వెండితెర అభిమానుల హృదయ సామ్రాజ్ఞి.. రాజకీయాల్లో పురట్చితలైవి.. వ్యక్తిత్వంలో మేరునగధీర.. సాహసం ఇంటి పేరు.. పోరాటం మారు పేరు.. భారత రాజకీయాల్లో ‘అమ్మ’గా అభిమాన జన హృదయాల్లో చెరగని ముద్ర వేసిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇక సెలవంటూ శాశ్వతనిద్రలోకి జారుకున్నారు. డిసెంబరు 5వ తేది రాత్రి 11.30 నిమిషాలకు ఆమె తుదిశ్వాస విడిచారు.
కోమలవెల్లి.. పేరులోనే కోమలం తప్ప ఆమె జీవితమంతా పోరాటాలమయమే. జయలలితగా వెండితెరపై, రాజకీయ యవనికపై ఒక మెరుపు మెరిసిన ఆమె జీవితంలో అడుగడుగునా అవమానాలే.. వాటిని ఎదురొడ్డి ‘జయ’ధీరగా నిలవడానికి అనుక్షణం పోరాటమే.. సాహసం, ఆత్మాభిమానంతో నిండుగా కనిపించే ఆమె అంతరంగం ఎవరికీ అంతుబట్టని ఒక రహస్యం. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో సంధ్య, జయరామన్ దంపతుల గారాలపట్టి కోమలవెల్లి.. చిన్నప్పుడు న్యాయవాది కావాలని కలలు కనేది. అయితే, తల్లి సంధ్య సినీ నటి కావడంతో అనుకోకుండా పదహారవ ఏట ఆమె ‘జయలలిత’గా వెండితెరపై అరంగేట్రం చేశారు. తరువాత కాలంలో సినిమాలే లోకమయ్యాయి. జయలలితగా మారి ఆమె సినీ రంగంలో లక్షలాది అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ క్రమంలోనే తమిళుల ఆరాధ్య నటుడు ఎంజీ రామచంద్రన్‍తో ఆమెకు సాన్నిహిత్యం ఏర్పడింది. అది రాజకీయ ప్రవేశానికి దారితీసింది. 1981లో రామచంద్రన్ ఆమెను తన అన్నాడీఎంకే పార్టీకి పరిచయం చేశారు. అనంతరం ఆమెను 1984లో రాజ్యసభకు పంపారు. ఆ తరువాత ఎంజీ రామచంద్రన్ మరణానంతరం అన్నాడీఎంకే పగ్గాలను పూర్తి స్థాయిలో తన చేతుల్లోకి తీసుకుని ఎదురులేని నేతగా నిలిచారు. అయితే, రాజకీయాల్లో ఒకరకంగా ఆమె ఎదురీదారనే చెప్పాలి. అడుగడుగునా అవమానాలు.. ప్రతిపక్ష డీఎంకే నుంచి ఎన్నెన్నో సవాళ్లు.. అవినీతి కుంభకోణాలు.. ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మరో మహిళ అయితే వీటికి భయపడి తెరమరుగు అయిపోయే వారే. కానీ, ఆమె మొండిఘటంగా పేరు తెచ్చుకున్నారు. ఏదైనా అనుకుంటే సాధించి తీరే వరకు వదలని పంతం ఆమెను రాజకీయాల్లో రాటుదేలేలా చేశాయి. జీవితంలోనూ, రాజకీయాల్లోనూ ఆమె తన సన్నిహిత సహచరురాలైన శశికళను తన వెన్నంటి పెట్టుకుని ఉండేవారు. ఒకదశలో ఆమెతోనూ విభేదాలు వచ్చి.. తన ‘పోయస్ గార్డెన్’ నుంచి బయటికి పంపారు. తరువాత మళ్లీ ఇద్దరు సన్నిహితమయ్యారు. రాజకీయాల్లో ఆమె ‘చో రామస్వామి’ని గురువుగా భావించేవారు. ఆస్తుల కేసులో ఆమె బెంగళూరు జైలులో అనుభవించిన శిక్ష ఆమె జీవితంలో పెనుమార్పును.. అదే సమయంలో నిర్వేదాన్ని తెచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటారు. తనకెదురైన అన్ని సమస్యలను అధిగమించిన ఈ పురట్చితలైవి.. 2016 మేలో ఆరవ సారి తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి ఆమె పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు విశేషమైన పథకాలను ప్రవేశపెట్టారు. ఈ పథకాలన్నీ పేదల జీవితాల్లో పెనుమార్పును తెచ్చాయి. దీంతో జయలలిత ‘అమ్మ’గా సామాన్య జన హృదయాల్లో నిలిచిపోయారు. నటిగా, రాజకీయ నాయకురాలిగా ఎన్నో శిఖరాలు అధిరోహించినా.. చివరి క్షణాల్లో ఆమె ఒంటరి అయ్యారు. అయిన వాళ్లెవరూ ఆమె వెంట లేరు. జీవితంలోని అన్ని దశల్లో, అన్ని రంగాల్లో పంతం పట్టి అనుకున్నది సాధించిన ‘జయ’లలిత.. మృత్యువుతో చేసిన దాదాపు 76 రోజుల పోరాటంలో మాత్రం ఓడిపోయారు. •
Review దివికేగిన ధీరనారి.