ఈ విశ్వం, ప్రేమ అనే కలంతో విరించి రచించిన ద్వంద్వసమాసభరిత రసమయకావ్య
అనుకోని ప్రమాదాలు సంభవించినప్పుడు మనం హతాశులమౌతుంటాం. సునామి, భూకంపాలు వంటి ఉపద్రవాలు వస్తుంటాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయని ప్రశ్నిస్తాం. పరమాత్మ దయాళువు, కరుణాసాగరుడని అంటారే, మరి ప్రకృతివైపరీత్యాలలో అమాయకు లైన పసిపిల్లలు, దీనజనులు ఎందుకు ప్రాణాలు కోల్పోతున్నారని అడుగుతాం. వేదాంతులు కూడా ఈ సందేహమే వ్యక్తం చేస్తారు.
ఎందుకు ప్రమాదాలు జరగకూడదు? విపత్తులెందుకు కలగకూడదు? సామూహిక మరణాలెందుకు సంభవించకూడదు? చెడు జరిగినపుడు, ఓరి భగవంతుడా నేనేం పాపం చేశానని ఈ శిక్ష అని తెగ బాధపడిపోతాం. సుఖసంపదలతో తులతూగుతున్న రోజుల్లో ఎంత పుణ్యం చేశానని ఇంత సౌభాగ్యం ఇచ్చావు తండ్రీ! అని దేవుణ్ణి తలచుకొని కృతజ్ఞతలు చెప్పామా ఎప్పుడైనా? ప్రకృతి ఉత్పాతాలు జరిగితే గొంతు చించుకొని గోల చేస్తాం. నందనవనంలా శోభిల్లే సృష్టిలోని సొగసులు చూసినప్పుడు గాని, ప్రకృతి అందించే సత్ఫలితాలు పొందినప్పుడు గానీ పరమేశ్వరుని మెచ్చుకున్నామా? బాల్యంలో విచారం లవలేశమైనా లేకుండా హాయిగా గడిపాం. ఎదిగిన తర్వాత కష్టాలు కలిగాయని దేవునిపై నింద వేస్తున్నాం, చిన్నతనంలోని మధు రానుభూతులు నేటికీ చెరగనీ స్మ•తులుగా
ఉన్నందుకు దైవమే కారణమని ఒక్కనాడైనా తల పోశామా ? జీవితంలోని చీకటికోణాలనే చింతి స్తుంటాం. కాంతి పుంజాలను ఎందుకు విస్మ రిస్తామోకదా !
కనిపించే ఉత్పాతం, కనిపించని ఉపశమనాన్ని తన వెంట తీసుకొస్తుంది. పగలు నిప్పులు కురిసే వైశాఖసూర్యుని ప్రసాదించిన ఆకాశమే, రాత్రి చల్లని చందమామను అందిస్తుంది. మన ఆనందపు మాధుర్యాన్ని ఇంతకింత అధికం చెయ్యాలని మాత్రమే వ్యాధి, సమస్య, ఓటమి, కన్నీరు, ఆకలి, దాహం కానుకగా ఇచ్చాడు దేవుడు. ఎంత బాగా వండితే అంత రుచిగా ఆహార ముంటుందని మన అభిప్రాయం. ఎంత ఆకలి పెరిగితే అంత మధురంగా భోజనముంటుందని ‘ఆయన’ ఆలోచన.
