ఆంధప్రదేశ్‍ లో ఫ్యాన్ సునామీ

ఆంధప్రదేశ్‍ రాష్ట్ర రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని విజయం.. ఎగ్జిట్‍ పోల్స్ కూడా విస్తుపోయేంతగా, వాటి అంచనాలను సైతం తలకిందులు చేస్తూ రాష్ట్ర శాసనసభలో ఏడింట ఆరొంతుల మెజారిటీ.. ‘ఫ్యాను’ గాలి ధాటికి ప్రత్యర్థి పార్టీలు కకావికలు.. ఇదీ మొన్నటి ఆంధప్రదేశ్‍ శాసనసభ ఎన్నికల్లో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‍ పార్టీ (వైఎస్‍ఆర్‍సీపీ) సృష్టించిన ప్రభంజనం. పార్టీ అధినేత వైఎస్‍ జగన్‍మోహన్‍రెడ్డి ఏపీలోని 175 స్థానాలకు 151 స్థానాలను ఏకపక్షంగా కైవసం చేసుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. రాష్ట్ర చరిత్రలో తండ్రి (వైఎస్‍ రాజశేఖరరెడ్డి) కొడుకు (వైఎస్‍ జగన్‍మోహన్‍రెడ్డి) ముఖ్యమంత్రులు కావడం ఇదే తొలిసారి.
ఆంధ్రావనిలో జగన్నినాదం మారుమోగింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ సునామీ సృష్టించింది. ఆ పార్టీ గుర్తు ‘ఫ్యాన్‍’ సృష్టించిన తుపానులో సైకిల్‍ చిత్తుచిత్తు అయిపోయింది. 2018, ఏప్రిల్‍ 11న ఆంధప్రదేశ్‍ శాసనసభకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మే 23న ఫలితాలు వెల్లడయ్యాయి. అనేక అంచనాల మధ్య జరిగిన ఈ ఎన్నికల్లో ఎగ్జిట్‍ పోల్‍ ఫలితాలను కాలదన్ని, పాత రికార్డులను తిరగరాస్తూ ‘ఫ్యాన్‍’ సరికొత్త రికార్డు సృష్టించింది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను వైఎస్‍ఆర్‍సీపీ ఏకంగా 151 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. పోలైన మొత్తం ఓట్లలో 50 శాతం ఓట్లను ఆ పార్టీ దక్కించుకుంది. ఇక, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తన 35 సంవత్సరాల రాజకీయ చరిత్రలో కనీవినీ ఎరుగని ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కేవలం 23 స్థానాలకు ఆ పార్టీ పరిమితమైంది. ఆంధప్రదేశ్‍ (కొత్త) రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా వైఎస్‍ జగన్‍మోహన్‍రెడ్డి మే 30న ప్రమాణ స్వీకారం చేశారు. వృద్ధులకు రూ.3,000 పెన్షన్‍ ఇస్తాననే హామీ మేరకు.. వారికి తొలి దఫాలో రూ.250 పెంచుతూ తొలి ఫైల్‍పై సంతకం చేశారు. వచ్చే ఐదేళ్లలో ఈ మొత్తం రూ.3,000కు చేరుకునేలా ప్రతి ఏటా రూ.250 చొప్పున పెంచుతారు.

తెలుగుదేశం పార్టీ కకావికలు..

తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన మంత్రుల్లో కేవలం ముగ్గురు మాత్రమే ఈ ఎన్నికల్లో విజయం సాధించారు. చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశ్‍ మంగళగిరిలో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో మరెన్నో విశేషాలు చోటుచేసుకున్నాయి. ఎన్టీఆర్‍ కుటుంబం నుంచి పోటీ చేసిన వారిలో చంద్రబాబు, బాలకృష్ణ మాత్రమే విజయం సాధించారు. ఎన్టీఆర్‍ కుమార్తె, అల్లుడు పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఓటమి పాలయ్యారు. బాలకృష్ణ ఇద్దరు అల్లుళ్లు లోకేశ్‍, భరత్‍ ఓటమి చవిచూశారు. ఇక, జనసేన పార్టీ పెట్టి ఎన్నికల గోదాలోకి దిగిన సినీ నటుడు పవన్‍ కల్యాణ్‍ తాను పోటీ చేసిన రెండుచోట్ల (భీమవరం, గాజువాక) పరాజయం పాలయ్యారు. ఆ పార్టీకి ఒకే ఒక్క స్థానం దక్కింది. తూర్పు గోదావరి జిల్లా రాజోలు నుంచి ఆ పార్టీ తరపున రాపాక వరప్రసాద్‍ ఒక్కరే గెలుపొందారు.

జిల్లాలకు జిల్లాలు ‘ఫ్యాన్‍’ ఖాతాలోకే..

2009లో వైఎస్‍ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధప్రదేశ్‍లోని 294 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్‍ 156 స్థానాలు దక్కించుకోగా, ఇప్పుడు విభజిత ఏపీలోని 175 సీట్లకు ఏకంగా 151 సీట్లు ఆయన తనయుడి పార్టీ గెలుచుకుని రికార్డు సృష్టించింది. 1994 ఎన్నికల్లో ఎన్టీఆర్‍ సృష్టించిన రికార్డును తిరగరాసింది. 2004లో ఉమ్మడి ఏపీలో 47 సీట్లు మాత్రమే గెలుచుకుని పరాజయం పాలైన టీడీపీ ఇప్పుడు విభజిత ఏపీలో కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. నెల్లూరు, కడప, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో మొత్తం అన్ని చోట్లా వైఎస్‍ఆర్‍సీపీ పాగా వేసింది. కృష్ణా, గుంటూరు, అనంతపురం, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో టీడీపీ రెండేసి స్థానాలు మాత్రమే దక్కాయి. వైఎస్‍ఆర్‍సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించి పోటీ చేసిన వారికి చుక్కెదురైంది. అప్పట్లో వైఎస్‍ఆర్‍సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. వీరిలో ఒక్క గొట్టిపాటి రవికుమార్‍ మాత్రమే గెలిచారు. ఇంకో విశేషం ఏమిటంటే నాడు వైఎస్‍ఆర్‍సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలుగా చేర్చుకుందన్న అపవాదు మూటగట్టుకున్న టీడీపీ.. నేడు అదే 23 సంఖ్యలో స్థానాలకు పరిమితం కావడం. ఇక, ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైఎస్‍ఆర్‍సీపీలో చేరిన అవంతి శ్రీనివాస్‍, ఆదాల ప్రభాకర్‍రెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడ్డి మాత్రం విజయబావుటా ఎగురవేశారు.

విజయానికి బాట వేసిన ‘పాదయాత్ర’

