మన భరత భూమి రామాలయాలకు పుట్టినిల్లు. దేశవ్యాప్తంగా శ్రీరాముడికి ఎన్నో గుడులూ గోపురాలూ ఉన్నాయి. అయితే చారిత్రక ప్రాధాన్యం రీత్యానో, స్థల పురాణ ప్రాశస్త్యంతోనో, వాస్తుకళతోనో అవన్నీ ప్రాచుర్యం చెందుతుంటాయి. అరుదుగా కొన్ని గుడులు మాత్రం వాటన్నింటితో పాటు సినిమా షూటింగుల పరంగానూ, వివాహ వేదికగానూ భక్తుల ఆదరణను చూరగొంటాయి. ఆ కోవకే చెందుతుంది హైదరాబాద్ శివారు శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయం.
చుట్టూ పచ్చని పరిసరాలూ, సువిశాలమైన ఆవరణా, ఎత్తయిన రాజగోపురం, పొడవాటి ప్రాకారాలతో అలరారే అమ్మపల్లి ఆలయం అతి పురాతనమైనది. సీతమ్మ వారు ఇక్కడ కొలువు దీరడంతో ఈ ఊరికి అమ్మపల్లి అనే పేరు వచ్చిందని అంటారు. ఆలయంలోని రాముల వారు కల్యాణరాముడుగానూ, సీతమ్మ వారు సంతాన ప్రదాయినిగానూ భక్తుల పూజలందుకుంటున్నారు. పెళ్లి కావాలనే వారు, సంతానం కోసం కలలు కనేవాళ్లు ఈ గుడిలోని సీతారాములను దర్శించి మొక్కుకుంటారు.
ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో వేంగీని పాలించిన కల్యాణీ చాళుక్యులు కట్టించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అయితే ఇక్కడి విగ్రహాలు మాత్రం అంతకన్నా పూర్వకాలం నాటివని, అవి బహుశా 7 – 11వ శతాబ్దం మధ్య కాలానికి చెందినవై ఉంటాయనేది పురావస్తు నిపుణుల అంచనా.
ఈ ఆలయం గర్భగుడిలోని సీతారామలక్ష్మణుల ప్రతిమలు మకర తోరణాలను కలిగి ఉండటంతో పాటు ఏకశిలపై చెక్కి ఉండటం విశేషం. ఏకశిలా విగ్రహాలు మనకు తెలిసినంత వరకూ రెండే ఉన్నాయనీ, ఒకటి ర్యాలీ జగన్మోహన ఆలయంలో ఉందనీ, రెండోది అమ్మపల్లి ఆలయంలోనిదనీ చరిత్రకారుల అభిప్రాయం. ఇక్కడ రాముల వారు కుడిచేతిలో బాణాలూ, ఎడమ చేతిలో విల్లునూ పట్టుకున్న కోదండరాముడిగా దర్శనమిస్తాడు. పద్నాలుగేళ్ల వనవాస సమయంలో రాముడు సంచరించిన ప్రాంతాల్లోనే ఈ కోదండరాముడి ఆలయాలు కనిపిస్తాయి. ముఖ మంటపంలో కూర్మం ఉండటం వల్ల ఈ క్షేత్ర దర్శనం మోక్షాన్ని ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు. అలాగే గర్భగుడి పై భాగంలో దశావతారాలు కళ్లకు కట్టినట్టు కళారూపాలుగా దర్శనమిస్తాయి.
దాదాపు తొమ్మిది ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ ప్రాంగణానికి ఘనమైన పౌరాణిక ప్రాశస్త్యం ఉంది. సీతాలక్ష్మణ సమేతంగా రాముడు దండకారణ్యంలో సంచరించే సమయంలో ఇక్కడ ఒక రాత్రి సేదదీరాడని, అప్పటికి అంజనీసుతుడైన ఆంజనేయుడిని కలవలేదని అంటారు. ఈ కారణంగానే కాబోలు ఆంజనేయుడు గర్భగృహంలో కనిపించడు. హనుమ విగ్రహాన్ని ఎదురుగా ఉన్న ముఖ మంటపంలో శ్రీరాముడికి ఎదురుగా ధ్వజ స్తంభం వద్ద తరువాత కాలంలో ప్రతిష్ఠించి ఉంటారని చెబుతారు. ఇక్కడే గరుత్మంతుడి విగ్రహం కూడా కనిపిస్తుంది.
