మనం నిత్యం వాడే మాటల్లో అనేక జాతీయాలు దొర్లుతుంటాయి. వాటిని చాలా వరకు యథాలాపంగా వాడేస్తుంటాం కానీ, నిజానికి వాటికి నిజమైన అర్థమేమిటో చాలామందికి తెలియదు. కానీ, వాడుకలో మాత్రం చాలా ‘పలుకుబడి’లో ఉంటాయి. అంటే, ఎక్కువగా వ్యావహారికంలో ఉంటాయి. వాటి అర్థం తెలియకున్నా.. సరిగ్గా ఆ సందర్భానికి తగినట్టు మాత్రం వీటిని వాడేయడమే ప్రత్యేకత. అలా వాడేస్తుండే కొన్ని పలుకుబడుల గురించి తెలుసుకుందాం.
ఆముదపు చెట్టు
చిన్నదైతే మొక్క. పెద్దదైతే చెట్టు. చేవదేలేది చెట్టు. చేవదేలనిది మొక్క. కొందరు బీరచెట్టు, పొట్ల చెట్టు అని తీగలను కూడా చెట్లని పిలిచే వాళ్లున్నారు. నేలబారున పెరిగే వెంపలి ‘చెట్టు’కు నిచ్చెనలు వేసేవాళ్లు పుడతారని కలికాల లక్షణంగా చెబుతారు. ఆ సంగతలా ఉంచి, ‘చెట్లు లేనిచోట ఆముదపు చెట్టే మహావృక్ష’మనే వాక్యం వాడుకలో ఉందని తెలుసు కదా!. సమర్థులు లేనిచోట ఉన్నంతలో ఉన్నవాడే గొప్పవాడనే అర్థంలో ‘అతగాడు ఆముదపు చెట్టులాంటి వాడ’ని అంటారు. పోటీదారు గానీ, మించిన వాడు కానీ లేనిచోట తానే అందరి కన్నా పెద్దవాడినని, గొప్పవాడినని చెప్పుకుని బతికే వ్యక్తిని ‘ఆముదపు చెట్ట’ని వేళాకోళంగా పిలుస్తారు.
ఆముదాలు
ఈ మాట ఆముదం చెట్లకూ, గింజలకూ అన్వయించవలసిందే కానీ లోక వ్యవహారంలో దీనికి మరో విశేషార్థం ఉంది. ఇప్పటిలా దివాలా తీసి బకాయిపడిన వారు అప్పులిచ్చిన వాళ్లకు ఎలా చెల్లించాలో వివరించే చట్టాలు లేని రోజుల్లో ఎందుకు పుట్టిందో కానీ ఈ మాట పుట్టింది. పదిమంది దగ్గర అప్పు తీసుకుని ఎవరికీ పూర్తిగా తిరిగి ఇవ్వలేని సందర్భంలో ఆముదాలు పంచడమనే పద్ధతి వాడుకలో ఉంది. మచ్చుకు వెయ్యి రూపాయలు నలుగురికీ బాకీ పడిన వ్యక్తి దగ్గర చివరకు వంద రూపాయలు మాత్రమే మిగిలి ఉంటే వారు వారిచ్చిన అప్పు దామాషా ప్రకారం ఈ నూరు రూపాయలనూ పంచిపెట్టి రుణం తీరిందనిపించుకోవడాన్ని ‘ఆముదాలు పంచడం’ అంటారు. వర్తక ప్రపంచంలో ఈ మాట ఒకప్పుడు మంచి వాడుకలో ఉండేది. ఈ పద్ధతిలో ఎక్కువ అప్పిచ్చిన వాడికి ఎక్కువ భాగం, తక్కువ ఇచ్చిన వాడికి తక్కువ భాగం దక్కేది. మొత్తం ఎవరికీ తిరిగి రాదు. ఇది రుణగ్రస్తుడి దగ్గర మిగిలిందని లెక్కతేలిన సొమ్ముకే పరిమితం. కానీ రుణగ్రస్తులు తమ ఆస్తులను లెక్కతేలనివ్వక, వాటిని బయటపడనివ్వకుండా చేతిలో ఏ పదో పరకో మిగిలిందని, వాటిని ఆముదాలుగా పంచేసి బయటపడే వాళ్లు. ఆస్తుల విషయం బయటపెట్టే వారు కాదు. అందువల్ల అప్పులు చేయడంలో ఆరితేరిన వారు ఎన్నిసార్లయినా దివాలా తీయగలుగుతుండే వారు. అన్నిసార్లూ బయటకు తెలియకుండా ఎంతోకొంత ఆస్తిని దాచుకునే వారు. పైకి మాత్రం మా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదని, అందుకే దివాలా తీశామని బీదరుపులు అరుస్తుంటారు. ఈ కారణంగానే తెలుగులో ఓ సామెత పుట్టింది- ‘ఏడుసార్లు దివాలా తీసిన వాడిని వెతికి పట్టుకుని మరీ పిల్లనివ్వాల’ని!. అన్నిసార్లు బాకీదారులను ముంచి తాను బాగుపడిన వాడు సామాన్యుడు కాదు కనుక, అతడి ‘సమర్థత’ను గుర్తించడమే గాక, అతడి దగ్గర బయటకు చెప్పని, కనిపించని ఆస్తి పుష్కలంగా ఉండి తీరుతుందన్న నమ్మకంతో కూడా ఈ జాతీయం పుట్టి ఉంటుంది. ఆముదం ఒంట్లోని కల్మషాన్ని వదిలించినట్టు ‘ఆముదాలు పంచడం’ అనేది రుణగ్రస్తతను వదిలిస్తుంది. అలాగే ఆముదాలు ఔషధపరంగా విరేచనకారిగా పనిచేస్తాయి.
