గమ్యం -గమనం

ఆడటం నెమలి లక్ష్యం. పాడటం కోయిల లక్ష్యం
ఆడుతూ పాడుతూ బ్రతకటం మనందరి లక్ష్యం

నేను చెప్పేవి విశ్వజనీనసత్యాలని అనుకోవద్దు. పరమసత్యాలుగా కూడా భావించకండి. జీవన ప్రయాణంలో ఈ మైలు రాయి వద్ద, తాత్కాలికమైన నా వ్యక్తిగతమైన మనోభావనలు మాత్రమే. మేధస్సుతో కూడిన ఆలోచనలను చర్చించుకోవచ్చు. అనుభూతి ప్రధానమైన మనోభావాలను చర్చించలేం. ఇవి సందర్భానుసారమైన తాత్కాలిక భావనలు. ఈ రోజు చెప్పినవి, రేపు నేను ఖండించవచ్చు. ఎల్లుండి తిరిగి సమర్థించవచ్చు. ఇవి నా సంతృప్తి కోసం, సరదా కోసం మీతో ఆడే ముచ్చట్లు.
జీవితలక్ష్యం అంటే ఏమిటి ? ఏ లక్ష్యమూ చేరుకోవాలనే కోరిక లేని స్థితిని చేరుకోవడమే జీవితలక్ష్యం. ఏ గమ్యమూ అవసరం లేని సంపూర్ణ సంతృప్తి, పరిపూర్ణ సుఖప్రవృత్తి. ఇదే లక్ష్యం. ఈ మాటలు నీకు సరిగ్గా అర్థమైతే ‘జీవించి’ ఉండటమే జీవనలక్ష్యమని తెలుసు కుంటావు. ‘ఉల్లాసకరంగా’, ‘ఉత్తేజభరితంగా’ జీవిస్తూ జీవనఫలంలోని మాధుర్యరసాన్ని జుర్రుకోవడమే నీ లక్ష్యం. నీ గమ్యమేమిటని నదిని అడుగు, సముద్రంలో చేరడముంటుంది. సముద్రాన్ని అడుగు, జవాబు దొరకదు. చిన్న నదికి గమ్యం ఉంది. పెద్ద కడలికి పెద్ద గమ్యం ఉండాలి కదా! అసలేమీ లేదు. చూశారా! గమ్యాలనేవి గందరగోళాలు.
నీవు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా జీవిస్తుంటే అది చాలు, నీ జీవితలక్ష్యం నెరవేరి పోయింది. అసలైన లక్ష్యాలన్నీ ఎప్పుడో ముందుగానే సాధింపబడినాయి. ఇప్పుడు నీవు సాధించదలచుకున్నవి ఎంత చిన్నవైనా, ఎంత పెద్దవైనా సరే, కేవలం ఆభరణాలు మాత్రమే. అలంకారప్రాయమే.
ఇక్కడ రెండు విషయాలున్నాయి. ఒకటి లబ్ధిదారుడు, రెండు లభ్య వస్తువు. మంచి
ఉద్యోగం, పెద్ద జీతం, ఇల్లు, హోదా ఈ లక్ష్యాలు సామాజిక భూషణాలు. మంచి భార్య, చక్కటి పిల్లలు ఇవి భౌతిక ఆభరణాలు. లభ్య వస్తువు కంటె లబ్ధిదారుడే గొప్పవాడు. ముత్యాలహారం కంటే అది ధరించిన కంఠం గొప్పది. వజ్రపు ముక్కెర కంటె సంపంగి ముక్కు విలువైనది. ‘అమ్మాయి’ నామ వాచకం. ఆమె ధరించిన ‘నగ’ విశేషణం. హారం పోయినా ఫరవాలేదు. కంఠం ఉంది. అదే పదివేలు, కాదు పదికోట్లు. ముక్కెర లేకపోయినా నష్టం లేదు, ముక్కు ఉంది. అదే మహాభాగ్యం నీ తలపై ధరించే తలపాగా, లేదా నవరత్నఖచిత కిరీటం కంటె, నీ తల చాలా విలువైనది. అలాగని మకుటంలోని మణులను తేలిక చెయ్యడం కాదు. కిరీటపు వన్నెచిన్నెలను తక్కువగా చెప్పడం కూడా కాదు. నీకు కిరీటం కావాలని తీవ్రమైన కోరిక ఉంటే కష్టించు, అన్వేషించు, శతవిధాల ప్రయత్నించు, సాధించు. తప్పు లేదు. కానీ దానికోసం లేనిపోని తలనొప్పి తెచ్చుకోకు. తల బొప్పికట్టించుకోకు. తల తాకట్టు పెట్టకు. శిరోభూషణం కంటే శిరస్సు అమూల్యమైనదని గ్రహించిన తర్వాత, కిరీటం కోసం ప్రయత్నించు. అపుడు నీ ప్రయత్నం ప్రమోదభరితంగా ఉంటుంది.