ఏపీలో అధికారం దక్కించుకోవాలంటే పాదయాత్ర ఒక్కటే ‘మార్గమా’?. ఇప్పుడు వైఎస్‍ఆర్‍సీపీ సాధించిన ఘన విజయంలో ఆ పార్టీ అధినేత వైఎస్‍ జగన్‍మోహన్‍రెడ్డి దాదాపు ఏడాది పాటు సాగించిన పాదయాత్రే కీలకమైంది. ఇప్పటి వరకు మూడుసార్లు ముగ్గురు నాయకులు పాదయాత్ర ద్వారా ఏపీలో అధికారాన్ని దక్కించుకున్నారు. 2003లో చేవెళ్ల నుంచి ఇచ్చాఫురం వరకు సాగిన పాదయాత్ర వైఎస్‍ రాజశేఖరరెడ్డిని అధికార పీఠంపై కూర్చోబెడితే.. 2013లో ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ‘వస్తున్నా మీ కోసం’ అంటూ చంద్రబాబు నాయుడు పాదయాత్ర నిర్వహించారు. తెలంగాణలో అధికారంలోకి రాకున్నా, నాడు చంద్రబాబు విభజిత ఏపీకి తొలి ముఖ్యమంత్రి అయ్యారు. తాజాగా జగన్‍.. ‘ప్రజా సంకల్ప యాత్ర’ పేరిట 341 రోజుల పాటు 3,648 కిలోమీటర్లు నవ్యాంధ్రలో నడిచారు. 2017 నవంబరు 6న మొదలైన పాదయాత్ర 2019 జనవరి 10న ఇచ్చాపురంలో ముగిసింది. ఆయన ఎన్నికలకు రెండు సంవత్సరాల ముందే ‘నవరత్నాల’ పేరిట ఎన్నికల హామీలను ప్రకటించారు. పాదయాత్ర ద్వారా ఈ నవరత్నాలను ఆయన ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆయన 2,516 గ్రామాలు, పట్టణాలను చుట్టారు. 124 బహిరంగసభల్లో పాల్గొన్నారు. అంతకుముందు జగన్‍.. ఓదార్పు యాత్ర కూడా నిర్వహించారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన వారిని పరామర్శించేందుకు చేపట్టిన ఈ యాత్ర జగన్‍కు కలిసి రాలేదనే చెప్పాలి. కాంగ్రెస్‍లో ఉంటే తన మనుగడ ఉండదని భావించిన ఆయన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‍ పార్టీ (వైఎస్‍ఆర్‍సీపీ) పేరిట కొత్త పార్టీ పెట్టారు. అయితే, 2014లో ఆయన పార్టీ అధికారంలోకి రాలేదు. అప్పట్లో 67 మంది వైఎస్‍ఆర్‍సీపీ నుంచి గెలిచారు.

సీఎం కావాలనేది పదేళ్ల కల..

దాదాపు పది సంవత్సరాల పాటు జగన్‍ పడిన ఆటుపోట్లు అన్నీ ఇన్నీ కావు. ఎన్నో ప్రతిబంధకాలు ఎదురైనా కానీ ఆయన అన్నిటికీ ఎదురొడ్డి నిలిచి చారిత్రాత్మకమైన విజయాన్ని నమోదు చేశారు. జగన్‍ తండ్రి రాజశేఖరరెడ్డి 2009 సెప్టెంబరులో హెలికాప్టర్‍ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన మరణానంతరం కాంగ్రెస్‍ పార్టీ నుంచి జగన్‍కు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. తండ్రి మృతిని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు చేపట్టిన ఓదార్పు యాత్రకు కాంగ్రెస్‍ అధిష్టానం అనుమతివ్వలేదు. ఆ పార్టీలో మనుగడ ఉండదని భావించే జగన్‍ కొత్త పార్టీ పెట్టారు. ఆయన మొదటిసారి 2009లో కడప లోక్‍సభ స్థానం నుంచి పోటీచేసి గెలిచారు. తండ్రి మరణానంతరం చోటుచేసుకున్న పరిణామాలతో ఆయన 2010లో కాంగ్రెస్‍కు, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. కడప లోక్‍సభకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్‍ అభ్యర్థిగా పోటీచేసి భారీ మెజారిటీతో గెలుపొందారు. జగన్‍కు మద్దతుగా కాంగ్రెస్‍ నుంచి మరో 18 మంది ఎమ్మెల్యేలు బయటికి వచ్చారు. వారంతా రాజీనామాలు చేయగా, అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో జగన్‍ మద్దతుదారులుగా నిలిచి.. గెలిచారు. ఈ క్రమంలోనే 2011లో జగన్‍ వైఎస్‍ఆర్‍ కాంగ్రెస్‍ పార్టీని స్థాపించారు.

కేసులు.. విచారణలు.. అరెస్టులు..

