పూర్వం మగధ దేశాన్ని ధర్మగుప్తుడు అనే రాజు పాలిస్తుండే వాడు.
ఆయనకు ఒక్కగానొక్క కుమార్తె.
ఆమె సాటిలేని రూపసి. దైవభక్తి గలది.
అపురూపంగా పుట్టిన ఆ సౌందర్యవతిని చూసుకుని రాజు మురిసిపోయేవాడు.
‘నా ముద్దుబిడ్డ ఇందువదనను ఎప్పటికైనా దైవభక్తి గల ఒక మహారాజుకు ఇచ్చి పెళ్లిచేస్తాను’ అంటూ ప్రతినబూనాడు.
ఇందువదన పెరిగి పెద్దదయింది.
దేశ దేశాల నుంచి ఎందరెందరో శ్రీమంతులు ఆ పిల్లను చూడవచ్చే వారు.
కానైతే, తను అనుకున్న సుగుణాలన్నీ ఒక్కరిలోనూ కనిపించకపోవడం చేత ధర్మగుప్తుడికి వారిలో ఎవరూ నచ్చలేదు.
కనుక, ఆ వచ్చిన వాళ్లు వచ్చిన దారినే మరలిపోయేవారు.
ఇందువదన విరక్తిభావంతో ఒకరోజున గదిలో కూర్చుని, ఆలోచించసాగింది.
‘జీవితం అంటే ఇదేనా? తిండి, నిద్రా తప్ప మరేమీ వ్యాపకాలు లేవా? నేను ఒంటిపాటుగా బతకవలసిందేనా?’ అని.
అలా విచారిస్తుండగా కోటలో ఏదో సందడి వినవచ్చింది.
అది విని ఆమె- ‘ఏమిటీ సందడి? నా జీవితంలో ఒక గొప్ప మార్పు రాబోతోందని మనసు మరీ మరీ చెబుతున్నదే! ఈ సందడి అటువంటి మార్పునకు సంబంధించినదై ఉంటుందా?’ అని అనుకున్నది.
అంతలోనే చెలికత్తెలు ఉరుకులు పరుగుల మీద వచ్చి, ఇందువదనను చుట్టేశారు.
కొత్తగా చూడవచ్చిన కళింగ రాజకుమారుడి గురించి ఊసులాడజొచ్చారు.
వారు అలా ఊసులాడుకుంటుండగానే మంత్రి వచ్చి ఇందువదనను రాజు వద్దకు తీసుకుని వెళ్లాడు.
ధర్మగుప్తుడు ఆమెను చేరదీసుకుని, ‘అమ్మా! మన అదృష్టం ఫలించి ఈనాటికి నీకు తగిన సంబంధం వచ్చింది’ అంటూ కళింగ రాజకుమారుడిని గురించిన వివరాలన్నీ ఆమెకు తెలియచెప్పాడు.
తండ్రి చెప్పినదంతా శ్రద్ధగా విన్న తరువాత ఇందువదన ‘నాయన గారూ! మీరు చెప్పిన ఐశ్వర్యములన్నిటి కంటే నాకు నా దేవిని సంతోషపెట్టడమే ఎక్కువ. కళింగ రాజకుమారులు నా దేవికి తగిన కానుకలు ఈయగలరా?’ అని అడిగింది.
‘తప్పకుండా ఇస్తాడమ్మా! చిన్ననాటి నుంచి అతడిని నేను ఎరుగుదును. నీలాగనే దైవపూజ అంటే ఆసక్తి గలవాడు. కనుకనే ఈ సంబంధానికి ఒప్పుకొన బుద్ధి పుట్టింది నాకు’ అని తండ్రి చెప్పేసరికి ఇందువదన ఆనందంతో సమ్మతించింది.
మరికొద్ది రోజులకే మంచి ముహూర్తాన, ఇందువదనను కళింగ రాజకుమారుడైన కృపావర్మకు ఇచ్చి వివాహం చేశారు.
ఆమె అత్తవారింటికి బయల్దేరి వెళ్లే రోజున తన దేవి ఆలయానికి వెళ్లి, భక్తితో పూజించి, ‘కళింగ రాజ్యమంతటిలో దొరికే విలువైన వస్తువు నీకు కానుకగా సమర్పించుకొంటాను తల్లీ!’ అని మొక్కింది.