తొంభై అడుగుల ఎత్తులో ఏడు అంతస్తులుగా ఉన్న గాలి గోపుర నిర్మాణ చాతుర్యం అద్భుతంగా ఉంటుంది. కాల్చిన ఇటుకలూ, సున్నపురాయితో ఎంతో పటిష్టంగా కట్టిన ఈ గోపురం నాటి చార్మినార్ కట్టడానికి స్ఫూర్తిగా నిలిచిందనీ అంటారు. ప్రవేశ ద్వారానికి పై భాగంలో శేషతల్ప సాయిగా ఉన్న విష్ణుమూర్తి విగ్రహం చూపరుల కళ్లను కట్టి పడేస్తుంది.
ఆలయ గోపురం, ప్రాంగణంలోని మెట్లబావి రాజస్థానీ వాస్తు నిర్మాణాన్ని పోలి ఉన్నాయనీ, బహుశా అవి తరువాత కాలంలో కట్టి ఉంటారనీ భావిస్తున్నారు. ఈ రకమైన ఉత్తరాది నిర్మాణం దక్షిణాదిన కనిపించడం కూడా అరుదైన సంగతే. మెట్లబావి చుట్టూ ఉన్న కొబ్బరిచెట్లు భక్తులకు ఆహ్లాదం గొలుపుతుంటాయి.
నిత్యపూజలతో పాటు శ్రీరామ నవమికి ఇక్కడ సీతారామ కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవమూర్తులను నర్కూడ నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకొస్తారు. ఆలయం ఎదురుగా ఉన్న మండపంలో శ్రీ సీతారామ కల్యాణం జరుపుతారు.
సాధారణంగా గుడిలో వివాహం చేసుకోవాలీ అనుకోగానే చాలామందికి ఏడుకొండల వేంకటేశ్వరస్వామి, అన్నవరం సత్యనారాయణస్వామి, భద్రాచలం సీతారామచంద్రస్వామి గుడులే స్ఫురిస్తాయి. అయితే ఇటీవల ఈ ఆలయాలతో పాటుగా శంషాబాద్‍లోని అమ్మపల్లి ఆలయం సైతం వివాహ వేడుకలకు ప్రత్యేక వేదికగానూ నిలుస్తోంది. సినిమాల్లో మాదిరిగానే ఆలయాన్ని తమకు నచ్చినట్టుగా దేదీప్యమానంగా అలంకరించుకుని పెళ్లిళ్లూ, ఫొటోషూట్‍లూ చేసుకునే వీలుండటమే ఇందుకు కారణం. దాంతో పురాతన అమ్మపల్లి ఆలయం మరింత ప్రాచుర్యంలోకి వచ్చి భక్తుల్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక్కడ సీతారామాలయంతో పాటు శివాలయం, హనుమాన్ దేవాలయం కూడా ఉన్నాయి.
అమ్మపల్లి ఆలయం ప్రాచీక కాలం నాటిది కావడం ఒక ఎత్తయితే, సినీ దేవాలయంగా ప్రాచుర్యం పొందడం మరో విశేషం. ముఖ్యంగా ‘మురారి’ సినిమాతో ఇది సినీ ఆలయంగా స్థిరపడిపోయింది. ఆ సినిమా సూపర్‍హిట్టు కావడంతో తరువాత కాలంలో మరెన్నో సినిమాల్లో కనీసం ఒక్క షాట్ అయినా ఇక్కడ తీస్తే సినిమా విజయవంతం అవుతుందన్న నమ్మకం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బలపడింది. ఇక్కడ విశాలమైన ఆవరణ, గుడి గోపురం కూడా అద్భుత శిల్పకళా చాతుర్యంతో ఉండటం, ఇతర విశేషాలకు నిలయం కావడంతో సినిమా ప్రారంభంలోనో శుభం కార్డు సమయంలోనో ఏదో ఒక షాట్‍లో ఈ ఆలయం కనిపిస్తుంటుంది. అందుకే వందలాది తెలుగు సినిమాలతో పాటు తమిళ, హిందీ సినిమాల్లోనూ ఈ ఆలయాన్ని చూడవచ్చు.
రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్న ఈ ఆలయం హైదరాబాద్‍కు 30 కిలోమీటర్ల దూరంలోనూ, శంషాబాద్ బస్సు స్టాప్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. శంషాబాద్‍కు దక్షిణం వైపు నుంచి షాబాద్ రోడ్డులో నాలుగు కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి మెహిదీపట్నం ద్వారా ఆలయానికి సులువుగా చేరుకోవచ్చు. ఇంకా హైదరాబాద్ నగరం నలువైపుల నుంచీ కూడా ఇక్కడకు చేరుకోవడానికి రవాణా సదుపాయాలు విరివిగా అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ పర్యాటక ప్రదేశాలలో ఎక్కువగా సందర్శించే వాటిలో ఒకటిగా ఈ ఆలయం ప్రఖ్యాతికెక్కింది.
రాముడంటే ఎవరు?
రాముడి గురించి చెబుతూ రామాయణం మొదటి సర్గలోనే నారదుడు వాల్మీకి మహర్షికి రామతత్వానికి సంబంధించి అరవై తొమ్మిది ఆనవాళ్లు చెప్పాడట.
అందులో మనకెన్ని లక్షణాలున్నాయి? వాటిలో ఏ కొన్ని ఉన్నా లేదా సాధనతో వాటిని సొంతం చేసుకున్నా మనమూ రాముడు కావచ్చు. మరి రాముడి లక్షణాల్లో కొన్నిటిని చూద్దాం..
నియతాత్మా: నిశ్చయమైన స్వభావం ఉన్న వాడు. వికారాలకు అతీతుడు.
వశీ: ఇంద్రియాలను తన అదుపులో ఉంచుకున్న వాడు.
బుద్ధిమాన్: బుద్ధిమంతుడు.
నీతిమాన్: నిజాయతీపరుడు.
అరిందమ: కామక్రోధాలపై నియంత్రణ ఉన్నవాడు.
ప్రజానామ్ హితే రత: నలుగురి మంచినీ కోరేవాడు.
శుచి: పరిశుభ్రతకు విలువ ఇచ్చేవాడు.
విచక్షణ: మంచిచెడులను బేరీజు వేయగలవాడు.
సర్వసమ: అందరినీ సమానంగా చూసేవాడు.
సోమవత్ప్రియదర్శన: చంద్రుడిలా నిత్యానంద స్వరూపుడు.
ఇంకా రాముడు- ఓర్పులో భూమివంటి వాడు.
దానగుణంలో కుబేరుడు. ధైర్యంలో హిమవత్పర్వతం.
ఒక్క సద్గుణం చాలు.. మనిషి పునీతుడు కావడానికి. ఒక్క దుర్గుణం చాలు.. పాతాళానికి పడిపోవడానికి. ఈ భూమిపై మనిషిగా ఎలా జీవించాలో రాముడు స్వయంగా నడయాడి చూపాడు. అదే రావణుడు- ఎలా బతకకూడదో, ఎలా చావకూడదో ఉదాహరణగా నిలిచాడు.
రామాయణ వాల్మీకం మనిషి ఎలా ఉండాలో చెబుతుంది. ఎలా ఉండకూడదో కూడా హెచ్చరిస్తుంది. మనం నడిచే దారే మన •యాపజయాలను నిర్ణయిస్తుంది. మనం నడిచే దారే మన వ్యక్తిత్వాన్ని, సంస్కారాన్ని నిర్ధారిస్తుంది. అంతిమంగా జీవన సాఫల్య వైఫల్యాలనూ ప్రభావితం చేస్తుంది. ఎలా నడవాలో రాముడు దారి చూపాడు.
ఆ దారిలో నడవడమే మన కర్తవ్యం.












































































































































































Review ఏకశిలపై కోదండరాముడు.