మనం ఏం చేస్తున్నామన్నది కాదు.. ఎలా చేస్తున్నా
మన్నదే ముఖ్యం. మనం పని విషయంలో నిత్య శ్రామికులం కావాలి. మనకు ఏది దొరికినా అది మన కర్మ.. అంటే మనం చేసిన పనుల ఫలితమే. అదే ప్రారబ్ధం. ఆ పని తాలూకు ఫలితం నిస్వార్థపూరితమైనదైతే దాని ఫలితం శాశ్వతంగా మిగిలిపోతుంది. అటువంటపుడు ఓటమి అనే భావమే దరి చేరదు. మనం చేసే పనులపైనే మన వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. మనం వాడుకలో లేక తుప్పు పట్టిపోయిన యంత్రంలా కాకుండా నిర్విరామ శ్రమతో పదును తేలిన పనిముట్టులా ఉండాలి
మనమందరం భగవంతుని చేతిలో పనిముట్లు వంటి వాళ్లం. మనం ఏం చేయాలో, మన చేత ఏం చేయించాలో అంతా ఆ భగవంతుడే చూసుకుంటాడు. మనకు ఏది లభిస్తే అది భగవంతుని మహా ప్రసాదం అనుకోవడం, ఫలితం గురించి ఆలోచించక దానిని భగ వంతుని ఇచ్ఛకే వదిలేసి పనిలో నిమగ్నమై పోవడమే మన కర్తవ్యం కావాలి. కర్మయోగం అంటే అదే. ఫలితం గురించి ఆలోచించకుండా పనిచేసే వారు ధీరులతో సమానం.
మన కర్తవ్యాలను మనం చిత్తశుద్ధితో నిర్వర్తించే విషయంలో భగవంతుడు ఒక మహత్తరమైన హామీని మనకు ఇస్తున్నారు. అది- ‘‘చేతిలో ఉన్న పని గురించే ఆలోచించండి. ఆ కర్తవ్యాన్ని ఎలా నెరవేరుస్తున్నామో పరిశీలించండి. ఫలితం సంగతిని ఆ దేవుడికే అప్పగించండి. కష్టపడి కాదు.. ఇష్టపడి చేసే పనికే భగవంతుడు మహత్తరమయిన, శాశ్వతమయిన ఫలితాన్ని ప్రసాదిస్తాడు. మీ పని మీరు చేయండి. నేను ఉన్నది మీకు మీరు చేసే కర్మలకు తగిన బంగారు బహుమతులు ఇచ్చేందుకే..’’.
ప్రారబ్ధ సిద్ధాంతం..
ప్రయత్నంతో ఎటువంటి పనినైనా సాధించవచ్చు. స్వప్రయత్నంతో దేనినైనా సాధించవచ్చు. సాధించడం అంటే అనుకున్న ఫలితం వచ్చే వరకు లేదా చేపట్టిన పని పరిపూర్ణమయ్యే వరకు పని చెయ్యడం. పనిని మధ్యలో ఆపివేసి ఫలితం రాలేదని, పొందలేదని నిందలు వేయడం పొరపాటు. గతంలో చేసిన పనుల ప్రకారమే ప్రస్తుతం ఫలితాలు లభిస్తాయనేదే ప్రారబ్ధ సిద్ధాంతం. ప్రయత్నిస్తేనే భవిష్యత్తులో ఫలితాన్ని పొందగలమనేది స్వప్రయత్న సిద్ధాంతం.
మనం జీవితాంతం బతికేది ధనార్జన కోసమేనా? లేదా మరేదైనా ఉత్తమ గతి కోసమా? బతకాలీ అంటే సంపాదించుకోక తప్పదు. జీవితాంతం బతకాలంటే జీవితకాల పర్యంతం ధనార్జనకు శ్రమించాల్సిందేనా? జీవితానికి అది తప్ప వేరే పరమార్థం లేదా? ఇక్కడే మనందరం ఒక సత్యాన్ని గ్రహించాలి.
జీవించడం కోసం సంపాదించడం- అర్థం
సంపాదించడం కోసం జీవించడం- వ్యర్థం.