ఇందువదన, కృపావర్మ చిలుకా గోరింకల వలే అన్యోన్యంగా ఉండేవారు. ఆమె ఏమి కోరినప్పటికీ, తలచుకొన్నంతనే సమకూర్చే వాడు కృపావర్మ.
ఆమె సంతోషమే తన సంతోషంగా ఎంచి, ఇందువదనను అపురూపంగా చూసుకొంటున్నాడు.
ఇంతచేసినా, ఇందువదన ఏదో ఒక విధమైన బెంగతో ఉన్నట్టు కనిపించేది.
ఆమెలోని వైరాగ్య భావం కనిపెట్టిన కృపావర్మ, ఒకరోజున ఆమెను బుజ్జగించి, ఈ విచారానికి కారణం ఏమిటి అని అడిగాడు.
దీంతో తను దేవికి చేసిన వాగ్దానం గురించి చెప్పింది.
‘ఈపాటి దానికి అంత బెంగ ఎందుకు?. మన రాజ్యంలోకెల్లా విలువైన వస్తువులు తెప్పిస్తాను. అందులో నీకు నచ్చినది తీసుకుని నీ దేవికి సమర్పించు. నీ కోరిక తీర్చడం కంటే నాకు కావాల్సినది ఏముంది?’ అని తక్షణమే రాజ్యంలోని గొప్ప గొప్ప వర్తకులందరినీ పిలిపించాడు కృపావర్మ.
వారు చిత్రవిచిత్రమైన కానుకలెన్నో పట్టుకుని వచ్చి రాజు ఎదుట ఉంచారు.
ఇందువదన అవన్నీ వేడుకతో పరిశీలించగా, అన్నింటిలోనూ ఒకే ఒక వస్తువు ఆమెను ఆకర్షించింది.
అదే కాంతివజ్రం.
అది ఉన్నచోటు నుంచి చుట్టూ ఒక క్రోసెడు దూరం వరకూ ప్రకాశిస్తూ ఉంటుంది.
తన ఇందువదనకు అపురూప వస్తువు లభించినందుకు కృపావర్మకు అపరిమితమైన సంతోషమైంది.
లక్షల కొద్దీ వరహాలు పోసి ఆ కాంతి వజ్రాన్ని కొని భార్యకు ఇచ్చాడు.
ఆమె ఆనందానికి మేర లేకపోయింది.
దంపతులిద్దరూ కలిసి మగధ రాజ్యానికి కాలినడకన యాత్ర చేసి, అపురూపమైన ఆ కాంతివజ్రాన్ని దేవికి సమర్పించి వద్దామని నిశ్చయించుకున్నారు.
మరునాడు వారు మగధ రాజ్యానికి పాదచారులై బయల్దేరి గుట్టలు, పుట్టలు, మెట్టలు, మహారణ్యాలు దాటుకుని చివరకు ఒక పెద్ద నది వద్దకు చేరుకున్నారు.
ఆ నది దాటిన తరువాత మగధ రాజ్యం ఇక కొంచెం దూరమే ఉంది.
దంపతులు ఉత్సాహంతో నదిని దాటి, గట్టుపైన నిలబడ్డారు.
కొంచెం విశ్రాంతి తీసుకుని, తరువాత మళ్లీ పాదయాత్ర చేద్దామని అనుకుంటుండగా, కాంతివజ్రం కనిపించకుండా పోయింది.
‘ఇదేమి విడ్డూరం? నేను స్వయంగా చేతితో జాగ్రత్తగా పట్టుకుని ఉంటినే! వజ్రం ఏమైపోయింది?’ అంటూ కృపావర్మ కంగారుపడ్డాడు. ఇందువదన తత్తరపాటుకు గురైంది.
‘బహుశా అది ఏటిలో జారిపోయి ఉంటుంది’ అని తలచిన కృపావర్మ దాన్ని వెతికి తీసుకురాగలిగిన వాళ్లకు, ఏమి కోరుకుంటే అది ఇస్తాము’ అని అక్కడున్న బెస్తవాళ్లతో చెప్పాడు.
