కనిపించే దైవం – కనిపించని దైవం

ముందుగా కనిపించే దైవాన్ని దర్శించి తరించి, ఆపై కనిపించని దైవం వైపు దృష్టి సారిద్దాం. కొందరు కళ్ళు తెరచి జగత్తును పరికిస్తూ, పరిశీలిస్తూ, పరిశో ధిస్తూ, జగన్మోహనుని తిలకించి, పులకించి జన్మ ధన్యం చేసుకుంటారు. మరికొందరు కళ్ళు మూసు కొని, అంతర్నేత్రంతో అంతర్యామిగా కనుగొని అనంత సుఖసాగరంలో మునిగిపోతారు.
ఓ చిన్నపాప ముద్దులన్నీ మూటగట్టుకొని మనముందు నిల్చుంది. అందమైన జడతో, ముచ్చట గొలిపే దుస్తులతో కళకళలాడుతున్నది. ఆ బంగారుతల్లిని చూసుకొని ఎంతగా మురిసిపోతామో! మహాలక్ష్మిలా వెలుగుతున్న పాపాయి ఎదురుగానే ఉండగా, చూసి సంతోషించడం మాని, పాప ఫొటోలు చూస్తూ కూర్చుంటే ఎలా ఉంటుంది? పాపను ప్రత్యక్షంగా చూసినప్పుడు కలిగినంత ఆనందం ఫొటో చూసినప్పుడు కలుగుతుందా ? నదులు, పూలతోటలు, లోయలు, వాటి హొయలు స్వయంగా చూడకుండా పుస్తకాలలో వర్ణచిత్రాలుగా చూస్తే ‘వర్ణనాతీతస్థితి’కి చేరుకుంటామా ?
సృష్టి సౌందర్యాన్ని తనివితీరా చూస్తూ, తన్మయత్వంతో ప్రకృతితో మమేకం కావడమే అర్చన, అదే అర్పణ! ఈ అద్భుతసౌందర్యం వెనుక దాగిన ‘అతని’ అనంతనైపుణ్యాన్ని ఆరాధించడమే ‘తపస్సు.’ ఒక పూవు పూయడం సామాన్య విషయమా? చిన్న మొగ్గ వన్నెల కుసుమంగా వికసించడం ఎంత కష్టమైన కార్యం? ఒక గులాబీ పువ్వు సర్వాంగ సుందరంగా రూపుదాల్చడం ఎంత అపురూప విషయం? నోబెల్‍ బహుమతి గెల్చుకున్న వందల మంది శాస్త్రవేత్తలకు కాస్త మట్టి, కొన్ని నీళ్ళు ఇచ్చి వందసంవత్సరాల గడువివ్వండి. ఒక మల్లెపువ్వును, కనీసం ఒక్క గడ్డిపువ్వును తయారు చేయమనండి, చేస్తారేమో చూద్దాం! పూలమొక్క చిన్న ప్రయోగశాల. చిన్నకాండం, రెండు కొమ్మలు, నాలుగు ఆకులు, ఇంత మట్టి, ఇన్ని నీళ్ళు…. అంతే! సన్నసన్నని వేర్ల నుండి నీరు కొమ్మల్లోకి ప్రవహించి మొగ్గ తొడిగి అద్భుతపుష్పంగా పరిణామం చెందు తుంది. చూసేందుకు తేలికగా కనపడుతున్నా, లోతుగా పరికిస్తే ఎంత క్లిష్టమైన పక్రియ ఇందులో ఇమిడి ఉన్నది ! ఈ అపూర్వ చాతుర్యానికి హారతి పట్టాలి.
కనపడే ఈ సౌందర్యమకరందాన్ని తృప్తిగా కళ్ళతో త్రాగండి. గుండె గదిలో పదిలంగా ఆ మధురాను భూతిని దాచుకోండి. అప్పుడప్పుడు హృదయాన్ని సున్నితంగా మీటి ఆ కమనీయస్వరాలు మళ్ళీ మళ్ళీ వినండి. తీయని స్మ•తులు నెమరువేసుకోండి! ఒక మంచి పండు నీకు అందుబాటులో ఉన్నప్పుడు చేతిలోకి తీసుకో. పండు గుణగణాలను పొగడుతూ అది తయారైన విధానానికి అచ్చెరువొందుతూ హాయిగా తిను. రుచి చూడకుండా దూరం నుండి చూస్తూ మురిసిపోతే కొంతవరకే ఆనందించినట్టు. ప్రకృతి ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించు కోనట్లే. లోకంలోని ప్రతిచర్యా ప్రత్యేకమే. ఆఖరికి నడక కూడా అద్భుతమే.
మొట్టమొదటగా నిన్ను చూచి నువ్వే అబ్బుర పడటం అలవరచుకో. ఒకసారి అద్దంలో చూసుకో. నిన్ను చూస్తే ఆశ్చర్యం కలగడం లేదూ! మనమేమో అది లేదు, ఇది లేదు, ఏమీ లేదు అంటూ నిట్టూ ర్చుతాం. మనకు అందమైన రెండు కళ్ళున్నాయి, ఇంకేం కాలాలి ? ఒక అంధుణ్ణి చేస్తే కళ్ళ విలువ తెలుస్తుంది. కళ్ళు లేవని అతడు బాధపడుతున్నాడు. కళ్ళున్న మనం సంతోషించ లేకపోతున్నాం. ఉన్నదాని యొక్క ‘ఉన్నతిని’ గ్రహించాలి. ఉన్నంతలో ఆనందించే నేర్పును పెంచుకోవాలి.
ప్రతి అలికిడికీ స్పందించే సున్నితత్వం ఉంటే, కాశ్మీరు వెళ్ళ లేదనే దిగులుండదు. మన ఇల్లే అంద మైన కాశ్మీరం, సుందరనందనం! మన చిన్న ప్రహరీ గోడ చైనా గోడకంటె ఘనమైనది. ధనవంతులు ఎక్క డికో వెళ్ళి విహరిస్తారు. మిగిలిన వారి సంగతి ? బాధలేదు. ప్రకృతి ఆ లోటును తీరుస్తుంది. తన ఏర్పాటు తాను చేస్తుంది. అదే సంతోషం ఇక్కడే కలిగేటట్లు చేస్తుది.
విశ్వం యొక్క చిత్ర విచిత్రమైన సృజనశక్తిని తలచుకుంటూ విభ్రమం చెందటం వలన ఒక దివ్యానుభవం లభిస్తుంది.
ఇన్ని రకాల పుష్పసముదాయాలు, ఇన్ని వర్ణాలు, ఇన్ని వైభవాలు, పలురకాల అమృతతుల్యమైన ఫలాలు, కేవలం మన కోసం, మన ఆనందం కోసం, మనం అనుభవించడం కోసమే. ఇదంతా పరమ ప్రేమతో ప్రకృతి ప్రసాదించింది. ఈ విధంగా ‘కనిపించే దేవుని’ దర్శనమవుతుంది. ఎల్లలు లేని ఆ ప్రేమమూర్తి కరుణపట్ల కృతజ్ఞత వ్యక్తం చేయడానికి సృష్టి అణువణువున నిండిన ఆ కనిపించని శక్తిని ఆరాధించడమే ‘కనిపించని దైవాన్ని’ కనుగొనడం.

Review కనిపించే దైవం – కనిపించని దైవం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top