ మెక్‍గిల్ యూనివర్సిటీలో ఉద్యోగంలో చేరినపుడు, కమలా, ఆమె చెల్లెలు మాయా కూడా కెనడా వెళ్లారు. మాంట్రియాల్‍లో ఐదేళ్లు స్కూల్‍కు వెళ్లారు. కమలా హారిస్ తనను తాను ‘అమెరికన్’గా అభివర్ణించుకుంటారు. తన అస్తిత్వం ఎప్పుడూ సౌకర్యవంతంగానే ఉంటుందని ఆమె అంటారు. రాజకీయవేత్తలు తమ రంగు లేదా నేపథ్యం కారణంగా ఏదో ఒక గిరిలో ఇమిడిపోవాల్సిన అవసరం లేదని ఆమె 2019లో వాషింగ్టన్ పోస్ట్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
‘మామలా’.. ఆ పేరే ఒక సంచలనం..
కమల డగ్లస్‍ను వివాహం చేసుకుంటూనే, అప్పటికే ఆయనకు ఉన్న ఇద్దరు పిల్లలకు ఆమె మారు తల్లి అయ్యారు. ‘నేను, డాగ్ (డగ్లస్) పెళ్లిచేసుకున్నప్పుడు.. కోల్, ఎల్లా (డగ్లస్ పిల్లలు), నేను ఒక అంగీకారానికి వచ్చాం. ‘సవతి తల్లి’ అనే పదం మాకు నచ్చదు’ అని ఆమె ఎల్లీ మ్యాగజైన్‍కు రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కమలా కుటుంబం ఒక కొత్త పేరును తయారు చేసుకుంది. అది- ‘మామలా’. ఆ పేరు పతాక శీర్షికల్లోకి చేరింది. ఆధునిక అమెరికన్ సంకీర్ణ కుటుంబాలకు చిహ్నంగా మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది.
Review అమ్మ ప్రభావం ఎక్కువ...