ఆరుద్ర వాన
ఆరుద్ర కార్తెలో పడే వాన అదరగొడుతుందని అనుభవజ్ఞులంటారు. ‘ఆరుద్ర వాన అదరు వాన’ అనే సామెత కూడా ఉండనే ఉంది. ఆ ఏడాది ఫలసాయం ఆ వాన తీవ్రత మీద ఆధారపడి బాగుపడటమో, నష్టపోవడమో జరుగుతుంది. అందువల్ల ఆ కార్తెలో వాన కురుస్తుంటే రైతులు భయపడటం సహజం. ఈ లక్షణాన్ని పురస్కరించుకుని ఎవరైనా దూకుడుగా గబగబా మాట్లాడుతున్నా, తిట్టుకొంటున్నా ఆరుద్ర వానలా ఉందని ఆక్షేపిస్తుంటారు. అనుభవంలోని ప్రకృతి లక్షణాలను వ్యక్తుల ప్రవర్తనకు అన్వయించి వాడే జాతీయాల్లో ఇదీ ఒకటి.
ఆర్బత్ నాట్ క్షౌరం
ప్రపంచ యుద్ధకాలంలో వాడుకలోకి వచ్చిన జాతీయమిది. అంతకుముందూ, ఆ తరువాత మన భాషలో ఇమిడిపోయింది ‘తిరుపతి క్షౌరం’ మాత్రమే. ‘ఆర్బత్ నాట్ క్షౌరం’ అంతకంటే వేలరెట్లు ఎక్కువ తీవ్రమైనది. సర్వాంగ క్షౌరంలాంటిదన్న మాట. ఆ కాలంలో ఆర్బత్ నాట్ కంపెనీ అని ఒకటుండేది. దానికి ప్రపంచవ్యాప్తంగా శాఖలూ, ఉప శాఖలూ ఉండేవి. బ్రహ్మాండంగా వ్యాపారం చేసిన ఆ సంస్థలో చాలామంది వాటాలు కొన్నారు. పెట్టుబడులు పెట్టారు. నానా దేశాల్లో యుద్ధకాలంలో ఆ కంపెనీ అకస్మాత్తుగా దివాలా తీసింది. లక్షల మంది సమస్తం కోల్పోయారు. వందల మంది గుండెలు పగిలి చచ్చారు. ముఖ్యంగా మధ్యతరగతి జనం ఉన్నదీమన్నదీ ఊడ్చిపెట్టి వాటాలు కొన్నారు. డబ్బు దాచుకున్నారు. అంతా పోగొట్టుకున్నారు. తొలి తాకిడి తీవ్రత తగ్గిన తరువాత కావాలని ఈ సంస్థ దివాలా తీసిందనే ప్రచారం పుట్టింది. దరిమిలా ఆ వివరాలు అందరూ మరిచిపోయినా భాషలో మాత్రం ‘ఆర్బత్ నాట్ క్షౌరం’ అనే మాట మిగిలిపోయింది. వ్యాపారం మొత్తం మునిగినా, ముంచినా ‘ఆర్బత్‍నాట్ క్షౌర’మైనట్టే లెక్క.
ఆవంలో రాగిముంత
ఆవం అంటే కుమ్మరిరావం. పచ్చికుండలను కాల్చేచోటు. అక్కడ ఏ
లోహమూ కనిపించదు. బంకమట్టి, అడుసు, సారె వంటివి తప్ప ఇనుము, రాగి వగైరా అక్కడ ఉండవు. అయినా సరే ఓ మహానుభావుడు కుమ్మరిరావంలో రాగిముంతైనా ఉండకపోతుందా అని వెతికాడంట!. అజ్ఞానానికి నిదర్శనంగా ఈ జాతీయాన్ని వాడుతుంటారు. పైపెచ్చు కుమ్మరిరావంలో లోహం గురించి వెతకడం వృథా శ్రమ. ఏ ప్రయోజనం ఉండదు. అయినా అందులో లోహం దొరుకుతుందని వెతకడం అజ్ఞానమే కదా!. ‘ఆవంలో రాగిముంత’ అంటే లేని వస్తువు కోసం వెతకడం. కుందేటి కొమ్ము, గాడిదగుడ్డులాంటి పద ప్రయోగంలాంటిదే ఇదీనూ! లేని వస్తువు కోసం, దొరకని దాని కోసం, అది ఉండటానికి వీల్లేని చోట వెతికే తెలివితక్కువ పని ‘రాగిముంత కోసం ఆవంలో వెతకడం!’.
