ఒక గ్రామంలో ఒక ఉపాధ్యాయుడు ఉండేవాడు. ఆయన హూణ భాషలో పట్టభద్రుడు. అంతేకాక గణితంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించాడు. అతనిది బట్టతల.
ఒకరోజు ఆ ఉపాధ్యాయుడు ఊరికి దూరంగా ఉన్న మరో గ్రామానికి కాలినడకన బయల్దేరాడు. అది మిట్ట మధ్యాహ్న సమయం. ఎండ మలమల మాడ్చివేస్తోంది. చేతిలో గొడుగు లేదు. పైగా బట్టతల. ఎండ నుంచి ఎక్కడైనా తలదాచుకుందామంటే దారిలో ఎక్కడా ఒక్క చెట్టు కూడా కనిపించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో అతనికి ఒక అరమైలు దూరంలో పెద్ద మర్రిచెట్టు కనిపించింది. సేద తీర్చుకునే నిమిత్తం అతను త్వరగా నడిచి ఆ చెట్టు వద్దకు చేరుకున్నాడు. కొంతసేపు ఆ భారీ వృక్షాన్ని పరీక్షగా చూశాడు. అనంతరం చెట్టు కింద నీడలో ఒక గుడ్డ పరిచి దానిపై వెల్లకిలా పడుకున్నాడు.
అలా పడుకున్న ఆయన ఆ చెట్టును నిశితంగా పరిశీలించసాగాడు. శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్న ఆ వటవృక్షాన్ని పరిశీలిస్తుండగా, అంతలో అతని దృష్టి అతి చిన్నగా ఉన్న మర్రికాయలపై పడింది. వెంటనే అతను ఇలా ఆలోచించసాగాడు.
‘ఈ చెట్టును సృష్టించినది ఎవరు? దేవుడు కదా? మరి దేవుడికి లెక్కల విషయంలో అనుభవం లేదా? దేవుడు గణిత శాస్త్రం చదువుకోలేదా? లేకుంటే ఇంత బ్రహ్మాండమైన మర్రిచెట్టునకు ఇంత చిన్న కాయలను ఇస్తాడా? రామరామా! చిన్న గుమ్మడి తీగకే 30 పౌన్లు బరువైన పెద్ద గుమ్మడికాయను ఇచ్చిన దేవుడు మరి ఇంత పెద్ద చెట్టుకు ఎంత పెద్ద కాయలను ఇవ్వాలి. కనీసం టన్ను లేదంటే అరటన్ను బరువైన కాయలనైనా ఇవ్వాలి కదా! అలా ఇవ్వలేదంటే కచ్చితంగా దేవుడికి గణితశాస్త్రం తెలియదన్న మాట. బహుశా ఆయన లెక్కలలో నిష్పత్తి, అనుపాతం అనే పాఠాన్ని భగవంతుడు చదవలేదేమో! చదివి ఉంటే ఈ ప్రకారం సృష్టించి ఉండడు. అల్పుడనైన నాకే నిష్పత్తిని గురించి విజ్ఞానమెంతో ఉంది కదా! ఇక దేవుడికి ఎందుకు లేకపోయింది?’ అని ఇంకా తన లోని అహంకారం కొద్దీ ఏదేదో ఆలోచించసాగాడు.
అంతలో ఒక చిన్న సంఘటన జరిగింది. గాలి రయ్యిన వీచసాగింది. ఆ గాలికి ఒక చిన్న మర్రికాయ చెట్టుపై నుంచి సరిగా గురి పెట్టి కొట్టినట్టుగా ఉపాధ్యాయుడి గారి బట్టతలపై వచ్చి పడింది. కాయ చిన్నదైనా.. అది వేగంగా, సూటిగా దూసుకొచ్చి పడటంతో మాస్టారు గారి బుర్ర గింగుర్లాడింది. ఒక్క క్షణం కళ్లు బైర్లు కమ్మాయి. అప్పటికి ఇంకా భగవంతుడి సృష్టి లోపం గురించి తనలో తానే విమర్శిస్తూ ఉన్న ఆ ఉపాధ్యాయుడు ఆ దెబ్బ నుంచి తెప్పరిల్లుకుని ఈ లోకానికి వచ్చాడు. దెబ్బ తగిలిన చోట బుర్ర గోకుకుంటూ, ‘ఎంతటి ప్రమాదం తప్పింది? ఈ చిన్న కాయ దెబ్బకే నా తల గింగురమంటున్నది. నేను ఊహించినట్టు అరటన్ను కాయ కనుక ఈ చెట్టుకు ఉండి, నా తలపై పడి ఉంటే నా గతి ఏమయ్యెడిది? నా ప్రాణపక్షి మృత్యులోకము దారి పట్టెడిది కదా? ఆహా భగవంతుడు ఎంతటి కరుణామయుడు? మహా వృక్షం కాబట్టి ఎందరో బాటసారులు దాని కింద తలదాచుకునుటకు వస్తారు. కాబట్టి వారికి దెబ్బలు తగలకుండా అంత పెద్ద చెట్టుకు చిన్న కాయలను దేవుడు సృష్టించాడు. ఓహో! భగవంతుడికి లెక్కలే కాదు నీతి శాస్త్రం కూడా తెలుసు’ అని ఆ ఉపాధ్యాయుడు అనుకున్నాడు.
ఆనక తన ఆలోచనల్లోని తప్పును గ్రహించి భగవంతుడిని క్షమాపణ వేడుకున్నాడు. ఆ పిమ్మట మళ్లీ తల తడుముకుంటూ తన దారిన వెళ్లిపోయాడు.
నీతి: గర్వం పనికిరాదు. గొప్ప చదువులతో వచ్చే అహంకారం ఎందుకూ కొరగాదు. మనిషి తన కీర్తులు చూసుకుని మురిసిపోకూడదు. భగవంతుని, సృష్టిని తక్కువ చేసి విమర్శించకూడదు. విద్య.. మనకు వినయం, భక్తి, సౌశీల్యం నేర్పాలి. అదే సరైన విద్య, గర్వం, అహంకారం నేర్పేది విద్యే కాదు. ఏనాటికైనా భగవంతుని అనుగ్రహమే జీవులను కడతేర్చునదని గ్రహించాలి.
విద్యతో పాటు వినయం, భగవంతునిపై పూర్ణ విశ్వాసం కలవారై ఉండాలి.
Review దేవుడికి ఓ లెక్క ఉంది.