బైడెన్ తన బాల్యంలో బాగా ఇబ్బంది పడిన సమస్య- నత్తి. ఆయన నత్తితో బాగా బాధపడేవారు. ఈ కారణంగా తోటి పిల్లలు ఆయనను ‘డాష్’ అంటూ ఆట పట్టించే వారు. తరగతి గది టీచర్ అయితే, ‘బ..బ..బైడెన్’ అంటూ ఎకసెక్కెం చేసేది. అయితే, ఈ వెక్కిరింతలతో బైడెన్ ఆత్మన్యూనతకు గురికాకుండా, గంటల తరబడి అద్దం ముందు నిల్చుని కవితలు, పద్యాలు చదువుతూ, క్రమంగా సమస్యను అధిగమించారు. అయినా, ఇప్పటికీ బైడెన్‍కు మాట తడబడుతూనే ఉంటుంది. ఆయన నత్తితో బాధపడేవారికి ఇప్పటికీ తగిన సలహా, సూచనలు ఇస్తూ ధైర్యాన్ని నూరిపోస్తుంటారు.
రోజుకు 3 గంటలు.. 36 సంవత్సరాలు
బైడెన్ కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో మునిగి తేలుతున్నా బైడెన్ ఏనాడూ కుటుంబాన్ని, పిల్లల్ని నిర్లక్ష్యం చేయలేదు. రాజకీయాల కారణంగా వాషింగ్టన్ డీసీలో ఉన్నా.. పిల్లలతో గడిపేందుకు ప్రతి రోజూ రైలు పట్టుకుని గంటన్నర పాటు ప్రయాణించి రాత్రికల్లా డెలావర్‍లోని ఇంటికి చేరుకునే వారు. ఈ అటవాటును తాను సెనేటర్‍గా ఉన్న ముప్పై ఆరు సంవత్సరాల పాటు అలాగే కొనసాగించారు బైడెన్. అంటే, ఆయన ఈ 36 సంవత్సరాల్లో రోజుకు మూడు గంటలు చొప్పున రైలు ప్రయాణం చేశారన్న మాట. జీవితంలో వ్యక్తిగతంగా, రాజకీయంగా ఎదురుదెబ్బలు తగిలిన ప్రతిసారీ ఆయన కుటుంబ అనుబంధాలు మరితంగా బలపడ్డాయి. అదే ఆయన బలం.
నిక్సన్ అంటే ఇష్టం లేక..
బైడెన్ డెమొక్రటిక్ పార్టీకి చెందిన వారనే విషయం తెలిసిందే. ఆ పార్టీ గుర్తుపైనే పోటీచేసి ఆయన అధ్యక్షుడయ్యారు. అయితే, బైడెన్ నిజానికి రిపబ్లికన్‍గానే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1968లో విలియం ప్రికెట్ వద్ద లాయర్‍గా పనిచేసే వారు. ఆయన రిపబ్లికన్. తాను కూడా అప్పటికి రిపబ్లికన్ నేతలకు మద్దతు ఇచ్చేవారు. స్థానిక రిపబ్లికన్‍లు బైడెన్‍ను కూడా రిజిస్టర్ చేయించారు. అయితే, అప్పటి అధ్యక్ష అభ్యర్థి నిక్సన్ అంటే ఇష్టం లేని బైడెన్.. తరువాత తన రిజిస్ట్రేషన్‍ను స్వతంత్రంగా మార్చుకున్నారు. తరువాత డెమొక్రటిక్ పార్టీలో చేరారు.
Review ‘డాష్’ అనేవారు...