
తెలుగువీర లేవరా.. దీక్ష బూని సాగరా..దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా దారుణ మారణకాండకు తల్లడిల్లవద్దురా నీతిలేని సనాలు నేటి నుండి రద్దురా నిదురవద్దు.. బెదరవద్దు.. నింగి నీకు హద్దురా.. ఎవడు వాడు.. ఎచటి వాడు.. ఇటు వచ్చిన తెల్లవాడు
కండబలం కొండఫలం కబళించే దుండగీడు.. మానధనం ప్రాణధనం దోచుకొనే దొంగవాడు తగిన శాస్తి చెయ్యరా.. తరిమి తరిమి కొట్టరా..
ఈ దేశం ఈ రాజ్యం నాదే అని చాటించి.. ప్రతి మనిషి తొడలు గొట్టి.. శృంఖలాలు పగులగొట్టి చురకత్తులు పదునుబెట్టి.. తుది సమరం మొదలుపెట్టి సింహాలై గర్జించాలీ.. సంహారం సాగించాలీ వందేమాతరం.. వందేమాతరం స్వాతంత్య్ర వీరుడా.. స్వరాజ్య భానుడా అల్లూరి సీతారామరాజా.. అందుకో మా పూజలందుకో.. రాజా.. అల్లూరి సీతారామరాజా.. తెల్లవాడి గుండెల్లో నిందురించిన వాడా మా నిదురించిన పౌరుషాగ్నిని రగిలించిన వాడా త్యాగాలే వరిస్తాం.. కష్టాలే భరిస్తాం నిశ్చయముగ నిర్భయముగా నీ వెంటే నడుస్తాం.
గుండె గుండెను రగిల్చే స్ఫూర్తి మంత్రం.. పౌరుషాగ్ని ప్రజ్వలించే అక్షరాలు నింపుకొన్న నిప్పుకణం.. ప్రతి పల్లె గొంతెత్తి పలికే అచ్చమైన తెలుగు రణన్నినాదం.. జనహృదిలో కొలువైన జాగృతికి నిదర్శనం.. ఈ గీతం. తెలుగు వారి దేశభక్తికి సాక్ష్యంగా, స్వాతంత్య్ర దినాన దశదిశలా మారుమోగే పాట.. ‘తెలుగు వీర లేవరా..’. రత్నగర్భ నుదుటిన రుధిర సిందూరంగా మారి చరితార్థుడైన అల్లూరి సీతారామరాజు గాథను అత్యద్భుతంగా తెరకెక్కించారు ప్రముఖ కథానాయకుడు కృష్ణ. అల్లూరిగా అసమాన నటనా కౌశలాన్ని ప్రదర్శించి తెలుగు వారి మనోఫలకాలపై చెరగని ముద్ర వేశారు. ఆ చిత్రంలోని ‘తెలుగు వీర లేవరా..’ గీతం నరాలను ఉప్పొంగిస్తుంది. అల్లూరి మాటే పాటగా మారి గిరిజనపు గండ్రగొడ్డళ్లకు పదును పెడుతుంటే.. వాటి వాడికి తెగిపడే చరక్కసి మూకల శరీరాలు జ్ఞప్తికి వచ్చి ప్రేక్షకుల ఒళ్లు పులకరిస్తుంది.
తెలుగు అక్షరానికి జాతీయ బహుమతిని సాధించి పెట్టిన ఈ పాటను వినని తెలుగు వారుండరు. మహా కవి శ్రీశ్రీ కలం నుంచి ఉరకలెత్తిన ఆ భావావేశంతో గొంతు కలపని వారు కనిపించరు. అంత్యప్రాసలతో, అందరికీ అర్థమయ్యే చిన్న చిన్న పదాలతో గుదిగుచ్చిన ఈ తెలుగు రచన.. నాటి, నేటి, ఏనాటి వారికైనా ఇష్టమైనదే. ఎర్రకోటపై మువ్వన్నెల పతాకం రెపరెపలాడుతున్నంత కాలం తెలుగు నేలపై ఈ పాట వినిపిస్తూనే ఉంటుంది.
Review తెలుగు వీర లేవరా!.