ఆశ్లేష వాన
ఆశ్లేష కార్తెలో పడే వానకు అరికాలు తడిస్తే అదే గొప్ప అనేది అనుభవజ్ఞుల మాట. వానకారుకు ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నా ఉరుములూ మెరుపులూ జోరుగా ఉండి, మబ్బు గాలికి తేలిపోతుంది. టపటపా నాలుగు చినుకులు పడి వచ్చినంత త్వరగానే ఆశ్లేష కార్తెలో కురిసే వాన ఆగిపోతుంది. ఈ ప్రకృతి లక్షణం ఆధారంగా పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి పిసరంత చేతిలో పెట్టే దాతల విషయంలో ఈ మాటలు వాడుతుంటారు. ఆర్భాటమే కానీ త్యాగం చేసేది తక్కువన్న మాట. చేతికి ఎముక లేనట్టు కోతలు కోసి రెండో అంతస్తు కట్టిస్తామని ఆకుపూజ చేయించే బాపతు దాతల గురించి ప్రస్తావించేటప్పుడు ‘ఆయన వాగ్దానానికేం లెండి. అదంతా ఆశ్లేష వాన’ అని ఈసడిస్తుంటారు. మాటలు కోటలు దాటినా కాలు గడప దాటని, బడాయి మనుషుల ఠీవిని ఈ జాతీయం ద్వారా దెప్పిపొడుస్తుంటారు. నేటి రాజకీయ నాయకుల హామీలు, వాగ్దానాలు ఆశ్లేష వానను తలపించేవే అంటే అతిశయోక్తి కాదు.
మూర్ఖుడిని మెప్పించలేం!
ఎడ్డె దెలుపవచ్చు నేడాది కైనను
మౌని దెలుపవచ్చు మార్గమునను
మొప్పె దెలుపరాదు ముప్పదేండ్లకు నైన,
విశ్వదాభిరామ! వినుర వేమ!!
అర్థాలు:
ఎడ్డె: ఏమీ తెలియని వాడు, ఏడాది: సంవత్సరం, మౌని: మౌనంగా ఉండేవాడు, మొప్పె: మూర్ఖుడు.
భావం:
ఒక సంవత్సరమైనా ప్రయత్నించి అవివేకికి తెలివి కలిగేటట్టు చేయవచ్చు. ఏదైనా ఒక మార్గంలో మౌనికి కూడా విషయాన్ని తెలియజెప్పవచ్చు. కానీ, ముప్పయి సంవత్సరాలు ప్రయత్నించినా మూర్ఖునికి ఇసుమంత కూడా తెలియజెప్పలేము.
వివరణ:
ఎడ్డె అంటే అవివేకి. వివేకం అంటే తెలివి. అది లేనివాడు అవివేకి. ప్రయత్నిస్తే అవివేకికి క్రమంగా వివేకం అబ్బేటట్టు చేయవచ్చు.
ఇక, మౌని.. వీరు మౌనాన్ని వ్రతంగా అవలంభిస్తూ ఉంటారు. వీరు సైగల ద్వారా గానీ, రాతల ద్వారా గానీ తమ భావాలను వ్యక్తం చేస్తారు.. లేదా అది కూడా చేయరు. అంటే ఏ భావం లేకుండా వీరు మౌనంగా, అభావంగా ఉంటారు. మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారు. ఇటువంటి వాళ్లకు కూడా విషయాన్ని ఏదో ఒక పద్ధతిలో తెలియజేయడానికి చాలా వరకు అవకాశం ఉంది.
ఎటొచ్చీ ‘మొప్పె’లతోనే తంటా. మొప్పె అంటే మూర్ఖుడు. తనకు తెలియదు. ఇతరులు తెలియజెప్పబోతే వినిపించుకోడు. అటువంటి మూర్ఖుడికి ఎంతకాలం ప్రయత్నించినా ఏమాత్రం తెలియజెప్పలేము.




































































































































































Review ఆరుద్ర వాన అదరు.. ఆశ్లేష వాన పిసరు.