జయం -అపజయం

అవసరముంటే ఆకాశంలో ఉన్నా అందివస్తుంది. అనవసరమైతే పక్కనే ఉన్నా రెక్కలొచ్చి చక్కాపోతుంది.
ఎంత శ్రమకోర్చి ప్రయత్నం చేసినా ఫలితం రాలేదని బాధపడుతుంటాం. కష్టించి సాధించిన దాని కంటె, సునాయాసంగా లభించినది శ్రేయస్కరం. అప్రయత్నంగా మన శ్వాసక్రియ జరుగుతోంది. నిరంతరం అసంకల్పితంగా జరిగే ఉచ్ఛ్వాస, నిశ్వాసల కంటే ఘనతర కార్యమేముంది ? శ్వాస సక్రమంగా ఆడటానికి లక్షల రూపాయలు వెచ్చించే వారున్నారు. అనాయాసంగా ఆహారాన్ని తీసుకోగలుగు తున్నాం. ఆకలిని చల్లార్చుకుంటున్నాం. ఎటువంటి కృషి లేకుండా పుష్కలంగా నీటిని వర్షం ద్వారా పొందుతున్నాం. రెండు సంవత్సరాలు వరుసగా వానలు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? నగరాలకు నగరాలు మరుభూము లవుతాయి. నీరు ఉచితంగా శ్రమ లేకుండా లభిస్తోంది. అయితే కష్టించి, ఖర్చు చేసి చెరు వులు, ఆనకట్టలు నిర్మించుకుంటున్నాం. నీరు నిలువ చేసుకుంటున్నాం. మొదటి విషయం, ‘సాధించడం’ అనే మాటలో ‘ప్రయత్నం’ అనేది అంతర్లీనంగా ఉంది ప్రయత్నమంటే పెద్ద ప్రాము ఖ్యత లేనిదని అర్థం చేసుకుంటే, ఒక బెంగపడవలసిన పని ఉండదు. సాధించి సంపా దించిన చిన్న చిన్న వస్తువులు ఉంటే ఏమిటి? లేకపోతే ఏమిటి? ఫలితాలు వస్తే ఎంత? రాకుంటే ఎంత? ఒకింత జాగ్రత్తగా యోచన చేస్తే, అసలు బాధపడనే పడవు.
ఒక్కసారి మనం చేసిన కృషికి ఫలితం రావడం ఆలస్యం కావచ్చు. సమయం పట్టవచ్చు. ఆలస్యం, దేవుని అలసత్వం కాదు. తిరస్కారం కాదు. తీయని పురస్కారం. ఆయన నిర్వహణలో అన్నీ సరైన సమయానికే జరుగుతాయి. జరగవలసిన తీరిగానే జరుగుతాయి. ఆయన గడియారం ఎప్పుడూ మెల్లగా తిరగదు. మన గడియారాలే వేగంగా నడుస్తాయి. కాలపురుషుని నిర్ణయాలు సకాలం లోనే అమలు జరుగుతాయి. సహనం, సంతోష తీరానికి చేర్చే ఉత్తమవాహనం. లెక్కల పుస్తకంలో ప్రశ్నకు పక్కనే •వాబు ఉండదు. తెలివిగా పరి శోధించి, పరిష్కరించి చివరిపేజీలోని సమా ధానంతో సరిచూసుకుంటాం.
కాలస్వభావం గురించి రమణ మహర్షి ఏమ న్నారో చూడండి. ‘‘గతం అనుభవంలోకి వచ్చి నప్పుడు వర్తమానంగానే అనుభూతమయింది. భవిష్యత్తు కూడా వర్తమానంగానే అనుభూత మవుతుంది. ఇప్పుడు మనం వర్తమానంలోనే ఉన్నాం. అంటే ఎప్పుడు ఉన్నది వర్తమానమే.’’ కనుక, గతం గురించి చింత వద్దు, భవిష్యత్తు గురించి బెంగవద్దు. అనుక్షణం వర్తమానంలో జీవించండి. గడచిన క్షణం కనుమూసిన వృద్ధు రాలు. రానున్న క్షణం తెరవని పసికందు. ఈ క్షణం నిండుజవ్వని. ఈ నిమిషాన్ని సరిగ్గా వాడు కుంటే మరు నిమిషం మరింత లాభం కలి గిస్తుంది. వర్తమానంలో జీవించే వ్యక్తి కాలాన్ని జయిస్తాడు. కలాతీతుడౌతాడు.
