ద్వంద్వాల తీరాల మధ్య నిరంతరం ప్రవహించే జగన్నాటక నదీప్రవాహానికి అసమానత అనేది అత్యవసరమైన లక్షణం. ఈ అసమానతలో అంతర్గతంగా ప్రవహించే సమానతను గుర్తించగలిగితే అనంత ఆనంద సామ్రాజ్యానికి సార్వభౌముడిగా మారవచ్చు
యుగయుగాలుగా ఎన్నెన్నో ప్రయత్నాలు చేసినా అసమానతలు ఇంకా మిగిలున్నాయంటే, సహజమైన బలమైన కారణమేదో ఉన్నట్లే కదా? వెనుకబాటుతనం ఏ రంగంలోనైనా తొలగిపోవలసిందే. అనుమానం లేనే లేదు. ఆర్థిక, సామాజిక శాస్త్రవేత్తలు రకరకాల పథకాలు
రచిస్తున్నారు కదా! ఇంకా ఎందుకీ తారతమ్యాలు మిగిలి పోతున్నాయి?
పైకి హెచ్చుతగ్గులమయంగా కనబడుతున్నా అంతర్లీనంగా సమానత్వమే విరాజిల్లుతున్నది. అందరూ పల్లకీ ఎక్కితే మోసేవారెవరు? అందరూ కోటిశ్వరులై యజమానులుగా కుర్చీలలోనే కూర్చుంటే మిగిలిన పనులు చేసేదెవరు? ఎవరు రోడ్లు వేస్తారు? పారిశుద్ధ్యం ఎవరు చేస్తారు? ఎవరు బట్టలు నేస్తారు? కార్లు, రైళ్లు నడిపేదెవరు? అంతెందుకు, మన చేతివేళ్లు సమానంగా ఉన్నాయా? కానీ, వాటి మధ్య ఉన్న చక్కని సమన్వయంతోనే మన పనులు సవ్యంగా జరుగుతున్నాయి. సమాజం సక్రమంగా నడవడానికి ఒక్కొక్కరికీ ఒక్కొక్క విధి నిర్ణయించబడింది. ఇది ప్రకృతి ఏర్పాటు చేసిన నియమం. నేల మీద ఎత్తుపల్లాలు ఉన్నందుకే నదులు ప్రవహిస్తున్నాయి. ఎత్తులో ఉన్న భూమి గొప్పదని, పల్లంలోని భూమి తక్కువదని అర్థమా? నదీ ప్రవాహానికి ఈ తారతమ్యం తప్పనిసరి కదా! హెచ్చుతగ్గుల మధ్య సమతుల్యతను పాటిస్తూ, వాటి మధ్య అవసరమైన నిష్పత్తి ఉండే విధంగా ప్రకృతి చూసుకుంటుంది.
ఈ సత్యం మనం గుర్తించలేక పోతున్నాం అంగీకరించలేక పోతున్నాం. ఇలా మనను ఏమార్చడం కూడా ప్రకృతి లీలావిలాసమే. అసంపూర్ణత, పరిపూర్ణతలోని భాగమే. అపరిపక్వత, పరిపక్వతలోని విడదీయలేని అంశమే. ప్రకృతిని ఎవరూ బాగు చేయాల్సిన పని లేదు. మార్చవలసిన అవసరం అంతకంటే లేదు. ప్రకృతి పథకరచన ఎప్పుడూ పటిష్టంగా ఉంటుంది. ప్రకృతి నిర్వహించే కార్యకలాపాలు లోప రహితం, సమగ్రం. ఎక్కడైనా సంపదలు, వనరులు అవధులు దాటితే, మితిమీరితే వరదలు, సునామీ, భూకంపాల వలన సమతుల్యత కలుగుతుంది. అన్నీ కోల్పోయి ప్రజలు నిరుపేదలవుతారు. కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో పారిశ్రామికీకరణ వలన పేదలు తగ్గారు. మనదేశంలో ఇంకా అంత అభివృద్ధిలేక పేదలు ఎక్కువగానే
ఉన్నారనుకోండి. ఒక పేదవాడు ధనికుడైతే, మరొకడు ఆ పేదవాని స్థానం ఆక్రమిస్తాడు. ఇది నిరంతర పరిణామక్రమం.