సొంతంగా పార్టీ పెట్టిన జగన్‍ ఓదార్పు యాత్ర ప్రారంభించగా, కాంగ్రెస్‍ నుంచి ప్రతిబంధకాలు ఎదురయ్యాయి. రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఆయన పదవిని అడ్డు పెట్టుకుని జగన్‍ అక్రమాస్తులు సంపాదించారని, క్విడ్‍ ప్రోకో కింది కోట్లు కొల్లగొట్టారంటూ కాంగ్రెస్‍ పార్టీ నాయకుడు శంకరరావు పిటిషన్‍ వేయగా, హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో జగన్‍పై 27కు పైగా కేసులు నమోదయ్యాయి. 2012, మే 27న జగన్‍ అరెస్టు అయ్యారు. 16 నెలల కారాగార వాసానంతరం 2013, సెప్టెంబరు 24న జగన్‍ విడుదల అయ్యారు. ఆ తరువాత కొద్ది నెలలకే ఉమ్మడి ఆంధప్రదేశ్‍ నుంచి తెలంగాణ వేరుపడింది. సమైక్యాంధ్ర వాదన, వైఎస్‍పై ప్రజల్లో ఉన్న అభిమానం తదితరాల నేపథ్యంలో 2014లో తన గెలుపు ఖాయమని జగన్‍ భావించారు. అయితే, తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. అయినా జగన్‍ పార్టీకి 67 స్థానాలు లభించడం ద్వారా గట్టి పోటీనే ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే చంద్రబాబు ఫిరాయింపులకు తెరలేపి.. వైఎస్‍ఆర్‍సీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకున్నారు. వారిలో కొందరికి చంద్రబాబు మంత్రి పదవులు కూడా ఇచ్చారు. అయితే వీరంతా, తాజా ఎన్నికల్లో ‘ఫ్యాను’ గాలికి కొట్టుకుపోయారు. కాగా, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడం లేదని నిరసిస్తూ, 2017 అక్టోబరు నుంచి జగన్‍ అసెంబ్లీని బహిష్కరించారు.

‘హోదా’ యోధ..

ఆంధప్రదేశ్‍కు ప్రత్యేక హోదా విషయంలో జగన్‍ అలుపెరగని పోరాటం చేశారనే చెప్పాలి. ఈ విషయంలో మొదటి నుంచీ ఒకే వైఖరికి కట్టుబడి ఉండటం ద్వారా ప్రజాదరణ పొందారు. ఏపీకి హోదా తెచ్చే యోధుడిగా ఆయనకు గుర్తింపు వచ్చింది. దీనికి తగినట్టే ఎన్నికల్లో గెలిచిన వెంటనే మోదీతో జరిగిన తొలి భేటీలోనే హోదా గుర్తించి ప్రస్తావించడం, అందుకోసం నిరంతరం ప్రయత్నాలు జరుగుతాయని ప్రకటించడం విశేషం. తెలుగుదేశం పార్టీ హోదాపై తడవకో రకంగా వ్యవహరించడం, మొదట హోదా కావాలని, ఆ తరువాత ప్యాకేజీ అంటూ రకరకాలుగా వ్యవహ రించడంతో ఆ పార్టీకి చావుదెబ్బ తగిలింది. పైగా హోదా విషయంలో మొదటి నుంచి బీజేపీతో అంటకాగి, ఆ తరువాత ఆ పార్టీతో దూరం కావడం కూడా జగన్‍కు కలిసొచ్చింది. 2014 ఎన్నికల మాదిరిగా అతి విశ్వాసానికి పోకుండా జగన్‍.. 2019 ఎన్నికలకు పక్కాగా, పకడ్బందీగా సిద్ధమయ్యారు. మంచి రాజకీయ వ్యూహాలను అమలు చేశారు. ఎన్నికలకు దాదాపు సంవత్సరంన్నర ముందు నుంచే రంగం సిద్ధం చేసుకుంటూ వచ్చారు. 2017 అక్టోబరు 6 నుంచి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించిన ఆయన ఈ ఏడాది జనవరి 10 వరకు నిరంతరం ప్రజల్లోనే ఉన్నారు. అంతకముందు కూడా వివిధ సభలు, దీక్షల ద్వారా ఏదో రూపంలో ప్రజల్లోనే ఉంటూ వచ్చారు. తగిన సమయంలో ‘నవరత్నాల’ను ప్రకటించారు. ఇవన్నీ ఎన్నికల్లో ఆయనకు కలిసి వచ్చాయి. ఆయన పార్టీ స్థాపించిన ఎనిమిది సంవత్సరాలకు అధికారంలోకి వచ్చారు. మరెవరైనా అయితే, కొత్త పార్టీ.. నడపలేక చేతులు ఎత్తేసే పరిస్థితి. కానీ, పట్టుదల, మొండి ధైర్యం, ఆత్మవిశ్వాసానికి మారుపేరుగా నిలిచే జగన్‍ ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని పార్టీని విజయపథంలో నడిపారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‍ పార్టీ ఏపీలో నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకుపోవడం కూడా జగన్‍కు బాగా ప్లస్‍ అయ్యింది. ఆ పార్టీ మెజార్టీ ఓటుబ్యాంకు వైఎస్‍ఆర్‍సీపీ ఖాతాలోకి జమ అయ్యింది.