ఇక రెండో విషయం, నీవు పొగొట్టుకొన దగినవే పోగొట్టుకుంటావు. పొందవలసినవి మాత్రమే పొందుతావు. మనంకోరినవి లభించక పోతే, పరమేశ్వరుని తెలివిని ప్రశ్నించకుండా ఉండే తెలివి మనకి ఉండాలి. మహామేధావియైన ప్రకృతి చక్కగా నిర్ణయించి, మనకు కావలసినవి మాత్రమే అందిస్తుంది. అక్కరలేనివి అందకుండా చేస్తుంది. ఇదే ప్రకృతి న్యాయం!
మనలో చాలామందికి ప్రకృతి మేధాశక్తి గురించి అంతగా తెలియదు. ఒక్కసారి నిజాయితీగా, శ్రద్ధగా మనసుపెట్టి ప్రకృతి తెలివితేటల మీద దృష్టి సారించండి. ఒళ్ళంతా గగుర్పాటు కలిగి మతి పోతుంది. కోటి ఫసిఫిక్‍ మహాసముద్రాల కంటే లోతైనది ప్రకృతి మేధస్సు. అసలు మేధస్సు అనే పదం ఏ మూలకు సరిపోతుంది ? ఎన్ని వందల సంవత్సరాలు కావాలి, ఆ మహాశక్తిని వర్ణించడానికి, పొగడ డానికి? ప్రకృతి ఏమి చేసినా మన మంచి కోసమే చేస్తుంది. ప్రతి పనిలోనూ ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉండి తీరుతుంది. మనుషుల నుండి, జంతువుల నుండి తన్ను తాను రక్షించుకునేందుకు పాము విషం తయారు చేసుకుంటుంది, కాటు వేస్తుంది. ఇతర జీవుల శరీరతత్వం తెలియకుండా పావు శరీరం ఆ జీవుల్ని చంపగలిగే రసాయ నాలను ఎలా తయారు చేసుకోగలుగుతుంది ? ఇది వింత కాదా ? అందరికీ తెలిసిన ఈ సాధారణ విషయం నిజంగా ఆలోచిస్తే ఎంతో అద్భుతం.
ఒక వ్యాధికి మందు కనిపెట్టడానికి ఎంత పరిశోధన జరుగుతుంది! వ్యాధి ఎలా పుడు తుంది, శరీరతత్వంపై మందు ఎలా పనిచేస్తుంది, జబ్బును మందు ఎలా నయం చేస్తుంది అనే విషయాలపై విస్త•త శోధన జరిగిన తర్వాత కాని మందు తయారు కాదు. పాము ఏ పరిశోధన లేకుండానే తన శత్రువును సంహరించగల విషాన్ని తయారు చేసుకుంటున్నది. ఎంత వింత!!
అలాగే, తల్లీబిడ్డల అనుబంధం చూడండి. తల్లిపాలలో పిల్లలకు కావలసిన అన్ని పోషక విలువలు, ఉండవలసిన నిష్పత్తిలో సరిగ్గా ఉంటాయి. తేలికగా జీర్ణమయ్యేట్లుగా ఏర్పాటు చేయబడతాయి. ప్రతి తల్లీ వైద్యశాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివి పాలు తయారు చేసుకుంటున్నదా ? మాతృమూర్తి యొక్క అమృతతుల్యమైన పాలను తయారుచేయగల శక్తి భగవంతుడి సామర్థ్యానికి తార్కాణం కాదా! తల్లి గర్భంలో శిశువు రూపుదాల్చి పెరగడం వలన, బిడ్డ శరీర నిర్మాణం, తత్వం తల్లి శరీరానికి తెలుసని మీరు సమర్థించ వచ్చు. మరి పాము విషం ఎన్నో రకాల జీవులను చంపుతుంది. వాటి శరీరతత్వాలు పాముకెలా తెలుసు? పాము కడుపులో ఇవన్నీ పుట్టి పెరిగాయా? అదే మానవ మేధస్సుకు అర్థం కాని ప్రకృతి ప్రతిభ.
ప్రతి విషయాన్నీ తేలికగా తీసుకునే స్వభావం చేత మనకీ విషయాలు అర్థం కావు. నలనల్లని మేఘమాలిక చలచల్లగా జలకన్యను పల్లకిలో మోసుకొస్తున్న రమణీయ దృశ్యాన్ని తిలకించండి. ఆనంద సాగరంలో తేలియాడండి. శ్రీ రామకృష్ణ పరమహంస మబ్బును చూసి మనసు పరవశించి సమాధిస్థితికి చేరుకునేవారు. కదిలే ఒక చిన్న చీమను చూచినా అటువంటి స్థితిని పొందవచ్చు. ప్రతి జీవిలోని సమస్త కార్యాలను నిర్వహించే మేధస్సు పేరే దైవం. ఇదే పరమాత్మకు ప్రకృతి ఇచ్చే నిర్వచనం.