ఒక మంచి వక్తను చూడండి. చక్కటి కృషితో భాషావిజ్ఞానం సంపాదించాడు. వాక్పటిమ పెంచుకున్నాడు. ఏ విషయం గురించైనా అనర్గళంగా, అలవోకగా మాట్లాడే సామర్థ్యం తెచ్చుకున్నాడు. అతని చతుర సంభాషణా శైలిని అందరూ పొగడుతున్నారు. అది అతనికి ప్రత్యేక అలంకారం. ఇక మన విషయం చూద్దాం. మనకు మాట్లాడే శక్తి ఉంది. దైనందిన వ్యవ హారాల్లో ఇతరులతో మాట్లాడగలం. ఇది మనం దరికీ గర్వకారణం. చాకచక్యంగా సంభాషించ లేకపోవచ్చు. ప్రయత్నిస్తే సాధ్యపడుతుంది. ఒక్కమాటైనా పలుకలేని మూగవారి గురించి ఆలోచించండి. వారికంటే మనమెంత అదృష్ట వంతులం.
ఒకసారి సరదాగా మిత్రులతో అన్నాను, నేను విశేషణాల ఆభరణాలు లేని నగ్నమైన నామవాచకాన్ని అని. ‘నేను నేనుగా’ ఉన్నాను. ‘నీవు నీవుగా’ ఉన్నావని గర్వపడాలి. నీకున్నవి ఏవైనా సరే, నీ కంటే గొప్పవి కాదు. ఎంతో ఖరీదైన బూట్లు నీ పాదాలకంటే చాలా అల్పమైనవి. అద్భుతమైన జీర్ణశక్తిని ప్రకృతి మనకు వరంగా ఇచ్చింది. ఎప్పుడైనా అజీర్ణవ్యాధి బారిన పడితే అప్పుడీ విషయం అనుభవంతో అర్థమవుతుంది. భోజనం చేయటం, జీర్ణంచేసుకుని శక్తిగా మార్చుకోవటం మామూలు విషయం కాదని అప్పటికి గానీ తెలిసిరాదు. ఆసుపత్రిలో ఒక్కసారి డయాలసిస్‍ (రక్తాన్ని) వడకట్టి, శుద్ధి చేయడం) చేయాలంటే, రెండు-మూడు వేలు ఖర్చవుతుంది. మన కిడ్నీలు రోజుకు నలభై ఎనిమిది సార్లు డయాలసిస్‍ చేస్తాయి. అంటే రోజుకు లక్ష రూపాయలు మనకు కిడ్నీలు సంపాదించి పెడుతున్నాయి. కిడ్నీలు బాగున్న ప్రతి వ్యక్తీ కోట్లకు పడగలెత్తినట్లే. మన ప్రతి అవయవమూ అమూల్యమైనది. ఈ శరీరం అనంతకోటినిధులకు నిలయం. నువ్వు జన్మించిన క్షణంలోనే నీ లక్ష్యం నెరవేరింది. నీకిక వేరే గమ్యమేమీ లేదు. జీవించి ఉండటమే నీ పరమ గమ్యం. ఇదే మహోన్నత లక్ష్యం. గొప్ప గొప్ప లక్షణాలుగా నువ్వు భావించేవన్నీ నీ ఉనికి కంటే చాలా చిన్నవి. కాబట్టి అవి సాధించినా పెద్ద తేడా ఏమీ ఉండదు. సాధించకపోయినా ఇబ్బంది లేదు.