అక్కడున్న బెస్తవారంతా తమ వల్ల కాదంటే తమ వల్ల కాదని తప్పుకున్నారు.
కానీ, ఒక ముదుసలి వ్యక్తి మాత్రం వారి వద్దకు వచ్చి, ‘స్వామీ! నాది ఒక్కటే కోరిక ఉంది. దాన్ని నెరవేరిస్తే ప్రాణానికైనా తెగించి, మీరు కోరిన కాంతివజ్రం పట్టి తెస్తాను’ అన్నాడు.
ఆ కోరికేమిటో చెప్పమన్నాడు కృపావర్మ,
‘నాకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. వాడికి మర్యాద గల జీవనోపాధి కల్పించాలి’ అన్నాడు వృద్ధుడు.
‘తప్పక అలాగే చేస్తా’నని కృపావర్మ వాగ్దానం చేసేసరికి, ముసలి వాడు ఏటిలోకి బుడుంగున మునిగి, అనేకమైన జలచరాలతోనూ, క్రూర సర్పాలతోనూ పోట్లాడి జయించి, చివరకు ఒక బ్రహ్మాండమైన చేపను లాక్కుని వచ్చాడు.
‘స్వామీ! మీ వజ్రాన్ని మింగిన చేప ఇదే’ అని అనేంతలో ఆ చేప తన బలమైన వాలముతో ముసలివాడిని ఒక్క దెబ్బ కొట్టింది.
ఆ దెబ్బకు అతను నీటిలోకి జారిపోయి, మరి కనిపించకుండాపోయాడు.
కృపావర్మ ఆ చేపను కోసి వజ్రం బయటకు తీసేసరికి, వింత చూడ్డానికి చుట్టూ జనం మూగారు.
కాంతివజ్రం దొరికినందుకు కృపావర్మ దంపతులు సంతోషిస్తూ, ఇక బయల్దేరుదామని అనుకుంటుండగా, ఎక్కడి నుంచో ఒక గుంటనక్క వచ్చి ఆ వజ్రాన్ని నోట కరుచుకుని పరుగుతీసింది.
కృపావర్మ గుంటనక్కను వెంబడించాడు.
అది అతి వేగంగా మూడు క్రోసులు పరుగెత్తి, ఆ వజ్రాన్ని ఒక తుప్పలో వదిలేసి మాయమైంది.
పాపం, కృపావర్మ కాయకష్టం పడి, ఆ మూడు క్రోసుల దూరం నక్క వెంట పరుగెత్తి, అది వదిలేసిన వజ్రాన్ని ఎలాగో మళ్లీ పట్టుకున్నాడు.
దంపతులు అలసట తీర్చుకుందామని ఒక చెట్టు కింద నడుము వాల్చి ఊసులు చెప్పుకొంటూ ఉన్నారు.
దేవి దర్శనం చేసుకుని, అపూర్వమైన ఆ కాంతివజ్రం సమర్పిద్దామని ఇందువదన ఎంతో ఆత్రపడసాగింది.
తలవని తలంపుగా ఇటువంటి ఆటంకాలు కలిగి, ఆలస్యమైపోతుండటంతో ఆమె ఆందోళన చెందింది.
కృపావర్మ ఆ కాంతివజ్రాన్ని ఎంతో భద్రంగా తల కింద పెట్టుకుని తన భార్య మొక్కును ఎలాగైనా నెరవేర్చాలని ఆలోచిస్తున్నాడు.
ఇంతలో ఒక గరుడ పక్షి రివ్వున వచ్చి కృపావర్మ తల కింద పెట్టుకున్న కాంతివజ్రాన్ని తన్నుకుపోయింది.
అదేమి చిత్రమో కానీ, ఆ గరుడపక్షి తన దారిన తను ఎగిరిపోక, వారికి అందుబాటులోనే ఉండి చుట్టూ తిరగసాగింది.
ఇదిచూసి, ఇందువదన, ‘పక్షి పట్టుకుపోయిన వస్తువు ఇంక దొరికేదేమిటి? అది కేవలం అసాధ్యం’ అనుకుని నిరాశ చెందింది.