ఈ నీతిని గ్రహించి సంపాదించిన దానితో సంతృప్తి చెందితే ఆనందంగా జీవించగలం. జీవితం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోవాలంటే ధనం అవసరం. అయితే ధనం మాత్రమే ఆనందానికి హేతువు కాదు. ఆనందం డబ్బూ దస్కాలపై ఆధారపడి ఉంటుందంటే ఈ లోకంలో ధనవంతులు చాలా సంతోషంగా ఉండి ఉండాలి. కానీ, అలా జరగడం లేదు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే, మానసిక, శారీరక సమస్యలతో బాధపడే వారిలో సంపన్నులే అధికం. అవసరాలకు సరిపడా డబ్బుంటే చాలు ప్రతి ఒక్కరూ కుబేరులతో సమానమే. అవసరానికి మించిన ధనం మాత్రం భోగాలకు కారణం అవుతుంది. భోగాలు రోగాలకు దారితీస్తాయి. రోగాలు వినాశనాన్ని కలిగిస్తాయి.ధన సంపాదన విషయమై ఎందరో భక్తులు షిర్డీ సాయినాథుని వద్ద సందేహాన్ని వ్యక్తం చేసేవారు.
‘‘అవసరాలకు సరిపడా సంపాదించుకోవడంలో తప్పులేదు కానీ, ఈ శరీరాన్ని మొత్తం ధనార్జన కోసమే వినియోగిస్తే ఈ జీవితం వ్యర్థం. అలాగే సంపాదించిన ధనాన్ని పోగుచేయకుండా అందులో ఏ కొంత మొత్తం వెచ్చించైనా అన్నదానాలకు, పేదల కోసం ఖర్చు చేయాలి. అలా చేయడం వల్ల ధనం సద్వినియోగం అవుతుంది. ఎవరైనా తాను సంపాదించనదంతా తాను మాత్రమే అనుభవిస్తే అది అతనితోనే అంతమైపోతుంది. అదే సంపాదనలోని కొంతైనా పరుల కోసం వినియోగిస్తే జన్మజన్మలకూ పుణ్యం లభిస్తుంది. అటువంటి ఫలం కలకాలం నిలిచి ఉంటుంది’’ అని బాబా వారి సందేహాన్ని తీర్చేవారు.
ఒక రౌతు గుర్రంపై ప్రయాణిస్తూ వెళ్తున్నాడు. మార్గమధ్యంలో ఒక బాటసారి ఎదురయ్యాడు. అతను రౌతుతో-‘అయ్యా! మీరు ఎటు వెళ్తున్నారు?’ అని అడిగాడు.ఆ రౌతు- ‘అదేమిటి? ఎక్కడికి వెళ్తున్నారని నన్ను అడుగుతున్నావు? నన్ను తీసుకువెళ్తున్నది గుర్రం కదా! దానిని అడగాల్సింది’ అని బదులిచ్చాడట.గుర్రం మన ప్రయాణానికి, ఇతరత్రా పనులకు ఉపయోగపడే ఒక సాధనం. అదే మాదిరిగా మన జీవన గమనానికి అవసరమైన కోరికలు, అవసరాలు తీర్చే ఉపకరణం ధనం. అటువంటి ధనమే కనుక మనల్ని, మన గమ్యాన్ని నిర్దేశించడం మొదలుపెడితే మనకు వచ్చేది ఉన్మాదం. అలాకాక మనమే ధనాన్ని అదుపులో పెట్టుకుని, దానిని శాసించగల స్థాయిలో ఉంటే కలిగేది ఆనందం.ఏది ఎంత ఉండాలో, ఏది ఎంత ఉంటే ఆనందమో మనం నిర్ణయించు కోగలిగితే జీవితంలో అన్నీ సమతూకంలో సమకూరుతాయి. ఏది ఎక్కువైనా, ఏది తక్కువైనా సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా జీవన నాణ్యత పడిపోతుంది. మనం చేసే పనిని ఎంత నాణ్యంగా చేయాలని తలపోస్తామో మన జీవితాలనూ అంతే నాణ్యంగా రూపుదిద్దుకోవాలి.
Review ఇష్టపడి చేద్దాం.