ప్రకృతి మనకు చక్కటి శరీరాలనిచ్చింది. కోటేరులాంటి ముక్కునిచ్చింది. శ్వాసించేందుకు మంచి గాలిని కూడా ఇచ్చింది. చెవులను సృష్టించింది. వినడానికి శ్రావ్యమైన సంగీతా న్నిచ్చింది. అందమైన నేత్రాలనిచ్చింది. చూసి సంబరపడటానికి అంతకు మించిన అందా లిచ్చింది. ఆకలిచ్చిన ప్రకృతి, ఆహారాన్ని ఏర్పాటు చేసింది. ఒకచేత దాహాన్నిచ్చి, మరొక చేత మంచి నీరు అందించింది. ఈ శరీరాన్ని సృష్టించిన ప్రకృతే, మనసును కూడా సృష్టించింది. శారీర కావసరాలకు ఇన్ని సమకూర్చిన ప్రకృతి మాన సికావసరాలు తీర్చదా? సుఖశాంతులీయదా? మనకేమి కావాలో ప్రకృతికి తెలియదా? అయి నప్పటికీ, దేవుడా ! అది కావాలి, ఇది కావాలి అని ప్రాధేయపడతుంటాం. మన కోరికలు తీర్చ మని అడుక్కోవడానికి పూజలు, ప్రార్థనలు చెయ్యాలా? త్రాగే నీటి కోసం, పీల్చే గాలి కోసం ఏ మంత్రం పఠించాలి ? అడగకుండానే అన్నీ లభిస్తుంటే ఇక దేనికోసం తాపత్రయం?
‘ఇదొక్కటి చాలు’ అనేది మనసు చేసే మాయ. ఒక్కసారి ‘ఇదొక్కటి చాలు’ అనే ఊబిలోకి దిగితే చాలు, ఒక బయటపడలేం. ‘ఇదొక్కటి చాలు’ అని మనసు అరచినప్పుడు, ‘ఇదొక్కటీ వద్దు’ అని మనసుకు ఆనందంగా నచ్చచెప్పే స్థాయికి మనం ఎదగాలి. అప్పుడే మనకు జీవితంపై సంపూర్ణమైన ఆధిపత్యం లభిస్తుంది. నిజంగా ఆ ‘ఇదొక్కటి’ మనకు అవసరమైతే, మనకు ఆరోగ్యకరమైనదైతే అడగకుండా ‘ఆయనే’ ఇస్తాడు. ఇవ్వలేదంటే, ఖచ్చితంగా అది మన మంచికే! బహుశా అది మన ఊహకందనంతగా అనవసరం, హానికరం అన్నమాట!
ప్రార్థన అంటే పొడవైన కోరికల చిట్టా కాదు. ఇప్పటివరకూ ఆయన ఇచ్చిన వాటికి కృతజ్ఞతతో ఆయనను కీర్తించడమే సరైన ప్రార్థన. ఫిర్యాదుల లేకపోవడం, అన్నింటినీ ఆనందంగా అంగీక రించడం అసలైన ప్రార్థన.
చైనాలోని కొన్ని ప్రాంతాల్లోనూ, నేపాల్‍లోనూ ప్రజలు పొట్టిగా ఉంటారు. అవి పర్వత ప్రాంతాలు. కొండ ఎక్కడానికి అడుగు ఎత్తి వేయాలి. కాళ్ళు పొడుగైతే భూమ్యాకర్షణ శక్తి వలన కాలు ఎత్తడానికి కష్టమవుతుంది. కాళ్ళు పొడుగైనపుడు పైభాగాన ఉండే శరీరభాగం కూడా పెరిగి ఇంకా భార మవుతుంది. కొండలెక్కడానికి వీలుగా, ఎంతో ప్రేమతో, ఎంతో తెలివిగా అక్కడి మనుషులను ప్రకృతి పొట్టిగా సృష్టించింది.