‘నా దేవిని సంతోషపెట్టలేకపోయాను. మాట నిలబెట్టుకోలేకపోయిన దురదృష్టవంతురాలిని. నేను ఉండేమి? లేకేమి?’ అని ఇందువదన తనను తానే నిందించుకుంటూ ఆ గరుడ పక్షి ఎగురుతున్న దారినే వెంబడించింది. తనకు ఇష్టం లేకున్నా, కృపావర్మ కూడా భార్య మీద ప్రేమతో ఇందువదన వెంట వెళ్లాడు. ఈ విధంగా గగన మార్గాన గరుడపక్షి, భూమి మీద కృపావర్మ దంపతులూ అలా తిరుగుతూనే ఉన్నారు.
కొంతదూరం వెళ్లిన తరువాత గరుడపక్షి వాయువేగంతో ఈశాన్యదిక్కుకు ఎగిరిపోయి అదృశ్యమైంది. దంపతులు ఇక ఆ పక్షిని వెంబడించలేక, అది ఎగిరిపోయిన దిక్కు దిశగా అంతులేని దూరం నడవసాగారు.
చివరకు ఒకచోట చతికిలబడ్డారు.
మరికొంచెం సేపటికి ఆ కటిక చీకటిలో ఒక దిక్కున గొప్ప వెలుగు కనిపించింది.ఆ వెలుగు ఏమిటో వారు సరిగ్గా గుర్తించలేకపోయారు కానీ, అటువంటి వెలుగుతో వారికి ఇంతకుముందు పరిచయం ఉన్నట్టు మనసుకు తట్టింది. ఈ విడ్డూరమేమిటో చూడాలనే కుతూహలంతో, లేని బలం కూడదీసుకుని ఆ వెలుగు కనిపించిన దిశగా దంపతులు నడక సాగించారు.
ఎలాగైతేనేం, ఆ వెలుగు కనిపించే చోటుకు చేరుకున్నారు.
అది ఒక దేవాలయంలో వెలుగుతున్న జ్యోతిలా కనిపించింది.
తీరా లోపలికి వెళ్లి చూసేసరికి, వారి ఆశ్చర్యానికి అంతులేకపోయింది.
అది ఇందువదనకు ఇష్టదైవమైన దేవీ ఆలయం.
ఆలయంలో దేవి శిరస్సు నుంచి ప్రకాశిస్తూ ఉన్నది వారు పోగొట్టుకున్న కాంతివజ్రమే. తల్లికి మొక్కుకుని, తమ మొక్కు ఈ విధంగా తీరినందుకు ఇందువదన దంపతులు సంతోషించారు.
తమకు దారి తెలియకుండానే ఆ కటిక చీకటిలో వారు మగధ రాజ్యంలోకి వచ్చేశారు. ఇంతకుపూర్వం అనేకమైన కష్టాలు పడవలసి రావడం, ఇప్పుడు ఈ విధంగా వారి సంకల్పం సిద్ధించి మేలు చేకూరడం, ఇదంతా ఈ దేవి మహిమ తప్ప వేరు కాదని కృపావర్మ దంపతులు నమ్మారు.
అప్పటి నుంచీ వారికి దైవభక్తి మునుపటి కంటే కూడా ఎక్కువైంది.
భక్తురాలైన తన కుమార్తెకు తగిన భర్త దొరకడం గొప్ప అదృష్టంగా భావించాడు ధర్మగుప్తుడు.
దేవికి తగిన కానుక సమర్పించగలిగానని ఇందువదన పొంగిపోయింది.
అనుకూలవతి అయిన భార్య దొరికినందుకు కృపావర్మ కృతార్థుడినని అనుకున్నాడు.
ఇందువదన, కృపావర్మ మళ్లీ తమ కళింగ రాజ్యం చేరుకున్నారు.
బెస్తవాడి కొడుకును
పిలిపించి, అతడిని సేనాధిపతిగా నియమించి కృపావర్మ మాట నిలుపుకున్నాడు.
