ఈ మధుమాసం లో…

ఉగాది.. మన ఊహల గాది. మన కలల పునాది. మన అంతరాంతవేది.
ఉగాది సర్వజన హృదయాహ్లాది. తెలుగు నాట ‘ఉగాది’. అస్సాలో ‘బిహూ’. కేరళలో ‘కొల్లవర్షం’. పంజాబ్‍లో ‘వైశాఖి’. మహారాష్ట్రలో ‘గుడిపడ్వా’. సిక్కింలో ‘నోసంగ్‍’. పేర్లూ, ఊళ్లూ వేర్లయినా ఉగాది అందించే సందేశం మాత్రం ఒక్కటే. భాషలూ, వేషాలు వేరైనా పవిత్ర భావన ఒక్కటే. ఇక, తెలుగునాట ఉగాది భావనలు, అదీ మన తెలుగు సాహిత్యంలో కొత్త చిరుగు తొడిగిన జిలుగుల వెలుగుల రుచి చూద్దామా.
‘రుతువుల్లో కుసుమాకరాన్ని’ అని కృష్ణుడు చెప్పాడు. వసంత మాసాన్నే మధు మాసం అని కూడా అంటారు. వసంతం మిక్కిలి హాయి గొలిసే సమయం. అందుకే కాబోలు డాక్టర్‍ సి.నారాయణరెడ్డి తన ‘కర్పూర వసంత రాయలు’లో ‘యువతులెల్లరు రతీరామలు/ యువకులో మన్మథస్వాములు’ అని అత్య ద్భుతంగా వర్ణించారు. ఒకప్పుడు తెలుగు నేలపై వసంతోత్సవాలు, గోపాలదేవోత్సవాలు విరివిగా జరిగేవి. ఇవన్నీ వసంత ప్రాధాన్యాన్ని తెలిపేవే. ఇలాంటి రుతువును గురించి ఆదికవి మొదలు ఆధునిక కవి వరకు వర్ణించని కవి లేరంటే అతిశయోక్తి కాదు. అందుకే రుతువులకే రాణి వసంతం.
‘ కమ్మని లతాంతముల కుమ్మొనసి వచ్చు మధుపమ్ముల సుగీత నినదమ్ము..’ అంటూ పాండురాజు శతశృంగం పర్వతం మీద గడిపే కాలంలో ఓ వసంత రుతువర్ణన చేశాడు నన్నయ. ఆ మధు మాసం ఎలా ఉందంటే.. రకరకాల పూలు పరిమళాలు వెద జల్లు తున్నాయి. దాన్ని పట్టుకుని తుమ్మెదలు పూల చెంత చేరు తున్నాయి. అప్పుడు వాటి ఝుంకారం దిక్కులన్నిటా మారు మోగుతోంది. ఇక, కోయిలలేమో కొత్త చిగుర్లతో నిగనిగలాడుతున్న మామిడిపూతను ఆస్వా దిస్తున్నాయి. మావిచిగురు తిని మత్తెక్కి పాడు తున్న కోయిలల కుహూస్వరం మధురంగా వినిపిస్తోందట. ఆ వనంలోని అశోక వృక్షాలు, సంపంగి మోదుగు చెట్లు పూలగుత్తులతో కనువిందు చేస్తున్న దృశ్యాన్ని, తన కవితా లక్షణమైన అక్షర అమృతంను సాధిస్తూ రమ్యంగా వర్ణించాడు నన్నయభట్టు.
ఇక, ఎర్రన తక్కువ రాయలేదు. ‘ఎందును పుష్ప సౌరభమ మెందును మందమదాళి ఝంకృతుల్‍/ ఎందును సాంద్ర పల్లవము లెందును..’ అంటూ వర్ణించాడు. అల్లసారి పెద్దన అయితే ఏకంగా, చెట్లు ఆకులు రాల్చిన గంట్ల నుంచి మళ్లీ ఆకులు చిగుర్లు తొడిగి, ఎర్రబారిన తర్వాత లేత ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ వర్ణాల్లోకి మారి.. అలా అలా ఆకులు దట్టమై నల్లటి నిగారింపు పొందిన వైనాన్ని కళ్లకు కట్టినట్టు వర్ణించాడు.
కందుకూరి రుద్రకవి తన ‘యయాతి చరిత్ర’లో వసంతం గురించి చేసిన వర్ణనను వర్ణించడానికి అక్షరాలు చాలవు.
‘చిలుకుల చదువుల బడులయి..’ అనే పద్యంలో ఆడిదము సూరకవి వర్ణించిన ప్రకారం- ‘వసంత•ం రాగానే చెట్లన్నీ చిలుకలకు బడులయ్యాయట. తుమ్మెదలకు పానశాలలుగా మారాయట. కోయిల గుంపులకు విందుగా మారి కళకళలాడాయట.
‘ఇది మధు మాసమా! అవుర యెంత మనోహరమెందుజూచినన్‍’ అంటారు కవిసామ్రాట్‍ విశ్వనాథ సత్య నారాయణ.
వసంత రుతువు ఆరంభ దినమే తెలుగు వారి ఉగాది అయి ఉండటం యాదృ చ్ఛికం కాదు. అందుకే ఎంతోమంది కవులు వసంతాన్ని, ఉగాదినీ కలిపి కవితలల్లారు.

Review ఈ మధుమాసం లో….

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top