ఎక్కడ ఏది ఉండాలో, ఎలా ఉండాలో, అలాగే అంతా నిర్మించ బడింది. చలి ప్రదేశంలో ఉండే వృక్షాలు అక్కడి వాతావరణానికి తగినట్టు పెరుగుతాయి. ఉష్ణ దేశాలలోని చెట్లు వేడిని తట్టుకునే విధంగా ఉంటాయి. ఎగిరేందుకు వీలుగా పక్షుల రెక్కలు తయారుచేయబడినాయి. నీటిలో నివ సించేందుకు, ఈదటానికి అనుకూలంగా జలచరాల శరీరనిర్మాణం జరిగింది. ఒంటె పాదాలు ఎడారి ఇసుకలో నడి చేందుకు సానుకూలంగా ఏర్పరచబడి నాయి. చాలాకాలం నీరు లేకపోయినా బ్రతికే నేర్పు ఇంటకివ్వబడింది. ఎక్కడి ప్రాణికైనా, ఏ జీవికైనా ఇప్పుడున్న శరీర సౌకర్యాలను అంతకంటె మెరుగు పరచలేం. అంత ఉత్తమంగా, ఖచ్చితంగా అవి సృష్టించబడినాయి. ఇంతకంటె గొప్పగా ఉండే అవకాశం లేదు. మన జీవన గాధలన్నీ, నవరసాలు చక్కగా మేళవించి, అంద మైన మలుపులతో అలంకరించిన అద్భుత రచ నలు. ప్రతిఒక్కరి జీవన కావ్యం, ఏదో ఒక ప్రత్యే కతతో, వైవిధ్యంతో తీర్చిదిద్దిన కళాఖండం. ఇంతకుమించి ఉన్నతంగా ఉండే అవకాశం లేదు. అవసరమూ లేదు.
ప్రకృతి మేధాసంపత్తి అసాధారణమైనది. ఆ శక్తిని స్మరించి, తరించి పోవడానికి మనకు జీవితకాలం సరిపోదు. ఈ విషయం గుర్తించ లేక, ఇది బాగా లేదు, అది తప్పు అని వంకలు పెడతాం. ప్రకృతి విజ్ఞతను గుర్తించడం. పైపైన సరిగా లేనట్టు కనిపించగానే, ఇవి అసంబద్ధమైన చర్యలని ఏకపక్షంగా ప్రకటించేస్తాం. ఈ సృష్టిలో మనకు అర్థం కాని విషయం ఏమైనా ఉంటే, అది అర్థం చేసుకునే స్థాయికి మనం ఎదగలేదని భావించాలి. దాని వెనుక నిగూఢమైన ప్రజ్ఞ ఉందని గ్రహించాలి.
మనకు తరచుగా దుఃఖాన్ని కలిగించే మన మనస్సు కూడా ప్రకృతి ఇచ్చినదే కదా! ఇలా ఎందుకు జరుగుతోంది? సమాధానం కొరకు సమస్య మూలాన్ని పరిశీలించాలి. ద్వంద్వ, వైరుధ్య అంశాల కలయిక ప్రకృతి సహజ వైఖరి. గుండెలోని మంచి రక్తం, చెడు రక్తం, పగలు- రాత్రి, శిఖరాగ్రం -లోయ ఇవన్నీ సృష్టి ఉనకికి మూలస్తంభాలు. ఈ ముఖ్య విషయాన్ని ఎప్పుడూ మరచిపోతున్నాం. సుఖదుఃఖాలు ఒకే నాణేనికి బొమ్మా-బొరుసులు.
సుత్తితో రాళ్ళు పగలగొడతాం. గోడలకు మేకులు దించుతాం. తలలు పగలగొట్టే అవకాశం ఉందని సుత్తిని సుతిమెత్తగా తయారు చేస్తామా? కూరలు కోసే కత్తి, కుత్తుకలు కూడా కోస్తుంది. మెడకాయను కోయని, కూరగాయల్ని మాత్రమే కోయగల కత్తిని ఎవరైనా తయారు చేయగలరా? మంచినీటిని మాత్రమే స్వీకరించి మురికినీటిని బహిష్కరించే గ్లాసును సృష్టి చేయగలమా? కత్తిని తయారు చేసుకుందాం, కానీ సక్రమంగా ఆడుకుందాం. కూరలే కోసుకుందాం. సంతోషం పొందటానికి ఒక మనసు, బాధ అనుభవించడానికి మరొక మనసు ప్రత్యేకంగా ఉంటాయా ? బ్రతుకును సుఖమయం చేసుకునే విధంగా మనసును మలచుకొనడమే జీవనకళ. అంతేకానీ, ఆనందాలే కావాలి, కష్టాలు మాత్రం వద్దు అనుకో కూడదు. అరవైనాలుగు కళలకంటే జీవనకళ ఉత్క•ష్టమైనది. జీవనఫలం నుండి ఆనందరసం జుర్రుకోవాలి.

Review జయం -అపజయం.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top