శాంతమ్మ – సింహం
అవంతీపురం రాజ్యంలో ఒకసారి కరువు కాటకాలు అలముకున్నాయి. జనమంతా తినడానికి లేక అల్లాడసాగారు. దీంతో ఆ దేశపు రాజు రాజ్యంలోని జనాభా లెక్కలు తీయించాడు. వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉందని గుర్తించి, అరవై ఏళ్లు నిండిన వారినందరినీ చంపేయాలని ఆజ్ఞాపించాడు. వారికెలాగూ చాలా జీవితం గడిచిపోయింది వారు పనిచేయలేరు. వాళ్ల ఉపయోగం లేదు కాబట్టి వారిని హతమారిస్తే మిగతా వారికైనా తిండి దొరుకుతుందన్నది రాజు గారి ఉద్దేశం. అలాగే, రాజ్యానికి శని పట్టిన కారణంగానే క్షామం నెలకొందని జ్యోతిషులు చెప్పడంతో రాజ్యంలో ఉన్న పనికిరాని వస్తువులను కూడా ఏరిపారేయాలని రాజు ఆదేశించాడు.
నిజానికి చాలా వరకు పాత వస్తువులను చాలామంది జ్ఞాపకంగా దాచుకుంటారు. కానీ, రాజు గారి ఆజ్ఞ వలన వాటిని వదల్లేక వదల్లేక జనమంతా వదిలించుకోసాగారు. దీంతో ఆ రాజ్యంలో కొన్నాళ్లకు వృద్ధులు, పాత వస్తువులు కనిపించకుండాపోయాయి.
ఆ రాజ్యంలో శాంతమ్మ అనే వృద్ధురాలు ఉండేది. ఆమెకు ఇటీవలే అరవై నిండాయి. దీంతో ఆమెను కుమారులు భటులకు కనిపించకుండా రహస్యంగా దాచి ఉంచారు.
ఇదిలా ఉండగా, ఆ రాజ్యంలోని అడవి నుంచి ఒక సింహం తప్పించుకుని రాజ్యంలోని ఊళ్ల మీద పడింది. కనిపించిన వారిని కనిపించినట్టే చంపేసేది. ప్రజలంతా భయభ్రాంతులయ్యారు. దాన్ని బంధించేందుకు భటులు చాలా ప్రయత్నాలు చేశారు కానీ, అవేమీ ఫలించలేదు. విషయం తెలిసిన శాంతమ్మ.. సున్నం నీళ్లలో ముంచిన మేకపిల్లను ఎరగా వేస్తే సింహం చిక్కుతుందని చెప్పింది. కొడుకులు అలాగే చేశారు. ఆకలితో ఉన్న సింహం మేకపిల్లను చంపి తినేసింది. అయితే మేకను సున్నంలో ముంచి ఉంచినందున సున్నం ప్రభావంతో కడుపు తిప్పినట్టయి సింహం పడిపోయింది. ముప్పుతిప్పలు పెడుతున్న సింహం ఇంత సులువుగా ఎలా చిక్కిందని, అంత మంచి సలహా ఎవరిచ్చారని రాజు ఆరా తీయగా శాంతమ్మ గురించి తెలిసింది.
వృద్ధులు పనికిరాని వారు కాదని, వాళ్ల సలహా, సూచనలు, అనుభవాలు దేశానికి మేలు చేస్తాయని, వాళ్ల అవసరం ఎంతో ఉందని రాజు తెలుసుకున్నాడు. వృద్ధులను చంపేయాలనే తన ఆజ్ఞను వెనక్కి తీసుకున్నాడు. అంతేకాదు, పూర్వీకులు జ్ఞాపకంగా దాచుకున్న వస్తువులు ఏదో ఒక సమయంలో ఉపయోగపడతాయని, వాటిని దాచుకోవచ్చని కూడా ఆజ్ఞాపించాడు.












































































































































































Review తగిన కానుక.