పిన్న వయసు సీఎం.. జగన్‍

భారతదేశ చరిత్రలో అతి చిన్న వయసు ముఖ్యమంత్రి ఎంవో హసన్‍ ఫరూఖ్‍ మారికర్‍. ఆయన 30 సంవత్సరాల వయసులోనే పాండిచ్చేరి (ప్రస్తుత పుదుచ్చేరి)కి ముఖ్యమంత్రి అయ్యారు. 1967 నాటి సంగతి ఇది. కేంద్ర పాలిత ప్రాంతమైన ఈ రాష్ట్రానికి ఆయన మూడు సార్లు సీఎంగా వ్యవహరించారు. ఇక, తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రలో పిన్న వయసులో ముఖ్యమంత్రి అవుతున్న రెండో వ్యక్తిగా జగన్‍ మోహన్‍రెడ్డి రికార్డు సృష్టించారు. ప్రస్తుతం ఆయన వయసు 46 సంవత్సరాలు. ఉమ్మడి ఏపీలో చిన్న వయసులో సీఎం అయిన తొలి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన 45 ఏళ్లకే సీఎం అయ్యారు. ప్రస్తుతం దేశంలో ముఖ్య మంత్రులుగా ఉన్న చాలామంది చిన్న వయసులోనే ఆ పదవిని చేపట్టారు. అరుణాచలప్రదేశ్‍ సీఎం పెమా ఖండూ 2016లో 26 ఏళ్లకే సీఎం పీఠాన్ని అధిష్టించారు. మేఘాలయ సీఎంగా ఉన్న కనరాడ్‍ సంగ్మా 40 ఏళ్లకు, మహారాష్ట్ర సీఎంగా ఉన్న దేవేంద్ర ఫడ్నవిస్‍ 43 ఏళ్లకు, యూపీ సీఎంగా ఉన్న యోగి ఆదిత్యనాథ్‍ 44 ఏళ్లకు సీఎం పగ్గాలు చేపట్టారు.

బ్రహ్మరథం పట్టిన పులివెందుల..

