తన ఆస్తినంతా చెట్టుకే రాసిచ్చేసిన విలియన్ జాక్స
ఎవరైనా తన పేరు మీద ఉన్న ఆస్తులను వారసులకు రాసిస్తుంటారు. లేదంటే అనాథ శరణాలయాలకో, వృద్ధాశ్రమాలకో తమ తదనంతరం ఆస్తి మొత్తం చెందేలా వీలునామా రాయడం కద్దు. కానీ, ఎవరూ ఊహించని విధంగా, వింటేనే ఆశ్చర్యం కలిగేలా ఓ వ్యక్తి మాత్రం తన ఆస్తినంతా ఓ వృక్షానికి రాసిచ్చేశాడు. ఆ చెట్టుపై ఆయన పెంచుకున్న మమకారానికి, ప్రేమకు అద్దం పట్టే ఈ ఉదంతం ఆయనలోని పర్యావరణ హితానికి, మొక్కలపై ప్రేమకు నిదర్శనంగా నిలుస్తుంది. సదరు వ్యక్తి తన ఇంటి ముందున్న చెట్టుకు అది పెరిగే స్థలాన్ని దాని పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయించాడు. ఏథెన్స్లోని డియరింగ్ అండ్ ఫిన్లీ స్ట్రీట్‍లో 1942కి ముందు భారీ వృక్షం ఒకటి ఉండేది. దాని యజమాని విలియన్ హెచ్.జాక్సన్ అనే వ్యక్తి ఆ చెట్టు పేరు మీదనే 8 అడుగుల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించాడు. ఈ స్థలంపై సర్వాధికారాలు ఆ చెట్టుకు ఉంటాయని రిజిస్ట్రేషన్‍లో పేర్కొన్నారు. దాంతో ఆ 8 అడుగుల స్థలం చట్టపరంగా ఆ చెట్టుకే చెందనున్నది. అయితే ఆ చెట్టును స్థానిక పురపాలక సంస్థ సంరక్షించేది. అధికారులు దానికున్న హక్కులు, న్యాయపరమైన అధికారాలను రాసి ఉన్న బోర్డును ఆ చెట్టు వద్ద ఉంచారు. అయితే, 1942లో వచ్చిన తుపాను దాటికి చెట్టు తట్టుకోలేకపోయింది. చెట్టు వయసు కూడా ఎక్కువగా ఉండటంతో తిరిగి కోలుకోలేక నేలమట్టమైంది. జాక్సన్ కోరికను నెరవేర్చడానికి స్థానికులంతా కలిసి చేతులు కలిపారు. ఆయన ఆ చెట్టుపై పెంచుకున్న ప్రేమ అక్కడితో ఆగిపోకూడదని అనుకున్నారు. దీంతో ఆ చెట్టు ఉన్న ప్రాంతంలోనే మరో మొక్కను నాటారు. ప్రస్తుతం అది భారీ వృక్షంగా ఎదిగి ఆ వీధి మొత్తానికి నీడనిస్తోంది.
Review చెట్టుకు వీలునామా.