ఒక కార్మికుడు మేనేజరుగా నియమింపబడితే, ఆ కార్మికుని స్థానంలో మరొకరు రావాలి. అదే క్రమంలో గుమస్తాలు, సూపర్వైజర్లు మొదలైనవారి స్థానాలు మారతాయి. వీరందరూ ఒకేస్థాయిలో ఉండటం కుదరని పని. లోకంలో అసమానత అనేది నిర్మూలనకు వీలుపడని వ్యవహారికపరమైన అవసరం. ఇది మంచీ కాదు, చెడూ కాదు. ఈ ద్వంద్వప్రపంచంలో లౌకికమైన విధుల నిర్వహణకు తప్పని అవసరం. ఈ మాట స్వార్థపూరితంగానో, నిరాశావాదంగానో అనిపించవచ్చు. కానీ, సంఘంలోని ఎక్కువ, తక్కువలను పూర్తిగా తొలగించడం అసంభవం. అయితే జీవనప్రమాణాలు పెంచవచ్చు. సుఖపడే సౌకర్యాలు మెరుగు పరచవచ్చు.
మనకు అవసరమైనవి ప్రతి ఒక్కరికీ అందుబాటులో లేకపోతే ప్రకృతి విరుద్ధమే అవుతుంది. శ్వాసించడానికి ప్రాణవాయువు అందరికీ అందుతోంది. చూడటానికి చక్కటి నేత్రాలు, కళ్లకు సరిపడ కాంతి ఇవ్వబడింది. నోరు, నోటికి పసందైన రుచులు అందరికీ లభ్యమవుతున్నాయి. ఎవరికి వారికి ఒక్కొక్కరంగంలో ప్రావీణ్యం సిద్ధించడం అందరి అవసరాలకు సహాయకరంగా ఉంటోంది. దుఃఖం కలిగినపుడు బాధపడడం, సంతోషం కలిగితే ఆనందించడం వంటి భావోద్వేగాలు అందరికీ సమానమే.
ప్రకృతి కఠినమైన సమవర్తి. ద్వంద్వ ప్రపంచంలో జీవించే మన దృష్టికి ఇది అర్థంకాదు. ప్రకృతి తన దృక్కోణంలో, తన న్యాయానికి అనుగుణంగానే అన్నీ చేస్తుంది. ఒక్కనిజాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రకృతి ప్రమాణాలలోని ఏకత్వం, సమానత్వం మన ఆలోచనా పరిధిలో భావించే విధంగా కానీ, మనం కోరుకునే పద్ధతిలో కానీ ఉండవు. భూమి లోతుల్లో చొచ్చుకుని ఉన్న చెట్టు వేర్లు చిటారుకొమ్మ వరకూ నీటిని సరఫరా చేస్తాయి. నా కష్టఫలాన్ని ఆకులు, కొమ్మలు అనుభవిస్తున్నాయని వేరు భావిస్తే సబబుగా ఉంటుందా? వృక్షంలో ప్రతి భాగానికీ ఒక్కో పని నిర్దేశించబడింది. కాండం కర్తవ్యం కాండానిది, కాయ కర్తవ్యం కాయది. అంతర్గతంగా చెట్టులో అన్నిటికీ సమాన భాగస్వామ్యం ఉంది. కానీ బాహ్యవృత్తులలో వైరుధ్యం కనబడుతుంది. ఇది నిర్వహణా సౌలభ్యం. ఈ విషయం మరచిపోయి ప్రకృతిని అపార్థం చేసుకుంటే ఎలా
Review అసమానతలో సమానత్వం.