వెలుగునీడలు జీవనచిత్రంలో అనివార్యం. ఇది మరచిపోయి ఫిర్యాదులు చేస్తుంటాం. సణుగుతూ నస పెడుతుంటాం. ఇతరుల కంటే మనసు వేరుగా భావించుకుంటూ, లేనిపోని ప్రత్యేకతను మనకు మనమే ఆపాదించుకుంటాం. మనం కూడా ఈ విశాల విశ్వంలో విడదీయలేని భాగమే. ఒక వ్యక్తికి కలిగిన వ్యాధి యావత్ ప్రపంచపు ఆరోగ్యంపై తనవంతు ప్రభావం చూపిస్తుంది. మన ఆరోగ్యం వ్యాధికారక సూక్ష్మజీవికి అనా రోగ్యం. ఒక మనిషికి ప్రమాదం జరిగితే అది మరొకవిధంగా మంచికి హేతువు అవుతుంది. ప్రమాదాలు మనం నివారించలేని సంఘటనలు. జీవన వ్యవహార ధర్మంలో ప్రమాదాలు అవసరమే! ప్రమాదం వెనుక దాక్కున్న ప్రమోదాన్ని గుర్తిం చటం, ప్రమాదాన్ని మోదంగా మలచుకోవటం మనం చేయవలసిన పని.
ఈ బ్రహ్మాండం నిర్మాణాత్మక, వినాశకరశక్తుల మేలుకలయిక. జగత్తులో సృష్టి మాత్రమే జరుగు తుందని అనుకుంటే పెద్ద పొరపాటు. సంహారం కూడా ప్రధాన పక్రియ. అనంతకోటి జీవజాలం సృష్టింపబడుతున్నప్పుడు, వాటి నాశనం కూడా అనంతంగా కొనసాగుతూనే ఉంటుంది. తాపీమేస్త్రీ ఉదయం ఒకచోట ఇల్లు కడుతుంటారు, మధ్యాహ్నం వేరొకచోట ఇల్లు కూల్చుతాడు. కట్టే వస్తువులు, కూల్చేపరికరాలు రెండూ అతని దగ్గరుంటాయి. పాతఇల్లు కూల్చకపోతే కొత్త అపార్ట్మెంట్ ఎలా వస్తుంది ?
ఈ రెండు శక్తులూ, బయటి మాదిరిగానే శరీరం లోపల కూడా తమ విధులు నిర్వహిస్తు న్నాయి. రోజు కొత్త కణాలు పుడుతుంటాయి, చనిపోతుంటాయి. ఉత్పత్తి-నాశనం ఈ రెండూ ఘర్షణ పడవు. పరస్పరం సహకరించుకుంటాయి. హీరో మాత్రమే ఉండి విలన్ లేకపోతే సినిమా రక్తి కడుతుందా ? రాముడుంటే రావణు డుంటాడు. కంసుడున్న చోట కృష్ణుడు పుడతాడు. ఇది అర్థం కాక మంచిచెడులను విడదీసి చూస్తుంటాం. సత్సంకల్పం పుట్టిన మనసులోనే దుష్టచింతనలూ వస్తుంటాయి. గుడిలో కానుకల హుండీ లేకపోయినా పరవాలేదు. కానీ, చెత్తబుట్ట మాత్రం ఉండి తీరాలి. ఇంట్లో పూజగది ఉండ కున్నా గడిచిపోతుంది. బాత్‍రూమ్ లేకుండా కుదురుతుందా?
నీ ఇంటి శుభ్రతకు చెత్తబుట్ట ఎలా కారణమో, నీ సంతోషానికి రహస్యం నీ దుఃఖం. ఆనందం లోని మలినాలను శుభ్రపరిచే చెత్తబుట్ట విషాదం. ఇది అవగాహన చేసుకుంటే చిక్కుముడి వీడినట్లే.
