బోధన రంగమంటే ప్రాణమిచ్చే జిల్.. 1970 సంవత్సరం నుంచి అదే వృత్తిలో కొనసాగుతున్నారు. ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో పని చేసిన ఆమె ప్రస్తుతం నార్తర్న్ వర్జీనియా కమ్యూనిటీ కాలేజీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు. జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన రెండు పర్యాయాల్లో రెండో మహిళగా హోదాను అందుకుంటూ ఒకవైపు అధికారిక బాధ్యతలు నిర్వర్తిస్తూనే, మరోవైపు తన వృత్తినీ సమాంతరంగా కొనసాగించారు జిల్. ఉపాధ్యాయ వృత్తి అంటే ప్రాణం పెట్టే జిల్.. ‘టీచింగ్ నన్ను నన్నుగానే కాదు.. నాలోని ఓ ప్రత్యేకమైన కోణాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసింది’ అని చెబుతారు. ఇప్పుడు తన భర్త అమెరికా అధ్యక్షుడైనా కూడా తాను పాఠాలు చెబుతూనే ఉంటానని జిల్ చెప్పారు.
ఇక అమెరికా రెండో మహిళగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కాలంలోనే పలు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాలుపంచుకున్నారు జిల్. ఈ క్రమంలో బాలికలకు రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కలిగించేందుకు పలు కార్యక్రమాలు సైతం నిర్వహించారు ఆమె. అంతేకాదు.. అప్పటి మొదటి మహిళ మిషెల్ ఒబామా (అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య)తో కలిసి ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు జిల్. ఇందులో భాగంగా సైనిక కుటుంబాలకు అండగా ఉంటూనే వారి పిల్లలకు చదువు, ఉద్యోగం వంటి విషయాల దిశగా కృషి చేశారు.
డోంట్ ఫర్గెట్.. గాడ్ బ్లెస్ అవర్ ట్రూప్స్..
జిల్ పరిపూర్ణ మహిళ మాత్రమే కాదు.. బహుముఖ ప్రజ్ఞ ఆమె సొంతం. ఇటీవలే జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆమె తన భర్త వెన్నంటే ఉండి అను నిత్యం ఆయనకు అండగా నిలబడ్డారు. ప్రచారంలో భాగంగా ఒకసారి నిరసనకారులు బైడెన్పైకి దూసుకువచ్చిన సమయంలో ఆమె తన భర్తకు రక్షణగా నిలబడి ప్రేమను చాటుకున్నారు. ఈ సంఘటనలో ఆమె అందరి దృష్టినీ ఆకర్షించారు. ప్రతిభా సంపన్నురాలైన ఈ అమెరికా ఫస్ట్ లేడీలో గొప్ప రచయిత్రి కూడా దాగి ఉంది. 2012లో ‘డోంట్ ఫర్గెట్. గాడ్ బ్లెస్ అవర్ ట్రూప్స్’ అనే పుస్తకాన్ని ప్రచురించారు జిల్. ఒక మిలటరీ కుటుంబానికి చెందిన తన మనవరాలి.
అనుభవాలను రంగరింగి ఇలా పుస్తకంగా విడుదల చేశారు జిల్. అన్నట్టు జిల్ డాక్టరేట్ కూడా చేశారు. కాగా, ప్రస్తుతం అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా విద్యా రంగంలో విశేష అనుభవం ఉన్న ఇండియన్ – అమెరికన్ మాలా అడిగ నియమితులయ్యారు. ఈ మేరకు అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. మాలా అడిగ కుటుంబం మూలాలు కర్ణాటకలోని ఉడుపిలో ఉన్నాయి. మాలా తల్లిదండ్రులు యాభై సంవత్సరాల క్రితమే అమెరికాలో స్థిరపడ్డారు.
పెట్ లవర్..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నిలిచి గెలిచిన బైడెన్, ఆయన సతీమణి జిల్కు సంబంధించిన వార్తలతో ఒక్క అమెరికాలోనే కాదు యావత్ ప్రపంచమంతా నిండిపోయింది. ఈ దంపతులతో పాటు వారి పెంపుడు శునకాలు కూడా సోషల్ మీడియాలో యమా క్రేజ్‌ను సంపాదించుకున్నాయి. బైడెన్, జిల్ ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న ఛాంప్, మేజర్ అనే జర్మన్ షెఫర్డ్ శునకాలకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అమెరికా అధ్యక్షుల పెంపుడు శునకాలు వారితో పాటే వైట్ హౌస్‌లో రాజభోగాలు అనుభవించడం అమెరికాలో సాధారణమే. అయితే పూర్వ అధ్యక్షుడు ట్రంప్‌కు ఎలాంటి పెంపుడు కుక్కలు లేకపోవడంతో, మళ్లీ నాలుగు సంవత్సరాల తరువాత శ్వేతసౌధంలో ఛాంప్, మేజర్ సందడి చేయనున్నాయి. జిల్ వాటితో ఆడుకుంటుండగా క్లిక్‌మనిపించిన ఫొటో ఒకటి నెటిజన్లను ఇటీవల విపరీతంగా ఆకట్టుకుంది.
లక్ష ఏళ్లయినా బైడెన్‌తో పొసగదనుకున్నా..
మొదటిసారి బైడెన్‌ను చూసినపుడు, లక్ష సంవత్సరాలైనా ఆయనతో నాకు పొసగదని అనుకున్నానని జిల్ కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు. అటువంటి జిల్.. బైడెన్‌తో కలిసి తొలి అడుగు వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వెన్నంటే ఉండటం విశేషం.
కొత్త సంప్రదాయానికి నాంది..
అమెరికన్ల దృష్టిలో ఫస్ట్ లేడీ అంటే వైట్‌హౌస్‌లో ఉంటూ, అవసరమైన ప్రతి సందర్భంలో ప్రెసిడెంట్ పక్కన మెరుస్తూ కనిపించాలి. అయితే ఈ దృక్పథంలో మార్పు వచ్చే సమయం వచ్చింది. అమెరికా అధ్యక్షుడి భార్య హోదాలో ఫస్ట్ లేడీగా మసులుకుంటూనే, తనదైన బోధన వృత్తినీ కొనసాగించవచ్చనే ఆలోచనకు అమెరికన్లు అలవాటు పడేలా చేయనున్నారు జిల్. ప్రస్తుతం ఆమె పనిచేస్తున్న నార్తర్న్ వర్జీనియా కమ్యూనిటీ కాలేజీలో ప్రొఫెసర్‌గా ఉన్న ఆమె.. అదే వృత్తిలో మరో నాలుగు సంవత్సరాలు కొనసాగనున్నారు. జిల్ పలు సందర్భాల్లో ‘బోధన నా వృత్తి కాదు.. బోధనే నేను’ అని చాటుకున్నారు.
Review ఇటు బోధన.. అటు సామాజిక సేవ.