దక్షిణామూర్తి ఈశ్వరాలయాల్లో దక్షిణ దిక్కున విలసిల్లే దైవం. ఆయన గురువులకు గురువు. నిత్య యవ్వనుడు. మౌనముద్రలో నిశ్చలంగా ఉపదేశించే మహాయోగి. శాంతమూర్తి. చిద్విలాసుడు. అటువంటి సచ్చిదానంద మూర్తినే స్మరించుకుంటూ చేసి ఈ స్తోత్ర రచన గంభీరమైన శైలిలో నడుస్తుంది. సకల ప్రాణుల సృష్టి – స్థితి – లయాలకు కారణభూతుడైన పరమ గురువును తన కవితాధారతో స్తుతించడానికే ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ రచన చేసినట్టు కనిపిస్తుంది.
రాహుగ్రస్త దివాకరేందుసదృశో మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోపసంహరణతో యో భూత్ సుషుప్తః పుమాన్ ।
ప్రాగస్వాస్పమితి ప్రబోధనమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ।।
రాహుగ్రస్త సూర్యచంద్రులు ఏ విధంగా మన దృష్టి పథంలో కనిపించరో అదేవిధంగా మాయ ఆవహించడం వలన సుషుప్తిలో కూడా (జాగ్రత్ స్వప్నాల వలే) వ్యక్తికి స్వకీయ ఉనికికి సంబంధించిన నిజమైన ఎరుక ఉండదు (ఈ అవస్థలో కూడా ఆత్మతత్త్వంగా తనను తాను గ్రహించడం లేదు. మాయచే ఆవహించి ఉంటాడు). స్వస్వరూప ఆత్మ చైతన్యం అనుభవ రూపకంగా అవగతం అయినపుడే అజ్ఞానం తొలగిపోతుంది. అలాంటి స్థితి కోసం దక్షిణామూర్తి రూపంలో ఉన్న గురువర్యులకు ఇదే నా నమస్కారం.
బాల్యాదిష్యపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తా స్వనువర్తమానమహమిత్యంతః స్ఫురంతం సదా ।
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ।।
బాల్య, కౌమార, వార్ధక్యావస్థలలోనూ, జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలలోనూ మన ఈ శరీరంలో చిదాత్మగా, నేను నీలోనే ఉన్నానంటూ చిన్ముద్రతో గుర్తు చేస్తూ, తనను ఆశ్రయించే వారిని ఎలా కాపాడుతున్నాడో, అట్టి దక్షిణామూర్తి రూపంలో ఉన్న గురువర్యులకిదే నా నమస్కారం.
విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యాచార్యతయా తథైవ పితృమాత్రాద్యాత్మనా భేదతః ।
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామితః
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ।।
జీవుడు మాయచే ఆవహించిన వాడై ఈ విశ్వాన్ని కార్యకారణ సంబంధ రూపంగానూ, స్వామి-భృత్య సంబంధ రూపంగానూ, శిష్య- ఆచార్య సంబంధంగానూ, మాతా పితృరూపంగానూ, స్వప్న జాగ్రదవస్థలగానూ భేద దృష్టితో చూస్తున్నాడు (అజ్ఞానం వల్ల భేద దృష్టితో చూస్తున్నాడని, కేవలాత్మ స్వరూపంగా దర్శించలేక పోతున్నాడని భావం). అద్వైత దృష్టి కోసం దక్షిణామూర్తి రూపంలో ఉన్న గురువర్యులకు ఇదే నా నమస్కారం.
భూరంభాంస్యనలో నిలోంబర మహర్నాథో హియాంశుః పుమా
నిత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్ ।
నాస్కత్కించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్విభోః
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ।।
పృథ్వి, ఆపస్, తేజం, వాయువు, ఆకాశం అనే పంచభూతాలు, సూర్యచంద్రులు- మనిషి- ఇవే తన మూర్తిగా కలిగి, మరియు వీటికి ఆవల పరబ్రహ్మగా వెలుగొందుతూ, అంతకుమించి ఇక ఏదీ లేదని చెప్పదగిన ఆ పరతత్త్వాన్ని చేరుకోవడానికి దక్షిణామూర్తి రూపంలో ఉన్న గురువర్యులకు ఇదే నా నమస్కారం.
సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్య శ్రవణా త్తదర్థమననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్ ।
సర్వాత్మత్వ మహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతః
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే ।।
ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో ప్రస్తావించిన పరబ్రహ్మతత్త్వాన్ని గురుముఖంగా తెలుసుకుని, దాని అర్థాన్ని మనన ధ్యానాదులతో గ్రహించి స్తుతించడం వలన, సర్వాత్మకుడిగా, సర్వమయుడిగా, సర్వేశుడిగా వెలుగొందవచ్చనీ, అష్టైశ్వర్యాలను పొందవచ్చునని ఫలశ్రుతిగా ఈ శ్లోకం చెప్పి ముగించడమైనది.
Review చిన్ముధ్రరూపంలో.. చిదాత్మగా….