శ్రీనివాస్ నిమ్మగడ
ఏ దేశమేగినా..ఎందుకాలిడినా.. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరేమన్నా..పొగడరా నీ తల్లి భూమి భారతిని..నిలుపురా నీ జాతి నిండు గౌరవమును.. అన్నట్లు భారతీయులు ఎక్కడకు వెళ్లినా తమ ప్రతిభను చాటుకుంటారు. భారతీయులను తలెత్తుకునేలా చేస్తారు. ఓ సామాన్య కుటుంబంలో పుట్టి అమెరికా రాజకీయాల్లో తనదంటూ ప్రత్యేక ముద్ర వేసుకోవడమనేది చిన్న విషయం కాదు..అలాంటి వారిలో ఓ అరుదైన భారతీయుడు, తెలుగుతేజం నిమ్మగడ్డ శ్రీనివాస్ ఒకరు.
భారతీయులు తమ శక్తి సామార్థ్యాలను నిరూపించుకోవడానికి కావాల్సిన పుష్కల అవకాశాలు అమెరికా రాజకీయాల్లో ఉన్నాయనే విషయాన్ని నిమ్మగడ్డ శ్రీనివాస్ గమనించారు. ప్రవాసాంధ్రుడిగా ఉన్న శ్రీనివాస్ అమెరికా రాజకీయాలను నిశితంగా పరిశీలించేవారు. 2012లో అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరపున బరిలో నిలిచిన మిట్ రామ్నీకి అతి పెద్ద మద్దతు దారుడిగా, సన్నిహితుడిగా నిమ్మగడ్డ నిలబడ్డారు. మిట్ రామ్నీ విజయానికి తన వంతుగా విశేషమైన కృషిచేశారు. అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు డిక్ చెనీ, న్యూజెర్సీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ, లూసియానా గవర్నర్ బాబా జిందాల్, జార్జియా గవర్నర్ సూశాన్, మార్టినెజ్, రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు రేయిన్స్ ప్రీబస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు జెబ్ బుష్, పాల్ రాయన్, మార్కో రూబియో తదితరులతో నిమ్మగడ్డ శ్రీనివాస్‍కు సత్సంబంధాలు ఉన్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍ను కూడా నిమ్మగడ్డ శ్రీనివాస్ పలు సమావేశాల్లో వ్యక్తిగతంగా కలిశారు. సహృదయుడైన ట్రంప్ అమెరికాను నూతన పథంలో నడిపిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంతటి పేరు ప్రఖ్యాతలు గడించిన శ్రీనివాస్ స్వస్థలం విజయవాడ. అక్కడ పుట్టి అమెరికాలో స్థిరపడినా నిత్య విద్యార్థిగా ఉంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీనివాస్ నిమ్మగడ్డ.
అవినాష్ ఇరగవరపు
అనుకున్నది ఒక్కటి..అయ్యింది ఒక్కటి..అన్నట్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు అందరికీ షాక్ ఇచ్చాయి. ట్రంప్ గెలుస్తారని ఎక్కువ మంది ఊహించలేదు.. సర్వేలు, మీడియా సంస్థలు, మేథావులు, విద్యావేత్తలు అంతా హిల్లరీ గెలుపు ఖాయమని వాదించారు. కానీ ఒక్కరు మాత్రం కచ్చితంగా ట్రంపే గెలుస్తారని బల్లగుద్ది మరీ చెప్పారు.. చెప్పడమే కాదు.. ట్రంప్ గెలిచేందుకు రచించిన ప్రచార వ్యూహంలో కూడా ఆయన పాత్ర పోషించారు. అతనే తెలుగు తేజం ఇరగవరపు అవినాష్.
ఓ సాధారణ ఐటీ ఉద్యోగిగా ఉన్న అవినాష్ అమెరికా ఎన్నికల్లో తన హవా చాటాడంటే ఆయన పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. చిన్పప్పటి నుంచి రాజకీయాలంటే ఉన్న ఆసక్తే అతన్ని ఈరోజు ఇంతటి పేరు గడించేలా చేసింది.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ ప్రచార వ్యూహకర్తల్లో ఒకరిగా నిలబెట్టింది. లక్నో ఐఐఎంలో ఎంబీఏ చేసిన ఇరగవరపు అవినాష్ హెచ్‍సీఎల్‍లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‍గా పనిచేశారు. ఉద్యోగం చేస్తున్నా అవినాష్ మనసంతా రాజకీయాలపైనే ఉండేది. ఆ బలమైన సంకల్పంతోనే అమెరికా రిపబ్లికన్ ఎన్నికల వ్యూహకర్తగా మారారు.
ఓటర్లపై అధిక ప్రభావం చూపే అంశాలపై అవినాష్ అధ్యయనం చేసేవాడు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‍ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా విశ్లేషణ చేశారు. మాస్టర్స్ చేస్తున్న తన భార్యను చూసేందుకు అమెరికా వచ్చిన అవినాష్ తాననుకున్న ప్రణాళికలను రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డగ్ డూసీ బృందానికి చెప్పారు. తన ఆలోచనలు డూసీ టీమ్‍కు నచ్చడంతో అవినాష్‍కి ఆ బృందంలో చోటు లభించింది.
ఆయా ప్రాంతాల ప్రజల స్థితిగతులు, అక్కడి సామాజిక, ఆర్థిక పరిస్థితులు, పలు అంశాలను అధ్యయనం చేసి సైకో గ్రాఫిక్స్ అనాలిసిస్ చేయడంలో అవినాష్ దిట్ట. దీంతో డూసీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. డూసీ విజయంతో అవినాష్‍కు పార్టీ ప్రచార వ్యవహారాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పదవి వచ్చింది. తర్వాత అవినాష్ ఇక వెనక్కి తిరిగి చూడలేదు. ట్రంప్ అభ్యర్థిత్వం ఖరారయ్యాక ఆయనతో పలుసార్లు సమావేశమై ఆయనకు తగ్గట్లు ప్రచారవ్యూహం రూపొందించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుడు అవినాష్ తన సత్తా చాటాడంటే తెలుగువాళ్లు గర్వించదగ్గ విషయమే.
Review ‘ట్రంప్’ కు బాసటగా తెలుగు వెలుగులు.