2019 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ రికార్డు కూడా జగన్‍మోహన్‍రెడ్డి• ఆయన వైఎస్సార్‍ కడప జిల్లాలోని పులివెందుల స్థానం నుంచి ఘన విజయం సాధించారు. 2014లో ఆయన తొలిసారి పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి 75,243 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తాజా ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైన క్షణం నుంచే ఆయన ఆధిక్యం కొనసాగింది. పోస్టల్‍, సర్వీసు ఓట్ల లెక్కింపులోనే ఆయనే పైచేయి సాధించారు. మొత్తం 30 రౌండ్ల ఓట్ల లెక్కింపులో ఆయనకు 90,543 ఓట్ల మెజారిటీ లభించింది. పులివెందుల.. వైఎస్‍ కుటుంబానికి ఆది నుంచీ అండగా నిలుస్తోంది. వైఎస్‍ మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య విజయలక్ష్మి 81,373 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక, ఎంపీ అభ్యర్థిగానూ మెజారిటీలో జగన్‍ రికార్డులు సృష్టించారు. 2009లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కాంగ్రెస్‍ పార్టీ నుంచి కడప ఎంపీగా పోటీ చేసి 1,78,846 ఓట్ల మెజారిటీ సాధించారు. అనంతరం 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో తన సొంత పార్టీపై పోటీ చేసిన ఆయన 5,48,672 ఓట్ల భారీ మెజారిటీ దక్కించుకున్నారు.

ఒక్క చాన్స్ ప్లీజ్‍..

నిజానికి వైఎస్‍ఆర్‍సీపీ శ్రేణులే ఊహించని ఘన విజయమిది. అయితే, ఈ గెలుపులో ఎన్నెన్నో మలుపులు.. ముఖ్యంగా ‘ఒక్క చాన్స్ ఇవ్వండి’ అంటూ ఆయన చేసిన అభ్యర్థన ప్రజల్లోకి బాగా వెళ్లింది. టీడీపీ అరాచకాలకు తోడు జగన్‍ రాజకీయ వ్యూహాలు, నినాదాలు భారీ విజయానికి బాటలు వేశారు. ముఖ్యంగా ‘ఒక్క అవకాశం ఇస్తే శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా పాలన అందిస్తా..’ అని జగన్‍ తన పాదయాత్రలో, ఎన్నికల ప్రచార సభల్లో పదేపదే అభ్యర్థించారు. తండ్రి మరణానంతరం అనేక ప్రతిబంధకాలకు ఎదురీదారనే సానుభూతి, ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ పలుమార్లు అధికారంలో ఉండటం, పైగా ఆ పార్టీ కార్యకర్తలు జన్మభూమి కమిటీల పేరుతో అరాచకాలకు పాల్పడటం వంటి ఘటనల నేపథ్యంలో జగన్‍కు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకుని ఏకపక్షంగా తీర్పునిచ్చారు. అలాగే, ‘రావాలి జగన్‍.. కావాలి జగన్‍’ అనే పాట ప్రజల మనసులను కొల్లగొట్టింది. కోట్ల మంది ఈ వీడియో సాంగ్‍ను వీక్షించారు. హోదా- ప్యాకేజీల విషయంలో టీడీపీ ద్వంద్వ వైఖరిపై ‘యూ టర్న్ బాబు’ అంటూ వైఎస్‍ఆర్‍సీపీ చేసిన ప్రచారం కూడా ప్రజల్లోకి బాగా వెళ్లింది. ‘2019లో మనమే గెలుస్తున్నాం’ అంటూ సామాజిక మాధ్యమాల ద్వారా విపరీతంగా ప్రచారం చేయడం కూడా ప్రజల మైండ్‍సెట్‍ మారడానికి కారణమైంది. ఇక, నవరత్నాలు జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి.

చెరగని చిరునవ్వు..