పువ్వును అడగండి, నీ ఆశయమేమిటని? వికసించి చూపిస్తుంది. పసిపాపను ప్రశ్నించండి, బోసినవ్వు సమాధానంగా ఇస్తుంది. పక్షి లక్ష్యం హాయిగా ఎగరడమే. నీ లక్ష్యం ఆరోగ్యంగా, ఆనందంగా బ్రతకడమే. శరీరం నిరంతరం శ్రమించినా, మనసును శాంతంగా సుఖించనీ!
కూడు, గూడు, నిత్యావసరాలకు సరిపడినంత ధనం…. ఇవి నిజమైన లక్ష్యాలు. ఉత్సాహంగా, ఉత్తేజంగా జీవించడం అంతకంటే మహదాశయం. మనిషిగా జన్మించి మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే అతి గొప్ప గమ్యాన్ని చేరుకున్నట్లే, సాధించవలసిన లక్ష్యాన్ని సాధించినట్లే. ఆ తరువాత మనం చేరబోయే గమ్యాల గమనం, మనకు ఇదివరకే పరమాత్మ ప్రసాదించిన పరమ గమ్యాన్ని (జీవించి ఉండటం) చేరేలా ఉండాలి, దాని గాఢత పెంచేలా ఉండాలి. మనం సాధించాలనుకున్న ఇతర లక్ష్యాలన్నీ, మనకు సృష్టికర్త మన తరపున సాధించిన లక్ష్యం (ఆరోగ్యంగా జీవించటం) యొక్క కక్ష్యలో తిరుగుతూ, ఆ లక్ష్యానికి మరింత ఆనందాన్ని కటాక్షించాలి. అంతేకానీ, పరమాత్మ తన అనంత మేధస్సును ధారపోసి మనకు వరంగా ప్రసాదించిన జీవన ధనాన్ని మన దృష్టిలో పెద్దగా కనబడే చిన్న లక్ష్యాలను సాధించటానికి వృధాగా ధారపోయరాదు.
మనందరికీ అతి ముఖ్యమైన లక్ష్యం మరొకటి ఉంది. అసలైన గమ్యం ఉంది. అది లక్ష్యం కాని లక్ష్యం, మహాలక్ష్యం! గమ్యం కాని గమ్యం, మహాగమ్యం! ప్రేమ! మన ఏకైక కర్తవ్యం ప్రేమ!! ఒకసారి ప్రేమలో పడిన పిదప మనం చేయవలసినదేమీ లేదు. లోకంలోని అన్ని సమస్యలకూ ప్రేమ పరిష్కరిస్తుంది. ప్రేమించేందుకు, ప్రేమించబడటానికి అర్హలేవీ లేవు. కానీ ఒక షరతు ఉంది. అదే షరతులు లేకుండా ప్రేమించడం. తన హృదయంలో ప్రేమ నిండిన వ్యక్తి మాత్రమే ఇతరుల హృదయాల్లో ప్రేమను మేల్కొలపగలడు. మనకు భగవంతుని ప్రేమ ఎంత అవసరమో, భగవంతునికి మన ప్రేమ అంతకంటే ఎక్కువ అవసరం. పరమాత్మ ప్రేమకు మనమందరం సజీవమైన ఆకృతులం. దైవాన్ని ప్రేమించడం, దైవ నిర్మితమైన ఈ సృష్టిలోని ప్రతి అంశాన్నీ ప్రేమించడం, ప్రకృతిలో తాదాత్మ్యం చెందటం మన మొదటి లక్ష్యం, చివరి లక్ష్యం.
ఎండకు ఎండిపో, వానకు తడిసిపో, వెన్నెల్లో కరిగిపో, ఎండుటాకులా ఎటైనా ఎగిరిపో, పండుటాకులా నవ్వుతూ రాలిపో.

Review గమ్యం -గమనం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top