
అమెరికాలో 1776 నుంచీ రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులే అధ్యక్షులుగా ఎన్నికవుతూ వస్తున్నారు. డెమొక్రటిక్, రిపబ్లికన్.. ఈ రెండు పార్టీలే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో జాతీయ స్థాయిలో ప్రభావం చూపే పార్టీలుగా నిలిచిపోయాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రెండు పక్షాలే అమెరికా రాజకీయ ముఖచిత్రంగా మారిపోయాయి. సంప్రదాయ భావాలు గల రిపబ్లికన్ పార్టీ చిహ్నంగా ఏనుగు, వామపక్ష భావజాలం కలిగిన డెమొక్రటిక్ పార్టీ చిహ్నంగా గాడిద ఆయా పార్టీల ఎన్నికల చిహ్నాలుగా స్థిరపడటం వెనుక ఆసక్తికరమైన చరిత్ర దాగి ఉంది.
1828లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ ఆడమ్స్.. తన ప్రత్యర్థి ఆండ్రూ జాక్సన్‌ను గాడిదగా అభివర్ణించారు. ఆయన అభిప్రాయాలు, ఆలోచనలు అర్థంపర్థం లేనివంటూ కొట్టిపారేశారు. జాక్సన్ అవే విమర్శలను తనకు అనుకూలంగా మలుచుకున్నారు. గాడిద అంటే విశ్వాసానికి ప్రతిరూపమని, ఎంతటి బరువును మోయడానికైనా సిద్ధపడుతుందని అంటూ నాటి ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. ఇదిలా ఉంటే, 1864 నాటి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసిన అబ్రహాం లింకన్‌కు మద్దతుగా ఇల్లినాయిస్కు చెందిన ఓ వార్తా పత్రిక.. ప్రచారంలో భాగంగా.. అంతకుముందు జరిగిన అంతర్యుద్ధంలో అప్పటి యూనియన్ ప్రభుత్వ విజయాలను ప్రస్తావిస్తూ ‘ఏనుగు’ బలానికి, పోరాటపటిమకు నిదర్శనమంటూ ఈ గుర్తుకు విస్తత ప్రచారం కల్పించింది.
ఈ రెండు పరిణామాలతో రిపబ్లికన్ల పార్టీ గుర్తు ఏనుగుగా, డెమొక్రాట్ల పార్టీ గుర్తు గాడిదగా అప్పటికే ప్రజల్లో స్థిరపడిపోయాయి. అయితే, ఈ గుర్తులను ఆయా పార్టీలు అప్పటికి ఇంకా అధికారికంగా ఖరారు చేసుకోలేదు.
ఇటువంటి పరిస్థితుల్లో రిపబ్లికన్ పార్టీ మద్దతుదారైన కార్టూనిస్ట్ థామస్ నాస్ట్.. గాడిద పులి చర్మం కప్పుకుని ఇతర జంతువులను భయపెడుతున్నట్టు, అయితే ఆ జంతువుల్లో కేవలం ఏనుగు మాత్రమే ధైర్యంగా గాడిదకు ఎదురు నిలబడినట్టు తన కార్టూన్లలో చిత్రీకరించారు. ఈ కార్టూన్ ఎంతటి సంచనలం సృష్టించిందంటే.. డెమొక్రటిక్ పార్టీకి గాడిద, రిపబ్లికన్ పార్టీకి ఏనుగు పార్టీ చిహ్నాలుగా మారిపోయేంతగా సదరు కార్టూన్ జన బాహుళ్యంలోకి వెళ్లిపోయింది. విచిత్రంగా థామస్ నాస్ట్ వివిధ సందర్భాల్లో వేసిన గాడిద, ఏనుగు కార్టూన్ బొమ్మలే నేటికీ ఈ రెండు పార్టీల అధికార చిహ్నాలుగా కొనసాగుతున్నాయి.
రిపబ్లికన్ పార్టీ విధానాలు
ఈ పార్టీ అమెరికా జాతీయవాద రాజకీయాల్లో పూర్తి సంప్రదాయబద్ధమైన పార్టీగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ పార్టీ గుర్తు ఏనుగు. రైట్ వింగ్ ఐడియాలజీ, రక్షణ రంగానికి ఎక్కువ బడ్జెట్ కేటాయించడం, అందరికీ ఒకేవిధమైన పన్నుల విధానం, నో లీగల్ అబార్షన్, ఫ్రీ మార్కెట్ , కఠినమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనలు, ఆరోగ్యరంగాన్ని ప్రైవేటీకరించడం, నో లీగల్ గే మ్యారేజ్ వంటివి ఈ పార్టీ ప్రధాన నినాదాలు, విధానాలు.