జగన్‍ నిరాడంబరంగానే ఉంటారు. 2014 ఎన్నికల సమయంలో, ఆ తరువాత కొద్ది కాలం వరకు ఆయన ఎక్కువగా నిలువు గీతల చొక్కాలు ధరించే వారు. ఆ తరువాత తెలుపు చొక్కాలు ఎక్కువ ధరిస్తూ వచ్చారు. ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాక మొత్తం తెలుపు రంగు చొక్కాలే వేస్తున్నారు. అప్పట్లో ఆయన వేసుకునే నిలువు గీతల చొక్కాలు ఆ పార్టీ శ్రేణుల్లో ఒక ట్రెండ్‍గా మారాయి. ఇక, ఆయన సాదాసీదాగానే ఉంటారు. జనంలో బాగా కలిసిపోతారు. వారితో ఇట్టే మమేకం అవుతారు. వారిలో ఒకరిగా మారిపోయి సాధకబాధకాలు వింటారు. అందరినీ పేరు పేరునా ఆప్యాయంగా పలకరిస్తారనే పేరుంది. అలాగే, ఆత్మీయంగా వ్యవహరిస్తారు. నీతి, నిజాయితీ, విలువలు, అవినీతి రహిత రాజకీయాలు వంటి పదాలను ఆయన తన ప్రసంగాల్లో ఎక్కువగా వాడుతుంటారు. తనపై ఉన్న అవినీతి ఆరోపణలను చెరిపేసుకోవడానికి ఈ పదాల వాడకమే ఆయనకు బాగా ఉపకరించిందని అంటారు. అలాగే, బాగా పరిచయస్తులను ‘అన్నా’ అని సంబోధిస్తారు. అంతగా పరిచయం లేని వారితో మాట్లాడాల్సి వచ్చినపుడు ‘వాట్‍ సర్‍’ అంటారని అంటారు. అలాగే కొత్త వ్యక్తులతో అంతగా కలిసిపోరని ఆయన గురించి తెలిసిన వారు చెబుతారు. తండ్రిని తలపించే హావభావాలు, ముఖంపై ఎప్పుడూ చెరగని చిరునవ్వు ప్రజల్లో జగన్‍కు ప్రత్యేక ఇమేజ్‍ను తెచ్చి పెట్టాయి. వైఎస్‍ జగన్‍మోహన్‍రెడ్డి భార్య భారతిరెడ్డి. ఆమె ‘సాక్షి’ దినపత్రికకు చైర్‍పర్సన్‍గా వ్యవహరిస్తున్నారు. ఇక, ఆయనకు ఇద్దరు కుమార్తెలు. వీరిద్దరు ఉన్నత చదువులు చదువుతున్నారు.

పాలన పరుగులు..

వైఎస్‍ జగన్‍మోహన్‍రెడ్డి మే 30న అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్‍ ఈసీఎల్‍ నరసింహన్‍ ఆయన చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. మంచి పాలన అంటే ఏమిటో చూపిస్తానని, దేశం మొత్తం ఆంధప్రదేశ్‍ వైపు చూసేలా చేస్తానని చెప్పిన జగన్‍.. ఆ దిశగా ‘యాక్షన్‍’ ప్రారంభించారు. మధ్య నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తామనేది ఆయన ఇచ్చిన హామీల్లో ప్రధానమైనది. ఈ క్రమంలో బెల్ట్ షాపులపై కొరడా ఝలిపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అనేక కాంట్రాక్టుల అక్రమాలను తిరగదోడటం ప్రారంభించారు. ‘రివర్స్ టెండరింగ్‍’ అంశం ఇప్పుడు ఏపీలో హాట్‍ టాపిక్‍గా మారింది. గెలిచిన అనంతరం జగన్‍ ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‍ షా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‍ను కలిశారు. మోదీ.. ‘జగన్‍తో అద్భుత సమావేశం’ అంటూ ట్వీట్‍ చేయడం దేశవ్యాప్తంగా ఏపీ రాజకీయాలు అందరినీ ఆకర్షించాయి. అలాగే, కేసీఆర్‍ నుంచి ఆత్మీయ స్వాగతం లభించింది. పాలనలో కొత్త మార్పులు తెస్తానని ప్రకటించిన జగన్‍.. ఇప్పటికే చేసి చూపిస్తున్నారు. పాలనను పరుగులు పెట్టిస్తున్నారు.

Review ఆంధప్రదేశ్‍ లో ఫ్యాన్ సునామీ.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top