గుండె, ధమనుల ద్వారా మంచి రక్తాన్ని అన్ని భాగాలకూ సరఫరా చేస్తుంది. సిరల ద్వారా చెడు రక్తం స్వీకరిస్తుంది. ఒకే గుండెలో మంచి రక్తం ఒకవైపు, చెడు రక్తం మరొకవైపు ఉంటుంది. ఒకే హృదయంలో మంచిభావాలు ఒక పక్క చెడ్డ భావాలు ఇంకొక పక్క ఉంటాయి. చెడుగా కనిపించే వ్యక్తిని ద్వేషించకండి. అతనిలో అన్నీ చెడు ఆలోచనలే అని మీరనవచ్చు. మన గుండెలో కర్ణికలు, జఠరికలు అని నాలుగు గదులున్నాయి. వాటికి బలమైన గోడలవంటి తలుపులున్నాయి. అవి మంచి రక్తాన్ని, చెడు రక్తాన్ని ఎప్పటికీ కలవనీయవు. చెడు రక్తం లేకపోవడం ముఖ్యం కాదు. ఉన్న చెడు రక్తాన్ని శుభ్రం చేయడమే అత్యంత ప్రధానం.
దూరాలోచనలు దూరాన ఉంచటం కాదు,
ఉన్న ఆలోచనలు ఉన్నతంగా మలచుకో. నిర్మూలన కారాదు నీ లక్ష్యం, ప్రక్షాళన కావాలి పరమార్థం. ఇదే ప్రకృతి బోధించే పరమసత్యం.
కొందరు గురువులు తేలికైన విషయాలు సంక్లిష్ట పరచి, తిరిగి సులభంగా వివరించే ప్రయత్నం చేస్తుంటారు. పిల్లిని మార్జాలంగా మార్చి, మార్జాలమంటే పిల్లి అని ప్రబోధిస్తారు. గురువంటే ఎవరు? కఠినతర విషయాలను సైతం, కలకండ లాగ మెత్తగా, తియ్యగా చేసి అందించేవారు అస లైన గురువులు. ఊపిరిపీల్చుకోవడం ఏ గురువు నేర్పారు? ఆహారం జీర్ణం చేసుకునే జ్ఞానం ఏ గురువుగారు ఉపదేశించారు? చేపకు ఈత నేర్పాలా? నెమలికి నాట్యం నేర్పాలా? కావలసింది నేర్చుకునే శక్తిని సర్వేశ్వరుడు ఇవ్వనే ఇచ్చాడు. ఒకటి గుర్తుంచుకోవాలి. ఏదైనా పని చెయ్యడానికి శక్తి లేదంటే, ఆ పని చేసే అవసరం మనకులేదని అర్థం. చాలామందికి ఈ సంకేతం అవగతం కాదు.
ఇది ఊహకందని ఊహ. భాషకందని భాష.
క్రూరత్వం అంటే ఏమిటి ? జింకను అడిగితే ఏమంటుంది? పులి చాలా క్రూరమని భయ పడుతూ చెబుతుంది. పచ్చగడ్డిని అడగండి, జింక క్రూరమని వణికిపోతూ జవాబిస్తుంది. ఒక టెట్రాసైక్లిన్ మాత్ర, మన శరీరంలోని అరవై మిలియన్ల బాక్టీరియా క్రిములను చంపేస్తుంది. ప్రతిరోజు మనం స్నానం చేస్తుంటే కోట్లాది సూక్ష్మజీవులు నశిస్తాయి. జగదేక న్యాయమూర్తీ! నీ దృష్టిలో ఏది హింస? ఏది అహింస? ఏది న్యాయం? ఏది అన్యాయం?
మన భావజాలం ఎన్నో పరిమితులకు లోబ డింది. అది అసమగ్రం, అసంపూర్ణం. సృష్టిలో సర్వోత్తమజీవి మనిషి అని మన అభిప్రాయం. ఈ లోకం మనుషుల కోసమే సృష్టించబడిందని భావిస్తాం. కవులు, మానవుడే మహనీయుడు అంటూ కవితలెన్నో అల్లారు. గొంతెత్తి పాడారు. అందరి కవుల జీవితాలు, వారి కావ్యాలంత కమనీయంగా ఉన్నాయా? వారి రచనలంత రసవత్తరంగా ఉంటున్నాయా? గేయాలు రాస్తున్న వారు గాయాలు లేకుండా బ్రతుకు వెళ్ళబుచ్చు తున్నారా? బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగ సాగడం ఎంతో ముఖ్యం. అయితే కొందరు కవీశ్వరుల గ్రంథాలతో పాటు వారి జీవితాలు సాహిత్యసౌరభాలు వెదజల్లుతుంటాయి.
విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కటీ విశేషమైనదే. ఏదీ చెడ్డది లేదు. అలా చెడ్డగా కనిపిస్తే, అది చూసేదృష్టిలోని తేడామాత్రమే. బజారులో ఎన్నో రకాల కూరగాయలుంటాయి. నాకు నచ్చినది కొంటాను, మిగిలినవి మంచివి కావని నేనంటే అది తప్పు. నాకు మామిడిపళ్ళు భలే ఇష్టం. అయితే మిగిలిన పళ్ళన్నీ చెడ్డవని అనగలనా? నా వంటికి పడనివి నాణ్యమైనవి కావంటే మీరు ఒప్పుకుంటారా? నేను హోటల్‍కి వెళితే నాకు పసందైనవి తింటాను. మిగిలిన వం•కాలన్నీ పనికిరానివి కాదు కదా ! మంచి-చెడు వ్యక్తిగత అనుభవాలు. ఆ రెండూ కలిసిమెలసి ఉంటాయి.మనం ప్రతి విషయం నమ్మాలి. అపనమ్మ కాన్నీ, అపనమ్మకపు ఆవశ్యకతను కూడా నమ్మాలి. ప్రతి వస్తువునూ గౌరవించాలి. ప్రేమించాలి. ఏది ఎలా ఉండాలో అలానే ఉంటుంది. ఏవి ఎందు కుంటాయో అందుకే ఉంటాయి. మన దగ్గర ఎన్నో చెంచాలుంటాయి. ఒక చెంచా అన్నం వడ్డించు కోవటానికి, మరొకటి నెయ్యి వేసుకోవటానికి పనికోస్తుంది. ఒక్కోక్కదానిని ఒక్కోవిధంగా వాడుకోవచ్చు. అందుకే అన్ని రకాల చెంచా లున్నాయి. సృష్టిలో ఏదీ పనికిమాలినది కాదు. హీనంగా చూడకు దేన్నీ. ఏదైనా ఎంత వ్యర్థమైన దిగా మనకు కనబడినా, ఎందుకో ఒకందుకు పనికొస్తుంది.
ప్రతి విషయాన్ని నమ్మడమే కాదు, ప్రతి వస్తు వునూ, ప్రతి సంఘటననూ ఆనందంగా స్వీక రించాలి. ఎన్నడూ అయిష్టపడకూడదు. ‘జూ’లో నెమలిని చూచినట్లే నాగుపాముని చూడాలి. జింక ఎంత అందమైనదో సింహం కూడా అంతే. అయితే జింకకు దగ్గరగా వెళ్ళి చేతులతో నిమురుతూ మురిసిపోతాం. సింహానికి దూరంగా ఉండి జాగ్రత్త వహించి, సొగసులీనె జూలును, సౌందర్య నిలయమైన సింహ మధ్యమాన్ని (నడుము) చూసి సంతోషించాలి. సింహం దుర్మార్గమైనదని అనకూడదు, ద్వేషించకూడదు. ఈ జనవనంలో కూడా అందరినీ, అన్ని భావనలనూ, అన్ని భావోద్వేగాలనూ ఆదరించాలి. ప్రతి ఒక్కరి సమక్షంలో సమానస్థాయిలో సంతో షంగా ఉండాలి. బొమ్మా-బొరుసూ రెండింటికీ ఒకే విలువ ఇవ్వాలి. జ్ఞానిగా జీవించు. అజ్ఞానిలా కనిపించు. వైరుధ్యం సృష్టి వైశిష్ట్యం. సమన్వయం తోనే జీవనం నందనవనం.
Review ద్వంద్వ సమానం.