డెమొక్రటిక్ పార్టీ విధానాలు
ఈ పార్టీ గుర్తు గాడిద. లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ (వామపక్ష భావజాలం), మిలటరీకి తక్కువ ఖర్చుపెట్టడం, సంపన్నులకు ఎక్కువ పన్ను విధించడం, పేదలకు తక్కువ పన్నులు విధించడం, అబార్షన్లకు ఓకే, మార్కెట్ మీద ప్రభుత్వ ఆధీనం కొనసాగించడం, వీసా నిబంధనల్లో పట్టువిడుపు ధోరణితో వ్యవహరించడం, ప్రజారోగ్య రంగాన్ని ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచడం, గే మ్యారేజ్‌కు సమ్మతి వంటివి ఈ పార్టీ విధానాలు.
- తాజా ఎన్నికల్లో జో బైడెన్‌కు 70.7 మిలియన్లకు పైగా ఓట్లు పడ్డాయి. గతంలో ఏ అధ్యక్ష అభ్యర్థికి ఇంత పెద్ద మొత్తంలో ఓట్లు పడిన దాఖలాలు లేవు. 2008లో అప్పటి డెమొక్రటిక్ అభ్యర్థి బరాక్ ఒబామాకు 69 మిలియన్ల ఓట్లు లభించాయి. ఆ రికార్డును ఇప్పుడు బైడెన్ బద్దలుకొట్టారు.
- అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అత్యధిక స్థానాలు కలిగిన రాష్ట్రం కాలిఫోర్నియా. ఇక్కడ 55 స్థానాలు ఉన్నాయి.
- అతి తక్కువ స్థానాలు కలిగిన రాష్ట్రం అలస్కా. ఇక్కడ కేవలం 3 మాత్రమే ఉన్నాయి.
- అమెరికా రాజ్యాంగానికి రెండు వందల సంవత్సరాల (200) చరిత్ర ఉంది. దీనికి ఇప్పటి వరకు 27 సార్లు సవరణ చేశారు. చివరి సవరణ 1992, మే 27న జరిగింది.
- 1920 వరకు అమెరికాలో మహిళలకు ఓటుహక్కు లేదు. 19వ రాజ్యాంగ సవరణ ద్వారా వారికి ఎన్నికల పక్రియలో భాగస్వామ్యం కల్పించారు.
- 26వ రాజ్యాంగ సవరణ ద్వారా అమెరికాలో 18 ఏళ్లకే యువతకు ఓటుహక్కు కల్పించారు.
- అమెరికా ఎన్నికల చరిత్రలో ఇప్పటి వరకు జార్జి వాషింగ్టన్ మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక అధ్యక్షుడు. అటు తరువాత ఇప్పటి వరకు ఏ ఒక్కరూ ఏకగ్రీవంగా ఎన్నికైన దాఖలాలు లేవు. జార్జి వాషింగ్టన్ వరుసగా రెండుసార్లు (1789 నుంచి 1797 వరకు) అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించారు. అయితే, అమెరికా అధ్యక్ష పదవికి రెండుసార్లుకు మించి పోటీ చేయకూడదనే నిబంధనను ప్రతిపాదించినది కూడా ఆయనే కావడం విశేషం.
- తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ పేరు మీదనే అమెరికా సంయుక్త రాష్ట్రాలకు రాజధాని (వాషింగ్టన్) ఏర్పాటైంది.
- అమెరికాకు తొలి ఆఫ్రో – అమెరికన్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా. అమెరికాకు తొలి ఉపాధ్యక్షుడు జాన్ ఆడమ్స్.
- అమెరికాలో నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో గెలుపొందిన అధ్యక్ష అభ్యర్థి జనవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తారు. అంతకుముందు మార్చి 4న ప్రమాణ స్వీకారం చేసేవారు. అయితే, 1933లో చేసిన 20వ రాజ్యాంగ సవరణ ద్వారా జనవరి 20 అమల్లోకి వచ్చింది.
- అమెరికా అధ్యక్షుడిగా అత్యధిక కాలం వ్యవహరించిన వారు ఫ్ల్రాంక్లిన్ ది రూజ్వెల్ట్. ఆయన మొత్తం నాలుగుసార్లు (1932 నుంచి 1946 వరకు) దేశాన్ని పాలించారు. ఆయన 63వ ఏట పదవిలో ఉండగానే మరణించారు.
