స్నేహాలు రకరకాలు. అవసరానికి చేసేవి కొన్ని.. అనుకోకుండా కుదిరేవి కొన్ని.. వృత్తిపరంగా కొన్ని.. వ్యక్తిగతంగా కొన్ని.. కానీ, వేర్వేరు హోదాల్లో ఉంటూ వ్యక్తిగత స్థాయిని మించి కొనసాగే ప్రాణ సమానమైన స్నేహాలు అరుదు. అటువంటి స్నేహితుల జోడీ.. జో – బరాక్. (జో బైడెన్ – బరాక్ ఒబామా). ప్రత్యర్థులుగా మొదలై ప్రాణ స్నేహితులుగా మారిన వీరిద్దరు స్నేహానికి కొత్త నిర్వచనంగా నిలుస్తారు.
‘మా సోదర ప్రేమ గురించి మాట్లాడుకోవడానికి ఇంటర్నెట్‍కు ఇదే చివరి అవకాశం’ అని ఒబామా అనగానే ఆ పక్కనే ఉన్న జోబైడెన్ పగలబడి నవ్వుతూ బరాక్ భుజం తట్టారు. ఇది అమెరికా 44వ అధ్యక్షుడు బరాక్ ఒబామా.. నాటి ఉపాధ్యక్షుడు, ప్రస్తుత అమెరికా 46వ అధ్యక్షుడు జో బైడెన్ మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. 2017 జనవరిలో అమెరికా అత్యున్నత పురస్కారం అయిన ‘ది ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడం’ను బైడెన్‍కు అందించే సభలో ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు. అధ్యక్షుడిగా నేను చివరిసారి ప్రెసిడెన్షియల్ మెడల్ అందిస్తున్నానని ఒబామా అనగానే బైడెన్ వెనక్కి తిరిగి ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. ఇది వాళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనం.
ప్రత్యర్థులుగా మొదలై మిత్రులుగా మారారు..
ఒబామా – బైడెన్ మధ్య స్నేహం, అనుబంధం విచిత్రంగా మొదలైంది. 2008 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని బైడెన్ నిర్ణయించుకున్నారు. అప్పటికే ఈయనకు సెనెటర్‍గా దాదాపు 35 సంవత్సరాల అనుభవం ఉంది. బైడెన్‍కు పోటీగా మరో సీనియర్ క్రిస్ డోడ్ కూడా రంగంలోకి దిగారు. అప్పటికే యువకుడైన బరాక్ ఒబామా ఇల్లినాయిస్ సెనెటర్‍గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన కూడా అప్పుడు బరిలోకి దిగారు. అమెరికాలో ఏదైనా పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే ముందు పార్టీలో జరిగే బిడ్‍లో గెలుపొందాల్సి ఉంటుంది. ఔయోవాలో నిర్వహించిన కాకస్‍లో బైడెన్‍కు పార్టీ నుంచి ఒక శాతం మద్దతు మాత్రమే లభించింది. దీంతో ఆయనకు పరిస్థితి అర్థమైపోయింది. వెంటనే అధ్యక్ష పదవి రేసు నుంచి వైదొలిగారు. ఒబామా రేసులో దూసుకెళ్లి డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా నిలిచారు. ఒబామా తాను అధ్యక్షుడిగా ఎన్నికవగానే మొదట చేసిన పని.. ఉపాధ్యక్షుడిగా బైడెన్‍ను ఎన్నుకోవడం. అలా వీరి బంధం మొదలైంది.
బ్రోమాన్స్..
ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న రెండు పర్యాయాలు కూడా జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. ప్రతి కీలక సమావేశంలో జో.. ఒబామాకు నీడ వలే ఉండేవారు. బైడెన్ తెరపైకి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. అప్పట్లో అమెరికా పత్రికల్లో వీరిద్దరి సమన్వయాన్ని బ్రోమాన్స్ (సోదర ప్రేమ)గా వర్ణిస్తూ కుప్పలు తెప్పలుగా ఆర్టికల్స్ వచ్చేవి. అప్పట్లో అమెరికా తొలి మహిళ మిషెల్ (ఒబామా భార్య) నేతృత్వంలో నిర్వహించిన ‘లెట్స్ మూవ్’ ప్రచారం కోసం ఒబామా, బైడెన్ కలిసి ఒక వీడియోలో కూడా నటించారు. అది అప్పట్లో సంచలనం అయ్యింది. ఒబామా పుట్టిన రోజు సందర్భంగా జో బైడెన్ ఒక ఫొటోను షేర్ చేశారు. దీనిలో ‘జో – బరాక్’ అని రాసి ఉన్న బ్రాస్‍లెట్ ఉంది.
ఒకరికొకరు..
ఒబామా – బైడెన్‍ల బంధం ఆఫీస్‍కు, వైట్‍హౌస్‍కు మాత్రమే పరిమితం కాలేదు. ఒకరి కష్టనష్టాలను మరొకరు పంచుకునేంత గాఢంగా ఉండేది. ఈ విషయాన్ని ఒకసారి బైడెన్ స్వయంగా ఎన్‍బీసీ చానెల్‍కు చెప్పారు. ‘నేను ఒబామాను ఇష్టపడను.. ప్రేమిస్తాను. బ్యూ (బైడెన్ కుమారుడు) చనిపోవడానికి ముందు అనారోగ్యానికి గురయ్యాడు. అప్పుడు బరాక్ నాకు వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు’ అని బైడెన్ గుర్తుకు తెచ్చుకున్నారు. ఒబామా సతీమణి మిషెల్, బైడెన్ సతీమణి జిల్ కూడా సన్నిహిత మిత్రురాళ్లు. అలాగే, బైడెన్ మనవరాళ్లు, ఒబామా కుమార్తెలకు మంచి దోస్తీ కుదిరింది. వృత్తిపరమైన జీవితానికి దూరంగా వీరి మధ్య బలమైన బంధం ఏర్పడింది. వైట్‍హౌస్‍లో అధ్యక్షుడికి, ఉపాధ్యక్షుడికి ఈ స్థాయిలో సంబంధాలు ఉండటం అత్యంత అరుదుగా కనిపిస్తుంది. అందుకే ఒబామా తానే
అధ్యక్ష ఎన్నికల్లో నిలబడినట్టు భావించి, ఇటీవల జరిగిన ఎన్నికల్లో బైడెన్ కోసం విస్తత ప్రచారం చేశారు.
Review జోడీ నంబర్ వన్.