- రూజ్వెల్ట్ అనంతరమే 1951, ఫిబ్రవరిలో అధ్యక్ష పదవికి ఎవరూ రెండుసార్లుకు మించి పోటీచేయరాదనే నిబంధన అమల్లోకి వచ్చింది.
- 1951 తరువాత.. ఇప్పటి వరకు అమెరికాకు రెండుసార్లు అధ్యక్షులుగా వ్యవహరించింది ఐదుగురే. ఔసెన్ హోవర్, రొనాల్డ్ రీగన్, బిల్ క్లింటన్, జార్జిబుష్, బరాక్ ఒబామా.. వీరే రెండేసి సార్లు గెలుపొందారు.
- అమెరికా చరిత్రలో అతి తక్కువ కాలం అధ్యక్ష పదవిలో ఉన్నది హెన్రీ హారిస్. ఈయన కేవలం 31 రోజులు మాత్రమే పదవిలో ఉన్నారు. 1841 మార్చి 4 నుంచి ఏప్రిల్ 4 వరకు పగ్గాలు చేపట్టి.. పదవిలో ఉండగానే మరణించారు.
- అధ్యక్ష పదవిలో ఉంటూ ఇప్పటి వరకు 13 మంది కన్నుమూశారు.
- అమెరికా రాజధాని వాషింగ్టన్లో గల అధ్యక్షుడి నివాస భవనం శ్వేతసౌధం (వైట్‌హౌస్) మెట్లపై కొత్త అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేయడం ఆనవాయితీ. ప్రధాన న్యాయమూర్తి గెలుపొందిన అధ్యక్ష అభ్యర్థి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రమాణం చేసేటపుడు ఒక చేతిలో బైబిల్ పట్టుకోవడం ఆచారంగా వస్తోంది.
- అమెరికాలో అధ్యక్ష పదవికి నేరుగా పోటీ చేసే వీలులేదు. అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే ముందుగా పార్టీకి సంబంధించిన ప్రాథమిక ఎన్నికల్లో గెలుపొంది తీరాలి. ఇక్కడ అత్యధిక మంది పార్టీ సభ్యుల మద్దతు లభించిన వారికే అధ్యక్ష పదవికి పోటీపడే అవకాశం లభిస్తుంది. పార్టీపరంగా జరిగే ఈ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరుగుతాయి. ఇందులో గెలుపొందిన వారే అధ్యక్ష పదవికి అర్హులవుతారు. ఉపాధ్యక్ష పదవికి పోటీచేసే రన్నింగ్ మేట్‌ను మాత్రం అధ్యక్ష అభ్యర్థి ఎంపిక చేసుకోవచ్చు.
- అమెరికా అధ్యక్ష ఎన్నికలు పరోక్ష పద్ధతిలో జరుగుతాయి. వాషింగ్టన్ డీసీ సహా 50 అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పేర్లు నమోదు చేసుకున్న ఓటర్లు ఎలక్టోరల్ కాలేజీ సభ్యులను ఎన్నుకుంటారు. వీరినే ఎలక్టర్లు అంటారు. వీరే అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. .
- ఏ అభ్యర్థీ ఎలక్టోర్ ఓట్లు తగినన్ని సంపాదించకపోతే కాంగ్రెస్ దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్ (ప్రతినిధుల సభ) అధ్యక్షుడిని ఎంపిక చేస్తుంది. ఇదే పరిస్థితి ఉపాధ్యక్ష అభ్యర్థి విషయంలో తలెత్తినా.. సదరు అభ్యర్థిని సెనేట్ ఎంపిక చేస్తుంది. ఇటువంటి పరిస్థితి ఒకటి రెండుసార్లు మినహా మరెప్పుడూ తలెత్తలేదు.
- అమెరికా తొలి ఉపాధ్యక్షురాలిగా తాజా ఎన్నికల్లో గెలుపొందిన కమలా హారిస్ పలు రికార్డులు సృష్టించారు. భారతీయ, ఆఫ్రికా మూలాలున్న తొలి మహిళగా, ఈ పదవి చేపట్టిన తొలి ఆసియన్ ఉమన్‌గా ఆమె గుర్తింపు పొందారు.
పజలు అత్యధిక ఓట్లు వేసినా.. తగినన్ని ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు దక్కకపోతే అధ్యక్ష పదవి లభించదు. అమెరికా ఎలక్టోరల్ కాలేజీలో 538 మంది సభ్యులు ఉంటారు. వీరిలో సగం కంటే ఎక్కువ మంది అంటే, కనీసంగా 270 ఓట్లు గెలుచుకున్న వారు అధ్యక్ష పదవికి ఎన్నికవుతారు
Review ఏనుగు – గాడిద కథ.